వుజూ


వుజూ (కాలకృత్యాలు) (నిరూపణ ఖుర్ఆన్ ద్వారా): “ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు నమాజుకొరకు లేచినప్పుడు మీ ముఖాలను మరియు  మోచేతుల వరకు చేతులను కడుక్కోండి, తలపై తడి చేతులతో తుడవండి, కాళ్ళను చీలమండాల వరకు కడుక్కోండి” సూరా  అల్ మాయిద 5׃6
 

విషయసూచిక

 

వుజూ ప్రాముఖ్యత

అబూహురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు – ఎప్పుడైతే ముస్లిం (అల్లాహ్ దాసుడు) వుజూలో తన ముఖం కడుగునో అప్పుడు ఆ నీటితో గాని లేక నీటి చివరి బిందువుతో గాని అతను (తన) కళ్ళతో చూచినటువంటి (చిన్న) పాపాలన్నీ కడిగివేయబడతాయి. మరియు ఎప్పుడైతే రెండు చేతులను కడుగునో తన రెండు చేతులతో చేసినటువంటి (చిన్న) పాపాలన్నీ ఆ నీటితో గాని లేక నీటి చివరి బిందువుతో గాని కడిగివేయబడతాయి. మరియు ఎప్పుడైతే రెండు కాళ్ళను కడుగునో తన రెండు కాళ్ళ సహాయంతో అతను నడిచివెళ్ళి చేసినటువంటి (చిన్న) పాపాలన్నియూ ఆ నీటితో గాని లేక నీటి చివరి బిందువుతో గాని కడిగివేయబడతాయి. తుదకు వుజూతో అతను పూర్తిగా పరిశుద్ధుడౌతాడు. ముస్లిం హదీస్ గ్రంథం


అలీ బిన్ అబితాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు – నమాజు యొక్క తాళం చేవి పరిశుభ్రతయే. అబూ దావూద్ హదీస్ గ్రంథం


వుజూ యొక్క నిబంధనలు

 1. పరిశుభ్రతా సంప్రాప్త సంకల్పం (మనస్సులో) చేసుకోవలెను
   
 2. స్వచ్ఛమైన, శుద్ధమైన నీటిని వినియోగించవలెను
   
 3. వుజూనందు శుభ్రపరచవలసిన శరీరాంగములను ఏదేని వస్తువు కప్పి ఉంచినట్లైతే దానిని తొలగించవలెను. ఉదా,, చేతిలో టైట్ గా ఉండి నీరు చొరబడనీయని స్థితిలో ఉన్న గడియారము, క్రీడాకారుల చేతిబంధం.


వుజూ ప్రత్యేకతలు

అంటే వుజూ నందు గల విధులు, పద్ధతులు(సున్నతులు)


వుజూ నందు గల విధులు (తప్పకుండా చేయవలసినవి)

 1. ముఖం పూర్తిగా కడగాలి (నీరు పుక్కలించడం, గర్ గర చెయ్యడం, ముక్కును శుభ్ర పరచడం కూడా చెయ్యాలి)
   
 2. రెండు చేతులను మోచేతుల వరకు కడగాలి
   
 3. తల మరియు చెవులు తడపాలి
   
 4. రెండు కాళ్లను, చీలమండలాల వరకు కడగాలి
   
 5. క్రమపద్ధతిని పాటించాలి. అంటే దేని తర్వాత ఏది చెయ్యాలో అదే క్రమంలో చెయ్యాలి


వుజూ నందు సున్నతులు (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన పద్దతులు)

(ఆచరిస్తే ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి, కాబట్టి వీటిని తప్పక పాటించటానికి ప్రయత్నించవలెను)

 1. “బిస్మిల్లాహ్” అని ఉచ్ఛరించడం
   
 2. రెండు చేతులనూ మణికట్టువరకు నీటితో మూడుసార్లు కడగాలి, మరియు చేతివేళ్ల నడుమ ఖిలాల్ చేయాలి (అప్పుడే నిదుర నుండి లేచిన వారికైతే ఇది అనివార్యం)
   
 3. మూడుసార్లు నోట నీరుతీసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి. అదేవిధంగా మూడుసార్లు ముక్కు నందునూ నీరు ఎక్కించి తీసివేయాలి
   
 4. మూడుసార్లు ముఖం కడగాలి
   
 5. గడ్డమునందు నీటితో ఖిలాల్ చేయాలి.
   
 6. మొదట కుడి చేతిని మోచేతి వరకు కడగాలి, తరువాత అదే విధంగా ఎడమ చేతిని కూడా కడగాలి.
   
 7. తల యొక్క మసహ్ చేయాలి. ముందు నుదుటి వైపునుండి తడిచేతులను తల వెనుక వరకు తీసుకెళ్లి మరల అక్కడ నుండి ముందుకు తీసుకురావాలి.
   
 8. మొదట కుడికాలిని పాదం యొక్క పై కట్టు (చీలమండలం) వరకు కడగాలి. తరువాత ఎడమకాలిని కూడా కడగాలి.
   
 9. కుడివైపు నుండి మొదలు పెట్టాలి
   
 10. తప్పనిసరిగా వజూను ఒక క్రమపద్ధతిలో మాత్రమే చేయాలి. (అంటే ఖుర్ఆన్ నందు ఆదేశించబడిన క్రమంలో)
   
 11. వుజూ తరువాత ఈ దుఆ చేయాలి “అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లాషరీకలహు వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, అల్లాహుమ్మజ్ అల్నీ మినత్తవ్వాబీన వజ్ అల్నీ మినల్ ముతతహ్హిరీన్” – నేను సాక్ష్యమిస్తున్నాను – (వాస్తవమైన) ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, కేవలం ఒక్క అల్లాహ్   తప్ప. ఆయనకు ఎవ్వరూ సాటికారు. మరియు నేను సాక్ష్యమిస్తున్నాను   ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్  దాసుడు మరియు అల్లాహ్    యొక్క వాస్తవమైన ప్రవక్త. ఓ అల్లాహ్ సుబ్ హానహు వత’ఆల! నన్ను పశ్చాత్తాపపడే మరియు పరిశుద్ధంగా ఉండే వారిలోని వాడిగా చేయుము.


హదస్ అల్ అస్గర్ ׃ వజూను భగ్నపరచు విషయాలు

 1. మల-మూత్రాదుల విసర్జన మరియు (అపానవాయువు)నిష్క్రమణ వలన
   
 2. దీర్ఘనిద్ర – మరుపుచేత
   
 3. కామవాంఛ లేదా మామూలుగాగానీ నేరుగా మర్మాంగాలను స్పర్శించుట వలన
   
 4. ఒంటె మాంసం తినడం వలన


ఆధారాలు

www.teluguislam.net (ఇంగ్లీష్)

677 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్