Translation
| 43. సూరా అజ్ జుఖ్ రుఫ్ 43:1 حم హా మీమ్. 43:2 وَالْكِتَابِ الْمُبِينِ సుస్పష్టమైన (ఈ) గ్రంథం సాక్షిగా! 43:3 إِنَّا جَعَلْنَاهُ قُرْآنًا عَرَبِيًّا لَّعَلَّكُمْ تَعْقِلُونَ మీరు అర్థం చేసుకోవటానికిగాను మేము దీనిని అరబీ ఖురానుగా చేశాము. 43:4 وَإِنَّهُ فِي أُمِّ الْكِتَابِ لَدَيْنَا لَعَلِيٌّ حَكِيمٌ నిశ్చయంగా ఇది మాతృగ్రంథం (లౌహె మహ్‌ఫూజ్)లో ఉన్నది. మా వద్ద అది ఎంతో ఉన్నతమైన, వివేకంతో నిండిన గ్రంథంగా ఉన్నది. 43:5 أَفَنَضْرِبُ عَنكُمُ الذِّكْرَ صَفْحًا أَن كُنتُمْ قَوْمًا مُّسْرِفِينَ ఏమిటి? మీరు హద్దు మీరిపోయే జనులైనందున మేము ఈ ఉపదేశాన్ని మీ నుంచి మళ్లించాలా? 43:6 وَكَمْ أَرْسَلْنَا مِن نَّبِيٍّ فِي الْأَوَّلِينَ మేము పూర్వీకులలో కూడా ఎంతోమంది ప్రవక్తల్ని పంపించాము. 43:7 وَمَا يَأْتِيهِم مِّن نَّبِيٍّ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ తమ వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు అతన్ని పరిహసించకుండా వదల్లేదు. 43:8 فَأَهْلَكْنَا أَشَدَّ مِنْهُم بَطْشًا وَمَضَىٰ مَثَلُ الْأَوَّلِينَ మేము వీళ్ళకన్నా ఎక్కువ ఘటికులనే పట్టుకొని అంత మొందించాము. పూర్వీకుల దృష్టాంతాలు గడచిఉన్నాయి. 43:9 وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ خَلَقَهُنَّ الْعَزِيزُ الْعَلِيمُ "భూమ్యాకాశాలను సృష్టించినదెవరు?" అని నువ్వు గనక వారిని ప్రశ్నిస్తే, "సర్వశక్తుడు, సర్వజ్ఞాని అయినవాడే (అల్లాహ్‌యే) సృష్టించాడ"ని వారు తప్పకుండా సమాధానమిస్తారు. 43:10 الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ مَهْدًا وَجَعَلَ لَكُمْ فِيهَا سُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُونَ ఆయనే మీకోసం భూమిని పాన్పుగా చేశాడు. మీరు మార్గం తెలుసుకోగలగటానికి అందులో మీ కోసం దారులను ఏర్పరచాడు. 43:11 وَالَّذِي نَزَّلَ مِنَ السَّمَاءِ مَاءً بِقَدَرٍ فَأَنشَرْنَا بِهِ بَلْدَةً مَّيْتًا ۚ كَذَٰلِكَ تُخْرَجُونَ మరి ఆయనే ఒక లెక్క ప్రకారం ఆకాశం నుంచి నీళ్ళను కురిపించాడు. ఆ విధంగా మేము దాంతో (ఆ నీటితో) సచ్చిన సీమను బ్రతికించాము. మీరూ (సమాధుల నుండి) అలాగే వెలికి తీయబడతారు. 43:12 وَالَّذِي خَلَقَ الْأَزْوَاجَ كُلَّهَا وَجَعَلَ لَكُم مِّنَ الْفُلْكِ وَالْأَنْعَامِ مَا تَرْكَبُونَ ఆయన వస్తువులన్నింటికీ జతలను సృష్టించాడు. మరి మీ కోసం ఓడలను, పశువులను (కూడా) చేశాడు. వాటిపై మీరు ఎక్కిపోతుంటారు. 43:13 لِتَسْتَوُوا عَلَىٰ ظُهُورِهِ ثُمَّ تَذْكُرُوا نِعْمَةَ رَبِّكُمْ إِذَا اسْتَوَيْتُمْ عَلَيْهِ وَتَقُولُوا سُبْحَانَ الَّذِي سَخَّرَ لَنَا هَٰذَا وَمَا كُنَّا لَهُ مُقْرِنِينَ మీరు వాటి వీపులపై ఎక్కి, ఆ తర్వాత వాటి మీద సర్దుకుని కూర్చున్నప్పుడు మీ ప్రభువు అనుగ్రహాన్ని స్మరిస్తారని (ఇదంతా చేశాము). మీరు ఇలా పలకండి: "దీనిని మాకు వశపరచినవాడు పరమ పవిత్రుడు. లేకపోతే దీనిని వశపరచుకోవటం మావల్ల అయ్యేపనికాదు. 43:14 وَإِنَّا إِلَىٰ رَبِّنَا لَمُنقَلِبُونَ "నిశ్చయంగా మేము (ఎట్టకేలకు) మా ప్రభువు వద్దకు మరలిపోవలసిన వారమే." 43:15 وَجَعَلُوا لَهُ مِنْ عِبَادِهِ جُزْءًا ۚ إِنَّ الْإِنسَانَ لَكَفُورٌ مُّبِينٌ ఇంకా వీళ్లు అల్లాహ్ దాసులలో కొందరిని ఆయన భాగంగా చేశారు. నిజంగా మానవుడు చాలా స్పష్టంగా కృతఘ్నతకు పాల్పడతాడు. 43:16 أَمِ اتَّخَذَ مِمَّا يَخْلُقُ بَنَاتٍ وَأَصْفَاكُم بِالْبَنِينَ ఏమిటి, అల్లాహ్ తాను సృష్టించిన వారిలో నుంచి కూతుళ్ళను తన కోసం కేటాయించుకుని, మీకేమో కొడుకులను అనుగ్రహించాడా? 43:17 وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِمَا ضَرَبَ لِلرَّحْمَٰنِ مَثَلًا ظَلَّ وَجْهُهُ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ మరి వారిలో ఎవరికయినా, కరుణామయుడైన అల్లాహ్‌కు అతను అంటగట్టిన ఉపమానం అతనికే కలిగిందనే శుభవార్తను అందజేస్తే అతని ముఖంపై చీకటి ఆవరిస్తుంది. ఆపై అతను దుఃఖించసాగుతాడు. 43:18 أَوَمَن يُنَشَّأُ فِي الْحِلْيَةِ وَهُوَ فِي الْخِصَامِ غَيْرُ مُبِينٍ ఏమిటీ, ఆభరణాల మధ్య పెరిగి, వాదోపవాదాలలో (తన మాటను) స్పష్టంగా విడమరచి చెప్పలేని (ఆడ సంతానం అల్లాహ్ వాటాలోనికి వస్తుందా?) 43:19 وَجَعَلُوا الْمَلَائِكَةَ الَّذِينَ هُمْ عِبَادُ الرَّحْمَٰنِ إِنَاثًا ۚ أَشَهِدُوا خَلْقَهُمْ ۚ سَتُكْتَبُ شَهَادَتُهُمْ وَيُسْأَلُونَ కరుణామయుని (అల్లాహ్) దాసులైన దైవదూతలను వీళ్లు ఆడవారుగా ఖరారు చేశారు. ఏమిటి, వారి పుట్టుక సందర్భంగా వీళ్ళుగాని అక్కడ ఉన్నారా? వీళ్ల ఈ సాక్ష్యం వ్రాసుకోబడుతుంది. (దీని గురించి) వీళ్లు తప్పకుండా నిలదీసి అడగబడతారు. 43:20 وَقَالُوا لَوْ شَاءَ الرَّحْمَٰنُ مَا عَبَدْنَاهُم ۗ مَّا لَهُم بِذَٰلِكَ مِنْ عِلْمٍ ۖ إِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ "కరుణామయుడు (అయిన అల్లాహ్) తలచి ఉంటే మేము వాళ్ళను పూజించేవారం కాము" అని (వీళ్లు కబుర్లు) చెబుతున్నారు. దీనికి సంబంధించి వీరికసలు ఏమీ తెలీదు. అవి కేవలం వీళ్ల ఊహాగానాలు మాత్రమే. 43:21 أَمْ آتَيْنَاهُمْ كِتَابًا مِّن قَبْلِهِ فَهُم بِهِ مُسْتَمْسِكُونَ ఏమిటి, దీనికి మునుపు మేము వారికి ఏదైనా (వేరే) గ్రంథం ఇచ్చి ఉన్నామా? దాన్ని గాని వారు గట్టిగా పట్టుకొని ఉన్నారా? 43:22 بَلْ قَالُوا إِنَّا وَجَدْنَا آبَاءَنَا عَلَىٰ أُمَّةٍ وَإِنَّا عَلَىٰ آثَارِهِم مُّهْتَدُونَ అది కాదు, "మా తాతముత్తాతలు ఒకానొక పద్ధతిపై ఉండటం మేము చూశాము. మేము వాళ్ల అడుగుజాడలలోనే నడుచుకుని సన్మార్గం పొందాము" అని వారు బుకాయిస్తారు. 43:23 وَكَذَٰلِكَ مَا أَرْسَلْنَا مِن قَبْلِكَ فِي قَرْيَةٍ مِّن نَّذِيرٍ إِلَّا قَالَ مُتْرَفُوهَا إِنَّا وَجَدْنَا آبَاءَنَا عَلَىٰ أُمَّةٍ وَإِنَّا عَلَىٰ آثَارِهِم مُّقْتَدُونَ ఇలాగే నీకు మునుపు మేము ఏ బస్తీలో హెచ్చరించేవాణ్ణి పంపినా అక్కడి శ్రీమంతులు కూడా, "మేము మా తాత ముత్తాతలను ఒక పద్ధతిపై ఉండటం చూశాము. మేము కూడా వారి పాదచిహ్నాలలోనే నడుస్తాము" అని చెప్పేవారు. 43:24 قَالَ أَوَلَوْ جِئْتُكُم بِأَهْدَىٰ مِمَّا وَجَدتُّمْ عَلَيْهِ آبَاءَكُمْ ۖ قَالُوا إِنَّا بِمَا أُرْسِلْتُم بِهِ كَافِرُونَ "మీ తాతముత్తాతలు అనుసరిస్తుండగా మీరు చూసిన మార్గం కంటే చాలా మంచి మార్గాన్ని (గమ్యానికి చేర్చే మార్గాన్ని) నేను మీ వద్దకు తీసుకువచ్చాను" అని (దైవప్రవక్త) అన్నప్పుడు, "మీకిచ్చి పంపబడిన పద్ధతిని మేము తిరస్కరిస్తున్నాం" అని వాళ్లు (తెగేసి) చెప్పారు. 43:25 فَانتَقَمْنَا مِنْهُمْ ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ అందుకే మేము వారిపై ప్రతీకారం తీర్చుకున్నాము. మరి ధిక్కరించిన వారికి పట్టిన గతేమిటో చూడు! 43:26 وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِ إِنَّنِي بَرَاءٌ مِّمَّا تَعْبُدُونَ ఇబ్రాహీము తన తండ్రితోనూ, తన జాతి వారితోనూ పలికినప్పటి విషయం (స్మరించదగినది. ఆయన ఇలా అన్నాడు): "మీరు పూజించే వాటి నుంచి నేను వేరైపోయాను. 43:27 إِلَّا الَّذِي فَطَرَنِي فَإِنَّهُ سَيَهْدِينِ "నన్ను పుట్టించిన వానిని మాత్రమే (నేను ఆరాధిస్తాను). ఆయనే నాకు సన్మార్గం చూపుతాడు." 43:28 وَجَعَلَهَا كَلِمَةً بَاقِيَةً فِي عَقِبِهِ لَعَلَّهُمْ يَرْجِعُونَ మరి ఇబ్రాహీము ఈ మాటే - తన తదనంతరం - తన సంతానంలో మిగిలి ఉండేట్లుగా చేసి వెళ్ళాడు - ప్రజలు (షిర్క్ నుంచి) మరలిరావటానికి. 43:29 بَلْ مَتَّعْتُ هَٰؤُلَاءِ وَآبَاءَهُمْ حَتَّىٰ جَاءَهُمُ الْحَقُّ وَرَسُولٌ مُّبِينٌ పైగా నేను వారికీ, వారి పితామహులకు జీవన సామగ్రిని విరివిగా ప్రసాదించాను - చివరికి వారి వద్దకు సత్యం వచ్చేసింది. అన్నింటినీ విడమరచి చెప్పే ప్రవక్త కూడా వచ్చేశాడు. 43:30 وَلَمَّا جَاءَهُمُ الْحَقُّ قَالُوا هَٰذَا سِحْرٌ وَإِنَّا بِهِ كَافِرُونَ తీరా సత్యం వచ్చేశాక, "ఇదొక ఇంద్రజాలం. దీన్ని మేము త్రోసిపుచ్చుతున్నాం" అని వారు చెప్పేశారు. 43:31 وَقَالُوا لَوْلَا نُزِّلَ هَٰذَا الْقُرْآنُ عَلَىٰ رَجُلٍ مِّنَ الْقَرْيَتَيْنِ عَظِيمٍ "అవునూ, ఈ ఖుర్‌ఆను ఈ రెండు (ప్రసిద్ధ) నగరాలలో ఉండే ఎవరో ఒక ప్రముఖునిపై ఎందుకు అవతరింపజేయబడలేదు?" అని వారు అనసాగారు. 43:32 أَهُمْ يَقْسِمُونَ رَحْمَتَ رَبِّكَ ۚ نَحْنُ قَسَمْنَا بَيْنَهُم مَّعِيشَتَهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا ۚ وَرَفَعْنَا بَعْضَهُمْ فَوْقَ بَعْضٍ دَرَجَاتٍ لِّيَتَّخِذَ بَعْضُهُم بَعْضًا سُخْرِيًّا ۗ وَرَحْمَتُ رَبِّكَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ ఏమిటి, వారు నీ ప్రభువు కారుణ్యాన్ని పంచుతున్నారా? యదార్థానికి మేమే వారి ప్రాపంచిక జీవితంలో వారి ఉపాధిని వారి మధ్య పంచిపెట్టాము. కొందరు మరి కొందరిని లోబరచి ఉంచేందుకుగాను - అంతస్థుల రీత్యా - కొందరికి మరి కొందరిపై ఆధిక్యతను వొసగాము. వారు ప్రోగు చేస్తూపోయే దానికన్నా నీ ప్రభువు కారుణ్యం ఎంతో మేలైనది సుమా! 43:33 وَلَوْلَا أَن يَكُونَ النَّاسُ أُمَّةً وَاحِدَةً لَّجَعَلْنَا لِمَن يَكْفُرُ بِالرَّحْمَٰنِ لِبُيُوتِهِمْ سُقُفًا مِّن فِضَّةٍ وَمَعَارِجَ عَلَيْهَا يَظْهَرُونَ మానవులంతా ఒకే వర్గంగా తయారవుతారనే మాటే గనక లేకుంటే, కరుణామయుని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించే వారి ఇళ్ళ పైకప్పులను, వారు ఎక్కే మెట్లను (కూడా) మేము వెండితో చేసి ఉండేవారం. 43:34 وَلِبُيُوتِهِمْ أَبْوَابًا وَسُرُرًا عَلَيْهَا يَتَّكِئُونَ వారి ఇళ్ల తలుపులను, వారు దిండ్లకు ఆనుకుని కూర్చునే పీఠాలను కూడా (వెండితో చేసి ఉండేవారము). 43:35 وَزُخْرُفًا ۚ وَإِن كُلُّ ذَٰلِكَ لَمَّا مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا ۚ وَالْآخِرَةُ عِندَ رَبِّكَ لِلْمُتَّقِينَ బంగారు వస్తువులుగా కూడా చేసి ఉండేవారం. ఇదంతా ఐహిక జీవితపు లాభం మాత్రమే. పరలోకం మాత్రం నీ ప్రభువు దగ్గర కేవలం భయభక్తులు గలవారికే లభిస్తుంది. 43:36 وَمَن يَعْشُ عَن ذِكْرِ الرَّحْمَٰنِ نُقَيِّضْ لَهُ شَيْطَانًا فَهُوَ لَهُ قَرِينٌ కరుణామయుని స్మరణ పట్ల గుడ్డిగా వ్యవహరించే వ్యక్తిపై మేము షైతానును నియమిస్తాము. ఇక వాడే అతనికి సహవాసిగా ఉంటాడు. 43:37 وَإِنَّهُمْ لَيَصُدُّونَهُمْ عَنِ السَّبِيلِ وَيَحْسَبُونَ أَنَّهُم مُّهْتَدُونَ వారు (ఆ షైతానులు) వారిని సన్మార్గాన పోకుండా అడ్డుకుంటారు. మరి వారేమో తాము సన్మార్గంపైనే ఉన్నామని భ్రమపడుతూ ఉంటారు. 43:38 حَتَّىٰ إِذَا جَاءَنَا قَالَ يَا لَيْتَ بَيْنِي وَبَيْنَكَ بُعْدَ الْمَشْرِقَيْنِ فَبِئْسَ الْقَرِينُ ఆఖరికి అతను మా వద్దకు వచ్చినప్పుడు, "ఆహ్! నీకూ - నాకూ మధ్య తూర్పు - పడమరలకు మధ్య ఉన్నంత దూరం ఉండి ఉంటే ఎంత బావుండేది! నువ్వు మహాచెడ్డ సావాసివి" అని (తన వెంటనున్న షైతానుతో) అంటాడు. 43:39 وَلَن يَنفَعَكُمُ الْيَوْمَ إِذ ظَّلَمْتُمْ أَنَّكُمْ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ మీరు దుర్మార్గులని తేలిపోయినప్పుడు, ఈ రోజు మీరంతా నరక యాతనలో భాగస్థులై ఉండటం మీకెలాంటి లబ్దినీ చేకూర్చదు. 43:40 أَفَأَنتَ تُسْمِعُ الصُّمَّ أَوْ تَهْدِي الْعُمْيَ وَمَن كَانَ فِي ضَلَالٍ مُّبِينٍ (ఓ ప్రవక్తా!) మరి నువ్వు చెవిటివారికి వినిపించగలవా? అంధులకుగాని, స్పష్టమైన మార్గభ్రష్టతకు లోనై ఉన్నవారికిగాని సన్మార్గం చూపగలవా? 43:41 فَإِمَّا نَذْهَبَنَّ بِكَ فَإِنَّا مِنْهُم مُّنتَقِمُونَ ఒకవేళ మేము నిన్ను ఇక్కడి నుంచి తీసుకుపోయినా, మేము వారిపై ప్రతీకారం తీర్చుకోవటం మటుకు ఖాయం. 43:42 أَوْ نُرِيَنَّكَ الَّذِي وَعَدْنَاهُمْ فَإِنَّا عَلَيْهِم مُّقْتَدِرُونَ లేదా మేము వారికి చేసిన వాగ్దానాన్ని నీకు చూపిస్తాము. వారిపై మాకు పూర్తి అదుపు (అధికారం) ఉంది. 43:43 فَاسْتَمْسِكْ بِالَّذِي أُوحِيَ إِلَيْكَ ۖ إِنَّكَ عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ కనుక నీకు పంపబడిన సందేశాన్ని (వహీని) నువ్వు గట్టిగా పట్టుకో. నిశ్చయంగా నువ్వు రుజుమార్గంపై ఉన్నావు. 43:44 وَإِنَّهُ لَذِكْرٌ لَّكَ وَلِقَوْمِكَ ۖ وَسَوْفَ تُسْأَلُونَ నిస్సందేహంగా ఇది (ఈ గ్రంథం) నీకూ, నీ జాతివారికి హితబోధిని. త్వరలోనే మీరంతా ప్రశ్నించబడతారు. 43:45 وَاسْأَلْ مَنْ أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رُّسُلِنَا أَجَعَلْنَا مِن دُونِ الرَّحْمَٰنِ آلِهَةً يُعْبَدُونَ మరి నీకు పూర్వం మేము పంపిన మా ప్రవక్తలను "కరుణామయుడు (అయిన అల్లాహ్)ను వదలి వేరితర పూజించబడుతున్న దైవాలను మేము నిర్ధారించామేమో" అడిగిచూడు. 43:46 وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ فَقَالَ إِنِّي رَسُولُ رَبِّ الْعَالَمِينَ మేము మూసాకు మా సూచనలను ఇచ్చి ఫిరౌన్ వద్దకు, అతని నాయకుల వద్దకు పంపించాము. అప్పుడు (మూసా వాళ్ల దగ్గరకు వెళ్ళి) "నేను సకల లోకాల ప్రభువు యొక్క ప్రవక్తను" అన్నాడు. 43:47 فَلَمَّا جَاءَهُم بِآيَاتِنَا إِذَا هُم مِّنْهَا يَضْحَكُونَ మరి అతను మా సూచనలను తీసుకుని వారి వద్దకు వచ్చినపుడు వారు వాటిపై వికటాట్టహాసం చేశారు. 43:48 وَمَا نُرِيهِم مِّنْ آيَةٍ إِلَّا هِيَ أَكْبَرُ مِنْ أُخْتِهَا ۖ وَأَخَذْنَاهُم بِالْعَذَابِ لَعَلَّهُمْ يَرْجِعُونَ మేము వారికి చూపిస్తూపోయిన ఒక్కో సూచన దానికి ముందు వచ్చిన దానికి మించినదిగా ఉండేది. మరి మేము వాళ్ళను శిక్షగా పట్టుకున్నాము - అలాగైనా దారికి వస్తారేమోనని! 43:49 وَقَالُوا يَا أَيُّهَ السَّاحِرُ ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِندَكَ إِنَّنَا لَمُهْتَدُونَ వారిలా అన్నారు: "ఓ మాంత్రికుడా! నీ ప్రభువు నీతో వాగ్దానం చేసివున్న దాని గురించి మా కొరకుకాస్త ప్రార్థించవోయ్! (ఈ ఆపద గనక తొలగిపోతే) మేము తప్పకుండా సన్మార్గంపైకి వస్తాము." 43:50 فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الْعَذَابَ إِذَا هُمْ يَنكُثُونَ అయితే మేము ఆ శిక్షను వారి నుంచి తొలగించగా, అప్పటికప్పుడే వారు ఆడిన మాటను తప్పారు. 43:51 وَنَادَىٰ فِرْعَوْنُ فِي قَوْمِهِ قَالَ يَا قَوْمِ أَلَيْسَ لِي مُلْكُ مِصْرَ وَهَٰذِهِ الْأَنْهَارُ تَجْرِي مِن تَحْتِي ۖ أَفَلَا تُبْصِرُونَ మరి ఫిరౌను తన జాతి (జనుల) మధ్య చాటింపు వేయిస్తూ ఇలా అన్నాడు : "ఓ నా జాతి జనులారా! ఈజిప్టు రాజ్యం నాది కాదా? ఈ కాలువలు నా (మేడల) క్రింద ప్రవహిస్తున్నాయి. మీరు చూడటం లేదా? 43:52 أَمْ أَنَا خَيْرٌ مِّنْ هَٰذَا الَّذِي هُوَ مَهِينٌ وَلَا يَكَادُ يُبِينُ "పైగా తుచ్ఛుడైన అతని కంటే నేను ఉత్తముడను, కనీసం స్పష్టంగా చెప్పటం కూడా అతనికి చేత కాదాయె. 43:53 فَلَوْلَا أُلْقِيَ عَلَيْهِ أَسْوِرَةٌ مِّن ذَهَبٍ أَوْ جَاءَ مَعَهُ الْمَلَائِكَةُ مُقْتَرِنِينَ "సరే, అతనిపై బంగారు కంకణాలు ఎందుకు దించబడలేదు? పోనీ, అతని వెంట బారులు తీరిన దైవదూతలు ఎందుకు రాలేదు?" 43:54 فَاسْتَخَفَّ قَوْمَهُ فَأَطَاعُوهُ ۚ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ ఆ విధంగా అతను తన ప్రజలను మభ్యపెట్టి, మూర్ఖుల్ని చేశాడు. తుదకు వారు అతని మాటే విన్నారు. నిశ్చయంగా వారంతా అవిధేయ జనులే. 43:55 فَلَمَّا آسَفُونَا انتَقَمْنَا مِنْهُمْ فَأَغْرَقْنَاهُمْ أَجْمَعِينَ ఆ తరువాత వారు మాకు కోపం తెప్పించగా మేము వారిపై ప్రతీకారం తీర్చుకున్నాం. వారందరినీ (సముద్రంలో) ముంచి వేశాము. 43:56 فَجَعَلْنَاهُمْ سَلَفًا وَمَثَلًا لِّلْآخِرِينَ ఆ విధంగా మేము వారిని గతించిన వారుగా, రాబోయే తరాల వారికి ఒక ఉదాహరణగా చేశాము. 43:57 وَلَمَّا ضُرِبَ ابْنُ مَرْيَمَ مَثَلًا إِذَا قَوْمُكَ مِنْهُ يَصِدُّونَ మర్యమ్ కుమారుని ఉదాహరణ ఇవ్వబడినపుడు నీ జాతి జనులు (సంబరపడి) కేకలు వేశారు. 43:58 وَقَالُوا أَآلِهَتُنَا خَيْرٌ أَمْ هُوَ ۚ مَا ضَرَبُوهُ لَكَ إِلَّا جَدَلًا ۚ بَلْ هُمْ قَوْمٌ خَصِمُونَ "ఇంతకీ మా దేవుళ్ళు మంచివాళ్ళా లేక అతనా?" అని వారు (తరచి తరచి) అడగటం మొదలెట్టారు. వారు నిన్ను అలా అడగటం వెనుక వారి ఉద్దేశం జగడం తప్ప మరేమీ కాదు. అసలా జనులే జగడాలమారులు. 43:59 إِنْ هُوَ إِلَّا عَبْدٌ أَنْعَمْنَا عَلَيْهِ وَجَعَلْنَاهُ مَثَلًا لِّبَنِي إِسْرَائِيلَ అతను (మర్యమ్ కుమారుడైన ఈసా) కూడా ఒక దాసుడు మాత్రమే. మేమతన్ని అనుగ్రహించాము. ఇస్రాయీలు సంతతి వారికొరకు అతన్ని ఒక ఉదాహరణ (మా శక్తి నిదర్శనం)గా చేశాము. 43:60 وَلَوْ نَشَاءُ لَجَعَلْنَا مِنكُم مَّلَائِكَةً فِي الْأَرْضِ يَخْلُفُونَ మరి మేమే గనక తలచుకుంటే మీకు బదులుగా దైవదూతలనే భూమికి వారసులుగా చేసి ఉండేవారం. 43:61 وَإِنَّهُ لَعِلْمٌ لِّلسَّاعَةِ فَلَا تَمْتَرُنَّ بِهَا وَاتَّبِعُونِ ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ నిశ్చయంగా అతను (ఈసా - అలైహిస్సలాం) ప్రళయానికి ఒక సూచన. కాబట్టి మీరు దాని (ప్రళయదినం) విషయంలో సందేహపడకండి. మీరు నన్ను అనుసరించండి. ఇదే రుజు మార్గం. 43:62 وَلَا يَصُدَّنَّكُمُ الشَّيْطَانُ ۖ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ షైతాన్ మిమ్మల్ని అడ్డుకోరాదు సుమా! వాడు మీకు బద్ధ విరోధి. 43:63 وَلَمَّا جَاءَ عِيسَىٰ بِالْبَيِّنَاتِ قَالَ قَدْ جِئْتُكُم بِالْحِكْمَةِ وَلِأُبَيِّنَ لَكُم بَعْضَ الَّذِي تَخْتَلِفُونَ فِيهِ ۖ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ స్పష్టమైన నిదర్శనాలను తీసుకుని వచ్చినప్పుడు ఈసా (ఏసు - అలైహిస్సలాం) ఇలా అన్నాడు: "నేను మీ దగ్గరకు వివేకాన్ని తెచ్చాను. మీరు విభేదించుకుంటున్న కొన్ని విషయాల వాస్తవికతను విడమరచి చెప్పటానికే వచ్చాను. కనుక మీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయత చూపండి. 43:64 إِنَّ اللَّهَ هُوَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ "నిజానికి నా ప్రభువూ, మీ ప్రభువూ అల్లాహ్ మాత్రమే. కాబట్టి మీరంతా ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం." 43:65 فَاخْتَلَفَ الْأَحْزَابُ مِن بَيْنِهِمْ ۖ فَوَيْلٌ لِّلَّذِينَ ظَلَمُوا مِنْ عَذَابِ يَوْمٍ أَلِيمٍ అయితే ఆ తర్వాత (ఇస్రాయీల్ సంతతికి చెందిన) పలు కూటములవారు పరస్పరం విభేదించుకున్నారు. కనుక దుర్మార్గులకు బాధాకరమైన దినమునందలి శిక్ష వల్ల వినాశం తప్పదు. 43:66 هَلْ يَنظُرُونَ إِلَّا السَّاعَةَ أَن تَأْتِيَهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ తమకు తెలీకుండానే, తమపై అకస్మాత్తుగా ప్రళయం వచ్చి పడాలని వారు ఎదురు చూస్తున్నారా? 43:67 الْأَخِلَّاءُ يَوْمَئِذٍ بَعْضُهُمْ لِبَعْضٍ عَدُوٌّ إِلَّا الْمُتَّقِينَ ఆ రోజు (ప్రాణ) మిత్రులు కూడా ఒకరికొకరు శత్రువులై పోతారు - అయితే దైవభక్తి పరాయణులు మాత్రం అలా ప్రవర్తించరు. 43:68 يَا عِبَادِ لَا خَوْفٌ عَلَيْكُمُ الْيَوْمَ وَلَا أَنتُمْ تَحْزَنُونَ ఓ నా దాసులారా! ఈ రోజు మీకెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు. 43:69 الَّذِينَ آمَنُوا بِآيَاتِنَا وَكَانُوا مُسْلِمِينَ మా సూచనలను విశ్వసించి, విధేయులు (ముస్లింలు)గా ఉన్న వారినుద్దేశించి (ఈ విధంగా అనబడుతుంది:) 43:70 ادْخُلُوا الْجَنَّةَ أَنتُمْ وَأَزْوَاجُكُمْ تُحْبَرُونَ మీరూ, మీ భార్యలూ సంతోషంగా (సగౌరవంగా) స్వర్గంలో ప్రవేశించండి. 43:71 يُطَافُ عَلَيْهِم بِصِحَافٍ مِّن ذَهَبٍ وَأَكْوَابٍ ۖ وَفِيهَا مَا تَشْتَهِيهِ الْأَنفُسُ وَتَلَذُّ الْأَعْيُنُ ۖ وَأَنتُمْ فِيهَا خَالِدُونَ వారి వద్దకు నలువైపుల నుంచి బంగారు పళ్లాలూ, బంగారు గ్లాసులూ తేబడతాయి. మనసు కోరేవీ, కళ్లు ఆస్వాదించేవీ- అన్నీ అక్కడ ఉంటాయి. అందులో మీరు కలకాలం (సుఖంగా) ఉంటారు. 43:72 وَتِلْكَ الْجَنَّةُ الَّتِي أُورِثْتُمُوهَا بِمَا كُنتُمْ تَعْمَلُونَ ఈ స్వర్గం - మీరు చేసుకున్న సత్కర్మలకు బదులుగా మీరు దీనికి వారసులయ్యారు. 43:73 لَكُمْ فِيهَا فَاكِهَةٌ كَثِيرَةٌ مِّنْهَا تَأْكُلُونَ ఇందులో మీరు ఆరగించటానికి ఎన్నో పండ్లు ఫలాలున్నాయి (అని అనబడుతుంది). 43:74 إِنَّ الْمُجْرِمِينَ فِي عَذَابِ جَهَنَّمَ خَالِدُونَ (ఇకపోతే) అపరాధులు ఖచ్చితంగా శాశ్వతమైన నరకయాతనకు లోనై ఉంటారు. 43:75 لَا يُفَتَّرُ عَنْهُمْ وَهُمْ فِيهِ مُبْلِسُونَ ఆ యాతన వారినుంచి ఎన్నటికీ తగ్గించబడదు. ఇక వారు ఆశలన్నీ వదులుకుని, అందులోనే పడి ఉంటారు. 43:76 وَمَا ظَلَمْنَاهُمْ وَلَٰكِن كَانُوا هُمُ الظَّالِمِينَ మేము వారికెలాంటి అన్యాయం చేయలేదు. కాని వారంతట వారే అన్యాయస్థులయ్యారు. 43:77 وَنَادَوْا يَا مَالِكُ لِيَقْضِ عَلَيْنَا رَبُّكَ ۖ قَالَ إِنَّكُم مَّاكِثُونَ "ఓ మాలిక్! నీ ప్రభువు మమ్మల్ని అంతం చేసేస్తే (అంటే పూర్తిగా ఒకేసారి చంపేస్తే) పోతుంది కదయ్యా" అని వారు అరుస్తారు. దానికతను "మీరు (నిత్యం) ఇలా ఉండాల్సిందే" అంటాడు. 43:78 لَقَدْ جِئْنَاكُم بِالْحَقِّ وَلَٰكِنَّ أَكْثَرَكُمْ لِلْحَقِّ كَارِهُونَ "మేము మీ దగ్గరకు సత్యాన్ని తీసుకువచ్చాము. కాని మీలో చాలా మంది సత్యాన్ని ఏవగించుకున్నారు కదా!" 43:79 أَمْ أَبْرَمُوا أَمْرًا فَإِنَّا مُبْرِمُونَ ఏమిటి, వీళ్లు (నీకు వ్యతిరేకంగా) ఏదన్నా విషయాన్ని గట్టిగా నిర్ధారించారా? మరైతే మేము కూడా గట్టిగానే నిర్ధారిస్తాము. 43:80 أَمْ يَحْسَبُونَ أَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَنَجْوَاهُم ۚ بَلَىٰ وَرُسُلُنَا لَدَيْهِمْ يَكْتُبُونَ ఏమిటి, వాళ్ల రహస్య విషయాలను, వారి గుసగుసలను మేము వినలేమని వారనుకుంటున్నారా? (తప్పకుండా వింటాము) మేము పంపిన దూతలు వాళ్ల దగ్గరే వ్రాస్తున్నారు. 43:81 قُلْ إِن كَانَ لِلرَّحْمَٰنِ وَلَدٌ فَأَنَا أَوَّلُ الْعَابِدِينَ (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : "కరుణామయునికి సంతానమే గనక ఉంటే, అందరికన్నా ముందు నేనే వారిని ఆరాధించి ఉండేవాణ్ణి." 43:82 سُبْحَانَ رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبِّ الْعَرْشِ عَمَّا يَصِفُونَ వీళ్లు భూమ్యాకాశాల ప్రభువు, అర్ష్ (సింహాసనము) నకు అధిపతి అయిన అల్లాహ్ వీళ్లు బొంకే మాటలన్నింటికీ అతీతుడు, పవిత్రుడు. 43:83 فَذَرْهُمْ يَخُوضُوا وَيَلْعَبُوا حَتَّىٰ يُلَاقُوا يَوْمَهُمُ الَّذِي يُوعَدُونَ కాబట్టి నువ్వు వాళ్ళను వాళ్ళ వాగుడులోనే, ఆటపాటల్లోనే పడి ఉండనివ్వు. తుదకు వాళ్లకు వాగ్దానం చేయబడుతున్న రోజు వారికి ఎదురవుతుంది. 43:84 وَهُوَ الَّذِي فِي السَّمَاءِ إِلَٰهٌ وَفِي الْأَرْضِ إِلَٰهٌ ۚ وَهُوَ الْحَكِيمُ الْعَلِيمُ ఆయనే ఆకాశాలలో ఆరాధించదగినవాడు. భూమిలో కూడా ఆయనే ఆరాధ్యుడు. ఆయన అపార వివేక సంపన్నుడు, సంపూర్ణ జ్ఞానం కలవాడు. 43:85 وَتَبَارَكَ الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَعِندَهُ عِلْمُ السَّاعَةِ وَإِلَيْهِ تُرْجَعُونَ ఇంకా ఆయన గొప్ప శుభకరుడు. భూమ్యాకాశాల్లోనూ, వాటి మధ్య నున్న సమస్త వస్తువుల మీదనూ ఆధిపత్యం ఆయనదే. ప్రళయ ఘడియ గురించిన జ్ఞానం కూడా ఆయన వద్దనే ఉంది. మీరంతా (ఆఖరికి) ఆయన వద్దకే మరలించబడతారు. 43:86 وَلَا يَمْلِكُ الَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ الشَّفَاعَةَ إِلَّا مَن شَهِدَ بِالْحَقِّ وَهُمْ يَعْلَمُونَ అల్లాహ్‌ను వదలి వీళ్లు ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారికి, సిఫారసుకు సంబంధించిన ఏ అధికారమూ లేదు. కాని సత్యం గురించి సాక్ష్యమిచ్చి, దానికి సంబంధించిన జ్ఞానమున్న వారు మాత్రం (సిఫారసుకు యోగ్యులు). 43:87 وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَهُمْ لَيَقُولُنَّ اللَّهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ "మిమ్మల్ని పుట్టించినదెవర"ని నువ్వు గనక వారిని అడిగితే, "అల్లాహ్" అని వారు తప్పకుండా అంటారు. మరలాంటప్పుడు వారు ఎటు తిరిగిపోతున్నారు(ట)?! 43:88 وَقِيلِهِ يَا رَبِّ إِنَّ هَٰؤُلَاءِ قَوْمٌ لَّا يُؤْمِنُونَ "ఓ నా ప్రభూ! వీళ్లు మాత్రం విశ్వసించే జనులు కారు" అన్న తన ప్రవక్త పలుకు గురించి కూడా ఆయనకు తెలుసు. 43:89 فَاصْفَحْ عَنْهُمْ وَقُلْ سَلَامٌ ۚ فَسَوْفَ يَعْلَمُونَ కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు వారి నుంచి ముఖం త్రిప్పుకో. "(నాయనలారా!) మీకో సలాం!" అని చెప్పు. త్వరలో వారికే తెలిసివస్తుంది. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |