హదీస్ నిర్వచనం


హదీస్ అంటే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఆదేశాలు, ఆచరణలు, అనుమతించిన పద్ధతులు మరియు వారి వ్యక్తిగత ప్రవర్తన కు సంబంధించిన విషయాలు

 

విషయసూచిక

 

ఆదేశాలు


 ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన మాటల ద్వారా ప్రజలను ఆజ్ఞాపించినవి. ఉదాహరణ - ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజిఅల్లాహు అన్హు) ఇలా చెప్పారు – ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెబుతుండగా నేను విన్నాను " చేసిన పనులకు లభించబోయే ప్రతిఫలం పూర్తిగా సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి అతడి సంకల్పానికి అనుగుణంగా ప్రతిఫలం పొందుతాడు. కాబట్టి ఎవరైతే ప్రాపంచిక ప్రయోజనాల కోసం లేదా స్త్రీని పెళ్ళాడడం కోసం వలస వెళ్తారో అతడి వలస కేవలం దాని కోసమే అవుతుంది." సహీహ్ బుఖారి హదీస్ గ్రంథం

 

ఆచరణలు


ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా అచరించి, ప్రజలకు చూపినవి. ఉదాహరణ - ప్రవక్త భార్య ఆయిషా (రజిఅల్లాహు అన్హా) ఇష్టానుసారంగా ఉండే నఫిల్ (తప్పనిసరి కాని) ఉపవాసాల ఆచరణ పద్ధతి గురించి వివరిస్తూ ఇలా చెప్పారు "ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక్కోసారి ఇక ఉపవాసాలు ఆపరు అనుకునేటంత తరచుగా ఉపవాసాలుండేవారు మరియు ఇంకోసారి ఇక ఉపవాసాలుండరు అనుకునేటంత ఎక్కువకాలం ఉపవాసం నిలిపేసేవారు." సహీహ్ బుఖారి & సహీహ్ ముస్లిం హదీస్ గ్రంథాలు

 

అనుమతించినపనులు 


 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమోదించిన సహచరుల ఆచరణలు. ఉదాహరణ - అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజి అల్లాహు అన్హు ఇలా తెలిపారు - "అల్ అహ్జాబ్ యుద్ధం తర్వాత ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)  తన సహచరులకు బనుఖురైజా (మదీనా దగ్గరి ఒక ప్రాంతం) చేరుకుని మాత్రమే అసర్ నమాజ్ పూర్తిచేయమని ఆదేశించారు. కొంతమంది సహచరులు బనుఖురైజా లోనే అసర్ నమాజ్ పూర్తి చేసారు. కాని కొంతమంది నిర్ణీత సమయం దాటిపోతున్నదనే భయంతో బనుఖురైజా చేరక ముందే దారిలోనే అసర్ నమాజ్ పూర్తిచేసారు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులు పాటించిన ఈ రెండు విభిన్న పద్ధతులలో దేనినీ తప్పు పట్టలేదు." సహీహ్ బుఖారి & సహీహ్ ముస్లిం హదీస్ గ్రంథాలు 

 

ప్రవర్తన


 ప్రవక్త ముహమ్మద్  (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క భౌతిక లక్షణాలు, గుణగణాలు మరియు వ్యక్తిగత స్వభావపు విషయాలు. ఉదాహరణ - “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎల్లప్పుడు ఎక్కువగా దయ చూపేవారు మరియు రమజాన్ నెలలో వారిలో దయాగుణం మరీ ఎక్కువగా ఉండేది.” సహీహ్ బుఖారి & సహీహ్ ముస్లిం హదీస్ గ్రంథాలు

 

ఇస్లాం ధర్మ సూత్రాలకు రెండవ మూలం హదీస్ మరియు సున్నత్


ఇస్లాం ధర్మసూత్రాల మొదటి మూలం దివ్యఖుర్ఆన్. హదీస్ మరియు సున్నత్ లు ధర్మసూత్రాలకు రెండవ మూలం. అంతే కాకుండా దివ్యఖుర్ఆన్ కు వివరణ కూడా. అల్లాహ్ ఆజ్ఞలు దివ్యఖుర్ఆన్ లో కొన్నిచోట్ల సామాన్య విషయాలుగా కనబడవచ్చు (ఉదాహరణ -" మరియు క్రమబద్ధంగా నమాజును స్థాపించండి ") నమాజును క్రమబద్ధంగా ఎలా పాటించాలి ? అనే విషయం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవన విధానాన్ని గమనిస్తేనే మనకు తెలుస్తుంది. ప్రతి ముస్లిం నియమిత సమయాలలో ప్రతిరోజూ ఐదు సార్లు క్రమపద్ధతిలో నమాజు చేయాలనే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా ఆచరించి, దివ్యఖుర్ఆన్ లోని నమాజును స్థాపించండి అనే అల్లాహ్ ఆజ్ఞను పూర్తిచేసే పద్ధతి చూపెట్టినారు. అంటే ఖుర్ఆన్ లోని ఆదేశాల స్పష్టమైన వివరణ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)  జీవిత విధానం నుండి లభిస్తుంది.

 

దివ్యఖుర్ఆన్ మరియు సున్నత్ ల నుండి సాక్ష్యం


దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: "అల్లాహ్ మాటను మరియు ఆయన (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం) మాటను వినండి. వాటిని (సారాయి, జూదం, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యం) మానుకోండి. కాని మీరు గనుక ఆజ్ఞలను పాలించకపోతే, బాగా తెలుసుకోండి, మా ప్రవక్తపై ఉన్న బాధ్యత కేవలం ఆజ్ఞలను స్పష్టంగా అందచేయటమే."ఖుర్ఆన్ సూరా మాయిదా5:92

 

మరోచోట దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: "పూర్వపు ప్రవక్తలను కూడా మేము స్పష్టమైన నిదర్శనాలతోనూ, గ్రంథాలతోనూ పంపి ఉన్నాము. ఇప్పుడు ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను నీ (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరింప జేశాము, ప్రజల ముందు వారికోసం అవరింపజేయబడిన ఉపదేశాన్ని నీవు స్పష్టంగా వివరించటానికి, (స్వయంగా) ప్రజలు కూడా ఆలోచించటానికి."ఖుర్ఆన్ సూరా నహల్ 16:44

 

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రకటించారు -

"నా పద్ధతిని మరియు సరైన దారి చూపబడిన, వివేకవంతమైన ఖలీఫాల (ప్రవక్త తర్వాత వచ్చిన సహచర నాయకులు) పద్ధతిని అనుసరించండి. గట్టిగా పట్టుకోండి మరియు పళ్ళతో నొక్కి పట్టుకోండి, మరియు (ఇస్లాంలో) క్రొత్తపద్ధతులను బహిష్కరించండి. ఎందుకంటే ప్రతి క్రొత్త పద్ధతి (ఇస్లాంలో) నూతన కల్పనలకు దారితీస్తుంది మరియు ప్రతి కల్పిత విషయం (ఇస్లాం నుండి) పెడదారి పట్టిస్తుంది." అబుదావూద్ & తిర్మిజీ హదీస్ గ్రంథాలు

 

ఇంకోసారి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రకటించారు- "అత్యంత ఉత్తమమైన వచనాలు - అల్లాహ్ యొక్క వచనాలు (దివ్యఖుర్ఆన్) మరియు అత్యంత ఉత్తమమైన ఆచరణ మార్గం - ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క మార్గం మరియు అత్యంత చెడ్డవిషయాలు క్రొత్త పద్ధతులు అంటే (ఇస్లాంలో) నూతన కల్పితాలు కనుక్కోవటం." సహీహ్ ముస్లిం హదీస్ గ్రంథం

 

ఆధారాలు


www.islamhouse.com

1405 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్