అఖీదా


సరిఅయిన అఖీదా ఇస్లాం కు పునాది లాంటిది. అలాగే ఒక రాజ్యానికి మూలస్థంభం. ఒకరి మాటలు మరియు చేతలు అల్లాహ్ దగ్గర స్వీకరించబడాలంటే అవి ఇస్లామీయ శ్రియ (శాస్త్రం) ప్రకారం ఖుర్ఆన్ మరియు సున్నతుకు అనుగుణంగా ఉండాలి. ఒకవేళ అఖీదా సరిగ్గా లేనిచో మాటలు చేతలు రెండూ స్వీకరించబడవు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “.......విశ్వాసాన్ని తిరస్కరించినవారి కర్మలు వృధా అయిపోతాయి. పరలోకంలో వారు నష్టపోయిన వారిలో చేర్తారు.” ఖుర్ఆన్, సూరా మాయిదా 5:5.  “నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” ఖుర్ఆన్, సూరా జుమర్ 39:65

 

విషయసూచిక

 

అఖీదా పారిభాషిక భావం

అఖీదా పారిభాషికంగా అఖద అనే పదం నుంచి వచ్చింది. అరబిక్ భాషలో అఖద అంటే తాడు (ముడి వేసిన తాడు) అని అర్థం.


అల్లాహ్ ఖుర్ఆన్ లో సెలవిచ్చాడు: “మీరు పటిష్ట పరచిన ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని తప్పకుండా నిలదీస్తాడు” [ఖుర్ఆన్, సూరా అల్ మాయిదా 5:89]  ఇంకా ఇలా అన్నాడు, “ప్రమాణాలను ఖరారు చేసుకున్న మీదట భంగపరచకండి.” (ఖుర్ఆన్, సూరా నహ్ల్ 16:91)  


ఎవరైనా ‘అఖద్ ఇలా చేస్తాను’ అంటే అతను మనసులో దాని గురించి గట్టిగా నిర్ణయించుకున్నట్లే.


కావున ఇస్లామీయ విద్వంసుల ప్రకారం అల్ అఖీదా, అల్ ఇతిఖాద్ అంటే : ఎలాంటి సంశయం లేకుండా ఒకరి మనసులో జన్మించే పటిష్ట ఆలోచన.


అఖీదా ఇస్లామీయ భావం

అల్లాహ్ పై విశ్వాసం, ఆయన దైవదూతలు, ఆయన గ్రంథాలు, ఆయన దైవప్రవక్తలు, అంతిమదినం, విధివ్రాతపై విశ్వాసం – మంచి అయినా, చెడు అయినా. వీటిని విశ్వాసం (ఈమాన్) మూలస్తంభాలు అంటారు.


ఖుర్ఆన్

ధర్మానికి మూలస్థంభం సరిఅయిన విశ్వాసం (ఈమాన్). దాని ఆధారంగానే ఫలితం ఉంటుంది. అల్లాహ్ ఖుర్ఆన్ లో సెలవిచ్చాడు : ‘కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి. తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు.’ ఖుర్ఆన్, సూరా అల్ కహఫ్ 18:110


నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” ఖుర్ఆన్, సూరా అజ్ జుమర్ 39:65 


‘కాబట్టి నువ్వు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించు – ధర్మాన్ని ఆయనకు మాత్రమే ప్రత్యేకిస్తూ!’ ఖుర్ఆన్, సూరా అజ్ జుమర్ 39:2


కావున ఈ ఆయతులు, మరి ఎన్నో ఆయతుల ద్వారా తెలిసేదేమిటంటే (షిర్క్) బహుదైవారాధనతో కూడిన ఏ ఆచరణా స్వీకరించబడదు. కావున ప్రతి ప్రవక్త తమ ప్రజానీకాన్ని ముందుగా వారి విశ్వాసాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు. కేవలం అల్లాహ్ నే ప్రార్ధించండి, అతణ్ణి తప్ప వేరెవరినీ ప్రార్ధించకండి అనే ఉపదేశాన్నే ప్రతి ప్రవక్త చేశారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు : ‘మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తకు ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) “అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరాత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధపరచాము. ఖుర్ఆన్, సూరా అన్ నహ్ల్ 16:36


హదీస్

ఇబ్న్ అబ్బాస్ రజి అల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం : దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ముఆద్ ను యెమన్ పంపించేటప్పుడు ఇలా అన్నారు, “నువ్వు వెళ్ళే ప్రాంతం గ్రంథవహులది. కావున వారికి మొట్ట మొదటి విషయం అల్లాహ్ యొక్క తౌహీద్ (ఏకదైవారాధన) గురించి బోధించు. వారు దానిపై అమలు చేసినచో వారికి ఒక రోజులో చేయవలసిన ఐదు పూటల నమాజు గురించి తాకిదు చేయి. వారు నమాజు చదవడం ప్రారంభిస్తే వారికి జకాత్ చెల్లించమని చెప్పు. వారు దానికి ఒప్పుకున్నచో ధనికుల వర్గం నుండి జకాత్ రుసుము వసూలు చేసి బీదవారికి పంచిపెట్టాలి. సహీహ్ బుఖారి 9:469 (NE 7372)   

అఖీదా సరిచేయడం, ప్రతి ప్రవక్త మొదటి కర్తవ్యం

ప్రతి ప్రవక్త తన అనుచర సమాజానికి చెప్పింది ఒకటే, “ఓ నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్ ను ఆరాధించండి.అయన తప్ప వేరెవరూ మీ ఆరాధనకు అర్హులు కారు.” (ఖుర్ఆన్, సూరా అల్ ఆరాఫ్ 7:59,65,73,85). నూహ్, హూద్, సాలెహ్, షుఅయిబ్ అలైహిముస్సలామ్ – అందరూ తమ ప్రజానీకానికి ఇదే ఉపదేశించారు.

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవక్తగా నియమించబడ్డాక 13 సంవత్సరాలు మదీనాలో ప్రజలను తౌహీద్ వైపు పిలిచారు. వారి అఖీదాను సవరించారు. ఎందుకంటే పూర్తి ఇస్లామీయ ధర్మపు పునాదులు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి.

ఇస్లాం వైపు పిలిచే (దాయిలు) అందరూ – ఏ కాలానికి చెందినా వారైనా సరే, ఇతరులను ఇస్లాం వైపుకు పిలిచేటప్పుడు ప్రవక్తలనే ఆదర్శంగా తీసుకుంటారు. ముందుగా తౌహీద్ (ఏకదైవారాధన) పాఠం మరియు అఖీదాను సరిచేయడం వైపే మొగ్గు చూపారు. ఆ తరువాతే ఇతర ధర్మ శాసనాల వైపు దృష్టి సారించేవారు.


షేక్ సాలిహ్ అల్ ఫౌజాన్ ప్రకారం

మొట్టమొదటగా అఖీదా రావాలి. ఎందుకంటే ప్రవక్తలందరు ఇస్లాం వైపు పిలిచే మొదటి పిలుపు అఖీదా వైపే. ‘ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్ ను ఆరాధించండి. అయన తప్ప మీ ఆరాధ్య దేవుడెవడూ లేడు.’ ఖుర్ఆన్, సూరా హూద్ 11:84


అఖీదా ప్రాముఖ్యత ఎంత అంటే అది మానవుడు స్వర్గానికి పోతాడో లేదా నరకానికి వెళ్తాడో నిర్ణయిస్తుంది. ఖుర్ఆన్ లో అల్లాహ్ సెలవిచ్చాడు : “తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించిన వాడు ఘోర పాపంతో కూడిన కల్పన చేశాడు.” ఖుర్ఆన్, సూరా నిసా 4:48


షిర్క్ (బహుదైవారాధన) తౌహీద్ (ఏకదైవారాధన) కు వ్యతిరేకం. తౌహీద్ (ఏకదైవారాధన) సరిఅయిన అఖీదా (విశ్వాసం)కు మూలం. 


అఖీదా ప్రాముఖ్యతను చాటుతూ అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు : “నిస్సందేహంగా అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్ చేయటం) ఘోరమైన అన్యాయం. ఖుర్ఆన్, సూరా లుఖ్మాన్ 31:13


సరిఅయిన అఖీదా లేని కారణంగా నేడు ఇస్లామీయ ప్రపంచంలో చాలా భేదభావాలు కనిపిస్తున్నాయి. నేడు ముస్లింలలో సరిఅయిన అఖీదా లేని కారణంగా చాలా మంది సమాధుల చుట్టూ తిరుగుతూ ఆ సమాధుల్లో ఉన్నవారిని తమ కోరికలు తీర్చమని వేడుకుంటున్నారు. ఇలాంటి వారు చాలా అంధకారంలో పడిఉన్నారు. వీరు ఖుర్ఆన్ లోని అల్లాహ్ ఆదేశాలను వినలేదా :


“ఒకవేళ మీరు వారిని మొరపెట్టుకున్నా, వారు మీ మొరను ఆలకించరు. ఒకవేళ ఆలకించినా, మీ అక్కరను తీర్చలేరు. పై పెచ్చు ప్రళయదినాన మీరు కల్పించే భాగస్వామ్యాన్ని (షిర్క్ ను) వారు (సూటిగా) త్రోసిపుచ్చుతారు. అన్నీ తెలిసిన దేవుని మాదిరిగా (సావధానపరిచే సమాచారాన్ని) నీకు తెలిపే వాడెవడూ ఉండడు సుమా!” ఖుర్ఆన్, సూరా ఫాతిర్ 35:14


ఆధారాలు

[1] http://www.islamhouse.com/p/52983,(ఇంగ్లీష్)
[2] http://abdurrahman.org/aqeeda/aqeedaimp.html (ఇంగ్లీష్)
[3] [5] http://www.qsep.com/modules.php?name=assunnah&d_op=viewarticle&aid=89 (ఇంగ్లీష్)
[4] http://sunnah.com/bukhari/97 (ఇంగ్లీష్)
[6] http://www.Allahuakbar.net/article_read.asp?id=498 (ఇంగ్లీష్)
 

3653 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్