మినా - MINA


మినా, సౌదీ అరేబియాలోని మక్కా మరియు ముజ్దలిఫా పట్టణాల మధ్యలో ఉంది. దీన్ని గుడారాల పట్టణం అని కూడా అంటారు. షైతానులను సూచించే తెల్ల స్థూపాలు ఇక్కడే ఉన్నాయి. హజ్ చేసేవారు దానిపై రాళ్లు కొట్టడానికి ముజ్దలిఫాలో గుమిగూడుతారు. [1]

 

హజ్ మొదటి రోజు హాజీలు మక్కా నుండి మినాకు వెళ్తారు. మినా మక్కాకు తూర్పు దిక్కున ఉంది. భక్తులు అక్కడ (మినాలో) ఒక రోజు (పగలు, రాత్రి) నమాజ్ చదువుతూ, దుఆ చేస్తూ, ఖుర్ఆన్ చదువుతూ, మరుసటి రోజు కోసం విశ్రాంతి తీసుకుంటూ గడుపుతారు.  

 

విషయసూచిక

 

తర్వియ రోజు మినాకు వెళ్ళడం

తర్వియ దినం జిల్ హజ్జా మాసపు 8వ రోజు మరియు హజ్ యొక్క మొదటి రోజు. హజ్జె తమత్తు చేసే వారు 8వ జిల్ హజ్జా (తర్వియ దినం) నాడు తాము ఉన్న ప్రదేశం నుంచే ఇహ్రామ్ ధరించి, ఉదయం మినాకు బయలుదేరాలి. 8వ జిల్ హజ్జా నాడు జుహర్, అసర్, మఘ్రిబ్, ఇషా నమాజులు హాజీలు మినాలోనే చదవాలి. మరుసటి రోజు అంటే, 9వ జిల్ హజ్జా రోజు ఫజర్ నమాజ్ కూడా అక్కడే (మినాలో) చదవాలి. హాజీలు మినాలో 9వ జిల్ హజ్జా రోజు సూర్యోదయం వరకు ఉండి, ఆ తరువాత అరఫాకు బయలుదేరాలి. 10వ జిల్ హజ్జా నాడు సూర్యోదయం కాక ముందే, హాజీలు మినాకు తిరిగిరావాలి. [2]

 

మినాలో రాత్రి గడపడం

11 మరియు 12 జిల్ హజ్జా ముందటి రాత్రులు మినాలో గడపడం తప్పనిసరి (విధి) అని అధిక శాతం విద్వాంసుల అభిప్రాయం. ఎవరైతే ఎలాంటి కారణం లేకుండా ఇలా చేయరో వారు పరిహారంగా మక్కాలో ఒక మేకను బలి ఇచ్చి, దాని మాంసాన్ని అక్కడి బిదవారికి పంచాలి.    

 

ఎవరికైనా మినాలో ఉండడానికి చోటు దొరకని పక్షంలో, అలాంటి వారు గుడారాలు అంతమయ్యే చోట ఉండవచ్చు. ఆ చోటు ముజ్దలిఫాలోకి వచ్చినా పరవాలేదు. ఖుర్ఆన్ లో ఇలా అనబడింది: “కాబట్టి శాయశక్తులా  మీరు అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. (ఆజ్ఞలను) వినండి, విధేయత చూపండి. (దైవమార్గంలో) ఖర్చు చేస్తూ ఉండండి. ఇది స్వయంగా మీకే శ్రేయస్కరం. ఎవరైతే తమ ఆత్మ లోభత్వం నుండి రక్షించబడ్డారో వారే సాఫల్య భాగ్యం పొందినవారు.” (ఖుర్ఆన్ సూరా తఘాబున్ 64:16)

 

తష్రీఖ్ రోజుల రాత్రులు మినాలో గడపకూడదు  

తష్రీఖ్ దినాలలో మినాలో రాత్రులు గడపడం తప్పనిసరి అని అధిక శాతం విద్వాంసులు అన్నారు. ఎక్కువ శాతం రాత్రి మినాలో గడపాలి. తష్రీఖ్ రాత్రుల్లో మినాలో ఆగకపోవడం :

 

మొదటి సందర్భం: ఏదైనా బలమైన కారణంగా ఒకతను మినాలో గడపలేకపోతే: షేక్ బిన్ బాజ్ (రహి) గారికి ఈ ప్రశ్న అడగబడింది. ఆయన ఇలా అన్నారు: “అతనికి/ ఆమెకు ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదా – అనారోగ్యం, మినాలో చోటు దొరకకపోవడం, హాజీల కోసం నీళ్ళు తెచ్చేవారు, గొర్రెల కాపరులు మొదలైనవారు.

 

రెండో సందర్భం: ఎలాంటి కారణం లేకుండా తష్రీఖ్ రోజులలో రాత్రిళ్ళు మినాలో గడపకపోవడం. షేక్ బిన్ బాజ్ (రహి) ఇలా అన్నారు: ఎవరైతే ఎలాంటి కారణం లేకుండా తష్రీఖ్ రోజుల్లోని రాత్రిళ్ళు మినాలో గడపరో, వారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆజ్ఞను ఉల్లంఘించిన వారవుతారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గొర్రె కాపరులను మరియు హాజీల కోసం నీళ్ళు తెచ్చేవారికి మినహాయింపు ఇచ్చారు. తష్రీఖ్ రోజుల్లో రాత్రిళ్ళు మినాలో ఆగడం తప్పనిసరి. ఏ కారణం లేకుండా ఇలా చేయనివారు పరిహారంగా జంతు బలి ఇవ్వాలి. ఇబ్న్ అబ్బాస్ (రజి) ఉల్లేఖనం ప్రకారం: “హజ్ ఆచరణల్లో ఏదైనా వదలిపెట్టినా, మరచిపోయినా, అతడు/ఆమె పరిహారంగా జంతు బలి ఇవ్వాలి.” తష్రీఖ్ దినాలలో రాత్రిళ్ళు మినాలో గడపని పక్షంలో ఒక మేక బలి ఇచ్చినా సరిపోతుంది. (ఫతావా అల్ షేక్ ఇబ్న్ బాజ్ vol 5)

 

బలి ఇచ్చిన జంతువు మాంసాన్ని హరంలోని పేదవారికి పంచాలి. బలి ఇచ్చిన వారు అందులో నుంచి తినకూడదు.

 

తష్రీఖ్ రోజుల్లో ఉదయం మినా నుండి బయటకు వెళ్ళడం, రాత్రిళ్ళు తిరిగి రావడం మరియు మినాలో ఉండడం యొక్క ప్రాముఖ్యత  

మొదట:

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్ ప్రకారం హాజీ (హజ్ చేసేవారు) మొత్తం దినం మినాలో గడపాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కేవలం తవాఫ్ అల్ ఇఫాదా కోసం మినా వదిలారు. రాత్రిలో ఎక్కువ భాగం మినాలోనే గడపాలి. మినాలో ఉండడానికి స్థలం లేని పక్షంలో, ఎవరైనా ఉదయం వేళ మినా నుండి మక్కాకు లేదా ఇతర ప్రదేశానికి వెళితే ఎలాంటి దోషం లేదు.

 

షేక్ ఇబ్న్ బాజ్ (రహి)ను ఇలా అడగడం జరిగింది: ఒకతను అరఫా నుండి వెళ్లి మొదటి జమరాత్ పై రాళ్లు కొట్టి, ఆ తరువాత తవాఫ్, సయీ చేసి, అసర్ నమాజ్ వరకు మక్కాలో ఉండి, ఆ తరువాత మినాకు వెళ్లి జంతు బలి ఇచ్చాడు. దీని కోసం అతను ఏమైనా చేయాలా?     

 

షేక్ జవాబు:

అతను ఎలాంటి పాపం చేయలేదు. ఈద్ రోజు లేదా తష్రీఖ్ దినాలలో మక్కాలో ఉండడం పాపం కాదు. కాని, వీలయితే ఆ దినాలలో మినాలో ఉంటే మంచిది. దీనివల్ల దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మరియు ఆయన అనుచరుల సున్నత్ పై అమలు చేసినట్లు అవుతుంది. ఎవరికైనా మినాలో ఆగడం కష్టంగా ఉంటే, అతను ఉదయం పూట మక్కాలో గడిపి, రాత్రి వేళ మినాలో గడిపితే, ఎలాంటి తప్పు లేదు. (మజ్మూ ఫతావా అల్ షేక్ ఇబ్న్ బాజ్ 17/365)  

 

హాజీలు ఎవరైతే అల్ అజీజియాలో ఉంటారో, వారు తష్రీఖ్ దినాలలో తమ ఇండ్లలో ఉండడం గురించి షేక్ ఇబ్న్ ఉసైమిన్ (రహి)ను అడగడం జరిగింది.    

 

దానికి ఆయన ఇలా జవాబిచ్చారు: నా అభిప్రాయం ప్రకారం అల్ అజీజియా లో ఉండేవారు ఉదయం పూట తమ ఇండ్లలో ఉండకూడదు. నిస్సంకోచంగా మినాలోని గుడారాలలో ఉండడం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్. హజ్ అల్లాహ్ కోసం చేసే జిహాద్ లాంటిది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను ఆయిషా (రజి) ఇలా అడిగారు: “స్త్రీలకు జిహాద్ (అల్లాహ్ దారిలో పోరాడడం) ఉందా?” దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “అవును, ఆ జిహాద్ లో పోరాటం ఉండదు- అది హజ్ మరియు ఉమ్రా.” కావున హాజీ పగలు, రాత్రి మినాలో ఉండడం అభిలషణీయం.     

 

షేక్ ఉసైమిన్ (రహి) ను ఇలా అడిగారు- తష్రీఖ్ దినాలలో మక్కాకు, దాని సమీప ప్రదేశాలు జిద్దా వగైరాకు వెళ్ళడం వల్ల హజ్ పై ప్రభావం పడుతుందా?

షేక్ ఇలా జవాబిచ్చారు: దీని వల్ల హజ్ పై ప్రభావం పడదు. కాని, ఆ రోజులు (తష్రీఖ్ రోజులు) మినాలో గడపడం వల్ల దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్ పై అమలు చేసినట్లు అవుతుంది. (మజ్మూ ఫతావా అల్ షేక్ ఇబ్న్ ఉసైమిన్ 23/241, 242)

 

రెండో విషయం:

మినాలో ఆగే విషయమై, మార్గదర్శకం ఏమిటంటే, హాజీ మినాలో సగ భాగం కంటే ఎక్కువ రాత్రి గడపాలి. రాత్రి సమయాన్ని సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు తీసుకోవాలి. దీని ప్రకారం ఎన్ని గంటలవుతుందో లెక్క కట్టాలి. ఒకవేళ మీరు మినాలో ఆరు గంటలు గడిపితే, అది సగం రాత్రి కంటే ఎక్కువే అవుతుంది.  

 

షేక్ ఇబ్న్ ఉసైమిన్ ను ఇలా అడిగారు: తష్రీఖ్ రోజుల్లో మక్కాలో ఎంత సమయం ఉండవచ్చు?

షేక్ ఇలా జవాబిచ్చారు: రాత్రిలో ఎక్కువ భాగం మినాలో గడపాలని విద్వాంసుల అభిప్రాయం. ఒకవేళ రాత్రి 10 గంటలుంటే, 5 ½ గంటలు మినాలో గడపాలి. (ఫతావా అల్ షేక్ ఇబ్న్ ఉసైమిన్ 23/244)

 

మినాలో ఉన్న రోజుల్లో హాజీ ఐదు పూటల నమాజులను అందరితో కలిసి సమూహంగా చదవడం ఉత్తమం. అది కూడా మస్జిద్ ఖైఫ్ లో చదవడం మంచిది. ఎందుకంటే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “మస్జిద్ ఖైఫ్ లో డెభ్భై ప్రవక్తలు నమాజ్ చేశారు.” [3]

 

ఆధారాలు

[1] http://www.hajinformation.com/main/j50.htm (ఇంగ్లీష్)
[2] http://www.go-makkah.com/english/dossier/articles/426/The+day+of+Al-Tarwiyah.html (ఇంగ్లీష్)
[3] http://islamqa.info/en/ref/36244/mina (ఇంగ్లీష్)
 

 

1172 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్