నమాజ్ (సలాహ్) ప్రాముఖ్యత


ఇస్లాం మూలస్థంభాలలో చాలా ముఖ్యమైనది, విశ్వాసం (షహాద) తరువాతి స్థానం నమాజ్ (సలాహ్). అల్లాహ్ మనపై వివిధ రకాల ఆరాధనలను విధించాడు. అందులో నమాజ్ (సలాహ్) ఒకటి. ఇది రోజూ, క్రమం తప్పకుండా పాటించే ఆరాధన.నమాజ్ (సలాహ్) వల్ల మనము రుజుమార్గంపై ఉంటాము మరియు అల్లాహ్ కు ఆగ్రహం తెప్పించే విషయాలకు దూరంగా ఉండగలుగుతాము.


నమాజ్(సలాహ్) వల్ల మానవుడు తన సృష్టికర్త ముందు వినయంగా నిలబడి, తను చేసిన తప్పులకు క్షమాపణ కోరే అవకాశం దొరుకుతుంది.దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లంకు ఇష్టమైన కర్మలలో నమాజ్ (సలాహ్) ఒకటి. నమాజ్ ద్వారా మనిషి తన ప్రభువుతో మాట్లాడగలడు మరియు తన కోరికలను వేడుకోగలడు.

విషయసూచిక

 

ఖుర్ఆన్

“నమాజును నెలకొల్పు. నిశ్చయంగా నమాజ్ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది.” (ఖుర్ఆన్ సూరా అల్ అన్ కబూత్ 29:45)
 

హదీస్

హదీసు ప్రకారం విశ్వాసులు అంతిమదినాన నమాజ్ గురించి ప్రశ్నించబడతారు. “తీర్పు దినాన మానవునికి మొట్టమొదటగా అడగబడేది నమాజ్ గురించే. ఇందులో అతను సాఫల్యం పొందితే మిగతా వాటిలో కూడా సాఫల్యం పొందవచ్చు. అదే ఇందులో సాఫల్యం పొందలేని పక్షంలో, మిగతా వాటిలో కూడా సాఫల్యం పొందడం కష్టం.” తబరాని


ఉబాదా బిన్ సామిత్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు:దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు: “ఐదు పూటల నమాజు అల్లాహ్ తన ప్రతి దాసునిపై విధి గావించాడు. ఎవరైతే దాన్ని క్రమం తప్పకుండా పాటిస్తారో, నిర్లక్ష్యం కారణంగా వదలిపెట్టరో, వారికి తీర్పుదినాన అల్లాహ్ స్వర్గంలో ప్రవేశింపజేస్తానని ఒప్పందం చేస్తాడు. కాని ఎవరైతే దాన్ని పాటిస్తూ,అప్పుడప్పుడు నిర్లక్ష్యం కారణంగా వదలిపెడతారో, వారితో అల్లాహ్ ఎలాంటి ఒప్పందం చేయడు. అల్లాహ్ తలచుకుంటే అతణ్ణి శిక్షిస్తాడు లేదా క్షమించివేస్తాడు.” [సునన్ ఇబ్న్ మాజా vol 1:1401(అరబీ 1465), సునన్ నసాయి vol 1: 462]


నమాజును దైవానుగ్రహంగా భావించాలి. ఎందుకంటే మనం చేసే తప్పులను అది తుడిచేస్తుంది. నమాజ్ ద్వారా మనం అల్లాహ్ తో నేరుగా మాట్లాడి, మన తప్పులను మన్నించమని, మంచి కార్యాలు చేయించమని వేడుకోవచ్చు. అల్లాహ్ మనల్ని చూస్తున్నాడనే భావనతో నమాజ్ చదవాలి. దీని మూలంగా అల్లాహ్ పట్ల విధేయత పెరుగుతుంది. ఇతరులకు చూపించడానికి నమాజ్ చేసినచో  అది మహా పాపం.దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు:


“ఎవరి ఇంటిముందైనా సెలయేరు ఉండి, అతను అందులో ఐదు సార్లు స్నానం చేసినచో అతని శరీరంపై ఏదైనా రోత మిగిలి ఉంటుందా?” “అతని శరీరంపై ఏది ఉండదు” అని ప్రజలు అన్నారు. దానిపై దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లంఇలా సెలవిచ్చారు: “ఇది ఐదు పూటల నమాజు అలాంటిది. వీటి మూలంగా అల్లాహ్ మానవుని పాపాలను తుడిచేస్తాడు.” (బుఖారీ, ముస్లిం)


దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా కూడా అన్నారు : “రోజువారిఐదు పూటల నమాజు మరియు శుక్రవారపు నమాజ్ నుంచి మరో శుక్రవారపు నమాజ్ వరకు మధ్యలో జరిగే తప్పులకు ప్రాయశ్చితం అవుతుంది.” (ముస్లిం)


ఆధారాలు

http://www.supportersoftawheed.co.uk/importanceofsalaaharticle.html (ఇంగ్లీష్)
 
 

752 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్