తవాఫ్ (కాబా ప్రదక్షణమ్) - TAWAAF OR CIRCUMAMBULATION


భాషాపరంగా ‘తవాఫ్’ అంటే, ఏదైనా ఒక వస్తువు చుట్టూ నడవడం లేదా తిరగడం. ఇస్లామియంగా ‘తవాఫ్’ అంటే, కాబా చుట్టూ గడియారపు వ్యతిరేక దిశలో ఏడు సార్లు ప్రదక్షిణ చేయడం. ఇది ఉమ్రా లేదా హజ్ సమయంలో చేస్తారు. ఇది ఉమ్రాలోని రెండవ విధి. ఈ విధిని తెలిసీ లేదా తెలియక వదలిపెట్టినచో, ఉమ్రా చెల్లదు. అలాగే ఆ వ్యక్తి ఇహ్రామ్ కూడా చెల్లుబాటు కాదు. తవాఫ్ లో కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు వరుసగా చేయాలి. [1] [2]

 

విషయసూచిక

 

ఖుర్ఆన్

అల్లాహ్ ఒక్కడే అని విశ్వసించే ప్రతి ముస్లిం అల్లాహ్ ప్రతి ఆజ్ఞను, చిన్నదైనా పెద్దదైనా తప్పకుండా శిరసావహిస్తాడు. ఖుర్ఆన్ లో ఇలా అనబడింది: “ఆ తరువాత  వారు  తమ  మురికిని దూరం చేసుకోవాలి, తమ మొక్కుబడులను చెల్లించాలి. (అనంతరం దేవుని) ఆ ప్రాచీన గృహానికి ప్రదక్షిణ చేయాలి.” (ఖుర్ఆన్ సూరా హజ్ 22:29). దీనిపై అమలు చేస్తూ, అతను అల్లాహ్ గృహానికి (కాబా) ప్రదక్షిణ (తవాఫ్) చేస్తాడు. ఇది కేవలం అల్లాహ్ పై ప్రేమతో, విధేయతతో, దయ కొరకు మరియు అల్లాహ్ శిక్షకు భయపడుతూ చేస్తాడు. మనిషి అల్లాహ్ ఆజ్ఞను జవదాటకుండా, ఎంత చెప్పబడిందో అంతే చేస్తాడు. తవాఫ్ లో కాబా రాయిని తాకేటప్పుడు, అది తనకు లాభం లేదా నష్టం చేకూరుస్తుందని భావించడు. కేవలం అల్లాహ్ ఆజ్ఞ చేశాడని దాన్ని పాటిస్తాడు.  

 

తవాఫ్ ప్రారంభించే చోటు

తవాఫ్ హజరె అస్వద్ (రాయి) మూల నుంచి ప్రారంభమవుతుంది. రుకునె యమని (యమన్ దిశలోని రాయి) ఒక మూలలో ఉంది మరియు దానికి పక్కన ఉన్న మూలలో హజరె అస్వద్ ఉంది. రుకునె యమని నుండి ఈ దుఆ చదవాలి, “రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతవ్ వఫిల్ ఆఖిరతి హసనతవ్ వఖినా అజాబన్నార్.” ఈ దుఆ తవాఫ్ లోని ప్రతి ప్రదక్షిణలో రుకునె యమాని నుండి హజరె అస్వద్ వరకు చదవాలి. హజరె అస్వద్ వద్ద చేరినప్పుడు, కుడి చేయి ఎత్తి హజరె అస్వద్ కు సలాం చేయాలి. తవాఫ్ ముగించే ముందు హజరె అస్వద్ ను ముద్దుపెట్టుకోవాలి.    

 

ఇంకా మఖామె ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజ్ చేయండి. అక్కడ స్థలం దొరకనిచో, మస్జిదె హరంలో ఎక్కడైనా నమాజ్ చేయవచ్చు. (షేక్ బిన్ బాజ్ గారి అభిప్రాయం)  

 

తవాఫ్ షరతులు

(1) సంకల్పం (నియ్యత్)
 
(2) పరిశుభ్రత అంటే, వజూ విధి (ఫర్జ్-తప్పనిసరి) అని కొందరు ఇస్లామీయ విద్వాంసుల అభిప్రాయం. కొందరు దీన్ని సిఫారసు చేయబడినది (ముస్తహబ్) అంటారు.

 

తవాఫ్ సమయంలో చేసే దుఆ

తవాఫ్ లోని ప్రతి ప్రదక్షిణలో రుకునె యమాని నుండి హజరె అస్వద్ మధ్యలో చేయాల్సిన ప్రత్యెక దుఆ తప్ప, ఇతర దుఆలు ఏవి హదీసుల ద్వారా నిరూపితం కాలేదు. కాని, తవాఫ్ లో ప్రతి ఒక్కరు తమ భాషలో మహోన్నతుడైన అల్లాహ్ ను కీర్తించవచ్చు మరియు వేడుకోవచ్చు.  


తవాఫ్ లోని ప్రతి ప్రదక్షిణలో ఈ దుఆ చదవాలి: ‘రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతవ్ వఫిల్ ఆఖిరతి హసనతవ్ వఖినా అజాబన్నార్’ (ఖుర్ఆన్ సూరా బఖర 2:201)


(అర్ధం: ప్రభూ! మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు, పరలోకంలో కూడా మేలును ప్రసాదించు. ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు).

 

తవాఫ్ రకాలు

తవాఫ్ లో అనేక రకాలు కలవు:

హజ్ సమయంలో చేసే తవాఫ్ అల్ ఇఫాదహ్. దీన్ని తవాఫ్ అల్ జియారహ్ (సందర్శించే తవాఫ్) అని కూడా అంటారు. ఇది అరఫా మైదానంలో నిలబడిన తరువాత, ఈద్ ఉల్ అజ్హా రోజున లేదా తరువాతి రోజున చేయబడుతుంది. ఇది హజ్ తప్పనిసరి కార్యాల్లో (విధులలో) ఒకటి.  

 

తవాఫ్ అల్ ఖుదూం (ఆగమన తవాఫ్) హజ్ కోసం. హజ్ కోసం ఇహ్రామ్ ధరించిన భక్తుడు ఖిరాన్ చేస్తున్నప్పుడు, అంటే కాబా చేరాక ఉమ్రా మరియు హజ్ కలపడం. ఇది విధి చేయబడిన కార్యం మరియు హజ్ సున్నత్ లలో ఒకటి – ఇందులో విద్వాంసుల మధ్య అభిప్రాయ భేదం ఉంది.    

 

తవాఫ్ అల్ వదా (వీడ్కోలు తవాఫ్). ఇది హజ్ కార్యాలన్నీ నెరవేర్చాక మక్కా వదిలే ముందు చేయాల్సిన తవాఫ్. ఈ విషయంలో కూడా విద్వాంసుల మధ్య భేధాభిప్రాయం ఉంది. కాని ఇది విధి (తప్పనిసరి) అనే విషయమే ఎక్కువ సరిఅయినది. రుతుస్రావంలో ఉన్న స్త్రీలు తప్ప అందరూ ఈ తవాఫ్ చేయాలి. దీన్ని చేయడం మరచినవారు పరిహారంగా (ఫిదియాగా) జంతు బలి ఇవ్వాలి.  

 

ఉమ్రా కోసం చేసే తవాఫ్. ఇది ఉమ్రా విధులలో (తప్పనిసరి కార్యాలలో) ఒకటి. ఇది చేయనిచో, ఉమ్రా నెరవేరదు.

 

ప్రమాణం పూర్తి చేసే ఉమ్రా. ఎవరైతే కాబా ప్రదక్షిణ చేస్తానని సంకల్పం చేస్తారో, వారిపై ఈ తవాఫ్ విధి అయిపోతుంది.

 

ముస్తహబ్  తవాఫ్.

 

ఆ తరువాత వీలయితే, మఖామె ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజ్ చేయాలి. అలా కాని పక్షంలో మస్జిదె హరంలో ఎక్కడైనా నమాజ్ చేయవచ్చు. [3]   

 

స్త్రీల విషయంలో

ఇహ్రామ్ ధరించేటప్పుడు లేదా ధరించాక రుతుస్రావం స్థితిలో ఉన్న స్త్రీ, తన రుతుస్రావం సమాప్తమై ఘుసల్ (పరిశుద్ధమయ్యే స్నానం) చేశాక, విధి చేయబడిన వాటిని పూర్తి చేయాలి.    

 

హజ్జె తమత్తు కోసం ఇహ్రామ్ ధరించేవరకు రుతుస్రావం కొనసాగినచో, ఆమెకు రెండు దారులు ఉన్నాయి:

 1. ఇహ్రామ్ ధరించేటప్పుడు రుతుస్రావం మొదలైనచో, ఆ స్త్రీ తన సంకల్పాన్ని ఉమ్ర ఎ తమత్తు నుండి హజ్జె ఇఫ్రాద్ కు మార్చుకోవాలి. హజ్జె ఇఫ్రాద్ ఆచారాలను పూర్తి చేశాక, వీలైనచో ఆమె వాజిబ్ సంకల్పంతో ఉమ్రా ఎ ముఫ్రిదా చేయాలి.
   
 2. ఇహ్రామ్ స్థితిలో వచ్చేశాక రుతుస్రావం మొదలైతే ఆమెకు రెండు దారులు ఉన్నాయి. ఒకటి పైన పేర్కొన్న విధంగా హజ్జె ఇఫ్రాద్ చేయడం లేదా తవాఫ్ మరియు నమాజ్ చేయకుండా ఉమ్ర ఎ తమత్తు ఆచారాలు పూర్తి చేయడం. హజ్జె తమత్తు కోసం ఇహ్రామ్ ధరించి, ఇతర ఆచారాలు పూర్తి చేసి మినా నుండి తిరిగి వచ్చాక, హజ్ తవాఫ్ కు ముందు ఉమ్ర తవాఫ్ పూర్తిచేయాలి. మినా నుండి తిరిగి వచ్చాక కూడా రుతుస్రావపు రక్తం ఆగని పక్షంలో, ఆమె తన తరఫున ఇతరులెవరినైనా నియమించి, తవాఫ్ పూర్తి చేయించాలి. మిగతా ఆచరణలు స్వయంగా చేసుకోవచ్చు. (సహీహ్ బుఖారీ 1638)

 

తవాఫ్ లో తప్పనిసరి విషయాలు

 1. ఇహ్రామ్ దుస్తులు అపరిశుద్ధంగా (నజాసత్ తో) ఉండకూడదు. 
   
 2. శరీరం దుస్తులతో సరిగ్గా కప్పబడి ఉండాలి, ప్రత్యేకంగా వ్యక్తిగత అవయవాలు.

 

తవాఫ్ లో అనుమానానికి  నియమాలు

తవాఫ్ అల్ ఇఫాదహ్ లో మనిషి ఒక ప్రదక్షిణను మరచిపోతే, ఆ తరువాత ఎక్కువ సమయం గడచినచో, అతను తవాఫ్ ను తిరిగి చేయాలి. కాని కొంచెం సమయమే గడచినట్లయితే, మరచిన ఆ ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు.

 

తవాఫ్, ఉమ్రా కోసమైనా లేదా హజ్ కోసమైనా- ఏడు ప్రదక్షిణలు చేయాలి. ఇందులో ఒక్క దాన్ని కూడా తక్కువ చేయడం ఆమోదయోగ్యం కాదు. ఖుర్ఆన్ లో ఇలా అనబడింది: “ఆ తరువాత వారు తమ మురికిని దూరం చేసుకోవాలి, తమ మొక్కుబడులను చెల్లించాలి.   (అనంతరం దేవుని) ఆ ప్రాచీన గృహానికి ప్రదక్షిణ చేయాలి.” (ఖుర్ఆన్ సూరా హజ్ 22:29)

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం దీన్ని (తవాఫ్) తన ఆచరణ ద్వారా చేసి చూపించారు. తవాఫ్ లో ఏడు ప్రదక్షిణలు చేసి ఇలా అన్నారు: “హజ్ ఆచరణలను నా నుండి నేర్చుకోండి.” (సహీహ్ ముస్లిం 2286)

 

అల్ నవవి (రహి) ఇలా అన్నారు: తవాఫ్ లో ఏడు ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ఒక్క తవాఫ్ నల్ల రాయి (హజరె అస్వద్) నుండి మొదలై అక్కడే పూర్తి అవుతుంది. ఏడిటిలో ఒక్కటి వదలిపెట్టినను, ఆ తవాఫ్ చెల్లదు. అతను మక్కాలో ఉన్నను లేదా తన ప్రదేశానికి తిరిగి వెళ్ళినను, దానిని జంతు బలి ఇచ్చి లేదా ఇతర ఏ విధంగానూ పూర్తి చేయలేరు. (అల్ మజ్మూ 8/21)

 

తవాఫ్ హద్దులు

 1. తవాఫ్ కాబా గోడలకు అవతల నుంచి, హజరె ఇస్మాయీల్ ‘c’ ఆకృతి  గోడ నుంచి చేయాలి. 
   
 2. కాబా గోడల హద్దును దాటకూడదు. హజరె ఇస్మాయీల్ గోడను తాకరాదు. ఇలా చేసినచో, ఆ తవాఫ్ చెల్లదు. దాన్ని మళ్ళి చేయాలి.

 

మువాలాత్: ఏడు ప్రదక్షిణలు ఒక దాని తరువాత ఒకటి, ఎలాంటి విరామం లేకుండా పూర్తిచేయాలి.

 

తవాఫ్ లో సిఫారసు (ముస్తహబాత్) చేయబడిన విషయాలు

 1. తవాఫ్ చేస్తున్నప్పుడు జిక్ర్ (అల్లాహ్ నామస్మరణ) లేదా ఖుర్ఆన్ చదవడం లేదా దుఆ చేయడం. వివరాల కోసం మనాసికె హజ్ చూడండి.
   
 2. హజరె అస్వద్ ను చేరినప్పుడు, దాన్ని సలాం చేయడానికి చేతులెత్తినప్పుడు, “బిస్మిల్లాహి అల్లాహు అక్బర్” అని అనాలి.
   
 3. కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు.
   
 4. చిన్న చిన్న అడుగులు వేయాలి.
   
 5. నడిచేటప్పుడు నెమ్మదిగా, శాంతంగా నడవాలి. చాలా మెల్లిగా లేదా చాలా వేగంగా నడవకూడదు.
   
 6. నమాజ్ లో అన్ని రకాల నిషేధించబడిన వాటి నుండి దూరంగా ఉండాలి.
   
 7. జుహర్ నమాజ్ సమయంలో తవాఫ్ చేయాలి.
   
 8. ఎలాంటి నియమాన్ని ఉల్లంఘించకుండా, కాబాకు వీలైనంత దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి. 

 

తవాఫ్ కు సంబంధించిన తప్పులు

 1. తవాఫ్ హజ్రెఅస్వద్ (నల్ల రాయి) నుండి కాక, ఇతర చోటు నుండి మొదలుపెట్టడం. తవాఫ్ హజ్రెఅస్వద్ (నల్ల రాయి) నుంచి మొదలుపెట్టడం విధి (తప్పనిసరి).
   
 2. హజరె ఇస్మాయీల్ లోపల నుండి తవాఫ్ చేయడం. హజరె ఇస్మాయీల్ కాబాలోని ఒక భాగం. ఇలా చేసినచో, తవాఫ్ నెరవేరదు. 
   
 3. తవాఫ్ లోని ఏడు ప్రదక్షినల్లో  మొదటి మూడు ప్రదక్షినలు రమల్ చేయడం (వేగంగా అడుగులు వేయడం). అది కూడా తవాఫ్ అల్ ఖుదూం (ఆగమన తవాఫ్)లో చేయాలి.
   
 4. హజ్రెఅస్వద్ (నల్ల రాయి) ని ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించడంలో, ఇతరులకు నెట్టడం, కొట్టడం లాంటి హానికరమైన పనులు చేయడం. ఇలాంటి పనులు చేయకూడదు.   
  * హజ్రెఅస్వద్ (నల్ల రాయి) ని ముద్దుపెట్టుకోకపోయినా, తవాఫ్ చెల్లుబాటు అవుతుంది. దాన్ని ముద్దుపెట్టుకోవడం వీలు కాని పక్షంలో, దానికి సమానంగా వచ్చినప్పుడు, కేవలం చేతితో సైగ చేసి ‘అల్లాహు అక్బర్’ అంటే చాలు.

   
 5. శుభం కలుగుతుందని భావించి, నల్ల రాయిపై చేతులు రుద్దడం. ఇది ఒక కొత్త పోకడ. ఇస్లామీయ చట్టంలో దీనికి ఎలాంటి ఆధారం లేదు. వీలయితే నల్ల రాయిని తాకడం లేదా ముద్దుపెట్టుకోవడం మాత్రమే సున్నత్ ద్వారా నిరూపితమయింది. 
   
 6. కాబా నాలుగు మూలాలను తాకడం లేదా చేతులను రుద్దడం కూడా తప్పుడు చేష్ట. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కాబా లోని నల్ల రాయి మరియు యమని మూలను తప్ప ఇతర వేటిని తాకలేదు. 
   
 7. ప్రతి ప్రదక్షిణకు ఒక ప్రత్యేకమైన దుఆ చదవడం.  
   
 8. ఇతరుల స్వరం కంటే ఎక్కువ స్వరంలో మాట్లాడడం. దీని వల్ల తవాఫ్ చేసే ఇతర భక్తులకు గందరగోళం ఏర్పడుతుంది.
   
 9. మఖామె ఇబ్రాహీం వద్ద నమాజ్ చేయడానికి పోరాడడం. ఇలా చేయడం సున్నత్ కు విరుద్ధం మరియు ఇతరులకు హాని కలుగుతుంది. తవాఫ్ పూర్తి చేశాక మస్జిదె హరంలో ఎక్కడైనా రెండు రకాతులు నమాజ్ చేయవచ్చు.

 

వీడ్కోలు తవాఫ్ లో జరిగే తప్పిదాలు

షేక్ ముహమ్మద్ ఇబ్న్ ఉసైమిన్ (రహి) ఇలా అన్నారు: “అల్ సహీహా ద్వారా ధృవీకరించబడిన దానిలో ఇబ్న్ అబ్బాస్ (రజి) ఇలా అన్నారు: “భక్తులు మక్కాను వదలిపెట్టే ముందు, చివరగా చేయాల్సింది కాబా ప్రదక్షిణ. రుతుస్రావంలో ఉన్న స్త్రీలకు మినహాయింపు ఇవ్వబడింది.” (సహీహ్ బుఖారీ 1755; సహీహ్ ముస్లిం 1328). కావున హజ్ లో చేయాల్సిన ఆఖరి కార్యం తవాఫ్. [5]    

 

వీడ్కోలు తవాఫ్ చేసేటప్పుడు ప్రజలు చేసే తప్పిదాలు:

 1. కొందరు జమరాత్ పై రాళ్లు విసరక ముందు మక్కా వదులుతారు. అప్పుడే తవాఫ్ కూడా చేసేస్తారు. ఆ తరువాత మినా వెళ్లి జమరాత్ పై రాళ్లు విసురుతారు. ఇలా చేయడం తప్పు. ఇలా చేసినచో, వీడ్కోలు తవాఫ్ నెరవేరదు. ఎందుకంటే, హజ్ లో ఆఖరిగా చేసేది తవాఫ్, కాని ఇక్కడ ఆఖరిగా చేసింది జమరాత్ పై రాళ్లు విసరడం.   
   
 2. కొందరు వీడ్కోలు తవాఫ్ చేసేసి ఇంకా మక్కాలోనే ఉంటారు. ఇలా చేసినచో, వారి వీడ్కోలు తవాఫ్ చెల్లదు. అలాంటి వారు మక్కా వదిలే ముందు మరోసారి తవాఫ్ చేయాలి. కాని ఒకవేళ ఎవరైనా వీడ్కోలు తవాఫ్ చేశాక, ఏదైనా కొనడానికి లేదా తన సామాను సర్దుకోవడానికి మక్కాలో ఆగితే ఎలాంటి తప్పు లేదు.
   
 3. కొందరు వీడ్కోలు తవాఫ్ చేశాక, కాబా నుండి బయటకు వచ్చేటప్పుడు, వెనుకు అడుగులు వేస్తూ వస్తారు. కాబా వైపు తమ వీపును చేయకూడదని వారి భావన. కాని, ఇది ఒక కొత్త పోకడ(ఇస్లాంలో కొత్త విషయాన్ని సృష్టించడం). దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం లేదా ఆయన సహచరులు (సహాబా) ఇలా ఎన్నడు చేయలేదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ గృహాన్ని (కాబాను) చాలా గౌరవించేవారు. ఇలా చేయడం గౌరవ సూచకం అయినచో, ఆయన తప్పకుండా ఇలా చేసేవారు. వీడ్కోలు తవాఫ్ పూర్తి అయ్యాక, మస్జిదె హరాం నుండి బయటకు వెళ్ళేటప్పుడు, ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళాలి. ఇలా వెళ్ళడంలో వీపు కాబా వైపు అయినచో ఎలాంటి దోషం లేదు.   
   
 4. మరి కొందరు వీడ్కోలు తవాఫ్ తరువాత, మస్జిదె హరాం నుంచి బయట వచ్చినప్పుడు, మస్జిద్ ద్వారం వద్ద ఆగి, కాబా వైపు ముఖం చేసి, దుఆ (వేడుకోలు), సలాం చేస్తారు. ఇది కూడా బిదహ్ (ఇస్లాంలో కొత్త పోకడ). దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చేయలేదు. ఇలా చేయడం మంచిదై ఉంటే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం దీన్ని తప్పకుండా చేసి ఉండేవారు. [6]

 

వైజ్ఞానిక దృక్పధం

సృష్టిలోని ప్రతీది, చిన్న అణువు నుంచి పెద్ద పెద్ద నక్షత్ర లోకాల (galaxy) వరకు – అన్నీ తవాఫ్ (ప్రదక్షిణ- చుట్టూ తిరగడం) చేస్తున్నాయి. అణువులో ఎలక్ట్రోన్లు (electron) నూక్లియస్ (nucleus) చుట్టూ మెల్లగా తిరుగుతుంటాయి. ఇది మానవుని మనసులా ఉంటుంది. గాలక్సీలో (galaxy), బిలియన్ లలోని నక్షత్రాలు వేగంగా గాలక్సీ మధ్య తిరుగుతూ ఉంటాయి. అవి తమను సృష్టించిన సృష్టికర్తకు ఆరాధన చేస్తున్నట్లుగా చుట్టూ తిరుగుతూ ఉంటాయి.    

 

దీని గురించి ఖుర్ఆన్ లో ఇలా అనబడింది: చంద్రుణ్ణి పట్టుకోవటం  సూర్యుని తరంకాదు. పగటిని మించిపోవటం రాత్రి వల్ల కాదు. అవన్నీ (తమ తమ నిర్ధారిత)  కక్ష్యల్లో తేలియాడుతున్నాయి. (ఖుర్ఆన్ సూరా యాసీన్ 36:40). ఇలా అల్లాహ్ సృష్టించాడు. అలాగే అల్లాహ్ ముస్లింలకు తవాఫ్ చేయండని ఆజ్ఞాపించాడు. కావున, తవాఫ్ చేయడం కొత్త విషయం ఏమి కాదు.     

 

అపోహ: ముస్లింలు కాబాను ఆరాధిస్తారా?

ఇది ఒక పచ్చి అబద్ధం. ఒక ముస్లిం నమాజ్ చేయాలంటే, ఉత్తర దిశ వైపు చేయాలో, దక్షిణ దిశ వైపు చేయాలో, తూర్పు వైపు చేయాలో అనే సమంజసంలో పడిపోతాడు. అందుకే అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఆజ్ఞాపించాడు: (ఓప్రవక్తా!) నువ్వు నీ ముఖాన్ని మాటిమాటికీ ఆకాశం వైపుకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మేము,  నువ్వు ఇష్టపడే ఆ దిశ వైపుకే నిన్ను త్రిప్పుతున్నాము. కనుక నువ్వు నీ ముఖాన్ని మస్జిదె హరామ్‌ వైపుకు త్రిప్పుకో. మీరెక్కడున్నా సరే ఇక మీదట మీ ముఖాలను దాని వైపుకే త్రిప్పాలి. (ఖుర్ఆన్ సూరా బఖర 2:144)  

 

కాబా ముస్లింల ఖిబ్లా (దిశ), అంటే ముస్లింలు నమాజ్ చదవడానికి కాబా వైపు తిరుగుతారు. ముస్లింలు నమాజ్ చేయడానికి కాబా వైపు తిరిగినను, వారు కాబాను ఆరాధించరు అనేది ముఖ్యం. ముస్లింలు కేవలం అల్లాహ్ ముందే సాష్టాంగపడుతారు మరియు అల్లాహ్ నే ఆరాధిస్తారు.  

 

1.  ఇస్లాం ఐకమత్యాన్ని విశ్వసిస్తుంది

కాబాకు పడమరలో ఉన్న ముస్లింలు పశ్చిమ వైపు ముఖం చేస్తారు. అలాగే, కాబాకు పశ్చిమ వైపు ఉన్న వారు పడమరకు ముఖం చేస్తారు. దీని వల్ల ముస్లిం సమాజంలో ఐక్యత ఏర్పడుతుంది.

 

2.  ఉమర్ (రజి) హదీస్

హజ్రెఅస్వద్ (నల్ల రాయి) గురించి ఒక హదీస్ ఉంది. ఇది ఉమర్ (రజి) ఉల్లేఖించారు. ఆయన ఇలా అన్నారు: “నీవు ఒక రాయి మాత్రమే అని నాకు తెలుసు. నీవు నాకు లాభం గానీ, నష్టం గానీ చేకూర్చలేవు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నిన్ను తాకడం మరియు చుంబించడం, నేను గనక చూసి ఉండకపోతే, నిన్ను తాకడం గానీ, చుంబించడం గానీ చేసే వాణ్ణి కాదు.” (సహీహ్ బుఖారీ 2:675, 1597 (NE) & సహీహ్ ముస్లిం 1270)  

 

3.  ప్రజలు కాబాపై నిలబడి అజాన్ ఇచ్చేవారు

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కాలంలో ప్రజలు కాబాపై నిలబడి అజాన్ ఇచ్చేవారు. ఏ విగ్రహారాధకుడు, తాను పూజించే విగ్రహంపై ఎక్కి నిలబడతాడు? ఇది ఈ అపోహకు సరిఅయిన జవాబు.

 

విద్వాంసుల కోణం

షేక్ ఉల్ ఇస్లాం ఇబ్న్ తైమియా (రహి) ఇలా అన్నారు: ఆరాధనలన్ని కేవలం అల్లాహ్ కే చెందును. వేరితరులకు (మానవులు, ఇతర వస్తువులు) ఆరాధించడం సరి కాదు. సాష్టాంగపడడం అల్లాహ్ కే పరిమితం. ఒకవేళ అల్లాహ్, తాను తప్ప ఏదైనా ఇతర వస్తువు ముందు సాష్టాంగ పడమంటే, అల్లాహ్ కు విధేయత చూపుతూ మేము దాన్ని పాటిస్తాము. అల్లాహ్ సాష్టాంగ పడమని చెప్పలేదు, కావున మనము వేటి ముందూ సాష్టాంగపడకూడదు. ఆదం అలైహిస్సలాం ముందు సాష్టాంగపడమని అల్లాహ్ దైవదూతలకు అజ్ఞాపించాడు. ఇది కూడా ఆరాధనే, ఎందుకంటే ఇది అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించడం మరియు విధేయత చూపడం అవుతుంది. ఇది అల్లాహ్ కు దగ్గర చేస్తుంది మరియు ఆదం అలైహిస్సలాం ను గౌరవించినట్లు అవుతుంది. యూసుఫ్ అలైహిస్సలాంకు ఆయన సోదరులు సాష్టాంగపడడం ఆయనకు అభినందించడం వంటిది. (మజ్మూ అల్ ఫతావా 4/360, 361)    

 

ఇస్లాంలో తౌహీద్ మరియు విశ్వాసానికి పర్యాయం బహుదైవారాధన మరియు అవిశ్వాసం. ఇస్లాంలో కాబా చాలా పవిత్రమైన, ప్రముఖమైన స్థలం, కాని ముస్లింలు దాన్ని ఆరాధించరు. [7]

 

ఆధారాలు

[1] http://www.sunnipath.com/library/books/B0037P0018.aspx(ఇంగ్లీష్)

[2] http://www.hajinformation.com/main/f35.htm(ఇంగ్లీష్)

[3] http://islamqa.info/en/ref/106598(ఇంగ్లీష్)

[4] http://islamqa.info/en/ref/85368(ఇంగ్లీష్)

[5] http://www.islamweb.net/ehajj/printarticle.php?id=141919&lang=E(ఇంగ్లీష్)

[6] http://islamqa.info/en/ref/36823(ఇంగ్లీష్)

[7] http://islamqa.com/en/ref/82349/Tawaaf(ఇంగ్లీష్)

 

787 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్