అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి


ఇది అంతిమ దినమని ఎందుకు పిలవబడిందంటే, దీని తర్వాత ఇక మరే దినమూ ఉండదు.

 

విషయసూచిక

 

అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి?

అంతిమదినాన్ని విశ్వసించడమంటే మానవజాతి మరలా ప్రాణాలతో లేపబడుతుందని మరియు వారి కర్మలకు ప్రతిఫలం ప్రసాదించబడుతుందని విశ్వసించడం. అంతిమ దినం గురించి ఖుర్ఆన్ లో మరియు సున్నతులలో తెలుపబడిన ప్రతి దాన్నీ మనం విశ్వసించడం.

 

అంతిమదినం గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ చాలా విపులంగా వివరించాడు, ఉదాహరణకు – “ఓ మానవులారా! మీ ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, ఆ అంతిమ ఘడియ యొక్క భూకంపం ఎంతో భయంకరమైనది. ఆ రోజు ఆవరించినపుడు, పాలిచ్చే ప్రతి స్త్రీ తన చంటి బిడ్డను సైతం మరచిపోవడాన్ని, ప్రతి గర్భవతి తన గర్భాన్ని కోల్పోవటాన్ని నీవు చూస్తావు. మరియు మానవులందరినీ ఏదో మైకంలో ఉన్నట్లు నీవు చూస్తావు, కానీ (నిజానికి) వారు (మద్యం) త్రాగి ఉండరు. కానీ అల్లాహ్ శిక్షయే అంత తీవ్రంగా ఉంటుంది.”ఖుర్ఆన్ సూరా హజ్ 22: 1-2

 

సమాధి అవస్థ

మరణం తర్వాతి మొదటి మజిలీయే సమాధి అవస్థ. మృతదేహం భూమిలో సమాధి చేయబడిందా లేక సముద్రంలో విసిరి వేయబడిందా లేక సింహం తిన్నదా లేక గాలిలో కలిపి వేయబడిందా అనే దానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనబోయే కఠిన పరీక్ష ఇది. ప్రతి ఒక్కరూ ఈ అవస్థను ఎదుర్కొనవలసి ఉంటుంది మరియు ప్రతి ఒక్కరూ మూడు విషయాల గురించి ప్రశ్నించబడతారు;

 

1.    నీ ప్రభువు ఎవరు ?

2.    నీ ధర్మం ఏది ?

3.    నీ ప్రవక్త ఎవరు ?

 

విశ్వాసి ఇలా జవాబిస్తాడు, ‘నా ప్రభువు అల్లాహ్, నా ధర్మం ఇస్లాం మరియు నా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)’. అప్పుడు ‘ఈ దాసుడు సత్యం పలికాడు’అని ఒక దివ్యవాణి ఆకాశాలలో నుండి ధృవీకరిస్తుంది.

 

అపుడు అతని కంటిచూపు చూడ గలిగేయంత వరకు అతని సమాధి విశాలం అవుతుంది, స్వర్గాలంకరణలు అమర్చబడతాయి. స్వర్గంలోనికి ఒక ద్వారం తెరవబడి,సువాసనలు మరియు శుభాలు స్వర్గం నుండి అక్కడికి వస్తుంటాయి. ఈ స్థితి నిస్సందేహంగా అతని ప్రాపంచిక స్థితి కంటే ఎంతో మేలైనది.

 

అతని ప్రభువు గురించి, ధర్మం గురించి మరియు ప్రవక్త గురించి ప్రశ్నించ బడినపుడు, అవిశ్వాసి మరియు కపట విశ్వాసి ఇలా జవాబిస్తాడు, ‘ఓహ్, ఓహ్, నాకు తెలీదు. ప్రజలు ఏదో అనడం విన్నాను మరియు నేను కూడా అలాగే అన్నాను.’

 

అపుడు ఒక పెద్ద ఇనుప సుత్తితో కొట్టటం జరుగుతుంది అప్పుడు ఆ అవిశ్వాసి బాధపడగా, అతడు పెద్దగా అరిచే అరుపు, జిన్నాతులు మరియు మానవులు తప్ప ప్రతిదీ వింటుంది – ఎందుకంటే ఒకవేళ వారే గనుక వినగలిగితే, వారు చెవిటి వాళ్ళుగా మారిపోతారు. ఆ ఇనుప సుత్తి ఎంత పెద్దగా ఉంటుందంటే ప్రజలందరూ కలిసి ఎత్తడానికి ప్రయత్నించినా, వారు దానిని పైకెత్తలేరు.

 

సమాధి అవస్థను విశ్వసించడం తప్పని సరి. ఎందుకంటే దానిని విశ్వసించడమనేది అంతిమ దినంపై విశ్వాసంలోని ఒక భాగం.

 

నమాజులో మనం ఇలా అర్థిస్తాము,

నరకాగ్ని యాతన నుండి మరియు సమాధి యాతన నుండి మేము అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాము.

 

కాబట్టి, ఖుర్ఆన్ మరియు సున్నతుల నుండి సమాధి యాతన ఋజువు చేయబడింది. దానిని విశ్వసించడమనేది అంతిమ దినాన్ని విశ్వసించడంలోని ఒక భాగం.

 

పునరుత్థానం

మహోన్నతుడైన అల్లాహ్ తీర్పుదినమున మన శరీరాలను నగ్నపాదాలతో, నగ్నంగా మరియు సున్తి చేయబడని స్థితిలో లేపుతాడు.

 

నగ్నపాదాలతో:ఎలాంటి చెప్పులు, బూట్లు లేకుండా అంటే పాదాలపై పాదరక్షల వంటి ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా.

 

నగ్నంగా:ఎలాంటి దుస్తులూ లేకుండా

 

సున్తి చేయబడని స్థితిలో:అంటే ఒడుగులు చేయబడకుండా

 

కొన్ని హదీథులలో ‘బుహ్మాన్’అని పేర్కొనబడింది – అంటే ఎలాంటి సంపద లేకుండా. అక్కడ ప్రతి ఒక్కరూ తమ కర్మలను మాత్రమే కలిగి ఉంటారు.

 

పునరుత్థానం అంటే తిరిగి లేపబడటం, అంతేగాని కొత్తగా మరలా సృష్టించబడటం కాదు. దీని గురించి ఖుర్ఆన్ లోని అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి, “వారికి చెప్పు: ‘వాటిని తొలిసారి సృష్టించినవాడే (తిరిగి) బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు’”ఖుర్ఆన్, సూరా యాసీన్36:79

 

ప్రజల కర్మల పత్రం

అల్లాహ్ అంతిమ దినాన్ని ‘యౌముల్ హిసాబ్’అంటే లెక్క చూడబడే దినం అనే పేరుతో పిలిచినాడు. ఎందుకంటే, అది మానవజాతి కర్మల లెక్కలు చూడబడే దినం.

 

అవిశ్వాసులు తమ పాపకార్యాలను ఒప్పుకుంటారు. వారి కర్మల ఫలితంగా వారు అవమానానికి గురి చేయబడతారు. అపుడు సాక్షులు ఇలా సాక్ష్యమిస్తారు, “తమ ప్రభువుపై అసత్యాలను కల్పించిన వారు వీళ్ళే”ఖుర్ఆన్, సూరా హూద్11:18.

 

కాబట్టి, లెక్క తీసుకోవడంలో విశ్వాసి మరియు అవిశ్వాసికి మధ్య చూపబడే ఈ భేదాన్ని చూడండి. 

 

త్రాసు

“ఆ రోజు బరువు (తూకం) కూడా సత్యమే.”ఖుర్ఆన్, సూరా అల్ ఆరాఫ్  7:8

 

“మేము ప్రళయదినాన న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాం”ఖుర్ఆన్, సూరా అంబియా21:47

 

“కనుక ఎవడు అణువంత మాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. మరెవడు అణువంత మాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.”ఖుర్ఆన్, సూరా జిల్ జాల్ 99:7-8

 

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, “రెండు వచనాలు అల్లాహ్ కు చాలా ఇష్టమైనవి, నాలుకపై తేలికగా పలుకబడతాయి, కానీ త్రాసులో చాలా బరువుగా ఉంటాయి,

 

సుబ్ హానల్లాహి వబి హమ్దిహి, సుబ్ హానల్లాహిల్ అజీమ్.”(సహీహ్ బుఖారీ)

 

మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసులోని, “త్రాసు పై బరువుగా ఉంటాయి.” సహీహ్ బుఖారీ

 

కర్మ పత్రాల పంపిణీ

కర్మల పత్రాలు ప్రజలకు ఇవ్వబడతాయి మరియు అవి ఇవ్వబడే పద్ధతిలో భేదం ఉంటుంది. కొందరికి అవి వారి కుడిచేతులలో ఇవ్వబడతాయి మరియు మరికొందరికి అవి వారి ఎడమ చేతులలో ఇవ్వబడతాయి. ఖుర్ఆన్ లోని సూరతుల్ హాఖ్ఖహ్ లో అల్లాహ్ దీని గురించి ఇలా తెలుపుతున్నాడు,

 

ఇక ఎవరి కర్మల చిట్టా అతని ఎడమ చేతికి ఇవ్వబడుతుందో, అతను ఇలా అంటాడు: ‘అయ్యో, నా కర్మల పత్రం నాకివ్వబడకుండా ఉంటే ఎంత బావుండేది. అయ్యో, నా చావే (నా వ్యవహారాన్ని) తేల్చేసి ఉంటే బాగుండేదే. నా ధనం నాకే మాత్రం అక్కరకు రాలేదు. నా అధికారం నా నుండి చేజారి పోయిందే’. (అని బాధపడతాడు) ఖుర్ఆన్,  సూరా అల్ హాఖ్ఖహ్ 69: 25-29

 

అల్ హౌద్ (ప్రత్యేక సరస్సు)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సరస్సు చాలా విశాలమైంది – ఓ అల్లాహ్!దానిలో నుండి త్రాగే వారిలో మమ్మల్ని కూడా చేర్చు గాక. దాని పొడవు మరియు వెడల్పు ఒక నెల ప్రయాణానికి సమానమైన దూరంలో ఉంటుంది. దాని నీరు పాల కంటే ఎక్కువ తెల్లగా, తేనె కంటే ఎక్కువ తియ్యగా మరియు కస్తూరి సువాసన కంటే ఎక్కువ సువాసనతో ఉంటాయి. ఎవరైతే ఈ సరస్సు నుండి త్రాగుతారో, వారికి ఇక ఎన్నడూ దాహం వేయదు. ఈ సరస్సు యొక్క నీరు అల్ కౌసర్ నుండి వస్తుంది. అల్ కౌసర్ అనేది స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇవ్వబడే ఒక నది. దీని యొక్క రెండు పాయలు అల్ హౌద్ సరస్సులోనికి వస్తాయి. అల్ హౌద్ ఎల్లప్పుడూ నిండుగా ఉంటుంది. విశ్వాసులు దాని వద్దకు వస్తుంటారు మరియు దాని నీరు త్రాగుతూ ఉంటారు. తీర్పు దినం నాడు వేడి మరియు అలసట వలన ప్రజలు బాధపడుతూ ఉండే సమయంలో, ఈ హౌద్ ప్రజలు సమావేశపరచబడే చోట ఉంటుంది. అల్లాహ్ అనుమతించిన వారు ఇందులో నుండి త్రాగుతారు మరియు ఇక ఎన్నడూ వారికి దాహం వేయదు.

 

షఫా (విముక్తి, మోక్షం)

షఫా రెండు రకాలు:

మొదటిది – కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది.

 

రెండోది – మొత్తం ప్రవక్తలు, సిద్ధీఖులు, షహీదులు మరియు సజ్జనులందరి కొరకు ప్రత్యేకించబడిన సాధారణ షఫా.

 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ప్రత్యేకించబడిన షఫా – ‘అష్షఫా అతుల్ ఉధమా’. అది లెక్క ప్రారంభించేందుకు ఉద్దేశించబడింది. తీర్పుదినం నాడు, తమ తలలపై సూర్యుడు ఒక ‘మీలు’దూరమంత దగ్గరలో ఉండటం, అలా 50,000 యేళ్ళ నుండి నిలుచొని ఉండటం వలన ప్రజలను అవస్త, వేదన మరియు బాధలు చుట్టుముట్టి ఉంటాయి. వారిలో కొందరు చెమటలో మునిగి ఉంటారు.

 

అపుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ వద్ద తీర్పుదినాన్ని ప్రారంభించిమని అల్లహ్ నేర్పే ప్రార్థనతో అర్థిస్తారు. ఆయన అర్థింపును స్వీకరించి, అల్లాహ్ తన దాసుల మధ్య తీర్పు చెప్పడానికి దిగుతాడు. ఈ విధమైన సిఫారసును ‘అష్షఫా అతుల్ ఉధమా’(గొప్ప సిఫారసు) అంటారు. ఇంతటి గొప్ప సిఫారసు చేసే హక్కే అల్లాహ్ తెలిపిన క్రింది వచనాలలోని ‘అల్ మఖామ్ అల్ మహ్మూద్’, “త్వరలోనే నీ ప్రభువు నిన్నుమఖామె మహ్మూద్ (ప్రశంసాత్మక స్థానానికి) చేరుస్తాడు”ఖుర్ఆన్, సూరా బనీ ఇస్రాయీల్17:79

 

ఆ విధంగా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు మరియు తన దాసుల మధ్య తీర్పు చెప్పడానికి అల్లాహ్ దిగి వస్తాడు మరియు వారిని (ఎంతో కాలంగా) నిలబడి ఉండిన బాధ నుండి అల్లాహ్ విముక్తి కల్పిస్తాడు.

 

 “... ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగల వాడెవడు ...”ఖుర్ఆన్, సూరా బఖర 2:255

 

పుల్ సిరాత్ (వంతెన)

పుల్ సిరాత్ అనేది నరకాగ్ని పై నిర్మించబడిన ఒక వంతెన. తమ కర్మలను అనుసరించి ప్రజలు దానిని దాటుతారు;కొందరు రెప్పపాటు కాలంలో చాలా వేగంగా దాటుతారు, కొందరు కాంతి వేగంతో దాటుతారు, మరికొందరు గాలివేగంతో దాటుతారు. ఎవరైతే సత్యాన్ని స్వీకరించడంలో మరియు దానిని ఆచరించడంలో ఎలాంటి ఆలస్యం చేయలేదో, అలాంటి వారు సిరాత్ ను త్వరత్వరగా దాటుతారు మరియు ఎవరైతే సత్యాన్ని స్వీకరించడంలో మరియు దానిని ఆచరించడంలో ఆలస్యం చేస్తారో, అలాంటి వారు సిరాత్ ను చాలా నిదానంగా దాటుతారు. కేవలం విశ్వాసులు మాత్రమే సిరాత్ వంతెనను దాట గలుగుతారు, నరకవాసులు కావటం వలన అవిశ్వాసులు దానిని దాటలేరు – నరకం నుండి కాపాడమని మనం అల్లాహ్ శరణు వేడుకుందాము – దాహంతో బాధ పడుతూ వారు నరకంలోనికి చేరుకుంటారు.

 

స్వర్గం లేక నరకంలోనికి ప్రవేశం

స్వర్గవాసులు స్వర్గంలోనికి మరియు నరకవాసులు నరకంలోనికి చేరుకునే అంతిమ దశ ఇది.

 

దీని గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి, “నరకాగ్నికి భయపడండి, అది అవిశ్వాసుల కొరకు తయారుచేయబడింది”ఖుర్ఆన్, అలి ఇమ్రాన్  3:131. ఇక్కడ తయారుచేయబడింది అంటే తయారుగా ఉందని అర్థం.

 

స్వర్గం గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి, “మీ ప్రభువు యొక్క క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరుగెత్తండి. దాని వెడల్పు భూమ్యాకాశాలంత ఉంటుంది. అది భయభక్తులు గలవారి కోసం తయారు చేయబడింది”ఖుర్ఆన్, సూరా ఆలి ఇమ్రాన్3:133. ఇక్కడ తయారు చేయబడింది అంటే తయారుగా ఉంది అని అర్థం.

 

అంతేగాక నరకంలో శిక్ష అనుభవిస్తున్న ఒక స్త్రీని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూస్తారు. ఆమె కట్టడిలో ఉన్న ఒక పిల్లికి తిండి పెట్టక పోవడమే గాక, కనీసం భూమి నుండి లభ్యమయ్యే వాటిని కూడా తినకుండా నిర్భందించడం వలన అది ఆకలితో చనిపోయింది. (బుఖారీ &ముస్లిం)

 

“అవిశ్వాసులై, అన్యాయానికి పాల్పడిన వారిని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించటం గానీ, ఏదైనా మార్గం చూపటం గానీ చేయడు. వారికి నరకమార్గం చూపటం తప్ప. వారందులో ఎల్లకాలం పడి ఉంటారు. ఇలా చేయటం అల్లాహ్ కు చాలా సులువు” ఖుర్ఆన్ సూరా నిసా  4:168-169.

 

ఆధారాలు

www.islamhouse.com ((ఇంగ్లీష్)

2061 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్