అల్లాహ్ పవిత్రత


ప్రతి నమాజు తరువాత, ‘సుబహానల్లాహ్’ అని, ‘అల్ హందులిల్లాహ్’ అని, ‘అల్లాహు అక్బర్’ అని ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించండి.

 

విషయసూచిక

 

ప్రతి నమాజు తరువాత, ‘సుబహానల్లాహ్’ అని, ‘అల్ హమ్దు లిల్లాహ్’ అని, ‘అల్లాహు అక్బర్’ అని ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించండి

హజ్రత్ అబూ హురైరా (రజి అల్లాహు అన్హు) కధనం :-ఓ రోజు కొందరు పేదప్రజలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “దైవప్రవక్తా! ధనికులు తమ సిరిసంపదల మూలంగా గొప్పగొప్ప హొదా, అంతస్తులు, శాశ్వత సౌఖ్యాలు పొందగలుగుతున్నారు. వారు మాలాగా నమాజులు కూడా చేస్తున్నారు, ఉపవాసాలు కూడా పాటిస్తున్నారు, పైగా డబ్బున్నందున హజ్, ఉమ్రా కూడా పాటిస్తున్నారు. జిహాద్ (ధర్మపోరాటం) కూడా చేస్తున్నారు. దానధర్మాలు కూడా చేస్తున్నారు” అని అన్నారు. అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :- “సరే, నేను మీకో విషయం తెలియజేయనా? దాన్ని గనక మీరు మీ దినచర్యగా చేసుకుంటే, మిమ్మల్ని మించిపోయిన వాళ్ళతో మీరు సమానులయిపోతారు. ఆ తరువాత మీతో మరెవరూ పోటీ ఉండరు. ఈ పద్ధతి అనుసరించే వాడుతప్ప మీరే అందరికంటే శ్రేష్ఠులయి పోతారు. ఆ విషయం ఏమిటంటే, ప్రతి నమాజు తరువాత, ‘సుబహానల్లాహ్’ అని, ‘అల్ హమ్దు లిల్లాహ్ ’ అని, ‘అల్లాహు అక్బర్’ అని ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించండి”. హజ్రత్ అబూ హురైరా (రజి అల్లాహు అన్హు) కధనం :- ఆ తరువాత (వీటి సంఖ్య విషయమయి) మాలో విబేధాలు వచ్చాయి. కొందరు సుబహానల్లాహ్, అల్ హమ్దు లిల్లాహ్ అనే మాటలు ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించాలని, అల్లాహు అక్బర్ అనే మాటను ముఫ్ఫై నాలుగుసార్లు స్మరించాలని అన్నారు. అందువల్ల నేను ఈ విషయం గురించి మరోసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అడిగాను. అప్పుడాయన “సుబహానల్లాహ్, అల్ హమ్దు లిల్లాహ్ , అల్లాహు అక్బర్ అనే మాటలలో ప్రతిదాన్ని ముఫ్ఫై మూడుసార్లు పఠించండి” అని అన్నారు.


348. [సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం - అజాన్, 115 వ అధ్యాయం - అజ్జిక్రి బాదస్సలాత్] ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 26 వ అధ్యాయం – నమాజు తరువాత ఏ ధ్యానం అభిలషణీయం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan) vol-1 సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్


ధైవస్మరణ మెల్లిగా చేయడం అభిలషణీయం

హజ్రత్ అబూ మూసా అష్అరీ (రజి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖైబర్ మీద దాడి చేశారు – లేక దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖైబర్ కు బయలుదేరారు – అప్పుడు ప్రవక్త అనుచరులు గుట్టపై నుండి ఒక లోయను చూసి “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్” అని బిగ్గరగా పలకసాగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అది విని “మీ పట్ల మీరు మృదువుగా వ్యవహరించండి (గొంతు చించుకుంటూ) అలా కేకలు పెట్టకండి. మీరు చెవిటివాడినో, లేక ఇక్కడ లేని వాడినో పిలవడం లేదు. మీరు అనుక్షణం వినేవాడ్ని, మీకు అతిచేరువలో మీ వెంట ఉన్నవాడిని పిలుస్తున్నారు” అని అన్నారు. నేనా సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వాహనం వెనుక నిలబడి “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అన్నాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇదివిని “అబ్దుల్లా బిన్ ఖైస్!”(*) అని పిలిచారు నన్ను. నేను “మీ సేవకై సిద్ధంగా ఉన్నాను ధైవప్రవక్తా!” అన్నాను. “నేను నీకు స్వర్గ నిక్షేపాలలో ఒక నిక్షేపం వంటి ఒక వచనాన్ని నీకు తెలుపనా?” అన్నారు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం). నేను “తప్పకుండా తెలియజేయండి ధైవప్రవక్తా! నా తల్లిదండ్రులు మీ కోసం సమర్పితం” అని అన్నాను. అప్పుడాయన “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ (దైవాజ్ఞ తప్ప ఏ శక్తీ ఏ బలమూ లేదు)” అని అన్నారు.


1728 [సహీహ్ బుఖారీ: 64 వ ప్రకరణం - మగాజి, 38 వ అధ్యాయం - గజ్వతి ఖైబర్] (*) హజ్రత్ అబూ మూసా అష్అరీ (రజి అల్లాహు అన్హు) అసలు పేరు అబ్దుల్లా బిన్ ఖైస్. (అనువాదకుడు) ప్రాయశ్చిత్త ప్రకరణం : 13 వ అధ్యాయం – ధైవస్మరణ మెల్లిగా చేయడం అభిలషణీయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2


సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్


రాత్రి పడుకునేటప్పుడు అల్లాహ్ పవిత్రతను కొనియాడటం

హజ్రత్ అలీ (రజి అల్లాహు అన్హు) కధనం :- హజ్రత్ ఫాతిమా (రజి అల్లాహు అన్హ) తిరగలి విసరి విసరి వ్యాధిగ్రస్తులయ్యారు. (అంటే ఆమె చేతులకు కాయలు కాశాయి). ఓసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు కొందరు (యుద్ధ) ఖైదీలు వచ్చారు. అది తెలిసి హజ్రత్ ఫాతిమా (రజి అల్లాహు అన్హ) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికెళ్లారు. కాని ఆయన లేరు. హజ్రత్ ఆయిషా (రజి అల్లాహు అన్హ) మాత్రమే వున్నారు. అందుచేత ఫాతిమా (రజి అల్లాహు అన్హ) ఆమెనే కలుసుకొని విషయం తెలియజేశారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చారు. హజ్రత్ ఆయిషా (రజి అల్లాహు అన్హ) ఆయనకు ఫాతిమా (రజి అల్లాహు అన్హ) వచ్చి పోయిన సంగతి తెలియజేశారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా ఇంటికి వచ్చారు. అప్పుడు మేము మా పడకలపై పడుకొని ఉన్నాము. నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను చూసి లేవడానికి ప్రయత్నించాను. కాని ఆయన నన్ను అలాగే పడుకొని ఉండమని చెప్పి మా ఇద్దరి మధ్య కూర్చున్నారు. అప్పుడు ఆయన దివ్యపాదాల చల్లదనం నా గుండెలకు తాకింది. ఆయన ఇలా అన్నారు, “(ఫాతిమా!) నీవు నన్నడిగిన దానికంటే ఎంతో మేలయినది నీకు చెప్పనా? నీవు పడుకోవటానికి పడక మీదికి చేరినపుడు 34 సార్లు అల్లాహు అక్బర్ అనీ, 33 సార్లు సుబ్ హానల్లాహ్ అనీ, 33 సార్లు అల్ హమ్దులిల్లాహ్ అనీ పఠిస్తూ ఉండు. ఈ స్మరణ నీ కోసం సేవకుడి కంటే ఎంతో శ్రేష్ఠమైన సంపద.”


1739 [సహీహ్ బుఖారీ :- 62 వ ప్రకరణం - ఫజాయిలి అస్ హాబిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం), 9 వ అధ్యాయం - మనాఖిబ్ అలీ బిన్ అబీతాలిబ్ అల్ ఖురషీ – రజి అల్లాహు అన్హు] ప్రాయశ్చిత్త ప్రకరణం : 19 వ అధ్యాయం – ఉదయం, రాత్రి పడుకునేటప్పుడు అల్లాహ్ పవిత్రతను కొనియాడటం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2 . సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్


ఆధారాలు

http://telugudailyhadith.wordpress.com/2012/11/08/dhikr-after-namaz/

http://telugudailyhadith.wordpress.com/2012/09/28/you-are-not-calling-deaf-and-dumb/

http://telugudailyhadith.wordpress.com/2012/09/12/dhikr-before-sleep-fatima/

 

240 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్