అల్లాహ్ ను ప్రేమతో, భయంతో, ఆశతో ఆరాధించడం


ఇస్లాంలో ఆరాధించే విధానం ఎంతో ప్రత్యేకమైనది. దాసుని మనసులో అల్లాహ్ ను ఆరాధించేటప్పుడు మూడు రకాలైన భావనలు ఉంటాయి –ప్రేమ, భయం, ఆశ. ఈ మూడింటిని అల్లాహ్ ఆరాధనలో ఎలా కలపడం అనేది తెలుసుకోవడం ప్రతి ముస్లింకు అవశ్యం. లేనిచో ఇతరులవలె మార్గభ్రష్టతకు లోనయ్యే అవకాశం ఉంది.

 

ఇతర ధర్మాల్లో ఎలా ఆరాధిస్తున్నారో చూడండి: “అల్లాహ్ ను ప్రేమించండి, జీసస్ ను ప్రేమించండి” అని క్రైస్తవులు అంటారు. వారు అల్లాహ్ కు భయపడటాన్ని విలువనివ్వుటలేదు. యూదులు కేవలం ఆశపైనే ఆధారపడి ఉంటారు. వారికి నరకాగ్ని తాకదనే ఆశలో ఉన్నారు.

 

ఇస్లామీయ ఆరాధనలో ఈ మూడూ ఉండటం అవసరం. లేనిచో ఆరాధన పూర్తి కాదు. అల్లాహ్ పై ప్రేమ, ఆయన దయపై ఆశ, ఆయన శిక్ష గురించి భయందివ్య ఖుర్ఆన్ లోని మొదటి సూరా, సూరా ఫాతిహాలోని మొదటి మూడు ఆయతులు చూస్తే తెలుస్తుంది.

 

విషయసూచిక

 

ఆయత్ 1 : “ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు”

ఖుర్ఆన్ లోని ఈ మొదటి ఆయతును చదివినప్పుడల్లా మేము అల్లాహ్ ను ప్రేమిస్తున్నాము అని సాక్ష్యమిస్తున్నాము. ఎలా అంటే – ఈ ఆయతులో అల్లాహ్ మా రబ్ (ప్రభువు), విశ్వాలన్నింటికి రబ్ (ప్రభువు) అని ధృవీకరిస్తున్నాము. సాధారణంగా రబ్ అంటే ప్రభువు అని అనువదిస్తాము, కాని ఈ పదానికి అది సరిఅయిన అనువాదం కాదు. వాస్తవానికి రబ్ అంటే అన్నింటినీ సృష్టించినవాడు; అన్నింటినీ నిర్వహించు మరియు పోషించువాడు; జననం మరణం ఆయన చేతిలోనే ఉంది; ఏదైనా మంచి జరిగితే అది ఆయన వల్లే జరుగుతుంది; ప్రతీదీ ఆయన పైనే ఆధారపడి ఉంది; ఆయన ఇష్టానుసారమే అన్నీ జరుగుతాయి.ముస్లింలను సత్యం వైపు నడిపించి, నైతిక విలువలు, మానమర్యాదలు నేర్పినవాడు ఆ రబ్(అల్లాహ్, ప్రభువు).

 

అల్లాహ్ మా రబ్ అని సాక్ష్యమిచ్చాక ఆయనే మాకు అన్ని రకాల దీవెనలు ఇచ్చాడని ఒప్పుకుంటున్నాము. ఆయన ప్రసాదించిన దీవెనలను మనము లెక్కించ దలిస్తే లెక్కించలేము. అలాంటి రబ్ (ప్రభువు)ను ప్రేమించకుండా మనం ఎలా ఉండగలం? ఎవరైనా మనకు చిన్న సహాయం చేస్తే మనం వారిని ఎంతగా ప్రేమిస్తాము మరియు కృతజ్ఞత చూపుతాము. మనకు అన్నీ(మంచి కుటుంబం, ఇల్లు, భద్రత, అన్నం, ఆరోగ్యం – అన్నిటికంటే ముఖ్యమైన ఇస్లాం మరియు సున్నత్ వైపు మార్గదర్శకం) ఇచ్చిన రబ్(ప్రభువు)కు మనం ఎంత ప్రేమ చూపాలి. మనం అల్లాహ్ ను కృతజ్ఞత చూపుతూ ‘ప్రశంసలన్నీ అల్లాహ్ కొరకే, రబ్బిల్ ఆలమీన్’ అనాలి.

 

ఆయత్ 2 : “అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు

సూరా ఫాతిహాలోని మొదటి ఆయతులో అల్లాహ్ రబ్ (ప్రభువు)అని సెలవీయబడింది. రెండో ఆయతులో ఆయన యొక్క మరో రెండు పేర్లు తెలుపబడ్డాయి: అర్రహ్మాన్ మరియు అర్రహీమ్. అర్ రహ్మాన్ అంటే అనంత కరుణామయుడు, ఆయన స్వభావంలోనే కరుణ ఉంది. అర్ రహీమ్ అంటే అపార కృపాశీలుడు. ఆయన చర్యలన్నీ కృపతో ,దయతో కూడినవి. ఆయన తన సృష్టినంతటిపై దయ, కృప చూపుతాడు.

 

ఈ రెండు పేర్లు ఉచ్ఛరించగానే మనకు ఆశ పుడుతుంది. ఆయన కరుణామయుడు అనగానే, మన తప్పులను మన్నిస్తాడు అనే ఆశ కలుగుతుంది. ఆ తప్పులు ఎన్నైనా సరే ఆయన మనల్ని క్షమిస్తాడు. మనము ఆయనపై ఆశ వదలుకోరాదు. ఖుర్ఆన్ లో అల్లాహ్ సెలవిచ్చాడు: “తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ (షిర్క్ తప్ప) క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు.” ఖుర్ఆన్సూరా అజ్ జుమర్ 39:53

 

మన ఆరాధనలో భయం కూడా ఉండాలని తరువాతి ఆయతులో తెలుపబడింది.

 

ఆయత్ 3: “ప్రతిఫల దినానికి యజమాని / రారాజు

ఈ ఆయతు చదవగానే మనకు అంతిమ దినం గుర్తుకు వస్తుంది. ఆ భయంకరమైన రోజున మనమందరం అల్లాహ్ ముందు నగ్నంగా, ఖాళి పాదాలతో నిలబడి ఉంటాము. కొందరికి ఎంత చెమట పడుతుందంటే అది భూమిలోకి డెభ్భై చేతులంత లోతుకు పోతుంది. ఆ రోజు ప్రజలు తాగి ఉండరు కాని తాగినట్లు కనిపిస్తారు. ఆ రోజు ప్రతి ఒక్కరు అల్లాహ్ ముందు నిలబడి తమ లెక్క ఇవ్వవలసి ఉంటుంది. తాము చేసిన ఏ చిన్న పని కూడా అల్లాహ్ కు తెలియకుండా లేదు అని అందరికీ తెలిసిపోతుంది.

 

“కనుక ఎవడు అణువంత సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. మరెవడు అణువంత దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.” ఖుర్ఆన్సూరా అజ్ జిల్ జాల్ 99:7,8

 

కావున సూరా ఫాతిహాలోని మూడవ ఆయతు చదివినప్పుడు తీర్పు, జవాబుదారితనం గురించి భయపడవలసి ఉంటుంది. మన చెడు కర్మలు ఎక్కువగా ఉంటే ఎలా అని భయమేస్తుంది. ఇలాంటి పరిస్థితి నుండి అల్లాహ్ మనందరినీ కాపాడుగాక!

 

తరువాతి ఆయతులో ఇలా ఉంది: “మేము కేవలం నిన్నే ఆరాధిస్తాము.” అనగా అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు ఎవడూ లేడని చెబుతున్నాము. ఆయన్ని ఎలా ఆరాధిస్తున్నాము? ప్రేమతోఆశతో మరియు భయంతోఈ లక్షణాలు మన ఆరాధనలో రావాలంటే అల్లాహ్ సహాయం, మార్గదర్శకం అవసరం. అందుకే మనం ఇలా అంటాము: “సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము.” ఖుర్ఆన్సూరా ఫాతిహా 1:4

 

సమతుల్యం పాటించాలి

మన ఆరాధనలో ప్రేమ, భయం, ఆశ ఉండాలని తెలుసుకున్నాక ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది: ఆరాధనలో ప్రతీది ఎంత మోతాదులో ఉండాలి? దీని జవాబు కోసం ఖుర్ఆన్ వైపుకు మరలుదాం.

 

“భయపడుతూ, ఆశపడుతూ అల్లాహ్ ను ఆరాధించండి.” ఖుర్ఆన్సూరా అల్ ఆరాఫ్ 7:56

 

“వారి ప్రక్కలు వారి పడకల నుంచి వేరుగా ఉంటాయి. వారు తమ ప్రభువును భయంతోనూ, ఆశతోనూ ప్రార్ధిస్తారు.” ఖుర్ఆన్సూరా సజ్దహ్ 32:16

 

కావున భయం మరియు ఆశ మనసులో సమపాళ్లలో ఉండాలి. అనస్ రజియల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఓ మరణించబోయే బాలుని వద్దకు వెళ్లారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని అడిగారు, “నువ్వు ఎలా ఉన్నావు?” ఆ బాలుడు జవాబిచ్చాడు: “ఓ దైవప్రవక్తా!  నేను అల్లాహ్ పై ఆశ మరియు నా పాపాల భయం మధ్యలో ఉన్నాను.” దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ ను తలచిన దాసుని మనసులోనే ఇలాంటి మిశ్రమ భావన ఉత్పన్నమవుతుంది. అల్లాహ్ వారు ఆశపడింది ఇస్తాడు మరియు వారు భయపడ్డ దాని నుండి రక్షిస్తాడు.” అహ్కాముల్ జనాయిజ్ నెం 2 లో అల్బాని గారు ధృవీకరించారు.

 

అందువల్ల మనం మంచి పని చేసినప్పుడు అది స్వీకరించబడుతుంది అనే ఆశతో పాటు, దానికి స్వీకారయోగ్యం ఉందో లేదో అని భయపడుతూ కూడా ఉండాలి. అలాగే తప్పు చేసినప్పుడు తన పశ్చాత్తాపం స్వీకరించబడుతుంది అనే ఆశతో పాటు, ఎక్కడ దాని గురించి అడగబడుతుందో అని భయపడాలి.

 

ఈ సమతుల్యం మన దావా (దావా కూడా ఆరాధనే)లో కూడా కనిపించాలి. ఇతరులను సత్యం (ఇస్లాం)వైపు పిలిచినప్పుడు ‘భయపడాల్సిన అవసరం లేదు’ అని కూడా అనకూడదు, అలాగే ‘మీరు నాశనం అయిపోయారు’ అని కూడా అనకూడదు. వారికి హెచ్చరిస్తూ ప్రోత్సహించాలి. ఒక వైపు నరకాగ్ని గురించి భయపెడుతూ, స్వర్గవనాల ఆశ కూడా చూపించాలి. అల్లాహ్ ఖుర్ఆన్ లో సెలవిచ్చాడు: “నిస్సందేహంగా నీ ప్రభువు శిక్షించటంలో వడిగలవాడు. నిస్సందేహంగా ఆయన క్షమించేవాడు, కనికరించేవాడు కూడా.”ఖుర్ఆన్సూరా అల్ ఆరాఫ్ 7:167

 

కనుక మనం ‘ఇతను నాశనం అయిపోయాడు’ లేదా‘ ఇది చాలా పెద్ద పాపం’ అని అనకూడదు.ఎవరినైనా శిక్షించాలో లేదా మన్నించాలో అల్లాహ్ చేతుల్లో ఉంది.

 

ఇబ్న్ అల్ ఖయ్యిం రహిముల్లాహ్ ఇలా అన్నారు: “అల్లాహ్ వద్దకు వెళుతూ ఓ విశ్వాసి మనసు పక్షిలా ఉంటుంది. ప్రేమ దాని తల, ఆశ మరియు భయం దాని రెక్కల లాంటివి. తల,రెక్కలు మంచిగా ఉన్నప్పుడు పక్షి బాగా ఎగురగలుగుతుంది. తల తెగినచో పక్షి మరణిస్తుంది. రెక్కలు లేనిచో అది ఎగురలేకపోతుంది.”

 

ముగింపు

ఈ మూడింటిలో సమతుల్యం లేనిచో ఆరాధన ఎలా మార్గభ్రష్టమవుతుందో తెలిసిపోయింది. కావున ఓ ముస్లిం మనసులో ఈ మూడింటి మధ్య సమతుల్యం ఉండాలి. ఫుదైల్ ఇబ్న్ ఇయ్యాద్ ఇలా అన్నారు: “భయం కంటే ప్రేమ మంచిది. భయం పాపాల నుండి ఆపుతుంది, ప్రేమ మనస్ఫూర్తిగా మంచి పనులను చేయిస్తుంది.” (d 187H)

 

ఆధారాలు

http://www.salafipublications.com/sps/sp.cfm?subsecID=IBD01&articleID=IBD010006&articlePages=1 (ఇంగ్లీష్)

http://abdurrahman.org/salah/worshippingallahoutof.html (ఇంగ్లీష్)

Source: Ad-DawahilalLaah Magazine (ఇంగ్లీష్)

2599 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్