ముస్లిమేతరులపై ముస్లింలకు గల బాధ్యతలు


ప్రతిహోదాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి.ఎవరైతే రాజ్యానికో,దేశానికో పాలకుడు అవుతాడో అతనిపై బాధ్యతలు కూడా ఉంటాయి.అలాగే ఓ ముస్లింపై కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి.అల్లాహ్ దైవప్రవక్తల మీద వేసిన బాధ్యత ఇప్పుడు ముస్లింలపై ఉంది.సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడం,మంచిని ప్రేరేపించడం,ఇతరులకు సహాయపడటం,సామాజిక జీవితంలో ఇస్లామీయ విలువలపై జీవితాన్ని గడపడం –ఇవన్నీ ముస్లింలపై ఉన్న బాధ్యతలు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన 40ఏళ్ల జీవితాన్ని సత్యంపైనే గడిపారు.అల్ అమీన్(సత్యవంతుడు) పేరుతో ప్రసిద్ధి గాంచారు.ఆ తరువాతే సత్యాన్ని ప్రవచించడం ప్రారంభించారు.

 

ముస్లింల జీవితం ఇతరులకు ఓ ఆదర్శంగా ఉండాలి.ఇతరులు ముస్లింల జీవిత విధానాన్ని చూసి ప్రభావితం అవ్వాలి.ముస్లింల జీవితం ఇంత బావుండటానికి కారణం ఏమిటి అని ఇతరులు ఆలోచించేలా చేయాలి.ఈ విధంగా మీరు ముస్లిమేతరుల సమాజంపై ప్రభావం చూపవచ్చు.

 

విషయసూచిక

 

ఖుర్ఆన్

అల్లాహ్ అనేక చోట్ల ఖుర్ఆన్ లో ఇస్లాం సందేశం చాటండి అని ముస్లింలకు పిలుపునిచ్చాడు.

 

“నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోనూ,చక్కని ఉపదేశంతోనూ పిలువు.అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు.నిశ్చయంగా తన మార్గం నుంచి తప్పిన వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు.సన్మార్గాన ఉన్నవారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు.” ఖుర్ఆన్,సూరా అన్ నహ్ల్ 16:125

 

“అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించినవారు, ఒండోకరికి సహనం(స్థైర్యం)గురించి తాకీదు చేసినవారు మాత్రం నష్టపోరు.” ఖుర్ఆన్సూరా అల్ అస్ర్ 103:3

 

(ఓ ప్రవక్తా!) నువ్వు వాళ్ళకు చెప్పేయి : “నా మార్గమైతే ఇదే. నేనూ,నా అనుయాయులూ పూర్తి అవగాహనతో, దృఢ నమ్మకంతో అల్లాహ్ వైపుకు పిలుస్తున్నాము.అల్లాహ్ పరమ పవిత్రుడు.నేను,అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించే (షిర్క్ చేసే)వారిలోని వాణ్ణికాను.” ఖుర్ఆన్,సూరా యూసుఫ్ 12:108

 

“మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరు.మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు,చెడు నుంచి ఆపుతారు,ఇంకా మీరు అల్లాహ్ ను విశ్వసిస్తారు.” ఖుర్ఆన్,సూరా ఆలి ఇమ్రాన్ 3:110

 

మేము ముస్లింలము,కేవలం అల్లాహ్ నే విశ్వసించాము,ఇస్లాం మా ధర్మమని స్వీకరించాము అని చెప్తే సరిపోదు.కేవలం అల్లాహ్ యే మా ఆరాధ్యుడు,అయన చూపిన విధానమే సరిఅయిన జీవన విధానం అని నమ్మిన వెంటనే మనపై కొన్ని విధులు,బాధ్యతలు తప్పనిసరి అయిపోతాయి.

 

హదీస్

అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : “నా ద్వారా తెలుసుకున్నది ఒక్క ఆయతు అయినా సరే అది ఇతరులకు చేరవేయండి.” సహీహ్ బుఖరీ 3461లేదాvol 4:667

 

అల్లాహ్ వైపు పిలవడం చాల పెద్ద పని, అలాగే దాని ప్రతిఫలం కూడా చాలా గొప్పగా ఉంటుంది.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : “ఎవరైతే ఇంకొకరిని పుణ్య కార్యం వైపు పిలుస్తారో అతనికి కూడా ఆ పుణ్యం చేసేవాడితోపాటు పుణ్యం లభిస్తుంది. అలాగే ఎవరైతే ఇంకొకరిని పాప కార్యం వైపు పిలుస్తారో అతనికి కూడా ఆ పాపం చేసేవాడితోపాటు పాపం లభిస్తుంది.” సహీహ్ ముస్లిం 2674

 

ధార్మిక జ్ఞానం

ఏ పని అయినా చేయడానికి ఆ పని గురించి కాస్త తెలిసి ఉండాలి. అలాగే ఇస్లాం గురించి ఇతరులకు చెప్పాలంటే ముందుగా ఇస్లాం గురించి మనకు కొంత తెలిసుండాలి. ఇతరులను అల్లాహ్ వైపు పిలిచేవారికి తాము పిలిచేదారి గురించి పూర్తిగా కాకున్నా కాస్త అయినా జ్ఞానం ఉండాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : “నా ద్వారా తెలుసుకున్నది ఒక్క ఆయతు అయినా సరే అది ఇతరులకు చేరవేయండి.” సహీహ్ బుఖరీ vol4:667

 

అల్లాహ్ అప్పగించిన బాధ్యతలు

ముస్లిమేతరున్ని అల్లాహ్ వైపు పిలవడం ప్రతి ముస్లింపై అల్లాహ్ విధించిన బాధ్యత. ఇస్లాం యొక్క సత్యాన్ని ఏ విధంగా చెప్పగలిగితే ఆ విధంగా ముస్లిమేతరులకు (యూదులు,క్రైస్తవులు, బహుదైవారాధకులు) నచ్చజెప్పాలి. ఇది మానవాళికి చేయగలిగే అతి పెద్ద పుణ్యం.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : “ఇతరులను మంచి వైపు పిలిచేవానికి, ఆ మంచి పని చేసే వారితో సమానంగా పుణ్యం లభిస్తుంది.”అబూ దావూద్ 5110

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అలి రజిఅల్లాహుఅన్హును ‘ఖైబర్’అనే ప్రదేశానికి పంపించారు. అక్కడ యూదులను, క్రైస్తవులను ఇస్లాం వైపు పిలవమని ఆదేశిస్తూ ఇలా అన్నారు: “నీ ద్వారా ఒక్క మనిషి ఇస్లాం వైపుకు వచ్చినా, అది నీకు ఎర్ర ఒంటెలు (మంచి రకానివి) ఉండడం కన్నా చాలా ఉత్తమమైనది.”

 

ముస్లిమేతరులను ఇస్లాం వైపు పిలవడం, ఇస్లాం గురించి చెప్పడం, వారితో ఉత్తమంగా మెలగడం మనల్ని అల్లాహ్ కు దగ్గరగా తీసుకుపోతుంది.

 

ముస్లిమేతరుల ధన, ప్రాణాల రక్షణ

ముస్లిమేతరులను శారీరకంగా ఎలాంటి హాని కలిగించకూడదు. వారి ధనమానాన్ని గౌరవించాలి. అతను ధిమ్మి (ఇస్లామీయ పాలనలో నివసించే ముస్లిమేతరుడు), ముస్తామన్(ముస్లిం ప్రదేశంలో భద్రత కల్పించబడినవాడు), ముఆహిద్ (శాంతి ఒప్పందం కుదుర్చుకున్న ముస్లిమేతర దేశస్థుడు) అయిన పక్షంలో అతనికి అతని హక్కులన్నీ ఇవ్వాలి. అతన్ని మోసగించడం, ధనాన్ని దొంగిలించడం చేయకూడదు. అతని దేహానికి, ప్రాణానికి ఎలాంటి హాని కలిగించకూడదు. అతను ధిమ్మి,ముస్తామన్, ముఆహిద్ అయిన కారణంగా, ఇస్లామీయ చట్టం ప్రకారం అతణ్ణి సురక్షితంగా ఉంచడం ముస్లింల బాధ్యత.

 

ముస్లిమేతరులతో ప్రవర్తన

ముస్లిమేతరులతో (క్రయవిక్రయాలు) కొనడం, అమ్మడం, తీసుకోవడం, ఇవ్వడం చేయటంలో ఎలాంటి తప్పు లేదు.ఆధారాలు గల సమాచారం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అవిశ్వాసులు, విగ్రహారాధకులు, యూదులతో క్రయ విక్రయాలు చేసేవారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చనిపోయినప్పుడు ఆయన ఖడ్గం హామీ క్రింద ఓ యూదుని దగ్గర ఉంది. అయన సల్లల్లాహు అలైహివ సల్లం తన ఇంటివారి కోసం కొంత ధాన్యం అతని వద్ద అప్పుగా తీసుకున్నారు.

 

ముస్లిమేతరులపై హక్కులు 

ముస్లిములు మరియు ముస్లిమేతరుల మధ్య కొన్ని హక్కులు ఉన్నాయి.

 

అతనితో ఓ మంచి పొరుగువానిగా మెలగాలి. అతనితో వినయంగా ఉండాలి. అతన్నిబాధించకూడదు. అతను బీదవాడు అయిన పక్షంలో అతనికి ధన సహాయం చేయాలి. కానుకలు, మంచి సలహాలు ఇవ్వాలి. ఇలా చేసినచో అతను ఇస్లాం వైపు ఆకర్షించబడి ముస్లిం అయ్యే అవకాశం ఉంటుంది.పొరుగువాని హక్కు కూడా నెరవేరుతుంది.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “జిబ్రయీల్ అలైహిస్సలాం నన్ను పొరుగువానితో చాలా వినయంగా ఉండమని చెప్పేవారు. ఎన్ని సార్లు చెప్పేవారంటే పొరుగువాడిని మన వారసత్వంలో భాగం కలపిస్తారేమో అని భయము కలిగేది. సహీహ్

 

పొరుగువాడు ముస్లిమేతరుడు అయిననూ, అతనికి పొరుగువాని హక్కు ఉంటుంది. అతను సంబంధీకుడు, ముస్లిమేతరుడు అయిన పక్షంలో అతనికి రెండు హక్కులు ఉంటాయి. ఒకటి సంబంధం మూలంగా, మరొకటి పొరుగువాని మూలంగా. అతను బీదవాడు అయిన పక్షంలో అతనికి స్వచ్చందంగా ధన సహాయం చేయవచ్చు, కాని జకాత్ నుంచి మాత్రం ఇవ్వకూడదు. ఎందుకంటే అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు: “ధర్మం విషయంలో మీ పై కాలుదువ్వకుండా, మిమ్మల్ని మీ ఇల్లూ, వాకిలి నుండి వెళ్ళగొట్టకుండా ఉన్న వారితో మీరు సద్వ్యవహారం చేయటాన్ని, వారికి న్యాయం చేయటాన్ని అల్లాహ్ ఎంత మాత్రం నిరోధించడు. పైగా అల్లాహ్ న్యాయం చేసే వారిని ప్రేమిస్తాడు.సూరా,ముమ్ తహినహ్ 60:8

 

సహీహ్ హదీస్ ప్రకారం అస్మా బిన్తె అబీ బకర్ రజిఅల్లాహుఅన్హా ఇలా ఉల్లేఖించారు: బహుదైవారాధకులు అయిన ఆమె (అస్మా బిన్తె అబీ బకర్ రజిఅల్లాహుఅన్హా) తల్లి ఆమె వద్దకు సహాయం కోసం వచ్చారు. అది దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మరియు మక్కా వాసుల మధ్య శాంతి ఒప్పందo అమలు అవుతున్న సమయం. ‘తన తల్లితో బంధుత్వం కొనసాగించాలా’ అని అస్మా బిన్తె అబీ బకర్ రజిఅల్లాహుఅన్హా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను అడిగారు. “నీ బంధుత్వ హక్కు నెరవేర్చు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అన్నారు.

 

విద్వాంసుల కోణం

అబ్దుల్ అజీజ్ బిన్బాజ్ ఇలా అన్నారు: ముస్లిమేతరుల పండుగల్లో ముస్లిములు పాలుపంచుకోకూడదు. కాని వారి దగ్గరివారిలో ఎవరైనా చనిపోతే వారికి ‘అల్లాహ్ మీ నష్టాన్ని పూడ్చుగాక’ అనే పదాలతో సంతాపం తెలియజేయవచ్చు. సంతాపం తెలియజేసేటప్పుడు ‘అల్లాహ్ అతన్ని క్షమించుగాక’ లేదా‘అల్లాహ్ అతనిపై దయ చూపు గాక’ అని మాత్రం అనకూడదు.మరణించిన మనిషి ముస్లిమేతరుడు అయినచో అతని కోసం దుఆ చేయకూడదు. కాని బ్రతికున్న ముస్లిమేతరుని కోసం ‘ఇతను మార్గదర్శకత్వం పొందుగాక’ అని దుఆ చేయవచ్చు.ఫతావా నూరున్ అలద్దర్బ, 1/289-291

 

షేక్ ఇబ్న్ ఉసైమీన్ రహిముల్లాహ్ ఇలా అన్నారు: ఇస్లాం మరియు అల్లాహ్ వైపు పిలిచేవాడు పెద్ద విద్వాంసుడా, లేక మాములు మనిషా అనేది పెద్ద విషయం కాదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:“నా ద్వారా తెలుసుకున్నది ఒక్క ఆయతు అయినా సరే అది ఇతరులకు చేరవేయండి.”ఇస్లాం వైపు పిలిచేవానికి చాలా జ్ఞానం ఉండాలి అనే షరతు ఏదీ లేదు. కాని దేని వైపు (ఇస్లాం వైపు) పిలుస్తున్నాడో దాని గురించి కాస్త జ్ఞానం ఉండాలి. కొంచెం కూడా జ్ఞానం లేకుండా లేదా భావోద్వేగాలతో ఇస్లాం వైపు పిలవడం సమంజసం కాదు.ఫతావా ఉలమా అల్ బలదుల్ హరాం పేజి 329

 

ఆధారాలు

http://islamqa.info/en/ref/131777(ఇంగ్లీష్)

http://islamforhumanity.wordpress.com/2010/10/(ఇంగ్లీష్)

 

2194 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్