గుసల్ (ధర్మాదేశ పరమైన స్నానం)


గుసల్ అరబి పదం. పూర్తి శరీరాన్ని నీళ్ళతో కడగడాన్ని ఘుసల్ అంటారు.భార్యతో సంభోగం జరిపినప్పుడు, వీర్యస్కలనం అయినప్పుడు, స్త్రీల ఋతుస్రావం పూర్తిఅయినప్పుడు, బిడ్డను జన్మనిచ్చినప్పుడు, సహజమైన మరణం – వీటన్నిటి తరువాత ప్రతి (పెద్దవారైన స్త్రీ, పురుషులు) ముస్లిం పై గుసల్ తప్పనిసరి అవుతుంది.


 శుక్రవారపు నమాజ్ కు ముందు, రెండు ఈద్ (రమజాన్, బక్రీద్) నమాజులకు ముందు, హజ్ కు వెళ్ళేటప్పుడు ఇహ్రామ్ వేసుకునేముందు, ఇస్లాం స్వీకరించినప్పుడు – ఈ సమయాలన్నిటిలో గుసల్ చేయడం మంచిది(ముస్తహబ్). గుసల్ ను వుజూతో (నమాజ్ కు ముందు చేసేది) పోల్చకూడదు.[1][2]
 

విషయసూచిక

 

గుసల్ తప్పనిసరి అయ్యే పరిస్థితులు

ఈ మూడు పరిస్థితుల్లో గుసల్ తప్పనిసరి అవుతుంది :

 1. వీర్య స్కలనం జరిగిన సందర్భంలో(ఎటువంటి లైంగిక సంపర్కం లేకుండా కేవలం నిద్రలో  జరిగిన సరే). (సహీహ్ ముస్లిం 608)
   
 2. లైంగిక సంపర్కం జరిగిన సందర్భంలో, (ఇందులో వీర్య స్కలనం జరగకపోయినా సరే). (సహీహ్ బుఖారీ 291, సహీహ్ ముస్లిం 526)
   
 3. “మణి”(వీర్యం) బయటకు వచ్చినప్పుడు,( లైంగిక సంపర్కం ద్వారా గాని లేదా వీర్యస్కలనం ద్వారా గాని, ఎలాగైనా సరే). (సహీహ్ బుఖారీ vol 1:269)

 

ఖుర్ఆన్

ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు నమాజు కొరకు లేచి నప్పుడు మీ మొహాలను,  మోచేతులసమేతంగా మీ చేతులను కడుక్కోండి. మీ తలలనుమసహ్‌ చేయండి,చీలమండల వరకు మీ కాళ్ళను కడుక్కోండి. ఒకవేళ మీరు లైంగిక అశుద్ధావస్థకులోనవుతే స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి. ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణావస్థలో ఉంటే లేక మీలో ఎవరయినా కాలకృత్యాలు తీర్చుకుని వస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపిఉంటే – అట్టి పరిస్థితిలో నీరు లభ్యం కాకపోతే పరిశుభ్రమైనమట్టితో'తయమ్ముమ్‌'చేసుకోండి. దాన్ని మీ మొహాలపై చేతులపై తుడుచుకోండి.అల్లాహ్‌ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికీ గురి చేయదలచుకోడు. మీరు కృతజ్ఞులయ్యేందు కుమిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి,  మీపై తన అనుగ్రహాన్నిసంపూర్ణంగావించాలన్నదే ఆయన అభిలాష!(ఖుర్ఆన్,సూరా మాయిదా 5:6)


గుసల్లో రకాలు

గుసల్ లో మూడు రకాలు వున్నాయి.

 1. “వాజిబ్” (తప్పనిసరి),
   
 2. “సున్నత్”
   
 3. “ముస్తహబ్” (ఉతమమైనది).

 

1 –ఏ పరిస్థితిలో గుసల్ వాజిబ్” (తప్పనిసరి)అవుతుంది


(i) వీర్యం బయటకు వచ్చినప్పుడు, అది సంభోగము జరగకుండ అయినా సరే.

అబూ సయీద్ ఖుద్రీ రజిఅల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు: “నీళ్ళకు బదులు నీళ్ళు”. (అంటే వీర్య స్కలనం అయినప్పుడు గుసల్ (స్నానం) చేయాలి.) (సహీహ్ ముస్లిం 343)


(ii) రెండు మర్మాంగాలు (స్త్రీ, పురుషుని) కలిసి అంగ ప్రవేశం జరిగినప్పుడు, పురుషుని మర్మాంగం స్త్రీ మర్మాంగంలో ప్రవేశించినప్పుడు వీర్య స్కలనం జరగకపోయినా సరే.   

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు; “రెండుమర్మాంగాలు (స్త్రీ, పురుషుని) కలిసినప్పుడు, పురుషుని మర్మాంగం స్త్రీ మర్మాంగంలో ప్రవేశించినప్పుడు వీర్య స్కలనం జరగకపోయినాసరే, గుసల్(స్నానం) తప్పనిసరి అయిపోతుంది.” (సహీహ్ సునన్ అబీ దావూద్ 209)


(iii) ఋతుస్రావం మరియు “నిఫాస్” (ఋతుస్రావం అయిపోయాక కారే రక్తం) వలన.

వారు నిన్ను బహిష్టు గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు: అదొక అశుద్ధస్థితి. కనుక అశుద్ధావస్థలో వారికి ఎడంగా ఉండండి. వారు పరిశుద్ధులయ్యే వరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్ధత నొందినమీదట అల్లాహ్‌ అనుమతించిన స్థానం నుంచి మీరు వారితో సమాగమం జరుపవచ్చు. అల్లాహ్‌ పశ్చాత్తాప పడేవారిని  పారిశుద్ధ్యాన్ని అవలంబించే వారిని ఇష్టపడతాడు.(ఖుర్ఆన్, సూరా బఖర 2:222)


దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫాతిమా బిన్త్ హుబైష్ రజిఅల్లాహుఅన్హాతో ఇలా అన్నారు : “నీకు ఋతుస్రావం మొదలైనప్పుడు నమాజ్ చదవడం ఆపివేయి. అది పూర్తి అయ్యాక నమాజ్ చదవడం మొదలెట్టు.” (సహీహ్ అల్ బుఖారీ, ఫత్, 309)


2 – గుసల్ “వాజిబ్” (తప్పనిసరి) కాదు, కాని “ముస్తహబ్” (ఉత్తమమైనది),అటువంటి సందర్భాలు

(i) “ఇహ్రామ్” (హజ్ సమయంలో వేసుకునే దుస్తులు) కంటే ముందు గుసల్ చేయడం

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఇహ్రామ్” దుస్తులు ధరించే ముందు గుసల్ చేసేవారు. అత్తిర్మిజి (830) లో ఉంది. “తవాఫుజ్ జియారహ్” మరియు “తవాఫ్ అల్ వదా” (చివరి తవాఫ్)ల కోసం గుసల్ చేయడం “ముస్తహబ్” (ఉత్తమమైనది). ఇబ్న్ ఉమర్ మక్కాలో ప్రవేశించేటప్పుడు గుసల్ చేసేవారు.దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చేసే వారు అని ఆయన అన్నారు. సహీహ్ హుల్ బుఖారీ 1478, సహీహ్ హుల్ ముస్లిం 1259


(ii) మరణించిన వారికి గుసల్ చేయించడం (యుద్ధంలో “షహీద్” యిన అమరవీరునికి కాదు.)

అనేక మంది విద్వాంసుల ప్రకారం మరణించిన వ్యక్తికి గుసల్ చేయించడం తప్పనిసరి. ఎందుకంటే తన కూతురు మరణించినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడున్న  స్త్రీలతో ఇలా అన్నారు: “ఆమెను మూడు సార్లు లేదా ఐదు సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు నీళ్ళతో కడగండి.” సహీహ్హుల్ బుఖారీ 1253, సహీహ్ హుల్ ముస్లిం 939


(iii) మరణించిన వారిని స్నానం చేయించిన వాడు తరువాత గుసల్ చేయడం.

ఈ విషయం పై ఇస్లామీయ విద్వాంసుల మధ్య వివిధ అభిప్రాయాలున్నాయి. అబూ హురైరా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాఅన్నారు: “మరణించిన వ్యక్తిని స్నానం చేయించిన వాడు తరువాత గుసల్ చేయాలి.” ముస్నద్ అహ్మద్ 2/454, అబూ దావూద్ 3161, అత్ తిర్మిజి 993


(iv) శుక్రవారం రోజు గుసల్ చేయడం

ఎక్కువ శాతం మంది దీన్ని సున్నత్ అంటారు. కొందరు “వాజిబ్” (తప్పనిసరి)  అని కూడా అంటారు.


ఎవరికైతేచెమట ఎక్కువ వస్తుందో అలాంటి వారు శుక్రవారం గుసల్ చేయడం “వాజిబ్” (తప్పనిసరి). దేనికంటే దుర్వాసన వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది . ఇది చాలా నిజాయితీ గలవిషయం అని షేక్ ఉల్ ఇస్లాం ఇబ్న్ తైమియా ఫతావా అల్ కుబ్రా (5/307)లో చెప్పారు.


(v) అవిశ్వాసి ముస్లిం (విశ్వాసి) అయినప్పుడు

అబూ హురైరా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు:సుమామ బిన్ ఉస్సాల్ల్ రజిఅల్లాహుఅన్హు ముస్లిం (విశ్వాసి) అయినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఇతన్ని బాను తోటలో తీసుకెళ్ళి గుసల్ (స్నానం) చేయించండి.”


ఖైస్ ఇబ్న్ ఆసిం రజిఅల్లాహుఅన్హు ముస్లిం అయినప్పుడు నీళ్ళతో మరియు తామర ఆకులతో గుసల్(స్నానం) చేయి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. చాలా సందర్భాలలో కొత్త ముస్లిం పరిశుద్దిగా ఉండడు. అందువల్ల గుసల్ చేయడం మంచిది.(తిర్మిజి 605, అబూ దావూద్ 355)పురుషుల విషయంలో సున్తీ చేయించడం “వాజిబ్” (తప్పనిసరి). కాని దాన్ని కొన్ని రోజుల తరువాత చేయించినా పరవాలేదు.[3][4]


‘మణి’  ‘మజీ’ మరియు ‘వది’(ఇవి అరబీ పదాలు దీని విశ్లేషణ గ్రహించండి)

నీళ్ళ ఆకారంలో ఉండే దానిని ‘మజీ’అంటారు. ఇది తెలుపు రంగులో జిగేటుగా ఉంటుంది. ఇది లైంగిక చర్య కాకుండానే కేవలం అలాంటి ఆలోచనలతోనే విడుదలవుతుంది.ఇది బట్టలకు తగిలినచో కడుక్కోవలెను. దీనికి గుసల్ అవసరం లేదు.


స్త్రీలకు కూడా లైంగిక సంపర్కం ద్వారా ‘మణి’  (వీర్య స్కలనం) బయటకు వస్తుంది అప్పుడు గుసల్ తప్పనిసరి అవుతుంది. ఇది పసుపు పచ్చ రంగులో ఉంటుంది.


మూత్రమే కాకుండా మర్మాంగాల ద్వారా మూడు రకాల ద్రవాలు బయటకు వస్తాయి. అరబీ  పదాల ద్వారా వాటి విశ్లేషణను గ్రహించండి.

 

 1. “వది” (మూత్ర విసర్జన తరువాత వచ్చే తెల్లటి చిక్కటి ద్రవం).
   
 2. “మజి”(వీర్య స్కలనం కంటే ముందు బయటకు వచ్చే కొద్దిపాటి ద్రవం)
   
 3. “మణి”( వీర్యం)

 
“వది”లేదా “మజి”(కారినచో గుసల్ చేసే అవసరం లేదు. పరిశుద్దులవటానికి మర్మాంగాలను, ఇంకా బట్టలపై  తగులుకుంటే తగిలినచోటను,మరియు శరీరానికి తగిలితే ఆచోటను కడుక్కుంటే చాలు. ఆ తరువాత వుజూ చేసి నమాజ్ చేయవచ్చు.


“మణి”( వీర్యం) కారిన పక్షంలో గుసల్ చేయడం తప్పనిసరి అవుతుంది.[5]


స్త్రీలకు కూడా పురుషుల్లాగానే స్కలనం అవుతుంది

ఉమ్మె సులైం రజిఅల్లాహుఅన్హా ఉల్లేఖించారు: ఉమ్మె సులైం రజిఅల్లాహుఅన్హా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో స్త్రీల కలల (పురుషులకు వచ్చే తడి కలలు) గురించి అడిగారు.దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘స్త్రీకి ఒకవేళ తడి కల వచ్చినచో ఆమె కూడ గుసల్ చేయాలి.’ ఉమ్మె సులైం రజిఅల్లాహుఅన్హా ఇలా అన్నారు: ‘నేను సిగ్గుపడుతూ ఇలా అడిగాను, “ఆడవాళ్ళకు కూడ ద్రవం పడుతుందా?”. దీనికి జవాబుగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘ఔను, (పడుతుంది), లేకుంటే(పిల్లవాడు) తల్లిని ఎలా పోలి ఉంటాడు? పురుషులకు విడుదలయ్యే ద్రవం చ్కిక్కగా, తెలుపు రంగులో ఉంటుంది. అదే స్త్రీలకు విడుదలయ్యే ద్రవం పలచగా, పసుపు పచ్చ రంగులో ఉంటుంది; (స్త్రీ, పురుషులలో) ఎవరిజన్యువులు ఎక్కువగా ఉంటాయో వారి పోలికలు (పిల్లలకు) ఉంటాయి.’ (సహీహ్ హుల్ ముస్లిం 608)


పైన ధృవీకరించిన హదీసు ద్వారా తెలిసేదేమిటంటే, స్త్రీలకు కూడా లైంగిక సంపర్కం తరువాత వీర్య స్కలనం జరుగుతుంది.


పురుషునికి మరియు స్త్రీకి విడుదలయ్యే వీర్యంలో వ్యత్యాసం ఉంది. పురుషుని వీర్యం తెల్లగా, చిక్కగా ఉంటుంది. స్త్రీ వీర్యం పసుపు పచ్చగా, పలచగా ఉంటుంది.


ఉమ్మ్ సల్మారజిఅల్లాహుఅన్హా ఉల్లేఖించారు : దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు : “పురుషుని వీర్యం చిక్కగా తెలుపు రంగులో ఉంటుంది. స్త్రీల వీర్యం పలచగా పసుపు పచ్చగా ఉంటుంది.” (సహీహ్ హుల్ ముస్లిం 311)[6]


గుసల్ చేసే పద్ధతి

గుసల్ చేసే పద్ధతి : పురుషులు, స్త్రీలు

 1. మనసులో సంకల్పం చేసుకోవాలి, నోటితో పలికే అవసరం లేదు.
   
 2. బిస్మిల్లాహ్ పలుకుతూ కుడి చేయిని మణికట్టు వరకు కడగాలి. వేళ్ళ మధ్యలో బాగా కడగాలి. ఇలా చేతి ఏ భాగం కూడా పొడిగా ఉండకుండా చూసుకోవాలి.
   
 3. మర్మాంగాన్ని బాగా కడుక్కోవాలి.
   
 4. పూర్తి వుజూ (నమాజు కోసం చేసినట్లు) చేయాలి  – దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ పాదాలను గుసల్ అయిపోయాక కడిగేవారు. మరియు తలపై మూడు సార్లు నీళ్ళు వేసుకొనేవారు .“మసహ్” చేసేవారు.) 
   
 5. ఆ తరువాత మూడు సార్లు కుడి భుజంపై, మూడు సార్లు ఎడమ భుజంపై నీళ్ళు వేసుకోవాలి.
   
 6. ఇప్పుడు పూర్తి శరీరంపై నీళ్ళు వేసుకొని బాగా కడుక్కోవాలి.
   
 7. గుసల్ చేసిన ప్రదేశం నుంచి కాస్త జరిగి కుడి కాలును ఎడమ కాలును చీలమండలం వరకు కడుక్కోవాలి.

 

శరీరపు భాగాలన్నిటినీ చేతితో బాగా రుద్దాలి. శరీరం మొత్తం నీళ్ళతో తడిసిపోవాలి. ఏ భాగం కూడా పొడిగా ఉండకూడదు.

 

స్త్రీకైనా పురుషునికైనాతలపై ఉన్న వెంట్రుకలన్నీ తడవాలి. ఒక్క వెంట్రుక పొడిగా ఉన్నా గుసల్ అవదు.

 

“జనాబత్”

“జనాబత్” అంటే అపరిశుద్ధావస్థ. ఇది వీర్య స్కలనం అయినచో లేదా సంభోగము అయినచో ఏర్పడుతుంది. ఎవరిపైనైతే గుసల్ “జనాబత్” తప్పనిసరి అవుతుందో వారిని అరబీ భాషలో “జునుబ్” అంటారు. ఖుర్ఆన్ లో ఇలా ఉంది:


విశ్వసించిన ప్రజలారా! మీరు (తాగిన) మత్తులో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు కూడా పోకండి. మీరు పలికేదేమిటో మీకు అర్థంకాగలిగినప్పుడే(నమాజుచెయ్యాలి). లైంగికఅశుద్ధావస్థలోకూడా –

స్నానంచేయనంతవరకూ–నమాజుచేయరాదు. (మస్జిదు) దారి గుండాసాగిపోయేటి పరిస్థితి అయితే అది వేరే విషయం! ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరయినా మలమూత్ర విసర్జన చేసి వస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే–అట్టి స్థితిలో మీకు నీరు లభ్యంకాని పక్షంలో పరిశుభ్రమైన మట్టి(నిఉపయోగించే) సంకల్పంచేసుకోండి. (దాంతో) మీ ముఖాలను చేతులను తుడుచుకోండి. నిశ్చయంగా అల్లాహ్‌ మన్నించేవాడు క్షమాభిక్ష పెట్టేవాడు.(ఖుర్ఆన్, సూరా నిసా 4:43)


ఓ విశ్వసించిన వారులారా! మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ మొహాలను  మోచేతులసమేతంగా మీ చేతులను కడుక్కోండి. మీ తలలను మసహ్‌ చేయండి.చీలమండల వరకు మీ కాళ్ళను కడుక్కోండి. ఒకవేళ మీరు లైంగిక అశుద్ధావస్థకులోనవుతే స్నానం చేసి పరిశుద్ధులుఅవ్వండి. ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణావస్థలో ఉంటే లేక మీలో ఎవరయినా కాలకృత్యాలు తీర్చుకుని వస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే – అట్టి పరిస్థితిలో–నీరులభ్యంకాకపోతే పరిశుభ్రమైన మట్టితో “తయమ్ముమ్‌” చేసుకోండి. దాన్నిమీమొహాలపై చేతులపై తుడుచుకోండి.అల్లాహ్‌ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికీ గురి చేయదలచుకోడు. మీరు కృతజ్ఞులయ్యేందుకు మిమ్మల్నిపరిశుద్ధులుగా చేసి  మీపై తన అనుగ్రహాన్ని సంపూర్ణంగావించాలన్నదే ఆయన అభిలాష! (ఖుర్ఆన్, సూరా మాయిదా 5;6)


“గుసల్ జనాబత్” కారణాలు

“జనాబత్” కు రెండు కారణాలున్నాయి:

1.    “మణి”( వీర్యం) కారడం.ఇది నిద్రలో కావచ్చు, మెలకువగా ఉన్నప్పుడు కావచ్చు, కొంచెం కావచ్చు, ఎక్కువ కావచ్చు, కావాలని కావచ్చు, అనుకోకుండా కావచ్చు, చట్టబద్ధంగా కావచ్చు, చట్టవిరుద్దం (హస్త ప్రయోగం)గా కావచ్చు. ఇలాంటి సందర్భాలన్నింటిలో గుసల్ “జనాబత్” వాజిబ్ (తప్పనిసరి) అవుతుంది.


పురుషునికి ఏదైనా ద్రవం బయటకు వచ్చినప్పుడు అది వీర్యమో కాదో తెలుసుకోవడానికి మూడు చిహ్నాలున్నాయి: (1)కోరికతోవచ్చే ద్రవం; (2)స్పుర్తింగ్(spurting) విడుదల(3) విడుదల తరువాత హాయిగా అనిపించడం. ఈ మూడు చిహ్నాలు ఉన్నచో అది వీర్యమే, కానిచో అది వీర్యం కాదు.  


 స్త్రీలకు ద్రవం విడుదలైనప్పుడు కోరికతో వచ్చినా లేదా విడుదల తరువాత హాయిగా అనిపించినా గుసల్ తప్పనిసరి అయిపోతుంది. ఆలా కాని పక్షంలో అది ‘నజిస్’ (అపరిశుద్ధం) అవుతుంది. కావున గుసల్ తప్పనిసరి అవ్వదు.


2.లైంగిక సంపర్కం.  అది చట్టబద్ధంగా జరిగినా, చట్ట విరుద్ధంగా జరిగినా, వీర్య స్కలనం అయినా, కాకపోయినా ఎలాంటితేడా ఉండదు. గుసల్ జనాబత్ కోసం పూర్తి తృప్తి, కోరికతో సంభోగం జరగాల్సిన అవసరం లేదు. లైంగిక సంపర్కం జరిగితే చాలు, స్త్రీ పురుషులిద్దరిపై ‘గుసల్ జనాబత్’ “వాజిబ్” (తప్పనిసరి) అయిపోతుంది.


“ఇస్తిహాజా”

స్త్రీల మర్మాంగం ద్వారా ప్రవహించే ఒక రకమైన రక్తాన్ని “ఇస్తిహాజా” అంటారు. అలాంటి స్థితిలో ఉన్న స్త్రీని “ముస్తహాజా” అంటారు. సాధారణంగా “ఇస్తిహాజా” రక్తం పసుపు పచ్చ రంగులో చల్లగా ఉంటుంది. ఇది ఎలాంటి చప్పుడు చికాకు లేకుండా బయటకు వస్తుంది మరియు చిక్కగా ఉండదు. కాని కొన్ని సందర్భాలలో ఇది ఎర్రగా ఉంటుంది. వేడిగా ఉంటుంది. చిక్కగా ఉంటుంది మరియు నొప్పితో చికాకుతో బయటకు వస్తుంది.


“ఇస్తిహాజా”లో మూడు రకాలున్నాయి:

I. కొద్దిగా రక్తం (ఖలీల)

బట్టపై, పాడ్ పై (స్త్రీ తన మర్మాంగంపై పెట్టుకునేది)రక్తం కనిపించి, అది వ్యాప్తి చెందకపోతే ఈ “ఇస్తిహాజా”ని ఖలీల అంటారు. (ఈ పరిస్థితిలో ఆమె ప్రతి నమాజుకు ప్రత్యేకంగా వుజూ చేయాలి.)


II. మధ్య రకం రక్తం (ముతవస్సిత)

లోపల ఉన్న బట్ట(పాడ్)పై కొంచెం రక్తం వ్యాప్తి చెంది, బయట ఉన్న బట్టపై వ్యాపించకపోతే ఈ రకమైన ఇస్తిహాజాను ముతవస్సిత అంటారు. (ఈ పరిస్థితిలో స్త్రీముందుజాగ్రత్తగా రోజుకు ఒకసారి గుసల్ చేసి నమాజులు చదవవచ్చు.)


III. ఎక్కువ రక్తం (కసీర)

లోపలి బట్ట, పాడ్ పై రక్తం పూర్తిగా వ్యాపించి బయటి బట్టను తడిపితే – ఈ ఇస్తిహాజాను కథిర అంటారు.(ఈ పరిస్థితిలో స్త్రీ ఫజ్ర్ నమాజ్ కోసం ఒకసారి గుసల్ చేయాలి. జుహర్ మరియు అసర్ నమాజ్ కోసం ఓ సారి గుసల్ చేయాలి. మఘ్రిబ్ మరియు ఇషా నమాజ్ కోసం మరోసారి గుసల్ చేయాలి. ఈ విధంగా మూడు సార్లు గుసల్ చేయాలి. కాని జుహర్, అసర్ మధ్యలో ఎక్కువ సమయం తీసుకోకూడదు. తీసుకున్నచో అసర్ నమాజు కోసం వేరే గుసల్ చేయాల్సి వస్తుంది. మఘ్రిబ్, ఇషా నమాజ్ ల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది.)  

 

గుసల్ లో చేయవలసిన పనులు

పైన పేర్కొన్న విషయాలు గుసల్ లో “వాజిబ్” (తప్పనిసరి) అయినవి.ఇప్పుడు క్రింద ఇవ్వబడే విషయాలు గుసల్ లో “ముస్తహబ్” ఉత్తమమైనవి, ఇవి ఐదు:

 1. గుసల్ కు ముందు చేతులను అరచేతుల వరకు మూడు సార్లు కడగడం.
   
 2. మూడుసార్లు పుక్కిలించడం.
   
 3. పూర్తి శరీరంపై చేతులను రుద్ది అవయవాలన్నీ బాగా కడగబడేలా చూడడం.
   
 4. తల వెంట్రుకలపై చేతి వ్రేళ్ళతో బాగా రుద్ది, వెంట్రుకలన్నీ తడసిపోయేలా చూసుకోవడం.
   
 5. (పురుషులకు మాత్రమే) గుసల్ జనాబత్ కు ముందు ‘ఇస్తిన్జా’ (మూత్రవిసర్జన) చేయాలి. దీని వల్ల లాభం: గుసల్ అయిపోయాక మర్మాంగం ద్వారా కొన్ని చుక్కలు రాలినచో, ఇది మూత్రమో లేక వీర్యమో అనే సందేహం వస్తుంది. అలాంటప్పుడు అతడు మరోసారి గుసల్ చేయాలా? ఇలాంటి పరిస్థితిలో అతను గుసల్ కు ముందు ‘ఇస్తిన్జా’ (మూత్రవిసర్జన) చేసిఉన్నచో ఇది మూత్రం అని భావించి, గుసల్ చేయకుండా కేవలం వుజూ చేసి నమాజ్ చదవవచ్చు. గుసల్ కు ముందు ‘ఇస్తిన్జా’ చేయని పక్షంలో ఇది వీర్యం అనే భావనతో మరోసారి గుసల్ చేయవలసి వస్తుంది.[7][8]

 

ఆధారాలు

[1] http://www.islamweb.net/emainpage/index.php?page=articles&id=92746, (ఇంగ్లీష్)
[2] http://www.islambasics.com/view.php?bkID=68&chapter=4 (ఇంగ్లీష్)
[3] http://www.fatwaislam.com/fis/index.cfm?scn=fd&ID=839 (ఇంగ్లీష్)
[4] http://islamqa.info/en/ref/81949/Ghusl (ఇంగ్లీష్)
[5] http://www.islamhelpline.com/node/6221 (ఇంగ్లీష్)
[6] http://islamqa.info/en/ref/2458 (ఇంగ్లీష్)
[7] http://www.islamunveiled.org/eng/ebooks/ksala/ksala_ghusl.htm (ఇంగ్లీష్)
[8] http://www.islambasics.com/view.php?bkID=68&chapter=4 (ఇంగ్లీష్)
 
 

917 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్