అల్లాహ్ పై  విశ్వాసం


అల్లాహ్ ఔన్నత్యాన్ని తెలిపే మూడు అంశాలు –

  • అల్లాహ్ అధికారాల్లో ఏకత్వం

 

ప్రతి ముస్లిం అల్లాహ్ ఒక్కడే అని, ఈ సృష్టిలో ఆయన భాగస్వాములు ఎవ్వరూ లేరని, ఆయన  పేర్లు మరియు లక్షణాల్లో ఎవ్వరూ సాటిలేరని విశ్వసిస్తాడు. అల్లాహ్ ఒక్కడే పూజించదగినవాడు అని తన చేష్టల ద్వారా చాటుతాడు.

 

విషయసూచిక

 

అల్లాహ్ పై ఈమాన్ నిర్వచనం

అల్లాహ్ పై విశ్వాసం’ అంటే- అల్లాహ్ ఉనికిని, అల్లాహ్ దైవత్వాన్ని,అల్లాహ్ శుభనామాలను మరియు అల్లాహ్ దివ్య లక్షణాలను దృఢంగా విశ్వసించడం.

 

అల్లాహ్ పై ఈమాన్ షరతులు

అల్లాహ్ పై విశ్వాసంలో నాలుగు విషయాలు ఇమిడి ఉన్నాయి. ఎవరైతే వీటిని విశ్వసిస్తారో, వారు నిజమైన విశ్వాసులు.

 

1. అల్లాహ్ ఉనికిని విశ్వసించడం

అల్లాహ్ ఉనికి’ హేతుబద్ధంగా, మానవ స్వభావసిద్ధంగా ధృవీకరించబడిన ఒక వాస్తవ విషయం.అల్లాహ్ ఉనికి గురించి షరిఅహ్ లో తెలుపబడిన అనేక వాస్తవాలు క్రింద తెలుపబడ్డాయి.

 

           i.            అల్లాహ్ ఉనికిని నిరూపించే మానవ స్వాభావిక ఋజువు:

తన సృష్టికర్తను విశ్వసించే స్వాభావిక విశ్వాసంతో ప్రతి మానవుడు సృష్టించబడతాడు. దీని గురించి అతడు ముందుగా ఆలోచించవలసిన అవసరంగాని లేక నేర్చుకోవలసిన అవసరంగాని లేదు. మార్గభ్రష్టత్వంలో పడిపోయిన వారు తప్ప, మరెవ్వరూ ఈ సహజసిద్ధమైన దైవవిశ్వాసం నుండి మరలిపోరు. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: “ఫిత్రా (మానవుడి స్వాభావిక ఏకదైవ విశ్వాస) స్థితిలో కాకుండా ఏ బిడ్డా జన్మించడు. అయితే అతని తల్లిదండ్రులు అతడిని యూదుడిగానో, క్రైస్తవుడిగానో లేక అగ్నిపూజారిగానో మార్చి వేస్తారు.”  [సహీహ్ బుఖారీ హాదీస్ నం: 4775, సహీహ్ ముస్లిం హాదీస్ నం: 2658.]

 

         ii.            అల్లాహ్ ఉనికిని నిరూపించే హేతుబద్ధమైన ఋజువు:

భూత, భవిష్య వర్తమాన కాలాలలోని ఈ సృష్టి తనను ఉనికిలోనికి తీసుకు వచ్చిన ఒక సృష్టికర్తను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే సృష్టి తనకు తాను సృష్టించుకోలేదు లేదా ఏదైనా హఠాత్పరిమాణం, స్వయాన ఉనికిలో రాజాలదు.

 

సృష్టి తనకు తానుగా ఉనికిలోనికి రావటం అసాధ్యం. ఎందుకంటే ఏదైనా వస్తువు తనను తాను సృష్టించుకోలేదు: ఉనికి లోనికి రాక ముందు, అది సృష్టించబడనే లేదు. కాబట్టి, అదెలా తనను తాను సృష్టించుకోగలదు? అలాగే, ఏదైనా హఠాత్పరిమాణం వలన ఉనికిలోనికి రావడం కూడా అసంభవమైనదే. ఎందుకంటే, ఏది సంభవించినా దానికొక కారణముంటుంది. అంతేగాక, ఈ సృష్టి అత్యాద్భుతమైనదిగా, అత్యంత ఖచ్చితమైన విధంగా సృష్టించబడింది, ఇతర సృష్టితాల మధ్య ప్రతిదీ పొందికగా అమర్చబడింది. కారణానికి మరియు పర్యవసనానికి మధ్య దృఢమైన సంబంధం ఉంది. ఇవన్నీ నిరూపిస్తున్నది ఏమిటంటే ఈ సృష్టి ఏదో ఒక హఠాత్పరిమాణం వలన ఉనికిలోనికి రాలేదు. ఎందుకంటే ఏదైనా హఠాత్తుగా జరిగితే, దాని పర్యవసానం ఇంత ఖచ్ఛితంగా మరియు ఇంత పరిపూర్ణంగా ఉండదు. కాబట్టి ఇది అంత ఖచ్చితమైన సమతుల్యంలో ఎలా మిగిలి ఉంది?

 

సృష్టి తనకు తానుగా సృష్టించుకోవడం లేక ఏదైనా హఠాత్పరిమాణం వలన ఉనికి లోనికి రావడం జరగనట్లయితే, వీటిని ఉనికిలోనికి తీసుకు వచ్చిన ఒక సృష్టికర్త తప్పకుండా ఉండి తీరాలి. ఆయనే అల్లాహ్ – సకల లోకాల ప్రభువు.

 

అల్లాహ్ ఈ హేతుబద్ధమైన సాక్ష్యాన్ని మరియు తిరుగులేని ఋజువును సూరా అత్ తూర్ లో పేర్కొన్నాడు (ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం): “ఎవరి ప్రమేయం లేకుండా అవి స్వయంగా ఉనికిలోనికి వచ్చాయా? లేదా వాటికవే సృష్టికర్తలా?” సూరా అత్తూర్ 52:35

 

అవి సృష్టికర్త లేకుండా సృష్టించబడలేదు. వాటికవే సృష్టించుకోవడమూ జరగలేదు. కాబట్టి, మహోన్నతుడైన అల్లాహ్ యే వాటి సృష్టికర్త. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరా అత్ తూర్ పఠిస్తూ, ఈ ఆయతు వద్దకు వచ్చినపుడు, జుబైర్ ఇబ్నె ముతిమ్ దానిని విన్నారు (ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం): “ఎవరి ప్రమేయం లేకుండా అవి స్వయంగా ఉనికిలోనికి వచ్చాయా? లేదా వాటికవే సృష్టికర్తలా? లేదా భూమ్యాకాశాలను అవి సృష్టించాయా? లేదు, వారు దృఢమైన విశ్వాసం కలిగి లేరు. లేదా వారి వద్ద మీ ప్రభువు యొక్క భాండాగారాలేమైనా ఉన్నాయా? లేదా తమ ఇష్టానుసారం చేయగల అధికారం కలిగి ఉన్న నిరంకుశులా వారు? ” సూరా అత్ తూర్ 52:35-37. ఆ కాలంలో జుబైర్ అవిశ్వాసిగా జీవించేవారు. ఖుర్ఆన్ వచనాలు విన్న తర్వాత ఆయనిలా పలికినారు: “నా గుండె దాదాపు ఆగిపోయినట్లయింది. దైవవిశ్వాసం నా హృదయంలో ప్రవేశించిన మొట్టమొదటి క్షణమది.” (సహీహ్ అల్ బుఖారీ)

 

అల్లాహ్ఉనికికి ఉపమానం

అల్లాహ్ ఉనికిని నిరూపించేందుకు ఒక ఉదాహరణ.

 

ఒక అందమైన రాజభవనం, దాని చుట్టూ ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, వాటి మధ్య నదుల ప్రవాహం, సకల సౌకర్యాలు, అన్ని రకాల భోగభాగ్యాలతో కూడిన అలంకరణలు.ఇదంతా ఎవ్వరూ నిర్మించకుండా, హఠాత్తుగా దానికదే ఉనికిలోనికి వచ్చిందని ఒకవేళ ఎవరైనా మీతో చెబితే, వెంటనే మీరు దానిని తిరస్కరిస్తారు, నోటి మీదే అది ఒక పచ్చి అబద్ధం అని చెప్పేస్తారు. అది ఒక మూర్ఖమైన మాటగా పరిగణిస్తారు. మరిభూమ్యాకాశాలతో, నక్షత్రాలతో, అత్యద్భుతసువిశాల మరియు ఖచ్చితమైన సమతుల్యంతో కనబడుతున్న ఈ విశ్వం, దాని సృష్టికర్త ప్రమేయం లేకుండా దానికదే సృష్టించుకోవడం సాధ్యమా లేదా ఏదైనా హఠాత్పరిణామం వలన ఉనికిలోనికి రావడం సాధ్యమా?

 

ఎడారిలో నివసించే ఒక పల్లెవాసి ఈ హేతుబద్ధమైన ఋజువును గ్రహించి, ఇతరులు అడిగిన ఈ ప్రశ్నకు ఆయన చాలా స్పష్టంగా బదులిచ్చిన ఈ సంభాషణను ఒకసారి పరిశీలిద్దాం. “నీ ప్రభువు గురించి నీవు ఎలా తెలుసుకోగలవు?” ఆయన జవాబు: “ఒకవేళ ఒంటె పేడ నీకు కనబడితే, ఆ దారి గుండా ఏదో ఒక ఒంటె వెళ్ళిందని నీవు గ్రహిస్తావు. అలాగే ఒకవేళ మనిషి పాదాల గుర్తులు నీకు కనబడితే, ఆ దారి గుండా ఒక మనిషి వెళ్ళినట్లు నీవు గ్రహిస్తావు. మరి, నక్షత్రాలతో నిండిన ఈ ఆకాశం, పర్వత మార్గాలతో కూడిన ఈ భూమండలం మరియు ఎత్తైన అలలతో కూడిన ఈ సముద్రాలు – ఇవన్నీ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడి ఉనికిని నిరూపించడం లేదా?”

 

2. అల్లాహ్ సార్వభౌమత్వాన్ని విశ్వసించడం.

అల్లాహ్ సార్వభౌమత్వం అంటే కేవలం అల్లాహ్ మాత్రమే ప్రభువు,ఆయనకు భాగస్వాములు గానీ, సహాయకులు గానీ ఎవ్వరూ లేరు. కానీ మానవులలో కొందరు ఈ పిలుపును తిరస్కరించి, అల్లాహ్ తో పాటు ఆరాధించడానికి, వేడుకోవడానికి, అర్థించడానికి ఇతరులను దేవుళ్ళుగా చేసుకున్నారు.

 

సృష్టించే, ఆధిపత్యం చెలాయించే మరియు నియంత్రించే శక్తి గలవాడే ప్రభువు. అల్లాహ్ తప్ప మరో సృష్టికర్త లేడు. అల్లాహ్ తప్ప మరో సార్వభౌముడు లేడు. విశ్వలోకాలను నియంత్రించే శక్తి అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ లేదు. దీని గురించి అల్లాహ్ ఖురాన్ లోసూరా అల్ ఆరాఫ్ 7:54సూరా యూనుస్ 10:31, సూరా సజ్దహ్ 32:5, సూరా ఫాతిర్ 35:13లో ఈ విధంగా తెలియజేసాడు.

 

“నిశ్చయంగా, ఈ సృష్టి మరియు శాసనం ఆయనదే”  

 

“ప్రకటించు (ఓ ముహమ్మద్): ‘భూమ్యాకాశాల నుండి మీకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నది ఎవరు? లేదా వినికిడి శక్తి మరియు దృష్టి ఎవరి అధీనంలో ఉన్నాయి? మరణించిన వారిని తిరిగి సజీవం చేసేది మరియు సజీవంగా ఉన్నవారిని మరణింపజేసేది ఎవరు? విశ్వవ్యవహారాలను నడిపేది ఎవరు?’ (అని ప్రశ్నిస్తే), వారు ‘అల్లాహ్’ అని బదులిస్తారు. అపుడు వారినిలా ప్రశ్నించు: ‘మరి మీకు అల్లాహ్ శిక్షల భయం లేదా (ఆయన ఆరాధనలలో భాగస్వాములను చేర్చినందుకు?’)

 

 “భూమ్యాకాశాల మధ్య ఉన్న వాటి ప్రతి వ్యవహారాన్నీ ఆయనే నియంత్రిస్తాడు మరియు ఆయనే నడిపిస్తాడు; ప్రతిదీ ఆయన వైపుకే మరలుతుంది” 

 

“ఆయనే అల్లాహ్, మీ ప్రభువు; విశ్వసామ్రాజ్యం ఆయనదే. ఆయనను వదిలి ఎవరినైతే మీరు వేడుకుంటున్నారో, పిలుస్తున్నారో, అలాంటి వారు (విగ్రహాలు, అసత్యదైవాలు) ఖర్జురపు పండు పై నుండే పల్చటి దారం పోగుకు కూడా యజమానులు కారు.” 

 

3. అల్లాహ్ ఏక దైవత్వాన్ని విశ్వసించడం

కేవలం అల్లాహ్ మాత్రమే నిజమైన ఏకైక ఆరాధ్యుడు, ఆయనకెవరూ సాటి లేరు మరియు ఆయనకెవరూ భాగస్వాములు లేరు.

 

అల్ ఇలాహ్ అర్ధాలలో ఒకటి, ప్రేమించబడేవాడు. ప్రేమ మరియు గౌరవాభిమానాలతో ఆరాధించబడేవాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఆరాధింపబడే అర్హత గలవారెవ్వరూ లేరు – ఒక్క అల్లాహ్ తప్ప. దీని గురించి అల్లాహ్ దివ్యఖురాన్ లో సూరా తాహ 20:14లో ఈ విధంగా తెలియజేసాడు

‘’యదార్ధం ఏమిటంటే నేనే అల్లాహ్ ను, నాకు తప్ప వేరే ఆరాధ్య దైవం లేనేలేడు కనుక నన్నేఆరాధించు’’.

   

ఇంకా అల్లాహ్  ఆరాధ్య దైవమని సూరా ఆలె ఇమ్రాన్ 3:18లో స్వయంగా సాక్షమిస్తున్నాడు

“ఆయన తప్ప మరే ఆరాధ్యుడూ లేడు అనడానికి అల్లాహ్ సాక్ష్యంగా ఉన్నాడు, దైవదూతలు మరియు జ్ఞానం కలిగిన వారు కూడా. ఆయనే తన సృష్టిని న్యాయంగా నడుపుతున్నాడు. ఆయన తప్ప మరే ఆరాధ్యుడెవ్వడూ లేడు. మహా శక్తిమంతుడు, మహా వివేకవంతుడూను.” 

 

అల్లాహ్ ను వదిలి, ఆరాధించే ప్రతి దైవత్వం అసత్యమైనదే. దీని గురించి అల్లాహ్ సూరా అల్ హజ్  22:62లో ఇలా పలుకుతున్నాడు.

“ఎందుకంటే అల్లాహ్ మాత్రమే సత్యం. ఆయనతో పాటు (లేక ఆయనను వదిలి) వారు ఆరాధిస్తున్నవన్నీ అసత్యమైనవే. నిశ్చయంగా, అల్లాహ్ మహోన్నతుడు, ఘనమైన వాడూను.” 

 

దేవుడిగా పిలవబడినంత మాత్రాన వాటికి దైవత్వం చేకూర్చదు. దీని గురించి అల్లాహ్ సూరా అల్ నజమ్ 53:23లో ఇలా పలుకుతున్నాడు

“అవన్నీ మీరూ మరియు మీ తాతముత్తాతలు పెట్టుకున్న పేర్లు మాత్రమే. ఎలాంటి దైవత్వాన్నీ అల్లాహ్ వాటికి ప్రసాదించలేదు” 

సూరా యూసుఫ్ 12:39-40లో పూర్వపు ప్రవక్త అయిన యూసుఫ్ అలైహిస్సలాం జైలులో ఉంచబడినపుడు, అక్కడి రక్షకభటుడితో ఏకైక దేవుడైన అల్లాహ్ గురించి సంభాషిస్తూ ఇలా బోధించారు

“అనేక మంది దేవుళ్ళు ఉండటం మంచిదా లేక ఏకైకుడు మరియు తిరుగులేని వాడైన ఒక్క అల్లాహ్ మాత్రమే ఉండటం మంచిదా? ఆయనను తప్ప ఇంకెవ్వరినీ ఆరాధించవద్దు. ఆయనను వదిలి నీవూ మరియు నీ తల్లిదండ్రులు కొలుస్తున్న దేవుళ్ళ పేర్లకు అల్లాహ్ ఎలాంటి దైవత్వాన్నీ ప్రసాదించలేదు.” 

 

 అల్లాహ్ ప్రజలను ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే దివ్య వచనం వైపు పిలవటానికి ఆయన పంపిన ప్రతీ ప్రవక్తకు  అల్లాహ్  తప్ప మరెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు, ఆయన హక్కులో ఎవరికీ ఎలాంటి భాగస్వామ్యమూ లేదు,ఆయనకు అతి చేరువలో ఉండే దైవదూత అయినాసరే ,అని సూరా అల్ అంబియా 21:35, సూరా అన్నహల్ 16:36లో తెలియజేసాడు.

 

 “’లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే దివ్య వచనం వైపు సందేశహరుడిని తప్ప, మేము మరే సందేశహరుడినీ నీకు పూర్వం పంపలేదు. కాబట్టి నన్ను మాత్రమే ఆరాధించు” 

“నిశ్చయంగా మేము ప్రతి సమాజంలో ఒక సందేశహరుడిని (ఇలా పిలిచేందుకు) పంపాము: “అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, తాగూత్ (అసత్యదేవుళ్ళ) లకు దూరంగా ఉండండి.” 

 

4. అల్లాహ్ దివ్యనామాలను, దివ్యలక్షణాలను విశ్వసించడం.

అల్లాహ్ తన దివ్యగ్రంథంలో మరియు తన అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలలో (సున్నతులలో) స్వయంగా అల్లాహ్ ధృవీకరించిన తన దివ్యనామాలను మరియు దివ్యలక్షణాలను ఆయన ఔన్నత్యానికి సరిపోయేటట్లుగా, వాటి భావాలలో ఎలాంటి మార్పులుచేర్పులు చేయకుండా, వాటిని సృష్టితో పోల్చుతూ రకరకాల ప్రశ్నలు వేయకుండా ధృవీకరించడం.

 

“అత్యున్నతమైన నామాలు అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి. కాబట్టి వాటి ద్వారా ఆయనను వేడుకోండి. ఆయన దివ్యనామాలను తిరస్కరించే వారిని, నమ్మని వారిని విడిచి పెట్టండి. వారు చేస్తున్న దానికి తగిన ప్రతిఫలం పొందుతారు.” [అల్ ఆరాఫ్ 7:180]

 

ఈ వచనం సూచిస్తున్నదేమిటంటే, అల్లాహ్ నామాలు అత్యన్నతమైన దివ్యనామాలు.పరిపూర్ణత్వపు లక్షణాలు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందునని ఈ వచనం సూచిస్తున్నది, ఎందుకంటే పరిపూర్ణత్వాన్ని సూచించే లక్షణమే “మహోన్నతమైన లక్షణం”.

 

అల్లాహ్ దివ్యనామాలలో సమతూకం

అల్లాహ్ దివ్య నామాలలో సమతూకపు విశ్వాసం తప్పనిసరిగా ఉండాలి. అది ఏమిటంటే  క్రింద ఇవ్వబడే  నాలుగు విషయాల నుండి ఏవరైతే దూరంగా ఉంటారో, అలాంటి వారు నిజంగా అల్లాహ్ ను విశ్వసించనట్లే. ఎవరైనా వీటిలో ఏ ఒక్క దానిని అనుసరించినా, అలాంటి వారు తమకు ఆదేశించబడిన దానిని శిరసావహించకుండా, అల్లాహ్ దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలపై తగిన విధంగా నిజమైన విశ్వాసం పొందని వారవుతారు. వీటికి దూరంగా ఉండకుండా, ఎవరైనా సరే అల్లాహ్ దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను విశ్వసించలేరు. ఉదాహరణకు

1. తహ్రీఫ్

2.తఅతీల్

3.తమ్సీల్

4. తక్ఈఫ్

 

(i) తహ్రీఫ్

తహ్రీఫ్ అంటే మార్పులు – చేర్పులు చేయడం. ఉదాహరణకు‘అత్యుత్తమమైన దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలు కేవలం అల్లాహ్ కే చెందును’ అనే వాస్తవ భావార్థానికి భిన్నంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు ఆమోదయోగ్యం కాని విధంగా ఖుర్ఆన్ ఆయతుల మరియు సున్నతు వచనాల భావార్థాలలో మార్పులు  చేర్పులు చేయడం.

 

(ii) తఅతీల్

తఅతీల్ అంటే (తిరస్కరించడం) ఉదాహరణకు అల్లాహ్ దివ్యనామాలు దివ్యలక్షణాలను తిరస్కరిస్తూ, అవన్నీ లేదా వాటిలో కొన్ని అల్లాహ్ కు చెందవని చెప్పడం.ఖుర్ఆన్ మరియు సున్నతులలో పేర్కొనబడిన అల్లాహ్ దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను తిరస్కరించే ప్రతి ఒక్కరూ అల్లాహ్ దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను నిజంగా నమ్మనట్లే.

 

(iii) తమ్సీల్

తమ్సీల్ అంటే అల్లాహ్ ను ఆయన సృష్టితాలతో పోల్చడం. ఇంకా అల్లాహ్ దివ్యలక్షణాలను సృష్టితాల సాధారణ లక్షణాలతో పోల్చడం. ఉదాహరణకు, అల్లాహ్ చేయి మానవుడి చేతి లాంటిదే అనడం, అల్లాహ్ వినికిడి శక్తి మానవుడి వినికిడి శక్తి లాంటిదే అనడం, అల్లాహ్ తన అర్ష్ పై అధిష్టించడం అంటే మానవుడు ఒక కుర్చీ పై కూర్చోవడం లాంటిదని చెప్పడం …. మొదలైనవి. నిస్సందేహంగా, అల్లాహ్ దివ్యలక్షణాలను సృష్టితాల సాధారణ లక్షణాలతో పోల్చడమనేది ఒక పచ్చి అబద్ధం. దీని గురించి సూరా షురా 42:11లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు

“ఆయనను పోలినదేదీ లేదు” 

 

(iv) తక్ఈఫ్

తక్ఈఫ్ అంటే ఎలా సంభవమని చర్చించడం.ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తి పరిమితమైన తన ఊహలకు లేక ఆలోచనలకు మాటల రూపాన్నిస్తూ, అల్లాహ్ దివ్యనామాలు దివ్యలక్షణాలు ఎలా సాధ్యం అనే విషయం పై చర్చించడం. ఖచ్చితంగా ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదు. మానవుడికి వాటి గురించి తెలీదు. దీని గురించి సురా తాహా 20:110లో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు

“కానీ, ఆయన జ్ఞానంలో నుండి దేనినీ వారేనాడూ ఆవరించలేరు” 

 

ఆధారాలు

www.teluguislam.net(ఇంగ్లీష్)

2067 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్