అరఫా


అరఫా అనే నల్ల రాయి పర్వతం మక్కా నగరానికి తూర్పు దిశన ఉంది. దీన్ని దయ పర్వతం (జబల్ అర్ రహ్మాహ్) అని కూడా అంటారు. దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం హజ్ చేసినప్పుడు, తన చివరి ప్రసంగం ఈ కొండపై నుంచే ఇచ్చారు. హజ్ చేసినప్పుడు ఇక్కడ ఆగడం చాలా ముఖ్యం. ఇది ముజ్దలిఫా తరువాత వస్తుంది.

 

విషయసూచిక

 

చారిత్రక ఘటనలు

హజ్జతుల్ విదా (ఆఖరి హజ్) లోని అరఫా రోజు శుక్రవారం వచ్చింది. ఆ రోజు ఖుర్ఆన్ లోని ఈ ఆయతు (వచనం) అవతరించింది: “ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి  ఆమోదించాను.” (ఖుర్ఆన్, సూరా మాయిదా 5:3)


అల్లాహ్ ధర్మాన్ని పూర్తిగావించాడు. ఇప్పుడు ఇందులో ఎలాంటి మార్పుచేర్పులకు తావులేదు. అందువల్లే అల్లాహ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో ప్రవక్తల పరంపరను అపివేశాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చిట్ట చివరి ప్రవక్త. అల్లాహ్ ఇస్లాం ధర్మాన్ని ఆమోదించాడు, అనగా అల్లాహ్ కు ఇస్లాం తప్ప వేరే ఏ ఇతర ధర్మం సమ్మతం కాదు.

 

హదీస్

యజీద్ ఇబ్న్ షైబాన్ రజిఅల్లాహుఅన్హు ఇలా ఉల్లేఖించారు: మేము అరఫాలో మౌఖిఫ్ (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నిలబడిన చోటు)కు దూరంగా నిలబడి ఉన్నాము. (అబూ దావూద్, తిర్మిజి883). ఇబ్న్ మిర్బా అల్ అన్సారీ రజిఅల్లాహుఅన్హు మా వద్దకు వచ్చి ఇలా అన్నారు: “నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సందేశహరుడిని. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మీతో ఇలా అనమని చెప్పారు: ‘మీరు నిలుచుని ఉన్న చోటే నిలబడండి. మీరు మీ తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం నిలబడిన చోట నిలబడి ఉన్నారు.’” (సహీహ్ దావూద్ 1688)

 

అరఫా రోజు – 9వ జిల్హిజ్జా  

  • అరఫాకు వెళ్ళడం
     
  • అరఫాలో నిలబడటం
     
  • అరఫా నుండి బయలుదేరడం

 

అరఫాకు వెళ్ళడం

9వ జిల్ హిజ్జా ను అరఫా రోజు అంటారు. ఇది హజ్ యాత్రికులకు చాలా ముఖ్యమైన దినం.

  • అరఫా రోజున సూర్యుడు ఉదయించగానే (9వ జిల్ హిజ్జా) –అరఫా (మక్కాకు దక్షిణ తూర్పు దిశన) వైపుతక్బీరె తల్బియా చదువుతూ బయలుదేరాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అనుచరులు(సహాబా) అయనతో హజ్ చేసినప్పుడుఇలా చేశారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వారిని వారించలేదు.
     
  • ఆ తరువాత నమీర దగ్గర ఆగాలి – ఇది అరఫాకు దగ్గర ఉన్న ప్రదేశం, కాని ఇది అరఫా లోనికి రాదు. సాయంత్రం వరకు అక్కడ ఉండాలి.
     
  • సూర్యుడు అత్యున్నత స్థానం నుంచి జరిగాక ఉరనహ్ ప్రదేశానికి వెళ్లి అక్కడ ఉండిపోవాలి. ఇది అరఫాకు పక్కన ఉంది. ఇక్కడ ఇమాం ప్రజలను ఉద్దేశించి మంచి ఉపన్యాసం ఇవ్వాలి.
     
  • ఆ తరువాత జుహర్, అసర్ నమాజులు కలిపి సంక్షిప్తంగా చదవాలి. ఇలా జుహర్ వేళ చేయాలి.
     
  • అజాన్ ఒక్కసారే ఇవ్వాలి, కాని ఇఖామా రెండు సార్లు చెప్పాలి.
     
  • ఈ రెండు నమాజుల మధ్యలో ఏదీ చదువకూడదు.
     
  • ఇమాంతో పాటు నమాజు చేయలేనివాడు, స్వయంగా ఇదే విధంగా నమాజు చేయాలి.

 

అరఫాలో నిలబడటం

ఆ తరువాత అరఫాకు వెళ్లి, వీలైతే ‘జబల్ అర్ రహ్మాహ్’ కొండ కింద ఉన్న రాళ్ళపై నిలబడాలి. కుదరనిచో అరఫా ప్రదేశంలో ఎక్కడైనా నిలబడవచ్చు.


ఖిబ్లా వైపు ముఖం చేసి చేతులెత్తి దుఆ చేస్తూ, తల్బియా చదువుతూ ఉండాలి.


‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ఎక్కువగా చదవాలి. అరఫా రోజున ఇది మంచి దుఆ. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం దీని గురించి ఇలా అన్నారు: అరఫా రోజున సాయంత్రం నేను మరియు ఇతర ప్రవక్తలు పలికిన ఉత్తమ పదాలు – లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లాషరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్.


తల్బియాలో అప్పుడప్పుడు ఇది (ఇన్నమల్ ఖైరు ఖైరుల్ ఆఖిరతి– అన్నిటిలో మంచిది పరలోకంలోని మంచిది) కూడా జోడిస్తే ధర్మసమ్మతమే.


అతను అదే స్థితిలో, అల్లాహ్ ను స్తుతిస్తూ, తల్బియా చదువుతూ, దుఆ చేస్తూ ఉండిపోతాడు. అల్లాహ్ తన దూతల ముందు తన గురించి ప్రస్తావిస్తాడని ఊహిస్తూ ఇలా చేస్తాడు. హదీసులో ఇలా ఉంది: “అరఫా రోజున అల్లాహ్ అన్ని రోజులకంటే ఎక్కువగా తన దాసులను నరకాగ్ని నుంచి విముక్తి కలిగిస్తాడు. తన దూతలతో తన దాసుల గురించి ప్రస్తావిస్తూ, ‘వారు ఏం కోరుకుంటున్నారు?’ అని అడుగుతాడు. మరో హదీసులో ఇలా అనబడింది: “అల్లాహ్ అరఫాలో ఉన్న తన దాసుల గురించి దైవదూతలతో ఇలా అంటాడు: ‘నా దాసులను చూడండి. వారు నా దగ్గరకు చిందర వందరగా, దుమ్ము ధూళితో వచ్చారు.’” సూర్యాస్తమయం వరకూ అతడు ఆ స్థితిలోనే ఉంటాడు.


ఒకవేళ హజ్ చేసేవారు అలసిపోతే, వారి సహచరులతో మంచి విషయాల గురించి మాట్లాడవచ్చు లేదా మంచి పుస్తకాలు చదవవచ్చు. అల్లాహ్ ఔన్నత్యాన్ని చాటే మంచి పుస్తకాలను చదవడం వల్ల అతనికి ఆ రోజు విశిష్టతపై విశ్వాసం పెరుగుతుంది. ఆ రోజు ఎక్కువగా అల్లాహ్ ను స్మరిస్తూ, దుఆ చేస్తూ గడపాలి. అరఫా నాటి ఆఖరి ఘడియలలో ఎక్కువగా దుఆ చేయాలి. దుఆలలో అన్నిటికంటే ఉత్తమమైనది – అరఫా రోజు చేసే దుఆ.

 

అరఫా నుండి బయలుదేరడం

సూర్యుడు అస్తమించాక అక్కడి నుంచి ముజ్దలిఫాకు వెళ్ళాలి. ఇతరులను తోసుకుంటూ వెళ్ళకుండా, నెమ్మదిగా వెళ్ళాలి. కాని సమయం దొరికినప్పుడు వేగంగా వెళ్ళవచ్చు.


ముజ్దలిఫా చేరాక, అజాన్ మరియు ఇఖామా ఇచ్చి, మూడు రకాతులు మఘ్రిబ్ నమాజ్ చేయాలి. ఆ తరువాత ఇఖామా పలికి ఇషా నమాజ్ చేయాలి. రెండిటినీ కలిపి తగ్గించి చదవాలి. ఆ రెండు నమాజులను వేరు చేసి చదివిననూ ఎలాంటి దోషం లేదు. ఆ రెండు నమాజుల మధ్య గానీ, ఇషా నమాజు తరువాత గానీ ఇతర ఏ నమాజు చేయరాదు. ఆ తరువాత ఫజర్ నమాజ్ వరకు పడుకోవాలి. ఫజర్ నమాజ్ వేళ ప్రారంభం కాగానే, మొదటి ఘడియలలో, అజాన్ మరియు ఇఖామత్ ఇచ్చి నమాజ్ చేయాలి.


సూర్యుడు ఉదయించాక, అరఫా వైపుకు వెళ్ళాలి. అక్కడ జుహర్ సమయంలో- జుహర్, అసర్ రెండు నమాజులను కలిపి రెండు రెండు రకాతులు చదవాలి. కుదిరితే, సూర్యాస్తమయం వరకు నమిరహ్ లోని మస్జిద్ లో ఉండాలి. అక్కడ అల్లాహ్ ను స్తుతిస్తూ, ఖిబ్లా వైపు ముఖం చేసి ఎక్కువగా దుఆ చేస్తూ గడపాలి.


అరఫా రోజు సూర్యుడు ఉదయించాక, మినా వదలి అరఫా వైపు వెళుతూ తక్బీర్ (అల్లాహు అక్బర్), తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్) మరియు తల్బియా చదవాలి. అరఫా రోజు మిగతా రోజుల కన్నా ఎక్కువగా దైవదాసులను అల్లాహ్ నరకం నుంచి విముక్తి కలిగిస్తాడు. (సహీహ్ ముస్లిం)


అరఫా రోజు కావాలనుకుంటే ఉపవాసం ఉండవచ్చు లేదా వీడవచ్చు. తప్పనిసరి కాదు. ఆ రోజు ఉపవాసం ఉండకూడదు అనే ఆధారం జయీఫ్ (ధృవీకరించబడనిది). (తిర్మిజి). అరఫాలో ప్రవేశించేముందు ‘వాది ఎ నిమ్రహ్’ లో విశ్రాంతి తీసుకుని, జుహర్ సమయంలో ఇమామె హజ్ (ఖుత్బా) ప్రసంగం వినాలి. ఆ తరువాత జుహర్, అసర్ నమాజులు కలిపి ఒక అజాన్ మరియు రెండు ఇఖామాలతో చదవాలి. ఈ నమాజ్ సామూహికంగా చదవాలి. దీన్ని ఖసర్ చేయాలి (రెండు రకాతులు)అని అంటారు. (సహీహ్ ముస్లిం)


జుహర్ మరియు అసర్ నమాజ్ చదివాక, అరఫాలో ప్రవేశించి, కుదిరితే జబలె రహ్మత్ పై లేదా ఎక్కడ చోటు దొరికితే అక్కడ (వఖూఫ్) నిలబడి, చేతులు పైకెత్తి ఖుర్ఆన్ లోని దుఆలు లేదా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చదివిన దుఆలు చేస్తూ, మధ్య మధ్యలో తక్బీర్, తహ్లీల్ మరియు తల్బియా కూడా పలకాలి. (సహీహ్ ముస్లిం). ఆ రోజు ఈ దుఆ చేయండి: లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. (తిర్మిజి). ఇది దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్ (ఆచారం) మరియు ఈ దుఆ ధృవీకరించబడినది. కొందరు ఆలస్యంగా అరఫా చేరుకున్నా (10వ జిల్ హిజ్జా) ఫజర్ కు ముందు, వారి అరఫా కూడా స్వీకరించబడుతుంది. (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం)


సూర్యాస్తమయం తరువాత మఘ్రిబ్ నమాజ్ చదువకుండా ముజ్దలిఫాకు బయలుదేరండి. తల్బియా చదువుతూ మెల్లిగా, హుందాగా వెళ్ళండి. (సహీహ్ ముస్లిం). 8వ మరియు 9వ జిల్ హిజ్జా మధ్య రాత్రి మినాలో గడపడం తప్పనిసరి అని భావించడం సరి అయినది కాదు. (షేక్ అల్బాని గారి విద్యార్ధి మషూర్ ఆల్ సల్మాన్ గారి ఫత్వా)[1]

 

అరఫా రోజు చేసే ప్రార్ధన (దుఆ, తస్బీహ్)

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: అరఫా రోజున చేసే దుఆ అన్నిటికంటే ఉత్తమమైనది. అరఫా రోజున నేను మరియు ఇతర ప్రవక్తలు పలికిన ఉత్తమ పదాలు – లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. 


కేవలం ఒక్కడైన అల్లాహ్ తప్ప ఆరాధ్యానికి అర్హులు ఎవ్వరూ లేరు. అతనికి సహవర్తులూ ఎవ్వరు లేరు. రాజ్యాధినేత ఆయనే, స్తోత్రములన్నీఆయన కొరకే. అయన అన్నీ చేయగలడు. (సహీహ్ అత్ తిర్మిజి vol 3:184, సిల్సిలతుల్అహాదీస్ అస్ సహీహ 4/6)[2]

 

హజ్ లో అరఫా చాలా ముఖ్యమైనది

హజ్ లో అరఫాలో నిలబడటం చాలా ప్రాముఖ్యమైనది. అరఫాలో నిలబడనివాడు హజ్ కోల్పోయినట్లే. అరఫా లో నిలబడితే, ఇక వేరే హజ్ ఆరాధనలను నెరవేర్చకపోయినా పరవాలేదు అని అనుకోకూడదు. విద్వాంసుల ప్రకారం, అరఫాలో నిలబడినను, మిగతా హజ్ ఆచారాలను పూర్తి చేయాల్సిందే. ఉదాహరణకు – ముజ్దలిఫాలో రాత్రి గడపడం, తవాఫ్ అల్ ఇఫాదహ్, సఫా మర్వా మధ్యలో సయీ, జమ్రాత్ ను రాళ్ళతో కొట్టడం, మినాలో రాత్రి గడపడం మొదలైనవి.[3]

 

అరఫాకు సంబంధించిన తప్పులు

  1. కొందరు అరఫా ప్రదేశానికి బయట సూర్యాస్తమయం వరకూ ఉంటారు. ఆ తరువాత ముజ్దలిఫాకు బయలుదేరుతారు. అరఫాలో సరిఅయిన విధంగా నిలబడరు. ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల హజ్ నెరవేరదు. ఎందుకంటే, అరఫాలో నిలబడటం హజ్ లోని ముఖ్యమైన అంశాలలో ఒకటి. అందుచేత అరఫా హద్దుల్లో ఉండడం తప్పనిసరి. దాని బయట కాదు. అలా చేయడం కుదరనిచో కనీసం సూర్యాస్తమయంకు ముందు అరఫాలో ప్రవేశించి, సూర్యాస్తమయం వరకు అక్కడ గడిపినను సరిపోతుంది. ప్రత్యేకంగా జంతు బలి ఇచ్చే రాత్రి అరఫాలో నిలబడటం కూడా ఆమోదించదగినదే.
     
  2. అరఫా నుండి సూర్యుడు అస్తమించక ముందే బయలుదేరడం నిషేధం. ఎందుకంటే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సూర్యుడు పూర్తిగా అస్తమించే వరకు అరఫాలోనే ఉన్నారు.
     
  3. ప్రజలను త్రోసుకుంటూ అరఫా పర్వతాన్ని ఎక్కడం మంచిది కాదు. దీని వల్ల ఇతరులకు హాని కలుగుతుంది. మొత్తం అరఫా మైదానంలో ఎక్కడ నిలబడినా పరవాలేదు. అరఫా పర్వతాన్ని ఎక్కడం గానీ, అక్కడ నమాజ్ చేయడం గానీ ఆమోదయోగ్యం కాదు.
     
  4. దుఆ చేస్తున్నప్పుడు అరఫా పర్వతం వైపు ముఖం చేయకూడదు. సున్నత్ ప్రకారం దుఆ చేస్తున్నప్పుడు ఖిబ్లా (కాబా) వైపు ముఖం చేయాలి.
     
  5. అరఫా రోజున ఒక చోట ఎక్కువగా గులకరాళ్ళను పోగు చేయడం ఉత్తమం కాదు. అల్లాహ్ షరియా (చట్టం)లో ఇలాంటి వాటికి చోటు లేదు. [4]

 

ఆధారాలు

[1] http://www.spubs.com/sps/sp.cfm?subsecID=IBD11&articleID=IBD110001&articlePages=9 (ఇంగ్లీష్)
[2] http://www.islamawareness.net/Dua/Fortress/119.html (ఇంగ్లీష్)
[3] http://islamqa.info/en/ref/106587/arafah (ఇంగ్లీష్)
[4] http://www.onislam.net/ (ఇంగ్లీష్)
 

 

1948 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్