మదీనా – మస్జిదె నబవీ


పూర్వం మదీనా నగరం ‘యస్రిబ్’గా పిలువబడేది.మక్కా నుండి హిజ్రత్ చేసిన తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఈ నగరంలో స్థిరపడ్డారు. తన ఇంటి పక్కనే ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం నిర్మించిన మస్జిద్ ‘మస్జిదె నబవీ’(ప్రవక్త మస్జిదు)గా, ప్రసిద్దిచెందింది. మదీనా నగరం హరమె నబవీ సల్లల్లాహు అలైహివ సల్లం గా, దారుల్ హిజ్రత్ గా ఖ్యాతి చెం దింది. ఇంకా ఇది దైవాజ్ఞలు అవతరించిన కేంద్రంగా భాసిల్లింది. దైవప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాను పవిత్ర స్థలంగా ఖరారు చేసినట్లే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మదీనా నగరాన్ని పుణ్యక్షేత్రంగా ఖరారు చేశారు. ఆయన  సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా సెలవిచ్చారు:


“ఓ అల్లాహ్! ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాను పవిత్ర స్థలం (హారం)గా ఖరారు చేశారు. నేను ఈ నగరం (మదీనా)లోని రెండు రాతి ప్రదేశాల నడుమ భాగాన్ని పుణ్య క్షేత్రంగా ఖరారు చేస్తున్నాను.” (సహీహ్ ముస్లిం)   

 

విషయసూచిక

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవచనం

“పాము తన పుట్టలో శరణు పొందినట్లే విశ్వాసం (ఈమాన్) మదీనాలో శరణు పొందుతుంది. ఇక్కడి వైపరీత్యాలను, బాధలను ఓర్చుకున్న వాని కోసం నేను సిఫారసు చేస్తాను, సాక్షిగా ఉంటాను.” (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం)


ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇంకా ఇలా వక్కాణించారు:


“మదీనా కొలిమి లాంటిది. అది తన వారిలోని తప్పును దూరం చేస్తుంది. అందులోని మంచివారు మరింత నికార్సుగా తేలుతారు.” (సహీహ్ ముస్లిం)


మదీనా వాసుల గొప్పతనం

మదీనాలో నివసించే వారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కు ఇరుగు పొరుగు వారు. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం  మస్జిదుకు వచ్చేవారు. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం నగరంలో స్థిరపడేవారు. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం పుణ్య క్షేత్రంలో నిలకడ చూపేవారు. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వెలిగించిన దీపాలకు రక్షకులు. అలాంటి వారిని ఆదరించాలి. వారితో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలి. వారిని అభిమానించాలి. వారితో స్నేహ బంధాలను కలిగి ఉండాలి. వారికీ మనస్తాపం కలిగించకూడదు. వారిని బాధించే వారిని హెచ్చరిస్తూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:
“మదీనా వాసులను మోసగించేవాడు నీటిలో ఉప్పు కరిగే విధంగా కరిగిపోతాడు.” (సహీహ్ బుఖారీ)మదీనా వాసుల పట్ల సద్వ్యవహారం చేయమని  దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం యావత్తు అనుచరులను తాకీదు చేస్తూ ఇలా అన్నారు: “మదీనా నా వలస కేంద్రం. ఇదే నా విరామ స్థలం. నా పునరుత్థానం ఇక్కడి నుంచే జరుగుతుంది. నా పొరుగువారు ఘోర అపరాధాలకు ఒడిగట్టకుండా ఉన్నంత వరకూ వారిని రక్షించవలసిన బాధ్యత నా అనుచర సమాజం (ఉమ్మత్)పై ఉంది. ఎవరైతే వారిని రక్షిస్తారో వారి కొరకు నేను సిఫారసు చేస్తాను, సాక్షిగా ఉంటాను.” (తిబ్రానీ)  

 

మస్జిదె నబవీ గొప్పతనం

భూమండలంలోని మూడు గొప్ప మస్జిదులలో మస్జిదె నబవీ ఒకటి. దీని మహత్తును స్పష్టపరుస్తూ అంతిమ  దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ప్రవచించారు:

 

  1. “నా ఈ మస్జిద్ లో నమాజు  చేయటం – ఒక మస్జిద్ హరం తప్పించి – వేరితర మస్జిద్ లలో చేసే వెయ్యి నమాజులకన్నా ఘనమైనది.” (ముస్నద్ అహ్మద్)  
  2. “మస్జిదె హరంలో నమాజు చేయటం వేరితర మస్జిద్ లలో చేసే లక్ష నమాజులకన్నా శ్రేష్టమైనది.” (ముస్నద్ అహ్మద్)
  3. “మూడు మస్జిద్ లు తప్ప మరో దాని వైపు పుణ్యఫలాపేక్షతో వాహనాలను సిద్ధరపరచరాదు. అవేమంటే – 1. మస్జిదె హరం  2. మస్జిదె నబవీ 3. మస్జిదె అఖ్సా .”
  4. “నా నివాస గృహానికి – (ఈ మస్జిద్ లోని) నా వేదిక (మిoబర్)కి మధ్య ఉన్న స్థలం స్వర్గ వనాలలోని ఒక వనం.” (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం)   

 

ఆధారాలు

www.Islamhouse.com

 

1153 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్