ముహ్రిం - MUHRIM


ఇహ్రామ్ స్థితిలో ఉన్న హాజీని ‘ముహ్రిం’ అంటారు. హజ్ లేదా ఉమ్రా కొరకు ఇహ్రామ్ (దుస్తులు) ధరించిన వ్యక్తిని ముహ్రిం అంటారు.

 

విషయసూచిక

 

చేయాల్సిన పనులు

ముహ్రిం మక్కాకు చేరగానే, పట్టణంలో ప్రవేశానికి ముందు స్నానం చేయడం ఉత్తమం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా చేశారు. మస్జిదె హరాం లో ప్రవేశించేటప్పుడు, ముందుగా కుడి కాలు వేసి ఇలా చదవడం సున్నత్ – “బిస్మిల్లా, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్, అల్లాహుమ్మ ఇఘ్ఫిర్లి వఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్” (అల్లాహ్ పేరుతో,  దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంపై అల్లాహ్ శాంతి మరియు కరుణ కురియుగాక, నేను షైతాన్ నుండి మహోన్నతుడైన అల్లాహ్ శరణు కోరుతున్నాను. ఓ అల్లాహ్! నా కోసం కారుణ్యపు ద్వారం తెరచివెయ్యి.) ఇది ఇతర మస్జిద్ లలో ప్రవేశించేటప్పుడు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే, కేవలం మస్జిదె హరాంలో ప్రవేశించేటప్పుడే ఇలా చెప్పాలని ఎలాంటి ధృవీకరణ లేదు. [1]

 

ముహ్రిం చేయకూడని పనులు

ముహ్రిం తొమ్మిది నిషేధించబడిన పనుల నుండి దూరంగా ఉండాలి. అవి:

  1. వెంట్రుకలు కత్తిరించడం
     
  2. గోళ్ళు కత్తిరించడం
     
  3. సువాసనలు పూసుకోరాదు (సబ్బు, టిష్యు పేపర్, ఇత్తరు మొదలైనవి). సహజ సువాసనలు నిషేధించబడలేదు (అన్నం, కూర, చాయ్ మొదలైనవి).
     
  4. కుట్టబడిన దుస్తులు ధరించరాదు.
     
  5. తలను కప్పడం – గొడుగు, బస్ లేదా కార్ కప్పు వల్ల కప్పబడితే ఎలాంటి తప్పు లేదు.
     
  6. ఆట జంతువులను చంపడం నిషిద్ధం.
     
  7. సంభోగం (లైంగిక సంపర్కం) చేయరాదు.
     
  8. పెళ్లి చేసుకోరాదు.
     
  9. స్త్రీని కామోద్రేకంతో తాకరాదు.

 

ముహ్రిం ఇహ్రామ్ స్థితి నుండి బయటకు వచ్చేవరకు వీటి నుండి దూరంగా ఉండాలి. ఇహ్రామ్ తీసివేసిన మొదటి దశలో, కేవలం లైంగిక సంపర్కం తప్ప, మిగతా అన్నీటికి అనుమతి ఉంది. ఇహ్రామ్ తీసివేసిన రెండో దశలో లైంగిక సంపర్కం కూడా అనుమతించబడింది.  (షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ ఫతావా ఇస్లామీయ దారుస్సలాం vol 4, పేజి 133) [2]  
గమనిక: ఈ నిషేధాలు స్త్రీ, పురుషులు ఇద్దరికీ వర్తిస్తాయి.

 

ముహ్రింకు అనుమతించబడిన పనులు

  • చేతి గడియారం, కళ్ళద్దాలు, పైసల బెల్ట్, ఉంగరాలు, చలువ కళ్ళజోళ్ళు, వినే మాట్లాడే పరికరాలు మొదలైనవి ఉపయోగించడం.
     
  • సువాసన లేని సబ్బుతో శరీరాన్ని శుభ్రపరచుకోవడం (స్నానం చేయడం), తలను మరియు శరీరాన్ని మెల్లగా రుద్దడం, ఇలా చేయడంలో కొన్ని వెంట్రుకలు రాలినను పరవాలేదు. 
     
  • ఇహ్రామ్ దుస్తులను మార్చుకోవడం. ఇహ్రామ్ దుస్తులు తీయడం వల్ల ఇహ్రామ్ స్థితి భంగమైపోదు. సంకల్పం (నియ్యత్) ఇహ్రామ్ స్థితిలోకి తీసుకు వస్తుంది, అలాగే వెంట్రుకలు కత్తిరించడం ఇహ్రామ్ స్థితి నుంచి బయటకు తీసుకెళ్తుంది.
     
  • కార్ కప్పు, గొడుగు, గుడారం, భవనం ద్వారా తలపై నీడ పడటం.
     
  • పురుషులు పడుకునేటప్పుడు తమ ఇహ్రామ్ తో లేదా దుప్పటితో కాళ్ళను కప్పుకోవచ్చు, కాని తలను కప్పుకోరాడు.
     
  • ముహ్రిం తన తలపై తన సామానులను మోసుకుని పోవచ్చు. గొడుగు, వస్త్రం, గుడారం, కారు కప్పు, రైలు కప్పు ద్వారా సూర్యుని వేడి నుంచి నీడను పొందవచ్చు.
     
  • ముహ్రిం పైసలు పెట్టుకోవడానికి బెల్ట్ జేబు వాడవచ్చు. చేతి గడియారం కూడా వాడవచ్చు.

 

ముహ్రిం చేసే తప్పిదాలు

కొందరు హాజీలు ఇహ్రామ్ ధరించకుండానే, మీఖాత్ (ఇహ్రామ్ ధరించే ప్రదేశం) దాటి జిద్డా లేదా ఇతర కాబా దగ్గరి ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ చేరాక ఇహ్రామ్ ధరిస్తారు లేదా ఇహ్రామ్ స్థితిలోకి వస్తారు. ఇలా చేయడం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆదేశాలకు విరుద్ధం. ఎందుకంటే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం హజ్ లేదా ఉమ్రా చేసే ప్రతి వ్యక్తికి, అతని మార్గంలో వచ్చే మీఖాత్ ప్రదేశంలోనే ఇహ్రామ్ ధరించాలని అజ్ఞాపించారు.  

 

ఎవరైనా ఇలా చేసినచో తిరిగి తన మీఖాత్ ప్రదేశానికి వెళ్లి, ఇహ్రామ్ ధరించాలి లేదా పరిహారంగా మక్కాలో ఒక మేకను బలి ఇచ్చి దాని మాంసాన్ని బీదవారికి పంచిపెట్టాలి.  

 

ఈ తప్పు చేసినవారు – విమానంలో, ఓడలో, భూమి ద్వారా - ఏ విధంగా ప్రయాణం చేసి వచ్చిననూ, అందరికీ వర్తిస్తుంది.

 

ఆధారాలు

[1] http://www.alifta.com/Fatawa/FatawaSubjects.aspx? (ఇంగ్లీష్)
[2] http://ww.fatwaislam.com/fis/index.cfm?scn=fd&ID=969 (ఇంగ్లీష్)
 
 

476 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్