బహుమతి – అంగీకరించాలి!


స్వచ్ఛoదoగా ఎలాంటి పైకం తీసుకోకుండా ఇచ్చే దానిని బహుమతి అంటారు. బహుమతి పేదవాడికే ఇవ్వాలని ఏమీలేదు. అది ధనవంతునికి, పేదవానికి ఎవరికైనా ఇవ్వవచ్చు. మన స్నేహం తెలియజేయడానికి, అతని గౌరవం పెంచడానికి ఇచ్చేదే బహుమతి. బహుమతులు ఇచ్చుకోవడం వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం, బంధుత్వం బలపడుతుంది.


ఇస్లామీయపరంగా దీన్ని హదియ అంటారు. అనగా మన బంధువుకి, సోదరునికి, స్నేహితునికి ఇచ్చే బహుమానం. దాని ద్వారా పరస్పర బాంధవ్యం పెంచుకోవడం జరుగుతుంది.[1]
 

విషయసూచిక


హదీస్

మానవజాతి నాయకుడు, అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తనకు అంత పెద్ద హోదా ఉన్ననూ బహుమతిని స్వీకరించేవారు. అది మేక కాలు అయినను లేదా ఒక గ్లాసు పాలు అయినను అయన స్వీకరించేవారు.


 అబూ హురైరా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా ప్రబోధించారు: “ఎవరైనా నాకు మేక కాలు వండి తినడానికి పిలిచిననూ నేను వెళుతాను లేదా నాకు ఎవరైనా మేక కాలును బహుమతించిననూ తీసుకుంటాను.” (సహీహ్ అల్ బుఖారీ 5178)


విద్వాంసుల కోణం

ఉమ్దత్ అల్ ఖారీలో(13/128) అల్ అయ్ నీ ఇలా అన్నారు: ఇబ్న్ బత్తాల్ అన్నారు: దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం మేక కాలు అనడానికి కారణం, బహుమానం ఎంత చిన్నదైననూ దాన్ని స్వీకరించాలి అని మనల్ని ప్రోత్సహించడానికే ఇలా అన్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఎదుటి వ్యక్తి చిన్న చూపు చూస్తాడేమోననే భావం మనకు కలగదు.


బహుమానాలు ఇచ్చుపుచ్చుకోవడాలు

బహుమానాలు ఇచ్చుపుచ్చుకోవడం ఇస్లాంలోని మంచి మర్యాదలలో ఒక భాగం. ఆయిషా రజిఅల్లాహుఅన్హా ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం బహుమతులను స్వీకరించేవారు మరియు ఇతరులకు బహుమతులు ఇచ్చేవారు కూడా. (సహీహ్ బుఖారీ 2585)[2]


బహుమానాన్ని తిరస్కరించడం నిషేధించబడింది

అబ్ద్ అల్లాహ్ ఇబ్న్ మసూద్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు: “ఆహ్వానాన్ని స్వీకరించండి, బహుమానాన్ని తిరస్కరించకండి, ముస్లింలను కొట్టకండి.” అల్ ముస్నద్ (1/404)లో అహ్మద్. అల్బాని గారు ఇర్వా అల్ ఘలీల్ (6/59)లో ధృవీకరించారు.


మనకు ఎవరైనా మంచి చేస్తే మనం కూడా వారికి మంచి చేయాలని దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం మనకు బోధించారు. “మీకు ఎవరైనా మంచి చేస్తే మీరు కూడా అతనికి మంచి చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ చేయలేని స్థితిలో ఉంటే అతని హక్కు నెరవేరే వరకు అతని కోసం ప్రార్ధించండి.” (అబూ దావూద్)


దానధర్మాలు మరియు బహుమానంలో వ్యత్యాసం

బీదవారికి, అవసరం ఉన్న వారికి ఇచ్చేది దానం. ఇది అల్లాహ్ ప్రసన్నత చూరగొనే సదవకాశం. ఇది ఫలానా వ్యక్తికి ఇవ్వాలని ఏమీ లేదు, బీదవానికి, అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ ఇవ్వవచ్చు.


అదే బహుమతి అయినచో పేదవాడికే ఇవ్వాలని ఏమీలేదు. అది ధనవంతునికి, పేదవానికి ఎవరికైనా ఇవ్వవచ్చు. బహుమతులు ఇచ్చుకోవడం వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం, బంధుత్వం బలపడుతుంది.


 ధర్మం, బహుమానం – రెండూ మంచి పనులే. రెండింటికీ ప్రతిఫలం దొరుకుతుంది మరియు అల్లాహ్ ప్రసన్నుడవుతాడు. కాని ఏది ఉత్తమమైనది?


 ఇబ్న్ తైమియా ఇలా అన్నారు: ధర్మం అల్లాహ్ కోసం ఇవ్వబడుతుంది. ఇది ఆరాధనలో ఒక భాగం.ఇది ఫలానా వ్యక్తికి ఇవ్వాలని లేదు. దీని బదులు ఏదైనా పొందాలనే భావన కూడా ఉండదు. అదే బహుమానం అయితే ప్రత్యేక వ్యక్తిని గౌరవించడం లాంటిది. దీనిలో రెండు ఉద్దేశాలు ఉంటాయి. ఒకటి తమ ప్రేమను వ్యక్తం చేయడం, రెండు ఎదుటి వాని దగ్గర నుండి ఏదైనా ఆశించడం.


దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం బహుమతులను స్వీకరించేవారు మరియు వారికి దాని ప్రతిఫలం కూడా ఇచ్చేవారు. కాని దానధర్మాలు మాత్రం స్వీకరించేవారు కాదు. ఈ విధంగా చూస్తె దానధర్మాలు మేలైనవి. కాని ఒక్కోసారి బహుమానం దానం కన్నా ఉత్తమమవుతుంది. ఉదాహరణకు దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం గారి జీవితంలో తమ ప్రేమ చాటుతూ ఆయనకు బహుమానం ఇవ్వడం. బంధువులకు తమ బంధుత్వాన్ని బలపరచడానికి ఇచ్చే బహుమానం కూడా చాలా ఉత్తమమైనవి.[3]


ఆధారాలు

[1] http://www.islamhelpline.net/node/10440 (ఇంగ్లీష్)
[2] [3] http://www.islamweb.net/emainpage/index.php?page=articles&id=135329

717 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్