Translation
| 36. సూరా యాసీన్ 36:1 يس యా-సీన్. 36:2 وَالْقُرْآنِ الْحَكِيمِ వివేకంతో నిండిన ఖుర్‌ఆన్ సాక్షిగా! 36:3 إِنَّكَ لَمِنَ الْمُرْسَلِينَ (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా నువ్వు సందేశహరులలోని వాడవు. 36:4 عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ రుజుమార్గాన ఉన్నవాడవు. 36:5 تَنزِيلَ الْعَزِيزِ الرَّحِيمِ సర్వాధిక్యుడు, కృపాకరుడు (అయిన అల్లాహ్) తరఫున ఇది (ఈ ఖుర్‌ఆన్ గ్రంథం) అవతరింపజేయబడింది. 36:6 لِتُنذِرَ قَوْمًا مَّا أُنذِرَ آبَاؤُهُمْ فَهُمْ غَافِلُونَ ఎవరి తాతముత్తాతలు మునుపు హెచ్చరించబడలేదో ఆ జనులను నువ్వు హెచ్చరించటానికి (ప్రవక్తగా పంపబడ్డావు) - అందువల్లనే వారు పరధ్యానానికి లోనై ఉన్నారు. 36:7 لَقَدْ حَقَّ الْقَوْلُ عَلَىٰ أَكْثَرِهِمْ فَهُمْ لَا يُؤْمِنُونَ వారిలో చాలా మందికి వ్యతిరేకంగా (శిక్ష విధించాలన్న) మాట ఖరారై పోయింది. ఇక వారు విశ్వసించేవారు కారు. 36:8 إِنَّا جَعَلْنَا فِي أَعْنَاقِهِمْ أَغْلَالًا فَهِيَ إِلَى الْأَذْقَانِ فَهُم مُّقْمَحُونَ మేము వారి మెడలలో (ఇనుప) పట్టాలు వేసేశాము. అవి వారి చుబుకముల వరకూ (ఆక్రమించి) ఉన్నాయి. అందుచేత వారి తలలు పై వైపుకే తిరిగిపోయాయి. 36:9 وَجَعَلْنَا مِن بَيْنِ أَيْدِيهِمْ سَدًّا وَمِنْ خَلْفِهِمْ سَدًّا فَأَغْشَيْنَاهُمْ فَهُمْ لَا يُبْصِرُونَ మేము వారి ముందు ఒక అడ్డును, వారి వెనుక మరో అడ్డును పెట్టాము. ఆ విధంగా మేము వారిని కప్పివేశాము. తత్కారణంగా వారు చూడలేరు. 36:10 وَسَوَاءٌ عَلَيْهِمْ أَأَنذَرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ لَا يُؤْمِنُونَ కాబట్టి నువ్వు వారిని హెచ్చరించినా, హెచ్చరించకపోయినా ఒక్కటే. వారు విశ్వసించరు. 36:11 إِنَّمَا تُنذِرُ مَنِ اتَّبَعَ الذِّكْرَ وَخَشِيَ الرَّحْمَٰنَ بِالْغَيْبِ ۖ فَبَشِّرْهُ بِمَغْفِرَةٍ وَأَجْرٍ كَرِيمٍ హితబోధను అనుసరిస్తూ, చూడకపోయినా కరుణామయునికి (అల్లాహ్‌కు) భయపడే వ్యక్తిని మాత్రమే నువ్వు హెచ్చరించగలవు. కాబట్టి అలాంటి వ్యక్తికి నువ్వు క్షమాభిక్ష, గౌరవప్రదమైన ప్రతిఫలం గురించిన శుభవార్తను వినిపించు. 36:12 إِنَّا نَحْنُ نُحْيِي الْمَوْتَىٰ وَنَكْتُبُ مَا قَدَّمُوا وَآثَارَهُمْ ۚ وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُّبِينٍ నిశ్చయంగా మేము మృతులను బ్రతికిస్తాము. జనులు ముందుగా చేసి పంపుకున్న దానినీ, వారు వెనుక వదలివెళ్ళిన కర్మలను కూడా మేము వ్రాస్తూ పోతున్నాము. ఇంకా మేము ప్రతి విషయాన్నీ స్పష్టమైన ఒక గ్రంథంలో నమోదు చేసి పెట్టాము. 36:13 وَاضْرِبْ لَهُم مَّثَلًا أَصْحَابَ الْقَرْيَةِ إِذْ جَاءَهَا الْمُرْسَلُونَ ఉదాహరణగా (నీవు) వారికి ఒక పట్టణవాసుల వద్దకు (అనేక మంది) ప్రవక్తలు వచ్చినప్పుడు జరిగిన దానిని వివరించు. 36:14 إِذْ أَرْسَلْنَا إِلَيْهِمُ اثْنَيْنِ فَكَذَّبُوهُمَا فَعَزَّزْنَا بِثَالِثٍ فَقَالُوا إِنَّا إِلَيْكُم مُّرْسَلُونَ మేము వారి వద్దకు ఇద్దరిని (అంటే ఇద్దరు ప్రవక్తలను) పంపగా (మొదట) ఆ ఇద్దరినీ వారు ధిక్కరించారు. మరి వారికి (ఆ ఇద్దరికి) అండగా మేము మూడవ వానిని పంపగా, "మేము మీ దగ్గరకు ప్రవక్తలుగా పంపబడ్డాము" అని వారు (ఆ పట్టణ ప్రజలతో) అన్నారు. 36:15 قَالُوا مَا أَنتُمْ إِلَّا بَشَرٌ مِّثْلُنَا وَمَا أَنزَلَ الرَّحْمَٰنُ مِن شَيْءٍ إِنْ أَنتُمْ إِلَّا تَكْذِبُونَ దానికి వారు "మీరు కూడా మాలాంటి మానవమాత్రులే. కరుణామయుడు అసలు దేనినీ అవతరింపజేయలేదు. మీరు చెప్పేదంతా పచ్చి అబద్ధం" అని సమాధానమిచ్చారు. 36:16 قَالُوا رَبُّنَا يَعْلَمُ إِنَّا إِلَيْكُمْ لَمُرْسَلُونَ ప్రవక్తలు ఇలా అన్నారు : "మేము నిశ్చయంగా మీ వద్దకు ప్రవక్తలుగా పంపబడ్డామన్న సంగతి మా ప్రభువుకు తెలుసు. 36:17 وَمَا عَلَيْنَا إِلَّا الْبَلَاغُ الْمُبِينُ "స్పష్టంగా విషయాన్ని అందజేయటం వరకే మా కర్తవ్యం." 36:18 قَالُوا إِنَّا تَطَيَّرْنَا بِكُمْ ۖ لَئِن لَّمْ تَنتَهُوا لَنَرْجُمَنَّكُمْ وَلَيَمَسَّنَّكُم مِّنَّا عَذَابٌ أَلِيمٌ దానికి వారు, "మేము మిమ్మల్ని దరిద్ర సూచకంగా భావిస్తున్నాము. మీరు గనక (ఈ పనిని) మానుకోకపోతే, మేము మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తాము. మా తరఫున మీకు బాధాకరమైన శిక్ష అంటుకుంటుంది" అని చెప్పారు. 36:19 قَالُوا طَائِرُكُم مَّعَكُمْ ۚ أَئِن ذُكِّرْتُم ۚ بَلْ أَنتُمْ قَوْمٌ مُّسْرِفُونَ అప్పుడు ప్రవక్తలు ఇలా అన్నారు : "మీ దరిద్రమంతా మీ వెంటే ఉంది, ఏమిటీ, మీకు చేసే ఉపదేశాన్ని మీరు దరిద్రంగా తలపోస్తున్నారా? అసలు విషయం అదికాదు. మీరసలు బరితెగించి పోయారు." 36:20 وَجَاءَ مِنْ أَقْصَى الْمَدِينَةِ رَجُلٌ يَسْعَىٰ قَالَ يَا قَوْمِ اتَّبِعُوا الْمُرْسَلِينَ (అంతలోనే ఆ) నగరం చివరి వైపు నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు : "ఓ నా జాతివారలారా! మీరు ప్రవక్తలను అనుసరించండి. 36:21 اتَّبِعُوا مَن لَّا يَسْأَلُكُمْ أَجْرًا وَهُم مُّهْتَدُونَ "మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగని వారి, సన్మార్గాన ఉన్న వారి వెనుక నడవండి." 36:22 وَمَا لِيَ لَا أَعْبُدُ الَّذِي فَطَرَنِي وَإِلَيْهِ تُرْجَعُونَ "నన్ను పుట్టించిన వానిని నేను ఆరాధించకుండా ఉండటం ఎంతవరకు సమంజసం? మరి (నిజానికి) మీరంతా ఆయన వైపు మరలించబడేవారే. 36:23 أَأَتَّخِذُ مِن دُونِهِ آلِهَةً إِن يُرِدْنِ الرَّحْمَٰنُ بِضُرٍّ لَّا تُغْنِ عَنِّي شَفَاعَتُهُمْ شَيْئًا وَلَا يُنقِذُونِ "అట్టి (నిజ) దైవాన్ని వదిలేసి నేను ఇతరులను ఆరాధ్యులుగా ఆశ్రయించాలా? ఒకవేళ కరుణామయుడు (అయిన అల్లాహ్) నాకేదైనా నష్టం కలిగించదలిస్తే వారి సిఫారసు నాకెలాంటి లాభమూ చేకూర్చదు. వారు నన్ను కాపాడనూ లేరు. 36:24 إِنِّي إِذًا لَّفِي ضَلَالٍ مُّبِينٍ "మరి నేను స్పష్టమైన దుర్మార్గంలో పడిపోతాను. 36:25 إِنِّي آمَنتُ بِرَبِّكُمْ فَاسْمَعُونِ "అందుకే నేను చెప్పేది వినండి! నేను మటుకు మీరందరి (ఏకైక) ప్రభువును విశ్వసించాను." 36:26 قِيلَ ادْخُلِ الْجَنَّةَ ۖ قَالَ يَا لَيْتَ قَوْمِي يَعْلَمُونَ "స్వర్గంలో చేరిపో" అని (అతనితో) అనబడింది. "నా జాతి వారికి ఇది తెలిస్తే ఎంత బావుండేది!" అని అతనన్నాడు. 36:27 بِمَا غَفَرَ لِي رَبِّي وَجَعَلَنِي مِنَ الْمُكْرَمِينَ "నా ప్రభువు నన్ను క్షమించి, ఆదరణీయులలో నన్ను చేర్చిన సంగతి." 36:28 وَمَا أَنزَلْنَا عَلَىٰ قَوْمِهِ مِن بَعْدِهِ مِن جُندٍ مِّنَ السَّمَاءِ وَمَا كُنَّا مُنزِلِينَ అతని తరువాత మేము అతని జాతి వారిపై ఆకాశం నుంచి ఏ సైనిక దళాన్నీ దింపలేదు. దాని అవసరం మాకు లేదు కూడా. 36:29 إِن كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ خَامِدُونَ అది (ఆ శిక్ష) ఒకే ఒక్క కేక మాత్రమే! అంతే. వారంతా (ఆ దెబ్బకు) ఆరిపోయారు. 36:30 يَا حَسْرَةً عَلَى الْعِبَادِ ۚ مَا يَأْتِيهِم مِّن رَّسُولٍ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ (అలాంటి) దాసుల పరిస్థితి కడు శోచనీయం! తమ వద్దకు ఎప్పుడు, ఏ ప్రవక్త వచ్చినా వారతన్ని పరిహసించకుండా ఉండలేదు. 36:31 أَلَمْ يَرَوْا كَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّنَ الْقُرُونِ أَنَّهُمْ إِلَيْهِمْ لَا يَرْجِعُونَ వారికి పూర్వం ఎన్నో సముదాయాలను మేము తుదముట్టించటాన్ని వారు చూడలేదా? వారెన్నటికీ వారిదగ్గరకు తిరిగిరారు. 36:32 وَإِن كُلٌّ لَّمَّا جَمِيعٌ لَّدَيْنَا مُحْضَرُونَ అయితే ఎట్టకేలకు వారంతా సమీకరించబడి (తీర్పు నిమిత్తం) మా ముందు హాజరు పరచబడతారు. 36:33 وَآيَةٌ لَّهُمُ الْأَرْضُ الْمَيْتَةُ أَحْيَيْنَاهَا وَأَخْرَجْنَا مِنْهَا حَبًّا فَمِنْهُ يَأْكُلُونَ మరి వారి కోసం మృతభూమి కూడా ఒక సూచనే. దాన్ని మేము బ్రతికించాము. దాన్నుంచి ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేశాము. దాన్నుంచి వారు భుజిస్తున్నారు. 36:34 وَجَعَلْنَا فِيهَا جَنَّاتٍ مِّن نَّخِيلٍ وَأَعْنَابٍ وَفَجَّرْنَا فِيهَا مِنَ الْعُيُونِ ఇంకా మేము అందులో ఖర్జూరం, ద్రాక్షతోటలను (ఉత్పన్నం) చేశాము. వాటిలో ఊటలను ప్రవహింపజేశాము. 36:35 لِيَأْكُلُوا مِن ثَمَرِهِ وَمَا عَمِلَتْهُ أَيْدِيهِمْ ۖ أَفَلَا يَشْكُرُونَ దాని ఫలాలను (ప్రజలు) తినేందుకు! వారి చేతులైతే దాన్ని నిర్మించలేదు. మరలాంటప్పుడు వారు కృతజ్ఞులుగా ఎందుకు వ్యవహరించరు? 36:36 سُبْحَانَ الَّذِي خَلَقَ الْأَزْوَاجَ كُلَّهَا مِمَّا تُنبِتُ الْأَرْضُ وَمِنْ أَنفُسِهِمْ وَمِمَّا لَا يَعْلَمُونَ భూమి నుండి ఉత్పన్నం అయిన వస్తువులలోనైనా, మరి స్వయంగా వారిలోనే (మనుషులలోనే) అయినా, వారికి తెలియని వాటిలోనైనా - వాటన్నింటి జతలను సృష్టించినవాడు పరమ పవిత్రుడు. 36:37 وَآيَةٌ لَّهُمُ اللَّيْلُ نَسْلَخُ مِنْهُ النَّهَارَ فَإِذَا هُم مُّظْلِمُونَ వారి కొరకు రాత్రి కూడా ఒక సూచనే. దాన్నుంచి మేము పగటిని లాగివేస్తాము. దాంతో వారు చీకటిలో ఉండిపోతారు. 36:38 وَالشَّمْسُ تَجْرِي لِمُسْتَقَرٍّ لَّهَا ۚ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ సూర్యుడు తన కోసం నిర్ధారించబడిన కక్ష్యలోనే పయనిస్తున్నాడు. ఇది సర్వాధిక్యుడు, సర్వజ్ఞుడు అయిన అల్లాహ్ నిర్ధారించిన విధానం. 36:39 وَالْقَمَرَ قَدَّرْنَاهُ مَنَازِلَ حَتَّىٰ عَادَ كَالْعُرْجُونِ الْقَدِيمِ మరి చంద్రుని మజిలీలను కూడా మేము నిర్ధారించాము. తుదకు అది (వాడిపోయిన ఖర్జూరపు) పాత మండలా తయారవుతుంది. 36:40 لَا الشَّمْسُ يَنبَغِي لَهَا أَن تُدْرِكَ الْقَمَرَ وَلَا اللَّيْلُ سَابِقُ النَّهَارِ ۚ وَكُلٌّ فِي فَلَكٍ يَسْبَحُونَ చంద్రుణ్ణి పట్టుకోవటం సూర్యుని తరంకాదు. పగటిని మించిపోవటం రాత్రి వల్ల కాదు. అవన్నీ (తమ తమ నిర్ధారిత) కక్ష్యల్లో తేలియాడుతున్నాయి. 36:41 وَآيَةٌ لَّهُمْ أَنَّا حَمَلْنَا ذُرِّيَّتَهُمْ فِي الْفُلْكِ الْمَشْحُونِ మరి మేము వారి సంతతిని నిండు నౌకలో ఎక్కించటం కూడా వారి కొరకు ఒక సూచనే. 36:42 وَخَلَقْنَا لَهُم مِّن مِّثْلِهِ مَا يَرْكَبُونَ ఇంకా వారి కోసం దాని (నౌక) లాంటివే మరికొన్ని వస్తువులను కూడా సృష్టించాము. వాటిపై వారు ప్రయాణం చేస్తున్నారు. 36:43 وَإِن نَّشَأْ نُغْرِقْهُمْ فَلَا صَرِيخَ لَهُمْ وَلَا هُمْ يُنقَذُونَ మరి మేము గనక తలచుకుంటే వాటిని ముంచివేయగలం. అప్పుడు వారి ఫిర్యాదును వినేవారుగానీ, వారిని రక్షించేవారు గానీ ఎవరూ ఉండరు. 36:44 إِلَّا رَحْمَةً مِّنَّا وَمَتَاعًا إِلَىٰ حِينٍ కాని మేము మా తరఫున దయదలచి, ఓ నిర్ణీత కాలం వరకు వారికి లబ్దిని చేకూరుస్తున్నాము. 36:45 وَإِذَا قِيلَ لَهُمُ اتَّقُوا مَا بَيْنَ أَيْدِيكُمْ وَمَا خَلْفَكُمْ لَعَلَّكُمْ تُرْحَمُونَ "మీరు ముందు ఎదుర్కోబోతున్న పరిణామానికి, మీరు మీ వెనుక వదలిపోయే వాటికి (పాపకార్యాలకు) భయపడండి, - మీరు కరుణించబడతారు" అని వారికి ఎప్పుడు నచ్చచెప్పినా (వారు లక్ష్యపెట్టరు). 36:46 وَمَا تَأْتِيهِم مِّنْ آيَةٍ مِّنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ తమ వద్దకు వచ్చిన ప్రభువు సూచనలలో, వారు విముఖత చూపకుండా ఉన్న సూచన అంటూ ఏదీ లేదు. 36:47 وَإِذَا قِيلَ لَهُمْ أَنفِقُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا أَنُطْعِمُ مَن لَّوْ يَشَاءُ اللَّهُ أَطْعَمَهُ إِنْ أَنتُمْ إِلَّا فِي ضَلَالٍ مُّبِينٍ "అల్లాహ్ ప్రసాదించిన దానిలో నుంచి కొంత ఖర్చు చేయండి" అని వారితో అన్నప్పుడల్లా, ఈ తిరస్కారులు విశ్వాసులతో, "మేము వారికి ఎందుకు తినిపించాలి? అల్లాహ్ తలిస్తే ఆయన స్వయంగా వారికి అన్నం పెట్టేవాడు. ఎటొచ్చీ మీరే స్పష్టమైన అపమార్గంలో పడి ఉన్నారు" అని సమాధానమిస్తారు. 36:48 وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ "మీరు సత్యవంతులే అయితే ఆ (ప్రళయ) వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో చెప్పండి" అని వారంటున్నారు. 36:49 مَا يَنظُرُونَ إِلَّا صَيْحَةً وَاحِدَةً تَأْخُذُهُمْ وَهُمْ يَخِصِّمُونَ వారు దేనికోసం ఎదురు చూస్తున్నారో అది ఒకే ఒక (భయంకరమైన) కేక మాత్రమే. అది వారిని అమాంతం కబళిస్తుంది. అప్పుడు వారేమో పరస్పరం విభేదించుకుంటూ ఉంటారు. 36:50 فَلَا يَسْتَطِيعُونَ تَوْصِيَةً وَلَا إِلَىٰ أَهْلِهِمْ يَرْجِعُونَ ఆ ఘడియలో వారు వీలునామా వ్రాయటంగానీ, తమ ఇంటివారి వద్దకు మరలిరావటంగానీ చేయలేరు. 36:51 وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُم مِّنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنسِلُونَ మరి శంఖం పూరించబడగానే అందరూ తమ తమ గోరీల నుంచి లేచి, తమ ప్రభువు వైపునకు వడివడిగా వస్తారు. 36:52 قَالُوا يَا وَيْلَنَا مَن بَعَثَنَا مِن مَّرْقَدِنَا ۜ ۗ هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ "అయ్యో మా దౌర్భాగ్యం! మమ్మల్ని మా శయనాగారాల నుంచి లేపినదెవరు?" అని వారు వాపోతారు. "కరుణామయుడు (అయిన అల్లాహ్) చేసిన వాగ్దానమిదే. ప్రవక్తలు చెప్పింది నిజం" (అని వారితో అనబడుతుంది). 36:53 إِن كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ جَمِيعٌ لَّدَيْنَا مُحْضَرُونَ అది ఒకే ఒక (భయంకర) అరుపు తప్ప మరేమీ కాదు. అంతే! వారంతా మా ముందు హాజరుపరచబడతారు. 36:54 فَالْيَوْمَ لَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا وَلَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ మరి ఈనాడు ఎవరికీ ఎటువంటి అన్యాయమూ జరగదు. మీరు చేసుకున్న కర్మల ప్రతిఫలం తప్ప మరొకటి ఏదీ మీకు ఇవ్వబడదు. 36:55 إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغُلٍ فَاكِهُونَ స్వర్గవాసులు ఈ రోజు తమ (ఆహ్లాదకర) వ్యాపకాలలో నిమగ్నులై ఆనందిస్తూ ఉన్నారు. 36:56 هُمْ وَأَزْوَاجُهُمْ فِي ظِلَالٍ عَلَى الْأَرَائِكِ مُتَّكِئُونَ వారూ, వారి సతీమణులు (చల్లని) నీడలలో పీఠాలపై దిండ్లకు ఆనుకుని ఆసీనులై ఉంటారు. 36:57 لَهُمْ فِيهَا فَاكِهَةٌ وَلَهُم مَّا يَدَّعُونَ అందులో వారి కోసం అన్ని రకాల పండ్లు ఉంటాయి. ఇంకా వారు కోరినదల్లా ఉంటుంది. 36:58 سَلَامٌ قَوْلًا مِّن رَّبٍّ رَّحِيمٍ కృపాశీలుడైన ప్రభువు తరఫున వారికి 'సలామ్' చెప్పబడుతుంది. 36:59 وَامْتَازُوا الْيَوْمَ أَيُّهَا الْمُجْرِمُونَ "ఓ పాపాత్ములారా! ఈ రోజు మీరు వేరైపోండి." 36:60 أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَن لَّا تَعْبُدُوا الشَّيْطَانَ ۖ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ "ఓ ఆదం సంతతివారలారా! మీరు షైతాన్‌ను పూజించకండి, వాడు మీ బహిరంగ శత్రువు" అని నేను మీ నుండి వాగ్దానం తీసుకోలేదా? 36:61 وَأَنِ اعْبُدُونِي ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ "మీరు నన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం" అని కూడా. 36:62 وَلَقَدْ أَضَلَّ مِنكُمْ جِبِلًّا كَثِيرًا ۖ أَفَلَمْ تَكُونُوا تَعْقِلُونَ షైతాను మీలో ఎంతోమంది సృష్టిని పెడదారి పట్టించాడు. మరి మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోయిందా? 36:63 هَٰذِهِ جَهَنَّمُ الَّتِي كُنتُمْ تُوعَدُونَ మీకు వాగ్దానం చేయబడుతూ ఉన్న నరకం ఇదే. 36:64 اصْلَوْهَا الْيَوْمَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ "మీ తిరస్కార వైఖరికి బదులుగా ఈ రోజు దీనిలోకి ప్రవేశించండి" (అని వారితో అనబడుతుంది). 36:65 الْيَوْمَ نَخْتِمُ عَلَىٰ أَفْوَاهِهِمْ وَتُكَلِّمُنَا أَيْدِيهِمْ وَتَشْهَدُ أَرْجُلُهُم بِمَا كَانُوا يَكْسِبُونَ ఈ రోజు మేము వారి నోళ్ళకు సీలు వేస్తాము. వారి చేతులు మాతో మాట్లాడతాయి. వారు చేసిన పనుల గురించి వారి కాళ్లు సాక్ష్యమిస్తాయి. 36:66 وَلَوْ نَشَاءُ لَطَمَسْنَا عَلَىٰ أَعْيُنِهِمْ فَاسْتَبَقُوا الصِّرَاطَ فَأَنَّىٰ يُبْصِرُونَ మేము గనక తలచుకుంటే వారి కళ్లను కాంతిహీనం చేసేవారము. మరి వారేమో దారి వైపుకు పరుగులు తీసి దేవులాడే వారు. కాని వారికి (దారి) ఎలా కనిపిస్తుంది? 36:67 وَلَوْ نَشَاءُ لَمَسَخْنَاهُمْ عَلَىٰ مَكَانَتِهِمْ فَمَا اسْتَطَاعُوا مُضِيًّا وَلَا يَرْجِعُونَ మరి మేము తలిస్తే వారున్న చోటే వారి రూపురేఖలను మార్చివేస్తాము. తత్కారణంగా వారు ముందుకు పోనూలేరు, వెనక్కి తిరిగి రానూలేరు. 36:68 وَمَن نُّعَمِّرْهُ نُنَكِّسْهُ فِي الْخَلْقِ ۖ أَفَلَا يَعْقِلُونَ మేము వృద్ధాప్యానికి చేర్చిన వానిని (మళ్లీ) జనన స్థితికి తిప్పి తీసుకుపోతాము. అయినా వాళ్ళు అర్థం చేసుకోరేమిటి? 36:69 وَمَا عَلَّمْنَاهُ الشِّعْرَ وَمَا يَنبَغِي لَهُ ۚ إِنْ هُوَ إِلَّا ذِكْرٌ وَقُرْآنٌ مُّبِينٌ మేమతనికి (ముహమ్మద్‌కు) కవిత్వం నేర్పలేదు. అది అతనికి తగదు కూడా. అది హితోపదేశం మరియు స్పష్టమైన ఖుర్‌ఆన్ మాత్రమే. 36:70 لِّيُنذِرَ مَن كَانَ حَيًّا وَيَحِقَّ الْقَوْلُ عَلَى الْكَافِرِينَ బ్రతికి ఉన్న ప్రతి వ్యక్తినీ హెచ్చరించటానికి, అవిశ్వాసులపై మాట రూఢీ అవటానికి (ఈ దైవ దౌత్య ఏర్పాటు జరిగింది). 36:71 أَوَلَمْ يَرَوْا أَنَّا خَلَقْنَا لَهُم مِّمَّا عَمِلَتْ أَيْدِينَا أَنْعَامًا فَهُمْ لَهَا مَالِكُونَ మేము మా స్వహస్తాలతో చేసిన వాటిలో వారికొరకు చతుష్పాదాలు (కూడా) సృజించబడి ఉండటాన్ని వారు గమనించటం లేదా? మరి (చూస్తే) వాటికి వారు యజమానులుగా ఉన్నారు. 36:72 وَذَلَّلْنَاهَا لَهُمْ فَمِنْهَا رَكُوبُهُمْ وَمِنْهَا يَأْكُلُونَ మరి మేము ఆ పశువులను వారికి లోబడి ఉండేటట్లు చేశాము. వాటిలో కొన్నేమో వారి వాహనాలుగా ఉన్నాయి. మరికొన్నింటి మాంసాన్ని వారు భుజిస్తున్నారు. 36:73 وَلَهُمْ فِيهَا مَنَافِعُ وَمَشَارِبُ ۖ أَفَلَا يَشْكُرُونَ ఇంకా వాటి ద్వారా వారికి మరెన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. త్రాగే (పాల) పదార్థాలు లభ్యమవుతున్నాయి. అయినా వారు కృతజ్ఞులుగా మసలుకోరా? 36:74 وَاتَّخَذُوا مِن دُونِ اللَّهِ آلِهَةً لَّعَلَّهُمْ يُنصَرُونَ తమను ఆదుకుంటారనే ఆశతో వారు అల్లాహ్‌ను వదలి ఇతరత్రా దైవాలను ఆశ్రయిస్తున్నారు. 36:75 لَا يَسْتَطِيعُونَ نَصْرَهُمْ وَهُمْ لَهُمْ جُندٌ مُّحْضَرُونَ (యదార్థానికి) వారిని ఆదుకునే శక్తీస్థోమత వారికి ఎంత మాత్రం లేదు. అయినప్పటికీ వారు (ముష్రిక్కులు) వారిని అంటిపెట్టుకుని ఉండే సైనికులుగా ఉన్నారు. 36:76 فَلَا يَحْزُنكَ قَوْلُهُمْ ۘ إِنَّا نَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ అయినాసరే (ఓ ముహమ్మద్ - స!) వారి మాటలకు నువ్వు దుఃఖించకు. వారు దాచిపెట్టేవి, వ్యక్తపరిచేవి అన్నీ మాకు తెలుసు. 36:77 أَوَلَمْ يَرَ الْإِنسَانُ أَنَّا خَلَقْنَاهُ مِن نُّطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُّبِينٌ మేము మనిషిని పుట్టించింది (ఎంతో అల్పమైన) వీర్యపు బిందువుతోనన్న సంగతిని (కూడా) అతను గమనించటం లేదా? మరి ఉన్నట్టుండి అతను - బహిరంగంగానే - తగవులమారిగా తయారయ్యాడు. 36:78 وَضَرَبَ لَنَا مَثَلًا وَنَسِيَ خَلْقَهُ ۖ قَالَ مَن يُحْيِي الْعِظَامَ وَهِيَ رَمِيمٌ వాడు మమ్మల్ని (ఇతరులతో) పోల్చాడు. కాని (మరోవైపు) తన అసలు పుట్టుకనే మరచిపోయాడు. "కుళ్ళి కృశించిపోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు?" అని వాడు సవాలు విసురుతున్నాడు. 36:79 قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ (వారికి) సమాధానం ఇవ్వు : "వాటిని తొలిసారి సృష్టించిన వాడే (మలిసారి కూడా) బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు." 36:80 الَّذِي جَعَلَ لَكُم مِّنَ الشَّجَرِ الْأَخْضَرِ نَارًا فَإِذَا أَنتُم مِّنْهُ تُوقِدُونَ ఆయనే మీ కోసం పచ్చని చెట్టు నుంచి అగ్నిని సృష్టించాడు. మరి మీరిప్పుడు దాంతో నిప్పును రాజేస్తున్నారు. 36:81 أَوَلَيْسَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِقَادِرٍ عَلَىٰ أَن يَخْلُقَ مِثْلَهُم ۚ بَلَىٰ وَهُوَ الْخَلَّاقُ الْعَلِيمُ భూమ్యాకాశాలనే పుట్టించినవాడు వీరిలాంటివారిని (తిరిగి) పుట్టించలేడా? ఎందుకు పుట్టించలేడు? ఆయనే అన్నీ తెలిసిన సృష్టికర్త. 36:82 إِنَّمَا أَمْرُهُ إِذَا أَرَادَ شَيْئًا أَن يَقُولَ لَهُ كُن فَيَكُونُ ఆయన ఎప్పుడైనా, ఏదైనా వస్తువును చేయ సంకల్పించుకుని 'అయిపో' అని ఆదేశించగానే అది అయిపోతుంది. 36:83 فَسُبْحَانَ الَّذِي بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَإِلَيْهِ تُرْجَعُونَ కనుక - ఎవరి చేతుల్లోనయితే సమస్త వస్తువుల సర్వాధికారముందో ఆ అల్లాహ్ పరమ పవిత్రుడు. మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది సుమా! ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |