కపటుడి చిహ్నాలు


ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు “కపటుడి చిహ్నాలు మూడు”, 1) ఎప్పుడు మాట్లాడినా – అబధ్ధం పలుకుతాడు. 2) మరియు ఎప్పుడు వాగ్దానం చేసినా – దానిని పూర్తి చేయడు. 3) మరియు ఏ వస్తువునైతే అతని దగ్గర నమ్మకంగా ఉంచుతారో – దానిని అతడు నిజాయితిగా తిరిగి ఇవ్వడు. సహీ బుఖారి హదీస్ గ్రంధం.

 

విషయసూచిక

 

హదీస్ వివరణ

కపటత్వానికి చేర్చే వివిధ విషయాల గురించి ఇస్లాం ధర్మం తీవ్రంగా హెచ్చరిస్తున్నది. చూడటానికి చిన్న చిన్నవిగా కనబడినా అవి కపటత్వం దగ్గరికి చేర్చుతాయి. ఇక్కడ సఅలబ  బిన్ హాతిబ్ అల్ అన్సారీ యొక్క వృత్తాంతాన్ని ఒక మంచి ఉదాహరణగా వివరించటం జరిగినది. దివ్యఖుర్ఆన్ లోని సూరా అత్తౌబా అధ్యాయంలో 77వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు


“వారు అల్లాహ్ యెడల చేసిన ఈ ప్రమాణభంగం కారణంగా, వారు చెబుతూ వచ్చిన అబద్ధాల కారణంగా, అల్లాహ్ వారి హృదయాలలో కాపట్యాన్ని నాటాడు. అది ఆయన సమక్షంలో హాజరయ్యే వరకు వారిని వెంటాడటం మానదు.”    సూరా అత్ తౌబా 9:77

 

ఉల్లేఖకుని పరిచయం

అబు హురైరా రజి యల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీ సంవత్సరంలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీస్ లను జ్ఞాపకం ఉంచిన సహచరులలో (సహాబాలలో) ఒకరు.

 

ఈ హదీస్ యొక్క ప్రయోజనాలు (లాభాలు)

  1. అబద్ధం చెప్పటం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోక పోవటం, నిజాయితీని పాటించక పోవటం వంటి చెడు అలవాట్లతో, చెడు లక్షణాలతో ఎల్లప్పుడూ యుద్ధం చేస్తుండమని ఇస్లాం ధర్మం నిర్దేశిస్తున్నది.
     
  2. కపటత్వం నుండి మనం కాపాడుకోవటానికి ప్రయత్నించ వలెను. ఎందుకంటే అల్లాహ్ దగ్గర ఇది షిర్క్ అంటే ఏకదైవత్వ భాగస్వామ్యం లేదా బహుదైవారాధన కంటే ఘోరమైన పాపం.
     
  3. కపటత్వపు చిహ్నాల నుండి దేనినైనా సరే ఎట్టి పరిస్థితిలోను అలవర్చుకోకూడదు.
     
  4. ఎవరైతే కపటత్వపు లక్షణాలను అలవర్చుకున్నారో వారు, అల్లాహ్ దృష్టిలో  మరియు ఇతరుల దృష్టిలో చాలా హీనంగా దిగజారిపోతారు.
     
  5. మాట్లాడేటప్పుడు సత్యం పలకటం, ఇచ్చిన మాటను తప్పక పోవటం, నిజాయితీ తన దగ్గర ఉంచిన వస్తువులను వాటి యజమానికి సరిగ్గా తిరిగి ఇవ్వటం వంటి మంచి అలవాట్లు దైవవిశ్వాసుల చిహ్నాలలో కనబడతాయి.

 

ఆధారాలు

http://teluguislam.net/2010/10/28/characterstics-of-hypocrite-telugu-islam/
 

 

315 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్