Translation
| 59. సూరా అల్ హష్ర్ 59:1 سَبَّحَ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నది. ఆయన మహాశక్తిమంతుడు, వివేకవంతుడు. 59:2 هُوَ الَّذِي أَخْرَجَ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ مِن دِيَارِهِمْ لِأَوَّلِ الْحَشْرِ ۚ مَا ظَنَنتُمْ أَن يَخْرُجُوا ۖ وَظَنُّوا أَنَّهُم مَّانِعَتُهُمْ حُصُونُهُم مِّنَ اللَّهِ فَأَتَاهُمُ اللَّهُ مِنْ حَيْثُ لَمْ يَحْتَسِبُوا ۖ وَقَذَفَ فِي قُلُوبِهِمُ الرُّعْبَ ۚ يُخْرِبُونَ بُيُوتَهُم بِأَيْدِيهِمْ وَأَيْدِي الْمُؤْمِنِينَ فَاعْتَبِرُوا يَا أُولِي الْأَبْصَارِ ఆయనే గ్రంథవహులలోని అవిశ్వాసులను వారి ఇండ్ల నుండి తొలి (సారి) సమీకరణలోనే తీసివేశాడు. వారు వెళ్లి పోతారని మీరు (సయితం) ఊహించలేదు. (పటిష్టమైన) తమ కోటలు తమను అల్లాహ్ (దెబ్బ) నుండి రక్షిస్తాయని వారు అనుకున్నారు. అయితే వారు ఊహించని చోటు నుంచి అల్లాహ్ దెబ్బ వారిపై విరుచుకుపడింది. ఇంకా అల్లాహ్ వారి గుండెల్లో దడ పుట్టించాడు. వారు తమ ఇండ్లను చేజేతులా కొల్లగొట్టసాగారు. ముస్లింల చేతుల మీదుగా కూడా (ధ్వంసం చేయించుకున్నారు). కాబట్టి ఓ కళ్ళున్నవారలారా! దీని ద్వారా గుణపాఠం నేర్చుకోండి. 59:3 وَلَوْلَا أَن كَتَبَ اللَّهُ عَلَيْهِمُ الْجَلَاءَ لَعَذَّبَهُمْ فِي الدُّنْيَا ۖ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابُ النَّارِ ఒకవేళ అల్లాహ్ వారిపై దేశ బహిష్కరణను వ్రాసి ఉండకపోతే, వారిని ప్రపంచంలోనే దండించి ఉండేవాడు. పరలోకంలోనయితే వారికి నరకాగ్ని శిక్ష ఎలాగూ ఉంది. 59:4 ذَٰلِكَ بِأَنَّهُمْ شَاقُّوا اللَّهَ وَرَسُولَهُ ۖ وَمَن يُشَاقِّ اللَّهَ فَإِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ ఈ విధంగా ఎందుకు జరిగిందంటే వారు అల్లాహ్ పై, ఆయన ప్రవక్తపై కయ్యానికి కాలు దువ్వారు. ఎవడు అల్లాహ్ పై కయ్యానికి కాలు దువ్వినా అల్లాహ్ వాడ్ని చాలా కఠీనంగా శిక్షిస్తాడు. 59:5 مَا قَطَعْتُم مِّن لِّينَةٍ أَوْ تَرَكْتُمُوهَا قَائِمَةً عَلَىٰ أُصُولِهَا فَبِإِذْنِ اللَّهِ وَلِيُخْزِيَ الْفَاسِقِينَ మీరు కొన్ని ఖర్జూరపు వృక్షాలను నరికివేసినా లేదా వాటిని వాటి వ్రేళ్ళపై నిలిచి ఉండేలా వదిలివేసినా – ఇదంతా అల్లాహ్ అనుజ్ఞతోనే జరిగింది. అవిధేయులను అవమానపరచటానికి (ఆపాటి చర్య అవసరమయింది). 59:6 وَمَا أَفَاءَ اللَّهُ عَلَىٰ رَسُولِهِ مِنْهُمْ فَمَا أَوْجَفْتُمْ عَلَيْهِ مِنْ خَيْلٍ وَلَا رِكَابٍ وَلَٰكِنَّ اللَّهَ يُسَلِّطُ رُسُلَهُ عَلَىٰ مَن يَشَاءُ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ఇంకా – అల్లాహ్ తన ప్రవక్తకు అందజేసిన వారి సొమ్ముల కోసం మీరు మీ గుర్రాలనుగానీ, ఒంటెలనుగానీ పరుగెత్తించలేదు. అల్లాహ్ తన ప్రవక్తలకు తాను కోరిన వారిపై అధికారం వొసగుతాడు. అల్లాహ్ కు అన్నింటిపై అధికారం ఉంది. 59:7 مَّا أَفَاءَ اللَّهُ عَلَىٰ رَسُولِهِ مِنْ أَهْلِ الْقُرَىٰ فَلِلَّهِ وَلِلرَّسُولِ وَلِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ كَيْ لَا يَكُونَ دُولَةً بَيْنَ الْأَغْنِيَاءِ مِنكُمْ ۚ وَمَا آتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانتَهُوا ۚ وَاتَّقُوا اللَّهَ ۖ إِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ (మీరు చెమటోడ్చకుండానే ఇతర) పుర ప్రజల నుండి అల్లాహ్ తన ప్రవక్తకు స్వాధీనపరచిన సొమ్ము అల్లాహ్ కు, ప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, నిరుపేదలకు, బాటసారులకు వర్తిస్తుంది. ఈ సంపద మీలోని ధనిక వర్గాల మధ్యనే పరిభ్రమిస్తూ ఉండరాదన్న ఉద్దేశంతో ఈ విధంగా నిర్ణయించటం జరిగింది. దైవప్రవక్త మీకు ఇచ్చిన దానిని (సంతోషంగా) పుచ్చుకోండి. ఆయన ఏ విషయం నుండైన మిమ్మల్ని వారిస్తే, దాన్ని వదిలిపెట్టండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించగలవాడు. 59:8 لِلْفُقَرَاءِ الْمُهَاجِرِينَ الَّذِينَ أُخْرِجُوا مِن دِيَارِهِمْ وَأَمْوَالِهِمْ يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا وَيَنصُرُونَ اللَّهَ وَرَسُولَهُ ۚ أُولَٰئِكَ هُمُ الصَّادِقُونَ (ముఖ్యంగా ఈ ‘పై’ సొమ్ము) తమ ఇల్లూ వాకిలి నుండి, తమ ఆస్తి పాస్తుల నుండి గెంటివేయబడిన నిరుపేద ముహాజిర్లకు వర్తిస్తుంది. (ఎందుకంటే) వారు దైవానుగ్రహాన్ని, దైవప్రసన్నతను ఆశిస్తూ, దైవానికీ, ఆయన ప్రవక్తకు తోడ్పడుతున్నారు. వారే అసలు సిసలు సత్య సంధులు. 59:9 وَالَّذِينَ تَبَوَّءُوا الدَّارَ وَالْإِيمَانَ مِن قَبْلِهِمْ يُحِبُّونَ مَنْ هَاجَرَ إِلَيْهِمْ وَلَا يَجِدُونَ فِي صُدُورِهِمْ حَاجَةً مِّمَّا أُوتُوا وَيُؤْثِرُونَ عَلَىٰ أَنفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ ۚ وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ఇకపోతే వీరికంటే ముందే ఈ ప్రదేశం (మదీనా)లోనూ, విశ్వాసంలోనూ స్థానికులై ఉన్నవారు (వారికి కూడా ఈ సొమ్ము వర్తిస్తుంది); వారు ఇల్లూ వాకిలిని వదలి తమ వైపుకు వలస వచ్చే ముహాజిర్లను ప్రేమిస్తారు. వారికి ఏమి ఇవ్వబడినా దానిపై తమ అంతర్యాలలో ఏ కాస్త అసూయను కూడా రానివ్వరు. తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమపైన వారికే ప్రాధాన్యతనిస్తారు. వాస్తవానికి తమ స్వార్థ ప్రియత్వం (పేరాశ) నుండి రక్షించబడినవారే కృతార్థులు. 59:10 وَالَّذِينَ جَاءُوا مِن بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ وَلَا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلًّا لِّلَّذِينَ آمَنُوا رَبَّنَا إِنَّكَ رَءُوفٌ رَّحِيمٌ వారి తరువాత వచ్చినవారు (వారికీ ఈ సొమ్ము వర్తిస్తుంది), వారిలా వేడుకుంటారు : “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగినవాడవు, కనికరించేవాడవు.” 59:11 أَلَمْ تَرَ إِلَى الَّذِينَ نَافَقُوا يَقُولُونَ لِإِخْوَانِهِمُ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ لَئِنْ أُخْرِجْتُمْ لَنَخْرُجَنَّ مَعَكُمْ وَلَا نُطِيعُ فِيكُمْ أَحَدًا أَبَدًا وَإِن قُوتِلْتُمْ لَنَنصُرَنَّكُمْ وَاللَّهُ يَشْهَدُ إِنَّهُمْ لَكَاذِبُونَ (ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) నీవు కపటులను చూడలేదా? వారు గ్రంథవహుల్లోని తమ అవిశ్వాస సోదరులతో, “మీరు గనక దేశం నుండి బహిష్కరించబడితే మేము కూడా తప్పకుండా మీ వెంట బయలుదేరతాము. మీ విషయంలో మేమెన్నటికీ ఎవరి మాటా వినము. ఒకవేళ మీతో గనక యుద్ధం జరిగితే మేము మీకు తప్పకుండా సాయం చేస్తాము” అని అంటారు. కాని వాళ్ళు వట్టి అబద్ధాలరాయుళ్ళని అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు. 59:12 لَئِنْ أُخْرِجُوا لَا يَخْرُجُونَ مَعَهُمْ وَلَئِن قُوتِلُوا لَا يَنصُرُونَهُمْ وَلَئِن نَّصَرُوهُمْ لَيُوَلُّنَّ الْأَدْبَارَ ثُمَّ لَا يُنصَرُونَ ఒకవేళ వారు వెళ్ళగొట్టబడితే, వీరు వారితో పాటు వెళ్ళే రకం కాదు. ఒకవేళ వారితో యుద్ధం చేయబడితే వీళ్ళు వారికి సాయం కూడా చేయరు. ఒకవేళ సాయంగా వచ్చినా వెన్నుచూపి పారిపోతారు. మరి వారికి ఎలాంటి తోడ్పాటు కూడా లభించదు. 59:13 لَأَنتُمْ أَشَدُّ رَهْبَةً فِي صُدُورِهِم مِّنَ اللَّهِ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُونَ (ముస్లిములారా!) వారి హృదయాలలో అల్లాహ్ భయం కన్నా అధికంగా మీ భయం ఉంది. ఎందుకంటే వారు తెలివి లేని జనులు. 59:14 لَا يُقَاتِلُونَكُمْ جَمِيعًا إِلَّا فِي قُرًى مُّحَصَّنَةٍ أَوْ مِن وَرَاءِ جُدُرٍ ۚ بَأْسُهُم بَيْنَهُمْ شَدِيدٌ ۚ تَحْسَبُهُمْ جَمِيعًا وَقُلُوبُهُمْ شَتَّىٰ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْقِلُونَ వారంతా ఏకమైనా మీతో (మైదానాలలో) పోరాడలేరు. అయితే కోటలు గల పురములలో ఉండిగానీ, గోడల చాటున మాటేసిగానీ పోరాడగలరు. అసలు వాళ్ళ మధ్యనే తీవ్రమైన మనస్పర్ధలు ఉన్నాయి. వాళ్ళు కలసికట్టుగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు. కాని వారి మనసులు పరస్పరం వేరుపడి ఉన్నాయి. వాళ్ళ ఈ (దు)స్థితికి కారణం వాళ్ళ తెలివి మాలినతనమే. 59:15 كَمَثَلِ الَّذِينَ مِن قَبْلِهِمْ قَرِيبًا ۖ ذَاقُوا وَبَالَ أَمْرِهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ చూడబోతే వీళ్ళ వ్యవహారం వీరికి కొద్దికాలం క్రితమే గతించినవారిని పోలి ఉన్నది. వారెలాగూ తమ స్వయంకృతపు రుచిని చూశారు. వ్యధాభరితమైన శిక్ష కూడా వారికి పడుతుంది. 59:16 كَمَثَلِ الشَّيْطَانِ إِذْ قَالَ لِلْإِنسَانِ اكْفُرْ فَلَمَّا كَفَرَ قَالَ إِنِّي بَرِيءٌ مِّنكَ إِنِّي أَخَافُ اللَّهَ رَبَّ الْعَالَمِينَ వీళ్ళ సంగతి షైతాను మాదిరిగా ఉన్నది. వాడు మానవునితో, “తిరస్కార వైఖరిని అవలంబించు” అని అంటాడు. తీరా అతను తిరస్కార వైఖరికి పాల్పడినప్పుడు “నీతో నాకెలాంటి సంబంధం లేదు, పో. నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కు భయపడుతున్నాను” అని అంటాడు. 59:17 فَكَانَ عَاقِبَتَهُمَا أَنَّهُمَا فِي النَّارِ خَالِدَيْنِ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَاءُ الظَّالِمِينَ పర్యవసానంగా వారిరువురూ (నరకం) అగ్నిలో ఉంటారు – శాశ్వతంగా ఉండేవారుగా! తమ ఆత్మలకు అన్యాయం చేసుకునే వారికి తగిన శాస్తి ఇదే. 59:18 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَلْتَنظُرْ نَفْسٌ مَّا قَدَّمَتْ لِغَدٍ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. ప్రతి వ్యక్తీ రేపటి (తీర్పుదినం) కొరకు తానేం పంపుకున్నాడో చూసుకోవాలి. ఎల్ల వేళలా అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్ కనిపెట్టుకునే ఉన్నాడు. 59:19 وَلَا تَكُونُوا كَالَّذِينَ نَسُوا اللَّهَ فَأَنسَاهُمْ أَنفُسَهُمْ ۚ أُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ మీరు అల్లాహ్ ను మరచిపోయిన వారి మాదిరిగా అయిపోకండి. (వారి ఈ విస్మరణ కారణంగా) అల్లాహ్ కూడా వారిని తమ అత్మలనే మరచిపోయిన వారిగా చేసేశాడు. ఇలాంటి వారే పరమ అవిధేయులు. 59:20 لَا يَسْتَوِي أَصْحَابُ النَّارِ وَأَصْحَابُ الْجَنَّةِ ۚ أَصْحَابُ الْجَنَّةِ هُمُ الْفَائِزُونَ నరకవాసులు – స్వర్గవాసులు ఎన్నటికీ సమానులు కాలేరు. స్వర్గవాసులు మాత్రమే సాఫల్యం పొందినవారు. 59:21 لَوْ أَنزَلْنَا هَٰذَا الْقُرْآنَ عَلَىٰ جَبَلٍ لَّرَأَيْتَهُ خَاشِعًا مُّتَصَدِّعًا مِّنْ خَشْيَةِ اللَّهِ ۚ وَتِلْكَ الْأَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ ఒకవేళ మేము ఈ ఖుర్ఆన్ ను ఏ పర్వతం మీదనో దింపి ఉంటే అది అల్లాహ్ భీతితో అణగారి, తునాతునకలై పోవటాన్ని నీవు చూసి ఉండేవాడివి. ప్రజలు యోచన చేయగలందులకు గాను మేము ఈ దృష్టాంతాలను వారికి వివరిస్తున్నాము. 59:22 هُوَ اللَّهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ ۖ هُوَ الرَّحْمَٰنُ الرَّحِيمُ ఆయనే అల్లాహ్. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు – గోప్యంగా ఉన్నవాటిని, బహిర్గతమై ఉన్నవాటిని ఎరిగినవాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు. 59:23 هُوَ اللَّهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ الْمَلِكُ الْقُدُّوسُ السَّلَامُ الْمُؤْمِنُ الْمُهَيْمِنُ الْعَزِيزُ الْجَبَّارُ الْمُتَكَبِّرُ ۚ سُبْحَانَ اللَّهِ عَمَّا يُشْرِكُونَ ఆయనే అల్లాహ్. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే రాజాధిరాజు, (పరమ పవిత్రుడు), లోపాలన్నింటికీ అతీతుడు, శాంతి (భద్రతల) ప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు, బలపరాక్రమాలు గలవాడు, పెద్దరికం గలవాడు. ప్రజలు ఆయనకు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్ పవిత్రంగా ఉన్నాడు. 59:24 هُوَ اللَّهُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ ۖ لَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ ۚ يُسَبِّحُ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ఆయనే అల్లాహ్ – సృష్టికర్త, ఉనికిని ప్రసాదించేవాడు, రూపకల్పన చేసేవాడు. అత్యున్నతమైన పేర్లు ఆయనకు ఉన్నాయి. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువూ ఆయన పవిత్రతను కొనియాడుతోంది. ఆయనే సర్వాధికుడు, వివేకవంతుడు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |