పరదా (ముసుగు)


అరబీ పదం ‘హిజాబ్’ అంటే పరదా, ముసుగు వగైరా. ఇది అల్లాహ్ విధేయతకు సూచన. ఇది స్వచ్చత, వినయము, రుజుమార్గం, విశ్వాసానికి నిదర్శనం.

 

విషయసూచిక

 

పరిచయం


ఖుర్ఆన్ లో పరదా పురుషులు మరియు స్త్రీలకు అనివార్యం చేయబడింది. ఇస్లాంలో ఇది ముందుగా పురుషులకు, ఆ తర్వాత స్త్రీలకు వర్తిస్తుంది. ఖుర్ఆన్ మరియు హదీసులలో (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం విధానం) సూచించిన విధంగా కేవలం ఒక్క అల్లాహ్ నే ప్రార్దిoచడం తన కర్తవ్యo మరియు అల్లాహ్ యే తాను సృష్టించబడటానికి కారణం అని ప్రతి ముస్లిం భావిస్తాడు. పరదా కూడా అల్లాహ్ కు విధేయత చూపే ఓ మార్గం.

 

“(చూడండి) అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఏ వ్యవహారంలోనైనా ఒక నిర్ణయం చేసిన తరువాత విశ్వాసులైన ఏ పురుషునికిగానీ, స్త్రీకిగానీ తమకు వర్తించే ఆ వ్యవహారంలో ఎలాంటి స్వయం నిర్ణయాధికారం మిగిలి ఉండదు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే అతను స్పష్టమైన అపమార్గానికి లోనైనట్లే (జాగ్రత్త). ఖుర్ఆన్ సూరా అహజాబ్ 33:36   

 

ఖుర్ఆన్ మహిళలకు పరదా ఎందుకు విధించిందంటే దాని వల్ల వారు గౌరవం గల స్త్రీలు అని తెలుస్తుంది మరియు స్త్రీల మానమర్యాదలకు హాని కలిగే అవకాశం ఉండదు. వినయం విశ్వాసానికి చిహ్నం. వినయం, విధేయత, పరదా లేని వారు ధర్మానికి కూడా ప్రాధాన్యత ఇవ్వరు. పరదా స్త్రీని కించపరచదు, సరికదా ఆమె మానమర్యాదలను కాపాడుతుంది. పరదా వల్ల స్త్రీలపై గౌరవం పెరుగుతుంది మరియు సమాజంలో శాంతి నెలకొంటుంది. 

 

పురుషుల పరదా


ఖుర్ఆన్ లో అల్లాహ్ సెలవిస్తున్నాడు: (ఓ ప్రవక్తా!) ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలనీ, అది వారి కొరకు పవిత్రమైనదని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు. ఖుర్ఆన్ సూరా నూర్ 24:30

 

నామహ్రం (పెళ్లి చేసుకొనే అవకాశం గలవారు)తో కరచాలనం చేయడం


ఇస్లాంలో నామహ్రం తో కరచాలనం చేసే అనుమతి లేదు. దీని గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “మీకు అనుమతించబడని (నామహ్రం) స్త్రీలను ముట్టుకోవడం కన్నా మీ తలను ఇనుప సూదితో గుచ్చడం మీకు మేలైనది.” అల్ ముజాం అల్ కబీర్ లో అత్ తబరాని (20/213), అల్ ముసన్నఫ్ లో అబీ శైబహ్ (4/341)

 

స్త్రీల పరదా


 (ఓ ప్రవక్త ! ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలనీ, బహిర్గితమై ఉండేది తప్ప – తమ అలంకరణను బహిర్గతం చేయరాదనీ, తమ వక్షస్థలాలపై ఓణిలు వేసుకోవాలనీ, తమ భర్త లేక తమ తండ్రి లేక తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ భర్త కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేక తమ అక్కాచెల్లెళ్ళ కొడుకులు లేక తమతో కలసి మెలసి ఉండే స్త్రీలు, లేక తమ బానిసలు లేక ఇతరత్రా ఉద్దేశాలు లేకుండా తమకు లోబడి ఉన్న పురుష సేవకులు లేక స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా తెలియని బాలురు – వీళ్ళ ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అలంకరణలను (అందచందాలను) కనబడనివ్వకూడదనీ, దాగి ఉన్న తమ అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్ళను నేలపై కొడుతూ నడవరాదని వారితో చెప్పు. ముస్లింలారా ! మీరంతా కలసి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.” ఖుర్ఆన్ సూరా నూర్ 24:31

 

ఓ ప్రవక్తా ! తమపై నుంచి తమ దుప్పట్లను (క్రిందికి) వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా (మర్యాదస్తులుగా) గుర్తించబడి, వేధింపుకు గురికాకుండా ఉంటారు. అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. సూరా అహజాబ్ 33:59   

 

హదీసు


సఫియా బింత్ శైబహ్ రజిఅల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం ఆయిషా రజిఅల్లాహు అన్హా ఇలా అన్నారు: ఈ పదాలు అవతరించినపుడు – “జలాబీబిహిన్నతో అంతా కప్పుకోండి (అంటే- శరీరం, ముఖం, మెడ, చాతీలపై)” – వారు (ఇజార్) ఒక రకమైన బట్ట తీసుకొని దాన్ని అంచుల నుండి కత్తిరించి తమ ముఖాలను కప్పుకున్నారు. సహీహ్ బుఖారీ 4481    

 

పరదా చేసే వయసు


ఆడపిల్లలు యుక్త వయస్సుకు రాగానే పరదా చేయాలి. 

 

 (మగపిల్లలు, ఆడపిల్లలు) యుక్తవయసుకు చేరుకున్నారనడానికి మూడు సూచనలు ఉన్నాయి:

1 – తడి కలలు రావడం

 

2 – మర్మాంగాల చుట్టూ వెంట్రుకలు రావడం

 

3 – పద్నాలుగు సంవత్సరాలకు చేరడం

ఆడవారిలో నాలుగో సూచన కూడా ఉంది:

 

4 – బహిష్టు

ఈ నాలుగింటిలో ఏ ఒకటి కనిపించినా అప్పటి నుండి ఆడపిల్ల తప్పనిసరి పరదా చెయ్యాలి మరియు నిషేధించబడిన వాటి నుండి ఆగాలి.

 

పురుషుల పరదా నిబంధనలు


1.       కనీసం నాభి నుండి కాలి మడమకు దిగకుండా ఉండాలి.  

 

2.       ఇది శరీరానికి చాలా బిగువుగా లేదా శరీరం కనిపించేలా ఉండకూడదు.

 

3.       అది ఎంత వదులుగా ఉండాలంటే శరీరపు ఏ భాగమూ కనిపించకూడదు.

 

4.       అది మగవారి వస్త్రంలా ఉండాలి, ఆడవారి వస్త్రంలా ఉండకూడదు.

 

5.       దాని మీద ఎలాంటి డిజైన్లు ఉండకూడదు, ఎందుకంటే వాటి వల్ల ఆడవారికి ఆకర్షణ పుడుతుంది.

 

6.       అది గర్వానికి, అహంకారానికి ప్రతీక కాకూడదు.

 

7.       అది అవిశ్వాసులను పోలి ఉండరాదు. అవిశ్వాసుల ధర్మానికి ప్రతిబింబించే ఎలాంటి గుర్తులు ఉండకూడదు.

 

స్త్రీల పరదా నిబంధనలు


1.       పూర్తి శరీరాన్ని తల నుండి కాళ్ళవరకు కప్పి ఉంచాలి

 

2.       ఇది శరీరానికి చాలా బిగువుగా లేదా శరీరం కనిపించేలా ఉండకూడదు.

 

3.       అది ఎంత వదులుగా ఉండాలంటే శరీరపు ఏ భాగమూ కనిపించకూడదు.

 

4.       అది ఆడవారి వస్త్రంలా ఉండాలి, మగవారివిలా ఉండకూడదు.

 

5.       దానికి సువాసనలు పూసుకోరాదు. 

 

6.        దాని మీద ఎలాంటి డిజైన్లు ఉండకూడదు, ఎందుకంటే వాటి వల్ల మగవారికి ఆకర్షణ పుడుతుంది.

 

7.        అది గర్వానికి, అహంకారానికి ప్రతీక కాకూడదు.

 

8.        అది అవిశ్వాసులను పోలి ఉండరాదు. అవిశ్వాసుల ధర్మానికి ప్రతిబింబించే ఎలాంటి గుర్తులు ఉండకూడదు.

 

ఇస్లాం స్త్రీలను రక్షిస్తుంది. అoదుకొరకే అల్లాహ్ ఇలాంటి కటినమైన నియమాలను రూపొందించాడు. నేటి సమాజంలో ఆడవారిని చాలామంది మగవారు కేవలం ఆటవస్తువుగా వాడుతున్నారు. ప్రతి ప్రకటనలో స్త్రీలను అర్ధనగ్నంగా చూపిస్తున్నారు. ఇది ఆడవారి స్వేచ్చా లేదా వారిని కించపరచడమా? ఇస్లాం ఆడవారికి అసలైన స్వేచ్చను 1400 సంవత్సరాల క్రితమే ఇచ్చింది.

 

ఆధారాలు


http://islam102.wordpress.com/2009/03/10/what-are-the-conditions-of-proper-hijab/(ఇంగ్లీష్)

http://sisters.islamway.com/modules.php?name=News&file=article&sid=3(ఇంగ్లీష్)

2004 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్