సున్నత్


ఖుర్ఆన్ను అల్లాహ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పై అవతరింపజేశాడు. ఖుర్ఆన్ ను దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అనుచరుల ద్వారా లిఖితంగా మరియు నోటితోసంరక్షించాడు. ఖుర్ఆన్ కాకుండాదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పలికిన ప్రతి మాటా, చేసిన ప్రతి కర్మను కూడా అనుచరులు సంరక్షించారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పలికిన మాట (హదీస్), చేసిన కర్మ మరియు ఇతరులు చేస్తే, ఆమోదించిన కర్మలు అన్నీ సున్నత్ లో వస్తాయి. ఖుర్ఆన్ మరియు సున్నత్ రెండూ – అవతరణ (వహీ) క్రిందికి వస్తాయి.[1]

 

ఖుర్ఆన్ మరియు సున్నత్ రెండూ – ఇస్లామీయ చట్టానికి పునాదులు అని ప్రతి ముస్లిం విశ్వసించాలి. ఈ రెండూ మహోన్నతుడైన అల్లాహ్ అవతరింపజేసినవే. ఖుర్ఆన్ లోని పదాలు స్వయంగా అల్లాహ్ చెప్పినవి, కాగా సున్నత్ లోనివి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పలికిన మాటలు, చేసిన కర్మలు మరియు ఆమోదించిన పనులు. వీటిలోని ఇంకో వ్యత్యాసం ఏమిటంటే ఖుర్ఆన్ నమాజ్ లో చదువుతారు, కాని సున్నత్ ను నమాజ్ లో చదవరు.

 

ఇస్లాంధర్మం పూర్తి జీవన శైలి. కాని నేటి సమాజంలో కొందరు ఆధునిక ముస్లింలు తమ మనోవాంఛలకు అనుగుణంగా నడవడానికి, ఇస్లామీయనియమాలను ఉల్లంఘిస్తున్నారు.ఇంకొందరైతే సున్నత్ ను త్రోసిపుచ్చుతున్నారు, ఇది అత్యంత శోచనీయం.ఇలా చేయడం చాలా తప్పు.దీని గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నాకు ఖుర్ఆన్ మరియు దానికి సమానమైన మరొకటి ఇవ్వబడింది. ‘ఖుర్ఆన్ పైనే అమలుచేయండి. ఖుర్ఆన్ లో సమ్మతమైన దానిని సమ్మతంగా, నిషేధించినవాటిని నిషిద్ధంగా చేసుకోండి.’ కాని,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నిషేధించినది అల్లాహ్ నిషేధించినట్లే.”[2]

 

విషయసూచిక

 

పారిభాషిక భావం

భాషాపరంగా, సున్నత్అరబీ పదం. దీని భావం దారి, మార్గం.భాషాపరంగా అనేక భావాలు ఉన్నా, అన్నీ కలిపితే ఒకే భావం వస్తుంది. ‘లిసాన్ అల్ అరబ్’అనే పుస్తక రచయిత ‘సున్నత్’ ను – మార్గం, విధానం, అలవాటు, స్వభావం – అని వివరించారు. వీటన్నింటిని నిరంతరంగా చేస్తే, దాన్ని ‘సున్నత్’ అంటారు.

 

ఈ పదం కేవలం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కే ఉపయోగించాలనే షరతు ఏమీ లేదు. జీవితపు సున్నత్, ఫలానా మనిషి సున్నత్, ముస్లింల సున్నత్ – ఇలా ఎవరికైనా వాడవచ్చు.ఈ పదం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు వాడితే, దాని భావం మరియు ప్రత్యేకత పెరిగిపోతుంది.

 

ఇస్లామీయ భావం

ఇస్లామీయంగా,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పలికిన మాటలు, చేసిన పనులు, ఆమోదించిన కర్మలను సున్నత్ అంటారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తెచ్చిన చట్టం కూడా అల్లాహ్ తరఫు నుంచి వచ్చినదే అని ముస్లింల విశ్వాసం. ఖుర్ఆన్ లోని వచనాలు స్వయంగా అల్లాహ్ పలుకులు కాబట్టిఖుర్ఆన్ మాత్రమే అల్లాహ్ అవతరించినది అని కొందరు అంటారు. ఇది ఖుర్ఆన్ ఆయతులకు విరుద్ధం.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గురించి అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు: “మీ సహచరుడు (అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం) దారి తప్పనూ లేదు, పెడదారి పట్టనూ లేదు.అతను తన మనోభిరామం ప్రకారం మాట్లాడటమూ లేదు.అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు.” (ఖుర్ఆన్, సూరా నజ్మ్53:2-4)

 

సున్నత్ తప్పనిసరా లేదా సిఫార్సు చేయబడినదా? అల్ సుబ్కి ప్రకారం: ధార్మికంగా సున్నత్ అంటే,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రబోధనల ప్రకారం తప్పనిసరి లేదా సిఫార్సుచేయబడినది అని అర్ధం.[అల్ ఇభాజ్ ఫీ షర్ హిల్ మిన్హాజ్ 1/36][3]

 

సున్నత్ అవసరం ఏమిటి?

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కు ముందు అల్లాహ్ ప్రతి జాతిలో ఒక ప్రవక్తను పంపాడు. ప్రవక్తలందరూ తమ జాతివారిని బోధించింది ఒకటే – అల్లాహ్ ను ఆరాధించే సరిఅయిన విధానం.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కూడా ఇదే చేశారు. మనకు కేవలం ఖుర్ఆన్ మాత్రమే ఇవ్వబడి ఉంటే, మనమందరమూ దాన్ని ఒక్కో విధంగా అర్ధం చేసుకుని మార్గభ్రష్టతకు గురయ్యే వారము. అందుకోసమే, అల్లాహ్ తన కృప వల్ల మన వద్దకు తన ప్రవక్తను పంపాడు. అతను ఖుర్ఆన్ ను మరియు అల్లాహ్ ఔన్నత్యాన్ని మనకు సవివరంగా తెలియపరిచాడు. “(మేము వారిని) స్పష్టమైన నిదర్శనాలతోనూ, గ్రంథాలతోనూ (పంపి ఉన్నాము. అలాగే) ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పేందుకు, తద్వారా వారు యోచన చేసేందుకుగాను మేము నీపై ఈ జ్ఞాపిక (గ్రంథము)ను అవతరింపజేశాము.” (ఖుర్ఆన్, సూరా నహల్ 16:44)

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన మాటలు మరియు చేతల ద్వారా ఖుర్ఆన్ ను వివరించారు. అలాగే, తన సున్నత్ ల ద్వారా ఈ దివ్య గ్రంథాన్ని ఎలాఅర్ధం చేసుకోవాలో మరియు ఎలా ఆచరించాలో కూడా వివరించారు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు: “నిశ్చయంగా దైవప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది- అల్లాహ్‌ పట్ల,అంతిమ దినం పట్ల ఆశ కలిగి ఉండి, అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కరి కొరకు.”(ఖుర్ఆన్,సూరా అల్ అహజాబ్ 33:21).

 

ఇస్లాం ను అర్ధం చేసుకోవడానికి సున్నత్ చాలా అవసరం. సున్నత్ లేకుండా ఇస్లాంను అర్ధం చేసుకోవడం అసంభవం.సున్నత్ కూడా అల్లాహ్ అవతరణ అని విశ్వసించడం వల్ల మనకు (ముస్లింలకు) ఏ నష్టం లేదు. అల్లాహ్ ను ఆరాధించటానికి నమాజ్ చేయాలి, ఉపవాసం ఉండాలి,దాన ధర్మాలు మొదలైనవి చేయాలి అని ఖుర్ఆన్ లో ఉంది. కాని, ఆచరణాత్మకంగా ఎలా చేయాలో వివరించబడలేదు. అల్లాహ్ తన అపారమైన కృపతో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను పంపి, మనకు ఒక అనుసరనీయమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదించాడు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఖుర్ఆన్ ఆదేశాలను పాటించడంలో, అనుసరించడంలోఅందరికీ ఆదర్శప్రాయం.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వ్యక్తిత్వం గురించి అడిగినప్పుడు, అయన భార్య ఆయిషా రజియల్లాహుఅన్హా ఇలా అన్నారు: “... ఆయన వ్యక్తిత్వం మొత్తం ఖుర్ఆన్ కు అనుగుణంగా ఉండేది.” (ముస్లిం ఇంగ్లీష్ అనువాదం, vol 1, పేజి 358-360,నెం. 1623)

 

సున్నత్ అనుసరించడం తప్పనిసరా?

అల్లాహ్ కు విధేయత చూపడం నిస్సందేహంగా తప్పనిసరి. అల్లాహ్ ఇలా అన్నాడు: “ప్రవక్త (సఅసం)కు విధేయత చూపినవాడు అల్లాహ్‌కు విధేయత చూపినట్లే.” (ఖుర్ఆన్, సూరా అన్ నిసా 4:80). దీని వల్ల తెలిసిందేమిటంటేదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు విధేయత చూపితే అల్లాహ్ కు విదేయత చూపినట్లే.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:“నాకు అవిధేయత చూపినవాడు, అల్లాహ్ కు అవిధేయత చూపిన వాడవుతాడు.” (బుఖారీ ఇంగ్లీష్ అనువాదం vol 9, పేజి198, నెం 251). సున్నత్ ను అనుసరించడం ప్రతి ముస్లింపై తప్పనిసరి.

 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఆదేశించి సున్నత్ ప్రాముఖ్యతను చాటాడు: “కనుక (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు తోడు! వారు తమ పరస్పర వివాదాలన్నింటిలో నిన్ను తీర్పరిగా చేసుకోనంతవరకూ, తర్వాత  నీవు వారి మధ్య చెప్పిన తీర్పుపట్ల వారు తమ మనసులలో ఎలాంటి సంకోచానికి, అసంతృప్తికి ఆస్కారం యివ్వకుండా మనస్ఫూర్తిగా  శిరసావహించనంతవరకూ - వారు విశ్వాసులు కాజాలరు.” (ఖుర్ఆన్, సూరా నిసా 4:65)

 

“(చూడండి) అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త ఏ వ్యవహారం లోనయినా ఒక నిర్ణయం చేసిన  తరువాత విశ్వాసులైన ఏ పురుషునికి గానీ,  స్త్రీకి గానీ తమకు వర్తించే ఆ వ్యవహారంలో ఎలాంటి స్వయం నిర్ణయాధికారం మిగిలి ఉండదు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే అతను స్పష్టమైన అపమార్గానికి లోనైనట్లే (జాగ్రత్త!).” (ఖుర్ఆన్, సూరా అల్ అహ్జాబ్ 33:36). ముస్లింలుగా మన విశ్వాసం ఏమిటంటే మన శ్రేయస్సు కొరకు అల్లాహ్ మరియు అయన ప్రవక్త మనకు ఎల్లప్పుడూ ఆదేశిస్తారు.  దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను అనుసరించడం మన స్వయానికే శ్రేయస్కరం.కొందరు అవివేకులు ఆలోచించే విధంగా ఏమిటంటే ఇలా చేయడం వల్ల మనకు ఎలాంటి కీడుకలగదు.

 

ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం దైవప్రవక్తే కాకుండా అరేబియా 7 వ శతకంలోనీఒక అరబ్బు నివాసి. ఆయనక్కూడా ఇతరుల వలె కొన్ని వ్యక్తిగత అభిలాషలు ఉండేవి. ఆయన వ్యక్తిగతఅభిలాషలు, ఇస్లామీయ చట్టానికి అతీతం.దీనికి ఓ ఉదాహరణ - దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మదీనా వచ్చినప్పుడు, అక్కడి ప్రజలు కృతిమ ఖర్జూరపు చెట్లను నాటేవారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగినప్పుడు, ఇది మా అలవాటు అని అన్నారు. దానికిదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా చేయకుంటే మంచిదేమో అని నేను అనుకుంటున్నాను అని అన్నారు. వారు అయన చెప్పినట్లే అలా చేయడం మానేశారు. ఆ తరువాతి సంవత్సరం ఖర్జూరపుపంట చాలా దెబ్బతింది.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంముందు ఈ మాట వచ్చినప్పుడు ఆయన ఇలా అన్నారు: “నేను కూడా ఓ మానవమాత్రున్నే. కాబట్టి, ధార్మిక విషయంలో నేను ఏదైనా ఆదేశిస్తే, దాన్నిస్వీకరించండి. కాని, అదేప్రాపంచిక విషయంలో ఏదైనా చెబితే, అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నేను మీ లాంటి ఓ మానవుణ్ణి మాత్రమే.” (ముస్లిం ఇంగ్లీష్ అనువాదం vol 4, పేజి 1259, నెం5831)

 

ఇస్లాంలో కేవలం అల్లాహ్ ఒక్కడే ఆరాధ్యుడు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మానవుడు కాదు, అని అనడం నిరర్ధకం. ముహమ్మద్సల్లల్లాహు అలైహివ సల్లం దైవప్రవక్త కూడా కావడం వల్ల అతని సున్నత్ లు దోషరహితమైనవి, నిర్దిష్టమైనవి. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు: “నేనూ మీలాంటి  మానవ మాత్రుణ్ణే. (కాకపోతే) 'మీ అందరి ఆరాధ్యదైవం ఒకే ఆరాధ్య దైవం' అన్న సందేశం (వహీ) నా వద్దకు పంపబడుతుంది.” (ఖుర్ఆన్, సూరా కహఫ్ 18:110). సిసలైనముస్లింలుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంనుఅనుసరిస్తారు, ఆయన్ని ఆరాధించరు.[4]

 

సున్నత్ వలన లాభాలు ఏమిటి?

ప్రముఖ విద్వాంసులు ఇమాం మాలిక్ ఇలా అన్నారు: “సున్నత్ నూహ్ అలైహిస్సలాం నావ లాంటిది. దానిపై ఎక్కినవాడు సాఫల్యం పొందుతాడు, దాన్ని త్రోసిపుచ్చినవాడు మునిగిపోతాడు.” (దీన్ని షేక్ ఉల్ ఇస్లాం ఇబ్న్ తైమియా, మజ్మూఉల్ఫతావా4/57 లో ధ్రువీకరించారు).

 

స్వర్గంలో ప్రవేశించడానికి మరియు నరకాగ్ని నుంచి మనల్ని కాపాడుకోవటానికి ఈ మోక్షం చాలా అవసరం. సున్నత్ ను పాటించకుండా ప్రళయదినం నాడు నిరాశ చెందడం చాలా ఘోరం. దానికంటే ఘోరం ఉండదు. ఖుర్ఆన్ లో ఇలా సెలవీయబడింది: “ఆ రోజు  దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: "అయ్యో! నేను దైవప్రవక్త  (సఅసం) మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బావుందేది!” (ఖుర్ఆన్,సూరా అల్ ఫుర్ఖాన్ 25:27).శిక్ష సమయంలో కూడా ఈ నిరాశ వెంట ఉంటుంది:“ఆ రోజు వారి ముఖాలు అగ్నిలో అటూ ఇటూ పొర్లింపబడతాయి.అప్పుడు వారు,  "అయ్యో!  మేము అల్లాహ్‌కు,  ప్రవక్తకు విధేయత చూపి ఉంటే ఎంత బావుండేది?" అని అంటారు.” (ఖుర్ఆన్, సూరా అహజాబ్ 33:66). మరో వైపు సున్నత్ ను అనుసరించినవాడు, నిజమైన సాఫల్యం పొందుతాడు: “అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (సఅసం)కు విధేయత  చూపేవారికి అల్లాహ్‌,  క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప విజయం అంటే ఇదే.” (ఖుర్ఆన్,సూరా నిసా 4:13).దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంఇలా అన్నారు: “నాకు విధేయత చూపినవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు మరియు నాకు అవిధేయత చూపినవాడు అందులో ప్రవేశించడు.” (సహీహ్ బుఖారీ ఇంగ్లీష్ అనువాదం, vol 9:384)

 

సున్నత్ యొక్క తియ్యదనం జీవితంలో కనిపిస్తుంది. సున్నత్ పై అమలు చేసినవారికి మానసికంగా, శారీరకంగా శాంతి లభిస్తుంది. దీన్ని ముస్లిమేతర శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకుంటున్నారు.కొన్ని ఏళ్ల క్రితమేవైజ్ఞానిక శాస్త్రం, ఆరోగ్య శాస్త్రంకనుగొన్న వాస్తవాలను,1000 సంవత్సరాల ముందేదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నోటి వెంట వెలువడడం వాస్తవం. దీని వల్ల తేలిందేమిటంటే, సున్నత్ అల్లాహ్ అవతరించిందే. కావున, సున్నత్ ప్రకారం జీవితం గడిపే వాడు తన స్వయానికి మరియు మానవాళినంతటినీ మంచిని చేకూర్చుతాడు.సున్నత్ ను త్రోసిపుచ్చినవాడు ఓ మహా నిధిని కోల్పోయినవాడవుతాడు. ఆ నిధి పూర్తి సృష్టిలో చాలా విలువైనది. అది మనిషికి శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది.

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా సెలవిచ్చారు: “నేను మీ మధ్య రెండు విషయాలను వదలి పోతున్నాను. మీరు వాటిని అనుసరించినంత వరకూమార్గభ్రష్టతకు లోను కారు. అవి – దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్.” (మువత్తా మాలిక్, బుక్ 46, హదీస్ నెం 3) (అరబీ, బుక్ 46,హదీస్ నెం 1626)[5]

 

ఆధారాలు

[1] http://sunnahonline.com/library/fiqh-and-sunnah/127-suhayb-hasan (ఇంగ్లీష్)

[2] [3] [4][5] http://www.islaamnet.com/whatissunnah.html (ఇంగ్లీష్)

 

887 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్