ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం ఏమిటి


 

విషయసూచిక

 

అల్లాహ్ ను అమితంగా కీర్తిoచినవారు

హా  మీమ్‌.  సుస్పష్టమైన(ఈ) గ్రంథంసాక్షిగా!   మీరు  అర్థం  చేసుకోవటానికిగాను మేము దీనిని అరబీ ఖురానుగా చేశాము.  నిశ్చయంగా  ఇది  మాతృగ్రంథం  (లౌహెమహ్‌ఫూజ్‌)లో ఉన్నది.  మా వద్ద  అది ఎంతో ఉన్నతమైన, వివేకంతోనిండిన  గ్రంథంగా  ఉన్నది.  ఏమిటి? మీరు హద్దుమీరిపోయే జనులైనందున  మేము ఈ  ఉపదేశాన్నిమీ నుంచి మళ్లించాలా?  మేము  పూర్వీకులలో  కూడా  ఎంతోమంది  ప్రవక్తల్ని పంపించాము.  తమ  వద్దకు  ఏ  ప్రవక్త వచ్చినా  వారు  అతన్నిపరిహసించకుండా వదల్లేదు.  మేము వీళ్ళ కన్నాఎక్కువ ఘటికులనే పట్టుకొని అంతమొందించాము. పూర్వీకుల దృష్టాంతాలు గడచి ఉన్నాయి.  "కరుణామయుడు (అయిన అల్లాహ్‌) తలచి ఉంటే మేము వాళ్ళను పూజించేవారం కాము"  అని  (వీళ్లు కబుర్లు)  చెబుతున్నారు. దీనికి  సంబంధించి వీరికసలు ఏమీ తెలీదు.  అవి కేవలం వీళ్ల ఊహాగానాలు మాత్రమే.   సూరా అల్ జుఖ్ రుఫ్ 43:1-8,20; నీ ప్రభువు గొప్పతనాన్ని చాటి చెప్పు. సూరా అల్ ముద్దస్సిర్  74:3

 

ఆయన్ని విశ్వసించాలని వాగ్దానం తీసుకోబడింది

అల్లాహ్‌  (తన)  ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు,  ''నేను మీకు గ్రంథాన్ని,  వివేకాన్ని  ఒసగిన తరువాత,  మీ వద్ద ఉన్న దాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త  మీ  వద్దకు వస్తే  మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి, అతనికి  సహాయపడాలి'' అని చెప్పాడు. తరువాత  ఆయన, ''ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా?   నేను   మీపై  మోపిన బాధ్యతను స్వీకరిస్తున్నారా?''  అని ప్రశ్నించగా,  ''మేము  ఒప్పుకుంటున్నాము'' అని అందరూ అన్నారు.  ''మరయితే   దీనికి   మీరు  సాక్షులుగా  ఉండండి.  మీతో పాటు నేనూ సాక్షిగా ఉంటాను'' అని  అల్లాహ్‌ అన్నాడు. సూరా ఆలి ఇమ్రాన్ 3 :81

 

మృదువుగా వ్యవహరిస్తారు

 (ఓప్రవక్తా!) అల్లాహ్‌ దయవల్లనే నీవు వారి  యెడల మృదుమనస్కుడవయ్యావు. ఒకవేళ  నువ్వే  గనక కర్కశుడవు,  కఠిన మనస్కుడవు అయివుంటే వారంతా నీ దగ్గరి  నుంచి  వెళ్ళిపోయేవారు. కనుక నువ్వు వారి పట్ల  మన్నింపుల  వైఖరిని అవలంబించు, వారి క్షమాపణ  కోసం  (దైవాన్ని)  వేడుకో.  కార్యనిర్వహణలో వారిని సంప్రదిస్తూ ఉండు.  ఏదైనా పని గురించి  తుది నిర్ణయానికి వచ్చినప్పుడు, అల్లాహ్‌పై  భారం మోపు.  నిశ్చయంగా అల్లాహ్‌ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు. సూరా ఆలి ఇమ్రాన్ 3: 159

 

విశ్వాసుల పాలిట గొప్ప కారుణ్యమూర్తి

అల్లాహ్‌ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే, ఆయన వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకుని  వారి  వద్దకు పంపాడు. అతడు వారికి  ఆయన వాక్యాలను  చదివి వినిపిస్తాడు. వారిని పరిశుద్ధుల్ని చేస్తాడు. వారికి గ్రంథజ్ఞానాన్నీ, వివేకాన్నీ బోధిస్తాడు.   నిశ్చయంగా  అంతకు ముందైతే వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై ఉండేవారు. సూరా ఆలి ఇమ్రాన్ 3:164

 

విశ్వాసుల కొరకు కారుణ్యం

ప్రవక్తను  బాధించేవారు  కూడా  వారిలో కొందరున్నారు.  ''ఈయన  చెప్పుడు మాటలు వినేవాడు'' అని  వారంటున్నారు. వారికి చెప్పు:  ''ఆ వినేవాడు మీ మేలును కోరేవాడే. అతడు అల్లాహ్‌ను విశ్వసిస్తాడు. ముస్లింల మాటల్ని నమ్ముతాడు.  మీలో విశ్వసించిన వారి యెడల అతడు  కారుణ్యమూర్తి. దైవప్రవక్త (సఅసం)ను బాధించే వారికి బాధాకరమైన శిక్ష ఖాయం.''సూరా అత్ తౌబా 9:61

 

వివేకంతో , చక్కని హితబోధతో  ఉత్తమోత్తమ విధానంలో వాదిస్తూ ధర్మమార్గం వైపు ఆహ్వానిస్తారు

 

నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోనూ, చక్కని ఉపదేశంతోనూ పిలువు. అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు.  నిశ్చయంగా తన మార్గం నుంచి తప్పిన వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. సన్మార్గాన ఉన్నవారెవరో కూడా ఆయనకు  బాగా తెలుసు. సూరా అన్ నహ్ల్ 16:125

 

ఆధారాలు

www.teluguislam.net (ఇంగ్లీష్)

1223 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్