వేడుకోలు(దుఆ)


వేడుకోలు అనగా అర్ధించడం, అడగడం.

 

విషయసూచిక

 

పరిచయం

ఇస్లాంలో దుఆ చాలా ముఖ్యమైనది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం “దుఆ”ను ఆరాధన అన్నారు. అత్తిర్మిజి 3372, అబూ దావూద్ 1479, ఇబ్న్ మాజా 3828, సహీహ్ అని ఇమామ్ అల్బాని గారు ‘సహీహుత్తిర్మిజి’లో పేర్కొన్నారు.

 

అల్లాహ్ కు అడిగే వారంటే చాలా సంతోషం. మానవులు అన్ని విషయాల్లో ఆయన్నె అడగాలని అల్లాహ్  కోరుతున్నాడు. ఎవరైతే అల్లాహ్ ముందు వేడుకోరో అల్లాహ్ వారిపై కోపంగా ఉంటాడు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఆదేశిస్తున్నాడు: ”నన్ను ప్రార్ధించండి , నేను మీ ప్రార్ధనలను అంగీకరిస్తాను.” ఖుర్ఆన్, సూరా ఘాఫిర్ 40:60

 

ముస్లింలు అల్లాహ్ ను తప్ప ఇతరులను పూజించరు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : “మీ ఆరాధనలకు, వేడుకోళ్ళకు సమాధానం ఇచ్చేవాడు అల్లాహ్ ఒక్కడే. ఆయన్నెశరణుకోరండి” తిర్మిజి 2516 , ఇమామ్ అల్బాని గారు తమ పుస్తకo సహీహుల్ జామిలో దీన్ని సహీహ్ అన్నారు. 

 

దుఆ చేసే విధానం

 

దుఆ చేసే పద్ధతి

1.  దుఆ అంగీకరించబడాలంటే మొదటి విషయం అల్లాహ్ తో ఎవ్వరినీ జతచేయకూడదు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఆదేశిస్తున్నాడు: (ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవారు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికీ చెప్పు).    ఖుర్ఆన్, సూరా బఖర 2 : 186

 

2. దుఆ చేసాక తొందర పడకూడదు. అలా చేసిన ఎడల దుఆ తిరస్కరించబడే అవకాశం ఉంది. కావున హదీసులో ఇలా ప్రస్తావించబడింది: తొందరపడకుండా, నేను చేసిన దుఆ ఇంకా స్వికరించబడలేదు అని నిరాశ చెందకండి. సహీహ్ ముస్లిం :6593

 

3. అల్లాహ్ భీతిపరుల నజరానాను మాత్రమే స్వీకరిస్తాడు. ఖుర్ఆన్, సూరా మాయిదహ్ 5:27

 

4. దుఆలో అక్రమ వైఖరి అవలంబించకూడదు. అల్లాహ్ కు అక్రమ పద్ధతి నచ్చదు. “మీరు మీ ప్రభువును కడు దీనంగా వేడుకొండి. హద్దు మీరిపోయే వారిని ఆయన సుతరామూ ఇష్టపడదు. ఖుర్ఆన్, సూరా అరాఫ్ 7:55  

 

దుఆ చేయాల్సిన సమయాలు

కొన్ని నిర్దిష్టమైన సమయాల్లో దుఆ చేయాలని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రబోధించారు. అవి :

 

1.   రాత్రి చివరి సమయం(భాగం)లో

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారని అబూ హురైరా రజియల్లహు అన్హు ఉల్లేఖించారు: ప్రతి రాత్రి దాని చివరి భాగములో మన ప్రభువు అల్లాహు తఆలా ప్రపంచపు యొక్క ఆకాశము పైన దిగుతుంటాడు, ఇంకా అంటుంటాడు: ఎవరైనా ఉన్నాడా నా యందు ‘దుఆ’ చేసేవాడు, నేను అతని యొక్క దుఆను అంగీకరించటానికి. ఎవరైనా ఉన్నాడా నాతో అడిగేవాడు నేను అతనికి ప్రసాదించటానికి. ఎవరైనా ఉన్నాడా నాతో పశ్చాతాపము కోరేవాడు నేనతనికి క్షమించటానికి. (సహీహ్ బుఖారీ 1145, సహీహ్ ముస్లిం 758)   

రాత్రి చాలా గడిచాక ప్రపంచం మొత్తం ప్రాపంచిక సుఖాల్లో తేలియాడుతూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు అల్లాహ్ తన దైవ దాసులకు ఓ మంచి అవకాశం ద్వారా తమ తమ కోరికలను అల్లాహ్ ఎదుట ఉంచమని ఆదేశిస్తున్నాడు . దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు : “రాత్రి వేళల్లో ఓ సమయం ఉంది అప్పుడు అల్లాహ్ తన దాసుల యొక్క కోర్కెలను తీరుస్తాడు, ఇది ప్రతి రాత్రీ జరుగుతూ ఉంటుంది.” సహీహ్ అల్ ముస్లిం 757.

అనస్ రజిఅల్లాహు అన్హు ఇలా ఉటంకించారు :  దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంఇఖామత్ మరియు నమాజ్ మధ్యలో వేడుకున్నదాన్ని అల్లాహ్ తిరస్కరించడు”అని అన్నారు. అహ్మద్,అబూ దావూద్ 521, తిర్మిజి vol 1:212, సహీహుల్ జామి:3408, నసాయి మరియు ఇబ్న్ హిబ్బాన్ దీన్ని ధ్రువీకరించారు.

 

2. శుక్రవారం రోజు ఒక ప్రత్యేక సమయంలో

అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు :  దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కధనం ప్రకారం: శుక్రవారం రోజు ఓ ఘడియ ఎలా ఉంటుందంటే ఆ సమయంలో  ఎదైననూ కోరుకుంటే అది ఇవ్వబడుతుంది. ఆ సమయం చాలా స్వలంగా ఉంటుంది అని  దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చేయిని చూపుతూ చెప్పారు. సహీహ్ అల్ బుఖారీ: 935

 

3. ‘జమ్ జమ్’ నీళ్ళు త్రాగెటప్పుడు

జాబెర్ (రజి) ఇలా అన్నారు ‘జమ్ జమ్నీళ్ళు త్రాగటం చాలా ఉపయోగకరమైనవి. అహ్మద్ 3:357 & ఇబ్న్ మాజా vol 2:1018, 3062(NE).జమ్ జమ్’తాగేటప్పుడు ఈ నీళ్ళ ద్వారా నాకు మంచి చేకూర్చు, నా రోగాలను దీని ద్వారా నివారణ చెయ్యి’” అని అన్నారు.

 

4. సజ్దాలో ఉన్నప్పుడు

అబూ హురైరా (రజి) ఇలా అన్నారు. “సజ్దా” లో ఉన్నప్పుడు దాసుడు అల్లాహ్ కు చాలా సమీపమై ఉంటాడు, కావున సజ్దా లో ఉన్నప్పుడు అల్లాహ్ ను ఎక్కువగా స్మరించాలి” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అన్నారు. ముస్లిం, అబూ దావూద్, అన్ నసాయి, సహీహుల్ జామి 1175, రియాజుస్ సాలిహీన్ 1428

 

5. రాత్రి నిద్ర నుండి లేచినప్పుడు

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారని ఉబాద బిన్ అస్ సమిత్ (రజి) అన్నారు: “ఎవరైతే రాత్రి మేల్కొని లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్ దు వహువ అలాకుల్లి షైఇన్ ఖదీర్.  అల్ హందు లిల్లాహి వ సుబ్ హా నల్లాహి వ లా ఇలాహ ఇల్లల్ లాహు , వల్లాహు అక్బర్ వలా హౌల వలాఖువ్వత ఇల్లా బిల్లాహ్”(పూజించ దగేవాడు అల్లాహ్ తప్ప ఎవ్వరూ లేరు, ఆయనకి సహాయకులు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారం అంతా ఆయనదే, సర్వ స్తోత్రాలకు అర్హుడు ఆయనే, అల్లాహ్ తప్ప ఎవ్వరూ ఆరాధ్యానికి అర్హులు కారు, అల్లాహ్ యే అందరి కంటే గొప్పవాడు, అల్లాహ్ కు తప్ప ఎవ్వరికి ఎలాంటి అధికారం లేదు)    చదివాక అల్లాహుమ్మఘ్ ఫిర్లి (ఓ అల్లాహ్ ! నన్ను క్షమించు) చదివి వజూ చేసి నమాజ్ చదివితే అతని నమాజ్ అంగీకరించబడుతుంది.  సహీహుల్బుఖారీ vol 2:253  

 

6. ఫర్జ్ నమాజ్ తరువాత

అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం , “ఏ సమయంలో దుఆ స్వీకరించబడుతుంది?” అని కొందరు అడిగారు. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “రాత్రి చివరి ఘడియలు, ఫర్జ్ నమాజ్ తరువాత” అని అన్నారు. తిర్మిజి

 

7. ఖద్ర్ రాత్రి

అన్ని రాత్రుల్లో కెల్లా ఇది శుభమైన రాత్రి. “ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది” ఖుర్ఆన్, సూరా ఖద్ర్ 97:3

 

8. వాన పడేటప్పుడు

సహ్ల్ ఇబ్న్ సాద్ రజియల్లాహు అన్హు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారని చెప్పారు : “రెండు (దుఆలు) ఎప్పటికీ నిరాకరించబడవు. ఒకటి అజాన్ పలికేటప్పుడు, రెండు వానపడేటప్పుడు.”  సహీహ్ అల్ జామి: 307

 

9. అజాన్ సమయంలో

సహ్ల్ ఇబ్న్ సాద్ రజియల్లాహు అన్హు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారని చెప్పారు : “రెండు (దుఆలు) ఎప్పటికీ నిరాకరించబడవు. ఒకటి అజాన్ పలికేటప్పుడు, రెండు వానపడే టప్పుడు.”  సహీహ్ అల్ జామి: 307.

మరో హదీసులో ఇలా అనబడింది : ‘నమాజు కొరకు పిలవబడినప్పుడు ఆకాశ ద్వారాలు తెరవబడుతాయి, మరియు దుఆకు జవాబు ఇవ్వబడుతుంది.’ ముస్నద్ అత్తియాలిసి : 2106 మరియు  అస్ సిల్సిలహ్ అస్సహీహహ్: 1413

 

10. అజాన్ మరియు ఇఖామత్ మధ్యలో

అనస్ రజిఅల్లాహు అన్హు  దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారని ఉల్లేఖించారు : ‘అజాన్ మరియు ఇఖామత్ మధ్యలో చేసిన దుఆ రద్దు చేయబడదు.’అబూ దావూద్ 521, తిర్మిజి 212, సహీహుల్జామి 3408, అన్ నసాయి మరియు ఇబ్న్ హిబ్బాన్ దీన్ని ధ్రువీకరించారు.

 

11. సజ్దాలో ఉన్నప్పుడు
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారని అబూ హురైరా రజిఅల్లాహు అన్హు ఉల్లేఖించారు: ‘ఒక దాసుడు అల్లాహ్ కు అత్యంత సమీపంలో ఉండేది, సజ్దా చేసేటప్పుడు. అందువల్ల సజ్దా లో ఎక్కువగా వేడుకోండి.’ సహీహ్ అల్ బుఖారీ  979 మరియు సహీజామీ 1175

 

12.  అన్యాయాన్ని, హింసను భరించేవాడు

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ముఆద్ ఇబ్న్ జబల్ రజి అల్లాహు అన్హు తో ఇలా అన్నారు : ‘అన్యాయాన్ని, హింసను భరించేవాడి వేడుకోలు(దుఆ) చాలా శక్తివంతమైనది. ఎందుకంటే అన్యాయాన్ని భరించేవాడికి మరియు అల్లాహ్ కి మధ్య ఏదీ అడ్డు ఉండదు. అనగా అతని దుఆ మరియు అల్లాహ్ మధ్య ఏదీ అడ్డు ఉండదు.అది తిరస్కరించబడే అవకాశం లేదు.’  సహీహ్ బుఖారీ 1496 మరియు సహీహ్ ముస్లిం : 29

 

13. ప్రయాణికుడు

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : మూడు రకాల వేడుకోళ్ళు నిరాకరించబడవు. తమ సంతానం కోసం తల్లిదండ్రులు చేసేది, ఉపవాసం ఉన్నవారిది, ప్రయాణంలో ఉన్నవాడిది. అల్ బైహఖి vol 3:345, అల్ బాని గారి అస్సహీహ్ 1797, రియాజుస్ సాలిహీన్ 980

ప్రయాణించేవాడి ప్రయాణం మంచి ఉద్దేశంతో ఉంటేనే ఇది వర్తిస్తుంది. అదే ప్రయాణం చెడు ఉద్దేశంతో ఉన్నచో ఇది వర్తించదు.

 

14. తమ సంతానం కోసం తల్లిదండ్రులు చేసే దుఆ

మూడు ‘దుఆ’(ప్రార్ధన)లు అంగీకారము పొందేయి ఉన్నాయి అందులో ఎటువంటి సందేహము లేదు.

1.      దౌర్జన్యానికి గురైన వ్యక్తి యొక్క ‘దుఆ’

2.      ప్రయాణికుడి యొక్క ‘దుఆ’

3.      తండ్రి యొక్క ‘దుఆ’ తన సంతానము కొరకు. (అబూ దావూద్, తిర్మిజి దీనిని ఉల్లేఖించారు, ఇంకా తిర్మిజి దీనిని ‘హదీస్ హసన్’ అని అన్నారు. మరి అబూదావూద్ ఉల్లేఖనంలో సంతానము కొరకు అనే వాక్యము లేదు.)   

 

15. నమాజ్ లో తషహ్హుద్ లో అల్లాహ్ ను కీర్తించిన తరువాత   దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పై సలాం చదివాక నమాజ్ ముగించే ముందు చేసే దుఆ.  

ఫజాల ఇబ్న్ ఉబైద్ రజి అల్లాహు అన్హు ఉటంకించారు -    దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా సెలవిచ్చారు : ఎవరైనా దుఆ చేసేముందు అల్లాహ్ ను పొగుడుతూ ఆయన ఔన్నత్యాన్ని చాటాలి, తరువాత  దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పై సలాం చదవాలి, ఆ తరువాత తన కోసం వేడుకోవాలనుకున్నది వేడుకోవాలి. అబూ దావూద్ 1481, తిర్మిజి 3477

 

16. తమతో పాటు లేని తమ సోదర సోదరీమణుల కొరకు దుఆ చేయడం   

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా సెలవిచ్చారని అబూ జర్ర్ రజియల్లహు అన్హు ఉల్లేఖించారు: తమతోపాటు లేని తమ ముస్లిం సోదరుడు లేదా సోదరి కొరకు దుఆ చేసినప్పుడు ‘నీకూ మేలు కలుగుగాక!’ అని దైవదూతలు అంటారు. సహీహ్ ముస్లిం6588. మన వేడుకోళ్ళను అల్లాహ్ వద్దకు తీసుకెళ్ళే దైవదూత ‘ఆమీన్ (కలుగుగాక), నీకూ కూడా’ అని అంటారు.సహీహ్ ముస్లిం 6589.   

 

17.అరఫాత్ రోజు చేసే దుఆ

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : “వేడుకోళ్ళలో ఉన్నతమైనది అరాఫత్ రోజు వేడుకున్నది.” తిర్మిజి 2640, ముఅత్తా మాలిక్ 32

 

18.రమజాన్ నెలలో చేసే దుఆ

రమజాన్ నెల చాలా పవిత్రమైనది. కావున ఈ నెలలోని దుఆ కూడా ఉన్నతమైనదే. దీని గురించి   దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : ‘రమజాన్ రాగానే, దయ ద్వారాలు (మరో ఉల్లేఖనం లో స్వర్గ ద్వారాలు) తెరవబడుతాయి, నరక ద్వారాలు మూసివేయబడుతాయి, షైతాన్ బంధించబడుతాడు. దీనివల్ల తెలిసేదేమిటంటే రమజాన్ మాసంలో చేసే దుఆ ఆమోదించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ మాసంలో దయ మరియు స్వర్గ ద్వారాలు తెరువబడుతాయి. సహీహుల్బుఖారీ vol 3:1899, సహీహ్ ముస్లిం 1079, ఇమామ్ అల్బాని గారు దీనిని ధ్రువీకరించారు సహీహు త్తర్ఘీబ్ లో 1/491. 

 

19. జుల్ హిజ్జ మొదటి పది రోజులు

 ఇబ్న్ అబ్బాస్ రజియఅల్లాహు అన్హు ఉల్లేఖించారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అన్నారు : ‘ఈ పది రోజుల్లో చేసే పుణ్య కార్యాలు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి.’సహీహుల్బుఖారీ vol 2:86, తిర్మిజి vol 2:757, రియాజుస్ సాలిహీన్ 259.

 

20. అనారోగిని సందర్శించినప్పుడు చేసేదుఆ

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారని ఉమ్మ్ సలమ ఉల్లేఖించారు : ‘మీరు జబ్బుపడిన వాడిని, లేదా మృత్యువు చెందిన వాడిని సందర్శించినప్పుడు మంచి మాటలే పలకండి. ఎందుకంటే ఆ సమయంలో దైవదూతలు ప్రతిదానికి ఆమీన్ (జరుగుగాక) అని అంటారు. సహీహ్ ముస్లిం 2126 

 

21. వుజూ తరువాత చేసే దుఆ

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ప్రబోధించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు : మీలో ఎవరైతే వుజూ మంచి పద్ధతిలో చేసి, ‘అష్ హదు అల్లాహ్ ఇలాహ ఇల్లల్లాహ్ వహ్ దహు లా షరీక లహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు’ అని అంటారో ఎనిమిది స్వర్గ ద్వారాలు అతనికోసం తెరవబడుతాయి. అతను అందులోని ఏ మార్గం ద్వారానైనా స్వర్గం లో  ప్రవేశించవచ్చు. సహీహ్ ముస్లిం 234

 

22.హజ్ లో జమరాత్ పై రాళ్లు విసిరాక చేసే దుఆ

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారని ఉల్లేఖిoచ బడింది. సహీహుల్బుఖారీ 1753

 

23.కోడి కూసినప్పుడు చేసే దుఆ

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారని అబూ హురైరా రజి అల్లాహు అన్హు ఉల్లేఖించారు : ‘కోడి కూస్తున్నప్పుడు అల్లాహ్ ను వేడుకొండి, ఎందుకంటే కోడి దైవదూతను చూస్తుంది. గాడిద అరుస్తున్నప్పుడు అల్లాహ్ శరణు కోరండి, ఎందుకంటే అది షైతాన్ ను చూస్తుంది.’ ఫత్ హుల్ బారి 6/350, ముస్లిం 4/2092, సహీహుల్ జామి 611

 

24. కాబా లోపల చేసే దుఆ

కాబా ఎంత ఉన్నతమైనది అంటే దానికి సరిసమానం ఈ ప్రపంచంలో  ఏదీ లేదు. హతీం లోపల చేసే వేడుకోలు కాబా లోపల చేసినట్లే. ఎందుకంటే ఇది కూడా కాబా భాగమే. (వృత్తాకారంలో ఉన్న ఈ హిజ్ర్ మీరు కాబా ద్వారానికి ముఖం చేసి ఉన్నచో  కాబా కు కుడివైపు ఉంటుంది, యమానికి వ్యతిరేకంగా ఉంటుంది).   

 

25. ఉమ్రా లేదా హజ్సమయంలో సఫా మరియు మర్వా మధ్య చేసే దుఆ  

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సఫా మరియు మర్వా కొండలపై చాలా ఎక్కువ సేపు దుఆ చేసేవారు. సహీహ్ ముస్లిం 1218

 

26. నమాజ్ లో ఆమీన్ అనడం  

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : ‘ఇమాం ‘ఆమీన్’ అన్నప్పుడు మీరు కూడా అతని వెనుక ఆమీన్ అనండి, ఎందుకంటే ఎవరెవరి ఆమీన్ దైవదూతల ఆమీన్ తో కలుస్తుoదో వారి  పాపాలన్నీ కొట్టివేయబడుతాయి.సహీహుల్బుఖారి: 780,  సహీహ్ ముస్లిం: 816

 

ఆధారాలు

www.islamawareness.net (ఇంగ్లిష్)

www.islamqa.com(ఇంగ్లిష్)

www.abdurrahman.org/zikr/best-times-to-make-dua.html(ఇంగ్లిష్)

612 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్