షైతాన్ (ఇబ్లీస్ )


భావం

షైతాన్ అనేది అరబిక్ పదం. దీని అర్ధం శత్రువు, చెడు. ముస్లింలు షైతాన్ ను రెండు పేర్లతో పిలుస్తారు. ఒకటి ఇబ్లీస్ (అసలు పేరు), రెండోది షైతాన్ (అల్లాహ్ ను వ్యతిరేకించే పని చేసేవాడు). తెలుగు లో  దీనిని భూతం అంటారు.  

 

విషయసూచిక
పరిచయం

షైతాన్ ఎలా ఉంటాడు

షైతాన్ అవిధేయత

షైతాన్ సృష్టి లక్ష్యం

ఖుర్ఆన్ లో షైతాన్ వివరణ

ఇబ్లీస్

ప్రతి మనిషికి జిన్న్ సహవాసి ఉంటాడు

భవిష్యత్తు చెప్పేవాళ్ళు / భవిష్యవాణి చేసేవారు

జిన్నుల్లో రకాలు

షైతాన్ ను మానవుడు చూడగలడా?

ముగింపు

ఆధారాలు

 

పరిచయం


ఖుర్ఆన్ ప్రకారం షైతాన్ అగ్గితో సృష్టించబడ్డాడు. అతడు అవిధేయతాపరుడు. తన సృష్టి అగ్గితో మరియు మానవుని సృష్టి మట్టితో అయిందనే అహంకారం అతనిలో ఉండేది. అల్లాహ్ ప్రతి దానిని జతలలో సృష్టించాడు. మానవుణ్ణి జిన్నుతో జతపరిచాడు. మానవుడు, జిన్ను ఇద్దరూ చాలా  వివేకవంతులు మరియు తమ ఇష్టానుసారం జీవితం గడిపే అవకాశం పొందినవారు. జిన్నులు మానవుల కన్నా ఎన్నో ఏళ్ల ముందు సృష్టించబడ్డారు.   

“సుధీర్ఘ కాలంలో మానవుడు చెప్పుకోదగ్గ వస్తువుగా లేకుండా వుండిన సమయం ఒకటి గడవలేదా?” ఖుర్ఆన్ సూరా ఇన్సాన్ 76:1

“ఆయన మనిషిని పెంకు మాదిరిగా శబ్దం చేసే మట్టితో సృజించాడు. మరి జిన్నాతులను ఆయన అగ్ని జ్వాలలతో సృష్టించాడు.” ఖుర్ఆన్ సూరా రహ్మాన్ 55 :14 -15

 

జిన్న్ ఉనికి


 ఖుర్ఆన్ మరియు హదీసులలో జిన్నుల ఉనికి గురించి చాలా స్పష్టంగా వివరించబడింది. జిన్న్ అనే పదం ఖుర్ఆన్ లో 29 సార్ల కంటే ఎక్కువగా వచ్చింది. ‘షైతాన్’ లేదా దాని బహువచనం ‘షైతాన’ అనే పదం ఖుర్ఆన్ లో 80 సార్ల కంటే ఎక్కువగా వచ్చింది. వాస్తవానికి ఖుర్ఆన్ లో ఓ పూర్తీ సూరా జిన్న్ పేరుతొ ఉంది – సూరా అల్ జిన్న్ సూరా నెం 72.

వాస్తవానికి జిన్నుల ప్రపంచం ఒకటి ఉంది. కాని అది మనకు కనబడదు. వారు కూడా మానవుల్లా సహజ సిద్ధంగా తింటారు, త్రాగుతారు. మానవుల్లా వారిలో కొందరు మంచివారు, కొందరు చెడ్డవారు ఉంటారు.

జిన్నులు మానవుల కన్నాముందు సృష్టించబడ్డారు. వారు అగ్నితోసృష్టించబడ్డారు. ఇది ఖుర్ఆన్ లో ఇలా వివరించబడింది: “మేము మనిషిని  కుళ్ళి, బాగా ఎండిన మట్టితో సృస్టించాము. అంతకు ముందు మేము జిన్నాతులను తీవ్రమైన  ఉష్ణ జ్వాలలతో సృష్టిoచాము.” ఖుర్ఆన్ సూరా హిజ్ర్ 15:26-27

 

షైతాన్ ఎలా ఉంటాడు                      


ఖుర్ఆన్ ప్రకారం అల్లాహ్ ఇబ్లీస్ ను (ఇతర జిన్నులతో సహా)  తీవ్రమైన  ఉష్ణ జ్వాలలతో మరియు మానవులను మట్టితో సృష్టించాడు.

 

“అంతకు ముందు మేము జిన్నాతులను తీవ్రమైన  ఉష్ణ జ్వాలలతో సృష్టిoచాము.”ఖుర్ఆన్ సూరా హిజ్ర్ 15:27

 

“మరి జిన్నాతులను ఆయన అగ్ని జ్వాలలతో సృష్టించాడు.” ఖుర్ఆన్ సూరా రహ్మాన్ 55:15

 

అల్లాహ్ ఆదం అలైహిస్సలాం ద్వారా షైతాన్ విధేయతను పరీక్షించాడు. అంతకు ముందు షైతాన్ దైవదూతలతో పాటు ఉండి వారిలాగే అల్లాహ్ ను ఆరాధించేవాడు. “అల్లాహ్ అజ్ఞ లను పాలించటం లో వారు (దైవదూతలు) ఏ మాత్రం అలక్ష్యం చేయరు. పైగా వారికి జారీ చేయబడిన ఆజ్ఞలను వారు ఖచ్చితంగా పాలిస్తారు.” ఖుర్అన్ సూరా తహ్రీమ్ 66:6

అల్లాహ్ షైతాన్ కు తన ఇష్టానుసారం నడచుకొనే స్వేచ్చ ఇచ్చాడు. అల్లాహ్ అతణ్ణి మరియు దైవదూతలను ఆదం అలైహిస్సలాం ముందు సాష్టాంగ నమస్కారం చేయండని అన్నప్పుడు అతడి అహంకారం అతణ్ణి నాశనం చేసింది. అతడు ఇలా అన్నాడు, “నేను అతనికంటే ఘనుడను. (ఎందుకంటే) నీవు నన్ను అగ్నితో సృష్టించావు, అతన్నేమో మట్టితో సృష్టించావు.” ఖుర్ఆన్ సూరాసాద్ 38:76

 

ఇలా అల్లాహ్ కు అవిధేయత చూపినందుకు అల్లాహ్ అతణ్ణి శపించి నరకం అతని అంతిమ నివాసం చేశాడు. కాని, అతని కోరిక మేరకు అల్లాహ్ అతణ్ణి అంతిమ దినం వరకు సమయం ఇచ్చాడు. అతడు అల్లాహ్ అనుమతి దొరికాక, “నేను నీ దాసులను చెడు దోవ పట్టించి వారిని నరకానికి తీసుకెళ్తాను” అని శపథం చేశాడు. దానికి అల్లాహ్ ఏమన్నాడంటే, “నీవు నా నిజమైన, స్వచ్చమైన దాసులను పెడ దోవ పట్టించలేవు, వారు నీ వలలో పడరు” అని అన్నాడు.

 

షైతాన్ సృష్టి లక్ష్యం


షైతాన్ చాలా ముఖ్యమైన లక్ష్యంతో సృష్టించబడ్డాడు. షైతాన్ మనలను ఎల్లప్పుడూ మార్గభ్రష్టుల్ని చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. అలా కాని పక్షంలో మానవుల సృష్టికి అర్ధమే ఉండదు. అల్లాహ్ ఆజ్ఞను తు చ తప్పకుండా పాటించే దాసులు ఎందరో ఉన్నారు. 

అల్లాహ్ మనకు ఏది మంచో, ఏది చెడో తెలుసుకొనే జ్ఞానం ఇచ్చాడు. దానితో పాటు మనకు ఎన్నో సామర్ధ్యాలను ఇచ్చాడు. మన సామర్ధ్యాలను పెంచుకొని , మంచి చెడుల భేదాన్ని గుర్తిస్తూ నడవడమే జీవితం. అల్లాహ్ షైతాన్ ను సృష్టించి అతని ద్వారా మనల్ని పరీక్షిస్తున్నాడు. ఇలాంటి పరీక్షల ద్వారా మనలో చెడును ఎదుర్కొంటూ మంచి వైపు నడిచే సామర్ధ్యం పెరుగుతుంది. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాము మరియు మనలో దైవ భీతి పెరుగుతుంది.  

 

షైతాన్ వర్ణన ఖుర్ఆన్ లో


షైతాన్ లక్షణాలు దివ్య ఖుర్ఆన్ లో అనేక చోట్ల ప్రస్తావించబడ్డాయి. ఉదాహరణకుకొన్ని ఆయతులు :

 

 ‘ప్రజలారా ! భూమిలోని ధర్మసమ్మతమైన, పవిత్రమైన వస్తువులన్నిటినీ తినండి. కాని షైతాన్ అడుగుజాడలలో మాత్రం నడవకండి.వాడు మీకు బహిరంగ శత్రువు.”ఖుర్ఆన్ సూరా బఖర2:168

 “నిజానికి (ఈ వార్త అందజేసిన) వాడు షైతాను. వాడు తన మిత్రుల గురించి మీకు భయపెట్టాడు. కనుక మీరు అవిశ్వాసులకు భయపడకండి. మీరు విశ్వాసులే అయితే నాకు భయపడండి.” ఖుర్ఆన్ సూరా ఆలి ఇమ్రాన్ 3:175

 వాడు వారికి వట్టి వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. ఆశలు కలిగిస్తూ ఉంటాడు. కాని షైతాను వారితో చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే.” ఖుర్ఆన్ సూరా నిసా4:120

 

ఇబ్లీస్


ఇబ్లీస్ జిన్న్ జాతికి చెందినవాడు. అతడు అల్లాహ్ కు విధేయుడై ఉండేవాడు. అతడు ఉన్నత హోదా పొంది దైవదూతలకు దగ్గరగా చేర్చబడ్డాడు. అల్లాహ్ ఇబ్లీస్ ఉద్దేశ్యాన్ని గ్రహించి ‘ఇబ్లీస్’ (నిరశాచెందు) అని పేరు పెట్టాడు. అల్లాహ్ ఆదంను సృష్టించినప్పుడు ఇలా అన్నాడు : “మీరందరూ ఆదం ముందు సాష్టాంగపడండి” అని మేము దూతలను అజ్ఞాపించినప్పుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం తిరస్కరించాడు. అహంకారి అయి, అవిధేయులలో చేరిపోయాడు. ఖుర్ఆన్ సూరా అల్ బఖర 2:34. ఇబ్లీస్ గర్వానికి కారణం అతడు అగ్నితో మరియు ఆదం మట్టితో సృష్టించబడ్డారు. కావున అతడు తనను తాను ఆదం కన్నా ఉన్నతుడు అని భావించేవాడు. దీనివల్ల ఇబ్లీస్ మొదటి షైతాన్ అయ్యాడు. మిగతా షైతానులంతా అతని తరం వాళ్ళే.      

   

ప్రతి మనిషికి ఓ జిన్న్ సహవాసి ఉంటాడు


అబ్దుల్లా ఇబ్న్ మసూద్ రజిఅల్లహు అన్హు మరియు ఆయిషా రజిఅల్లహు అన్హా ఉల్లేఖించారు : ప్రతి ఒక్కరితో ఒక జిన్న్ ఉంటాడు. అప్పుడు సహాబా (సహవాసులు) ఇలా అడిగారు : దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మీతో కూడానా? దానికి  దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా జవాబిచ్చారు : ఔను, కాని అల్లాహ్ నన్ను అతడి నుండి కాపాడుతాడు. అందువల్ల నేను అతని చేతల నుండి రక్షించబడి ఉన్నాను. అతను నన్ను మంచి వైపుకే పిలుస్తాడు. సహీహ్ ముస్లిం  6757, 6759

 

భవిష్యత్తు చెప్పేవాళ్ళు/భవిష్యవాణి చేసేవారు


ఆయిషా రజి అల్లాహు అన్హు ఉల్లేఖించారు : దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం భవిష్యవాణి చేసేవారి గురించి ఇలా అన్నారు – “వారికి ఎలాంటి ప్రాధాన్యత లేదు.” అప్పుడు సహాబా (సహవాసులు), ఓ దైవప్రవక్తా ! సల్లల్లాహు అలైహివ సల్లం, ఒక్కోసారి భవిష్యవాణి చేసేవారు చెప్పింది నిజమౌతుంది కదా అని అడిగారు. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు : “జిన్న్ ఆ మాటను అతని మిత్రుని (భవిష్యవాణి చేసేవాడి) చెవిలో చెప్తాడు (సీసాలో ఏదైనా నింపినట్టుగా). దాన్ని భవిష్యవాణి చెప్పేవాడు మరో వంద అబద్ధాలు జోడించి చెప్తాడు. సహీహ్ బుఖారీ vol 7:657    

 

జిన్నుల్లో రకాలు


అబూ తలబా అల్ ఖుషాని రజి అల్లాహు అన్హు ఇలా అన్నారు : దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా బోధించారు : “జిన్నుల్లో మూడు రకాలు కలవు – మొదటి రకానికి చెందినదానికి రెక్కలు ఉంటాయి, అవి ఆకాశంలో ఎగరగలవు. రెండో రకం పాముల, కుక్కల రూపంలో కనిపిస్తాయి. మూడో రకం మధ్యలో విశ్రాంతి కొరకు ఆగి, తిరిగి తన ప్రయాణం ప్రారంభిస్తాయి.” అల్ మిష్కాత్ vol 2:4148 లో షేక్ అల్ అల్బాని వివరించారు.

జిన్ని అనే పదాన్ని అరబ్బులు ఒక్క జిన్ కోసం వాడుతారు.

 

మూడు రకాల జిన్నులు :

1  ఆమర్: (ఇంటి జిన్ను) అంటే అతడు మనుషుల మధ్యలో ఉంటాడు.

2  షైతాన్: ఈ రకం జిన్ని చాలా ద్వేశపూరితమైనది మరియు మానవులను రెచ్చగొట్టేది. ఇది చాలా చెడ్డది. 

ఇఫ్రిత్: ఈ రకం జిన్ని షైతాన్ కన్నా చాలా బలమైనది మరియు శక్తివంతమైనది.

 

జిన్నుల జీవనశైలి మానవుల్లాంటిదే. ఉదాహరణకు: వారు మనుషుల్లా తమ చేతలకు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది.

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు: “మేము జిన్నులను మరియు మానవులను మా ఆరాధన కొరకే సృష్టించాము.” ఖుర్ఆన్ సూరా జారియాత్ 51:56

 

షైతాన్ ను మానవుడు చూడగలడా? 


ఈ క్రింది ఆయత్ ప్రకారం మానవులు షైతాన్ ను చూడలేరు. కాని షైతాన్ మానవుడి వేషంలో వచ్చి, ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహిస్సలాం లను మోసం చేసి స్వర్గం నుండి తీసివేయబడేలా చేసినట్టు మనిషిని మోసం చేయగలడు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు: “ఓ ఆదం సంతతి వారలారా ! షైతాన్ మీ తల్లిదండ్రులను స్వర్గం నుంచి బయటికి తీయించి, వారి మర్మస్థానాలు వారికీ కనిపించేలా చేయటానికి వారి దుస్తుల్ని ఎలా తొలగింపజేశాడో అలాగే వాడు మిమ్మల్ని కూడా చెరపకూడదు సుమా ! వాడూ,వాడి సైన్యం మీరు వారిని చూడలేని చోటు నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. మేము అవిశ్వాసులకు షైతానులను స్నేహితులుగా చేశాము.” ఖుర్ఆన్ సూరా ఆరాఫ్ 7:27      

అబూ మసూద్ రజి అల్లాహు అన్హు ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సెలవిచ్చారు, “ఎవరైనా సూరా బఖర చివరి రెండు ఆయతులను రాత్రి పడుకొనే ముందు చదివితే అది అతనికి చాలు.” సహీహ్ బుఖారీ vol 6:530

 

ముగింపు


వారికి ఇలా చెప్పబడింది: “అల్లాహ్ ను వదలి మీరు ఎవరెవరినైతే పూజించే వారో వారేరి ? వారు మీకేదన్నా సహాయం చేస్తున్నారా ?  పోనీ, వారు తమకు తామైనా సహాయం చేసుకోగలుగుతున్నారా? అని వారితో అనటం జరుగుతుంది.

మరి వారూ, మార్గభ్రష్టులైన వారందరూ నరకంలో బోర్ల పడవేయబడతారు.

ఇబ్లీస్ సైనికులంతా కూడా (నరకం లోనికే నెట్టబడతారు). వారు పరస్పరం గొడవ పడుతూ ఇలా అంటారు – అల్లాహ్ సాక్షి ! మేము స్పష్టమైన అపమార్గానికి పాల్పడ్డాము. మిమ్మల్ని సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కు సమానులుగా భావించినపుడు. మమ్మల్ని పెడదారి పట్టించింది ఈ పాపాత్ములే (వేరేవారు కాదు.) కనుక ఇప్పుడు మా కోసం సిఫారసు చేసేవారెవరూ లేకుండా పోయారు. (మా బాధను అర్ధం చేసుకొనే) అప్తమిత్రుడు కూడా లేకుండా పోయాడు. ఒకవేళ మమ్మల్నే గనక మరోసారి తిరిగి పంపటం జరిగితే (నిజమైన) విశ్వాసులమవుతాము. నిశ్చయంగా ఈ వృత్తాంతంలో గొప్ప గుణపాఠ సూచన ఉంది.అయితే వారిలో అనేకులు విశ్వసించేవారు కారు. నిశ్చయంగా నీ ప్రభువు మాత్రమే శక్తిశాలి, దయాశీలి.” ఖుర్ఆన్ సూరా అష్ షుఅరా 26:92-104       

 

ఆధారాలు


http://www.sunnah.com/urn/46851

http://www.kalamullah.com/jinn.html

http://www.missionislam.com/knowledge/Jinn.htm

http://www.islamawareness.net/Jinn/jinn2.html

http://muttaqun.com/jinn.html

1267 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్