అల్లాహ్ తన దాసులను ప్రేమిస్తాడు అనడానికి నిదర్శనాలు


దైవపరాయణులు అల్లాహ్ ప్రేమ కోసం తపిస్తూ, దాని కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అల్లాహ్ ప్రేమ మనసుకు, ఆత్మకు ఆహారం లాంటిది. కళ్ళకు చల్లదనాన్ని ఇస్తుంది. ఈ తపన లేని మనసు శవం లాంటిది.దీని కాంతి పొందని వాడు అంధకారంలో పడిపోతాడు. దీని సంతోషాన్ని చవిచూడనివాడు, ఎల్లప్పుడూ దుఃఖంలో ఉంటాడు. అల్లాహ్ పై విశ్వాసం, సత్కార్యాలు మనిషిని అల్లాహ్ సామీప్యాన్ని పొందేలా చేస్తాయి. అలా కాని పక్షంలో అది ఆత్మ లేని శరీరం లాంటిది. 

 

విషయసూచిక

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చూపించిన మార్గాన్ని అనుసరించడం

ఖుర్ఆన్ లో ఇలా ఉంది: “(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “మీకు నిజంగానే అల్లాహ్‌ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్‌ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ   పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు.” (ఖుర్ఆన్,సూరా ఆలి ఇమ్రాన్ 3:31)

 

తోటివిశ్వాసులతో వినయంగా ఉంటూ, అల్లాహ్ తప్ప ఎవరికీ భయపడకపోవడం

అల్లాహ్ ఈ లక్షణాలను ఒకే ఆయతులో వివరించాడు: “ఓ విశ్వాసులారా! మీలో ఎవరయినాసరే తమ ధర్మం నుంచి తిరిగిపోతే (పోవచ్చు), అల్లాహ్‌ త్వరలోనే మరో జాతి వారిని తీసుకువస్తాడు. అల్లాహ్‌ వారిని  ప్రేమిస్తాడు, వారు అల్లాహ్‌ను ప్రేమిస్తారు. వారు  విశ్వాసుల పట్ల మృదు స్వభావులుగానూ, అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ ఉంటారు.   వారు అల్లాహ్‌ మార్గంలో పోరాడుతారు. నిందించేవారి నిందలను వారు ఏమాత్రం  పట్టించుకోరు. ఇది అల్లాహ్‌ అనుగ్రహం. ఆయన తాను కోరిన వారికి దీన్ని ప్రసాదిస్తాడు.   అల్లాహ్‌ విస్తృతి కలవాడు, జ్ఞానసంపన్నుడు.” (ఖుర్ఆన్,సూరా మాయిదా 5:54)

 

ఈ ఆయతులో అల్లాహ్ తాను ప్రేమించేవారి లక్షణాలను వివరించాడు. అందులో మొదటిది, వారువినయులు, విశ్వాసులతో మృదు స్వభావులుమరియు అవిశ్వాసుల పట్ల కఠినులు. వారు అల్లాహ్ మార్గంలో షైతానుతో, అవిశ్వాసులతో, కపటులతో పోరాడుతారు. వారు అల్లాహ్ కోసం నిందించేవారి నిందలను ఏమాత్రం  పట్టించుకోరు.

 

నఫిల్ ఆరాధనలు చేయడం

హదీసె ఖుద్సీ ప్రకారం అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “నా దాసుడు నఫిల్ ఆరాధనల వల్ల నాకు చేరువవుతాడు. నేనతన్ని ప్రేమిస్తాను.” నఫిల్ నమాజులు, దానధర్మాలు, ఉమ్రా, హజ్, ఉపవాసాలు మొదలైనవి నఫిల్ ఆరాధనలలో వస్తాయి.

 

ప్రేమించడం, ఇతరులను సందర్శించడం, ఒకరికొకరు సహాయపడటం (ఆర్ధికంగా), ఇతరులకు మంచి సలహాలు ఇవ్వడం – అన్నీ కేవలం అల్లాహ్ కొరకే అయిఉండాలి

ఈ లక్షణాలు ఒకే హదీసులో వివరించబడ్డాయి.అల్లాహ్ ఇలా సెలవిచ్చారని,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంఉల్లేఖించారు: “ఒకరికొకరు కేవలం అల్లాహ్ కోసం ప్రేమించేవారిని, నేను తప్పకుండా ప్రేమిస్తాను;కేవలం అల్లాహ్ కోసం ఒకరిని సందర్శించుకునేవారిని, నేను తప్పకుండా ప్రేమిస్తాను; కేవలం అల్లాహ్ కై ఒకరికి సహాయపడేవారిని (ఆర్ధికంగా), నేను తప్పకుండా ప్రేమిస్తాను;కేవలం అల్లాహ్ కై తమసంబంధాలను సరిచేసుకునేవారిని,నేను తప్పకుండా ప్రేమిస్తాను.” (ముస్నద్ అహ్మద్, 4/236 & 5/236)

 

‘ఒకరిని అల్లాహ్ కై సందర్శించుకోవడం’ అంటేవారిరువురు కేవలం అల్లాహ్ ప్రసన్నత చూరగొనడానికే కలుసుకుంటారు. అల్లాహ్ ను ఆరాధించడంలో కూడా వారు ఒకరినొకరు సహాయం చేసుకుంటారు.(అల్ మున్తఖా షర్ హుల్ మువత్తా, హదీస్ 1779)

 

అల్లాహ్ ద్వారా పరీక్షించబడటం

వైపరీత్యాలు, ప్రమాదాలుసంభవించడం అల్లాహ్ తరఫున జరిగే పరీక్ష. అల్లాహ్ అతణ్ణి ప్రేమిస్తున్నాడు అనడానికి నిదర్శనం. ఎందుకంటే ఇవి మనిషికి ఔషధం లాంటివి. మందు చేదుగా ఉంటుంది. అయిననూ, మనము మన ఆప్యాయులకు అది ఇస్తాము. ఎందుకంటే దాని వల్ల అతని ఆరోగ్యం బాగుపడుతుంది. ఒక సహీహ్ హదీసు ప్రకారం: “ఉత్తమమైన ప్రతిఫలం దొరకాలంటే అంతే పెద్ద పరీక్ష ఎదుర్కోవాలి. అల్లాహ్ ఎవరినైతే ప్రేమిస్తాడో, అతనికి పరీక్షకు గురిచేస్తాడు. ఆ పరీక్షలో నెగ్గినవాడు అల్లాహ్ కారుణ్యానికి అర్హుడవుతాడు. అల్లాహ్ పై నిరాశ చెందినవాడు,ఆగ్రహానికి గురిఅవుతాడు.” (తిర్మిజి, 2396; ఇబ్న్ మాజా, 4031)

 

పరలోకంలో దైవశిక్ష అనుభవించడంకంటే, ఇహలోకంలోవైపరీత్యాలను ఎదుర్కోవడం మంచిది. ఇలాంటి పరిస్థితిలో అతని చెడు కర్మలన్నీ పూడ్చివేయబడతాయి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ప్రబోధించారు: “అల్లాహ్ తన దాసులకు మంచి చేయాలనుకుంటే, అతనికి ఈ ప్రపంచంలో కఠిన పరీక్షలకు గురిచేస్తాడు. అలాగే ఎవరికైనా చెడు చేయాలనుకుంటే, అతని పాపాలను అంతిమదినం వరకు అలాగే ఉంచుతాడు.” (తిర్మిజి, 2396)

 

విద్వాంసులు దీన్ని ఈ విధంగా వివరించారు: కపటులకు అల్లాహ్ వైపరీత్యాల, బాధల నుండి దూరంగా ఉంచి, అతణ్ణి అతని పాపాల సమేతంగా తీర్పు దినం నాడు తన వద్దకు పిలిపించుకుంటాడు. అందుకోసం మనం ఎల్లప్పుడూ “ఓ అల్లాహ్! మమ్మల్ని నీవు ప్రేమించేవారిలో చేర్చుకో” అని వేడుకోవాలి.

 

అల్లాహ్ ను ప్రేమించేవారు, మాకు ఏం దొరుకుతుంది అని ప్రశ్నించకూడదు. వారికి దొరికేది చాలా ఉత్తమం. అల్లాహ్ ప్రియజనుల్లో చేరడం అంతకంటే ఉత్తమం. అల్లాహ్ ప్రేమించే వ్యక్తికి లభించే పుణ్యఫలాలు: ప్రజలు అతన్ని ప్రేమిస్తారు మరియు అతను లోకంలో అందరి ప్రేమను పొందుతాడు. హదీసులో ఇలా అనబడింది: “అల్లాహ్ ఒక దాసుణ్ణి ప్రేమించినప్పుడు, అతను జిబ్రయీల్ తో ఇలా అంటాడు, నేను ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాను, కావున మీరు కూడా అతన్ని ప్రేమించండి. అప్పుడు జిబ్రయీల్ అతన్ని ప్రేమిస్తూ, స్వర్గావసులను పిలిచి, అల్లాహ్ ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, మీరు కూడా అతన్ని ప్రేమించండి. స్వర్గ వాసులు కూడా అతన్ని ప్రేమిస్తారు. ప్రపంచం అతని కోసం ఆమోదయోగ్యం అవుతుంది.” (సహీహ్ బుఖారీ 3209)

 

హదీసె ఖుద్సీలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: అబూ హురైరా రజియల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ఉపదేశించారు: “నేను ప్రేమించే వ్యక్తితో ఎవరైనా శత్రుత్వం చేస్తే నేను అతడితో పోరాడుతాను.నేను విధిగా చేసిన ధార్మిక విధులను నేరవేర్చి, అతను నాకు దగ్గరవుతాడు. నఫిల్ ఆరాధనలు నిర్వర్తించి మనిషి నాకు చాలా దగ్గరవుతాడు మరియు నేను అతన్ని ప్రేమిస్తాను. నేను ఒక మనిషిని ప్రేమించడం మొదలుపెడితే, నేను అతను వినే చెవినైపోతాను, చూసే కళ్ళు అయిపోతాను, పని చేసే చేయినైపోతాను, నడిచేకాళ్ళు అయిపోతాను. అతను అడిగినదల్లా అతనికి ప్రసాదిస్తాను. అతను నా రక్షణ కోరితే అతనికి రక్షణ ఇస్తాను. నా విధేయుడైన దాసుని ప్రాణం తీయడం నాకు చాలా కష్టం కలిగిస్తుంది. ఎందుకంటే, అతను మరణాన్ని ఇష్టపడడు, నేను అతన్ని కష్టం కలిగించలేను.” (సహీహ్ బుఖారీ 6502)

 

ఈ హదీసె ఖుద్సీ లో అల్లాహ్ ఆప్యాయత పొందిన దాసునికి లభించే ప్రయోజనాలు ఉన్నాయి:

 • “అతను వినే చెవిని నేను” అంటే, అల్లాహ్ నచ్చే దానిని తప్ప అతడు దేనినీ వినడు.
   
 • “అతను చూసే కన్నును నేను” అంటే, అల్లాహ్ నచ్చిందే అతను చూస్తాడు.
   
 • “అతను పని చేసే చేతిని అవుతాను” అంటే, అల్లాహ్ నచ్చిన పనినే అతను తన చేతితో చేస్తాడు.
   
 • “అతను నడిచే కాలిని అవుతాను” అంటే,అల్లాహ్ మెచ్చే చోటికే అతని కాలు అతణ్ణి తీసుకెళుతుంది.
   
 • “అతడు అడిగిన ప్రతీది నేను అతనికి ప్రసాదిస్తాను” అంటే, అతని దుఆలను (వేడుకోళ్ళను) అల్లాహ్ ఆమోదిస్తాడు.
   
 • “అతను నా రక్షణ కోరితే, నేను అతనికి రక్షణ కల్పిస్తాను” అంటే, అతను అన్నిటినుండి అల్లాహ్ రక్షణ పొందుతాడు...

 

ఆధారాలు

Written by Sheikh MuhammedSalih Al-Munajjid,(ఇంగ్లిష్)

http://islamqa.info/en/ref/27232(ఇంగ్లిష్)

http://abdurrahman.org/seerah/riyad/00/chap047.htm(ఇంగ్లిష్)

http://www.a2youth.com/articles/soul_purification/signs_that_allah_loves_his_slaves/(ఇంగ్లిష్)

 

643 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్