ఇస్లాం దృష్టిలో సమాధి పూజ


దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్రైస్తవుల్లో చొరబడిన షిర్క్ గురించి చెబుతూ ఇలా అన్నారు: “వారు తమలోని పుణ్యపురుషులు చనిపోయిన తరువాత వారి సమాధులపై  ప్రార్ధనాలయాలు కట్టి వివిధ భంగిమల్లో వారి ఫోటోలు తగిలించేవారు. అలాంటి వారు అల్లాహ్ దృష్టిలో ప్రజల్లోకెల్లా అత్యంత నీచమైన వాళ్ళు.” ముత్తఫఖున్ అలై

 

సమాధుల వైపు తిరిగి నమాజు చేయడం కూడా దీనిలోకే వస్తుంది.  దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి ఇలా చెప్పారు: “సమాధులపై ‘ముజావర్ ‘గా కూర్చోకండి. మరి వాటి వైపు తిరిగి నమాజు చేయకండి.” ముస్లిం

 

సమాధుల వైపు నిలబడి నమాజు చేయడం నిషిద్ధమైతే సమాధులపై నమాజు చేయడం ఇంకా తీవ్రమైన నిషిద్ధం.

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసులు సమాధులను ‘మస్జిద్’గా చేయడాన్ని ఖండిస్తున్నాయి. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మరణానికి 5 రోజుల ముందు వీటి గురించి చాలా గట్టిగా తాకీదు చేశారు.

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని ఈ చర్యల నుండి రక్షించాలని పలు విధాల ఉదాహరణలతో చెప్పారు.

1) యూదులు, క్రైస్తవులను శపించటం,

2) వారి వినాశనం కోసం దుఆ,

3) దేవుని సృష్టిలో వారిని పరమ నీచులుగా ఖరారు చేయడం,

4) జాగ్రత్త ! సమాధులను ప్రార్ధనాలయాలుగా చేసుకోకండి అని చెప్పడం.

 

విషయసూచిక

 

ఖుర్ఆన్ వెలుగులో


అల్లాహ్ ను వదలి ప్రళయదినం వరకూ తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొర పెట్టుకునే వానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు?  సూరా అల్ ఆహ్ ఖాఫ్ :46 : 5

 

ముస్లింలలో అధికుల ధోరణి


బాధాకరమైన విషయం ఏమిటంటే ముస్లింలలో కొందరు  దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించిన విషవలయంలోనే ఇరుక్కున్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించిన పని చేసి షిర్కె అక్బర్ లో పడిపోయారు. సమాధులపై మస్జిద్ లు, దర్గాలు నిర్మించి వారి పేరున బలిదానాలు, దుఆలు, మొక్కుబడులు చెల్లిస్తున్నారు. తల నీలాలు సమర్పిస్తున్నారు. మరి వీరు దైవ దృష్టిలో ఎలాంటి వారుగా పరిగణించబడతారో?

 

ఇమాం ఇబ్న్ ఖయ్యిం రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు : ఎవరైనా ఒకవైపు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం మరియు సహాబాల విధానం, రెండో వైపు ప్రస్తుత ముస్లింలు చేసే నిర్వాకాన్ని చూస్తే వారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సంప్రదాయానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారన్న నిజం గ్రహిస్తారు. ఎందుకంటే –

 

1)   దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధుల వైపు తిరిగి నమాజు చేయకూడదని తాకీదు చేశారు. కాని వారు సమాధుల వైపు తిరిగి నమాజు చేస్తున్నారు.

 

2) దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధులపై మస్జిద్ నిర్మాణం నిషేధించారు. కాని వారు సమాధులపై మస్జిద్ లు, దర్గాలు నిర్మిస్తున్నారు.

 

3) దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధులపై దీపాలు వెలిగించకూడదన్నారు. కాని వారు దీపాలు వెలిగిస్తున్నారు.

 

4) దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధుల దగ్గర జాతర, ఉరుస్ చేయకూడదన్నారు. కాని వారు సమాధుల దగ్గర జాతర, ఉరుసులు, ప్రార్ధనలు చేస్తున్నారు.

 

5)  దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధులను ఎత్తుగా చేయకూడదని, వాటిపై ఇల్లు వగైరా కట్టకూడదన్నారు. కాని వారు మాత్రం సమాధులను ఎత్తుగా కట్టి గుంబద్ లు నిర్మిస్తున్నారు.

 

సమాధుల సందర్శనలోని ముఖ్య ఉద్దేశ్యం


హజ్రత్ బురైదా రజి అల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓ సారి ప్రజలతో ఇలా అన్నారు : ఇంతకు ముందు నేను మిమ్మల్ని సమాధులను సందర్శించవద్దని వారించేవాణ్ణి. కాని ఇప్పుడు చెబుతున్నాను, మీరు సమాధులను సందర్శించండి. ముస్లిం

 

తిర్మిజిలో ఈ వాక్యం అదనంగా ఉంది: “సమాధుల సందర్శనం పరలోకాన్ని జ్ఞప్తికి తెస్తుంది. మరో చోట ఇలా ఉంది : “ఈ సందర్శన ప్రాపంచిక వ్యామోహాన్ని తగ్గిస్తుంది.”

 

ఇస్లాం ఆవిర్భవించిన తొలినాళ్ళలో  దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరులను సమాధుల్ని సందర్శించవద్దని చెప్పారు. అనుచరులు కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారవటం చేత సమాధుల్ని సందర్శించినప్పుడు అజ్ఞానకాలపు భావోద్రేకాలకు లోనై షరీయతుకు విరుద్ధమైన పనులు చేస్తారేమోనని ఆయన ఆందోళన చెందేవారు. అయితే తర్వాతి కాలంలో వారు ఇస్లామీయ సూత్రాల్ని బాగా ఆకళింపు చేసుకొని నికార్సయిన ముస్లింలుగా పరిణతి చెందిన తర్వాత ఆయనకు ఆ భయం పోయింది. అప్పుడాయన తన అనుచరులు సమాధుల్ని సందర్శించేందుకు అనుమతినిచ్చారు. పైగా తరచూ ‘సందర్శిస్తూ ఉండాల’ని తాకీదు చేశారు. తాము ఏదో ఒకనాడు మరణించేవారమేనన్న భావన ప్రజల మనోమస్తిష్కాలలో  మెదులుతూ ఉండాలన్నదే ఆయన ప్రవచనంలోని అసలుద్దేశ్యం. అంతేగాని సమాధుల వద్ద ఉరుసుల పేరుతొ తమాషా చేయడానికి, మొక్కుకోవడానికి కాదు. ఈ రకమైన చేష్టలకు షరీఅత్ లో ఏ మాత్రం చోటు లేదు.   

   

ఆధారాలు


wwwwww.teluguislam.net

   

608 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్