జుల్ హిజ్జా మాసంజుల్ హిజ్జా మాసపు తొలి దశకంలో ఉపవాసం మరియు ఇతర సత్కార్యాల ఘనత
ఖుర్బానీ ఇచ్చేవరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను కొంచమైనా కత్తిరించుకోరాదు హజ్రత్ ఉమ్మె సల్మా (రజి అల్లాహు అన్హ) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈవిధంగా ప్రవచించారు :- ఖుర్బానీ కొరకు పశువు ఖుర్బానీ చేయదలుచుకునే వారు జుల్ హిజ్జా మాసపు నెలవంక కనిపించినప్పటి నుంచి ఖుర్బానీ ఇచ్చేవరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను కొంచమైనా కత్తిరించుకోరాదు.
సహీహ్ ముస్లిం 1708 [సహీహ్ ముస్లింలోని అజాహీ ప్రకరణం] 313 వ అధ్యాయం : ఖుర్బానీ చేయదలుచుకునే వారు జుల్ హిజ్జా మాసపు నెలవంక కనిపించినప్పటి నుంచి ఖుర్బానీ ఇచ్చేవరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను కొంచమైనా కత్తిరించుకోరాదు. హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
అరఫా రోజు పాటించబడే ఉపవాసం ఘనత హజ్రత్ అబూ ఖతాదా (రజి అల్లాహు అన్హు) కధనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అరఫా నాటి ఉపవాసం గురించి విచారించటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ, “అది క్రితం యేడు మరియు వచ్చేయేటి పాపాలన్నిటినీ (minor sins – చిన్న పాపాలు) తుడిచి పెట్టేస్తుంది” అని వివరించారు. సహీహ్ ముస్లిం 1251. [సహీహ్ ముస్లిం లోని ఉపవాసాల ప్రకరణం] జుల్ హిజ్జామాసపు తొమ్మిదో తేదీని ‘అరఫా రోజు’ అని పిలుస్తారు. ఆ రోజు హజ్ యాత్రికులందరూ అరఫాత్ మైదానంలో ఆగుతారు. కనుక ఆ రోజును ‘అరఫాత్ రోజు’ గా వ్యవహరిస్తారు. ఆ విధంగా అరఫాత్ మైదానంలో ఆగటమనేది హజ్ విధులన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది. దాన్ని నిర్వర్తించకపోతే హజ్ నెరవేరదు. హజ్ యాత్రికులు ఆ రోజున ప్రార్ధనలు, సంకీర్తనల్లో నిమగ్నులై ఉంటారు. ఆనాడు వారికి అదే గొప్ప ఆరాధనగా పరిగణించబడుతుంది. కనుక వారు ఆరోజు ఉపవాసం పాటించటం అభిలషణీయం కాదు. కాని హజ్ యాత్రలో పాల్గొనని వారికి మాత్రం ఆరోజు ఉపవాసం పాటిస్తే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. ఆ ఒక్క ఉపవాసం రెండేళ్ళ పాపాలను తుడిచి పెట్టేస్తుంది. 227 వ అధ్యాయం – అరఫా రోజు మరియు ముహర్రమ్ మాసపు తొమ్మిదో, పదో తేదీల్లో పాటించబడే ఉపవాసాల ఘనత హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లా అలై)
జుల్ హిజ్జా మాసపు తొలి దశకంలోఉపవాసం మరియు ఇతర సత్కార్యాల ఘనత హజ్ నెల ప్రారంభ మైనది, మొదటి పది రోజులు ఎంతో ముఖ్యమైనవి. ఈ పది రోజులలో చేసిన మంచి పనులకు అల్లాహ్ ఎంతో గొప్పపుణ్యం ప్రసాదిస్తాడు.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రజి అల్లాహు అన్హు) కధనం ప్రకారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:- జుల్ హిజ్జామాసపు తొలి పదిరోజుల్లో చేయబడిన సత్కార్యాల కన్నా ఇతర దినాల్లో చేసిన సత్కార్యాలేవీ దేవుని దృష్టిలో అత్యంత ప్రియమైనవి కావు. అది విని సహచరులు సందేహపడుతూ, “ధైవప్రవక్తా ! అల్లాహ్ మార్గంలో చేయబడే పోరాటం కూడా (దాని కన్నా ప్రియమైనది) కాదా ? అని అడిగారు. దానికి సమాధానమిస్తూ, “అల్లాహ్ మార్గంలో చేయబడిన పోరాటం కూడా (ప్రియమైనది) కాదు. ఒకవేళ ఎవరయినా ధనప్రాణాలు సమేతంగా బయలుదేరి వాటిలో ఏదీ తిరిగి రాకపోతే (అంటే దైవమార్గంలో వీరమరణం పొందితే మాత్రం నిశ్చయంగా అతను శ్రేష్టుడే)” అని చెప్పారు. బుఖారీ 1250 [సహీహ్ బుఖారీలోని పండుగ ప్రకరణం]
జుల్ హిజ్జామాసపు మొదటి పది రోజుల్లో హజ్ యాత్రికులు ప్రత్యేక ఆరాధనా కార్యకలాపాలు నిర్వర్తిస్తారు. కాని హజ్ చేయలేక పోతున్నవారు ఆ పుణ్యానికి నోచుకోలేరు. అందుకని అలాంటివారు తమ స్వంత ప్రదేశాల్లోనే ఉండి నఫీల్ ఉపవాసాలు ఇతర ఆరాధనా కార్యకలాపాలు చేసుకొని వీలైనంత ఎక్కువగా పుణ్యాన్ని సంపాదించుకోగలగాలన్నా ఉద్దేశ్యంతో జుల్ హిజ్జా మాసపు తొలి పది రోజుల్లో చేయబడే సత్కార్యాలు దేవునికి అత్యంత ప్రియమైనవని ప్రకటించడం జరిగింది. ఇస్లాం లో ‘జిహాద్’ కు చాలా ప్రాముఖ్యత ఉందన్న విషయం కూడా ఈ హదీసు ద్వారా బోధనపడుతున్నది. హదీసు కిరణాలు (RiyadusSaliheen) రెండవ సంపుటం సంకలనం: ఇమాం నవవి (రహిమతుల్లాహి అలైహి)
హజ్ లో – కాబా వీడ్కోలు ప్రదక్షిణ చేయడం తప్పనిసరి, అయితే రుతుమతికి (Menstruating woman) మినహాయింపు ఉంది హజ్రత్ ఆయిషా (రజి అల్లాహు అన్హ) కధనం :- నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో “దైవప్రవక్తా ! సఫియా బిన్తె హుయ్యి (రజి అల్లాహు అన్హు) బహిష్టు అయి ఉంది” అని తెలిపాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మనం ఆగిపోవడానికి ఈమె కారకురాలవుతుందేమో!” అని అన్నారు. ఆ తరువాత “ఆమె మీ అందరితో పాటు ఏదైనా ఒకసారి కాబా ప్రదక్షిణ చేయలేదా?” అని అడిగారు. “ఎందుకు చెయ్యలేదు, చేసింది (సందర్శనా ప్రదక్షిణ)” అన్నాను నేను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అయితే ఇక పరవాలేదు. మనం బయలుదేరవచ్చు” అని అన్నారు. సహీహ్ బుఖారీ 836 [సహీహ్ బుఖారీ : 6 వ ప్రకరణం - హైజ్, 27 వ అధ్యాయం - అల్ మర అతు తహీజు బాదల్ ఇఫాజా] హజ్ ప్రకరణం – 67 వ అధ్యాయం – వీడ్కోలు ప్రదక్షిణ చేయడం తప్పనిసరి, అయితే రుతుమతికి మినహాయింపు ఉంది. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
ఇతను ప్రళయదినాన లబ్బైక్ అంటూ లేస్తాడు హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రజి అల్లాహు అన్హు) కధనం :- ఒక వ్యక్తి అరఫా రోజు (Day of Arafah) వఖూఫ్ (లేచి ఉండు) స్థితిలో ఉండి హఠాత్తుగా ఒంటె మీద నుంచి జారిపడ్డాడు. అతని మెడ ఎముక విరగడంతో (అక్కడికక్కడే) చనిపోయాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అతని భౌతికకాయానికి రేగాకులు కలిపిన నీళ్ళతో స్నానం చేయించి రెండు వస్త్రాలతో చుట్టండి. శవానికి సువాసన పూయకండి. ముఖం (వస్త్రంతో) కప్పకుండా అలాగే బయట ఉంచండి. ఇతను ప్రళయదినాన లబ్బైక్ అంటూ లేస్తాడు” అని అన్నారు. సహీహ్ బుఖారీ 753 [సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం - జనాయేజ్, 20 వ అధ్యాయం - అల్ కఫని ఫి సౌబైన్] హజ్ ప్రకరణం : 14 వ ప్రకరణం – ఇహ్రాం స్థితిలో యాత్రికుడు చనిపోతే ఏం చేయాలి? మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
|
.