aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

27. సూరా అన్ నమ్ల్

27:1  طس ۚ تِلْكَ آيَاتُ الْقُرْآنِ وَكِتَابٍ مُّبِينٍ
తా - సీన్‌. ఇవి ఖుర్‌ఆన్‌ ఆయతులు- స్పష్టమైన గ్రంథానికి చెందినవి.
27:2  هُدًى وَبُشْرَىٰ لِلْمُؤْمِنِينَ
విశ్వసించిన వారికి మార్గదర్శకం, శుభవార్త.
27:3  الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُم بِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ
వారు (విశ్వాసులు) నమాజును నెలకొల్పుతారు, జకాతును ఇస్తారు, పరలోకాన్ని నమ్ముతారు.
27:4  إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ زَيَّنَّا لَهُمْ أَعْمَالَهُمْ فَهُمْ يَعْمَهُونَ
ఎవరయితే పరలోకాన్ని విశ్వసించరో వారికి మేము, వారి పనులు ఎంతో అందమైనవిగా అనిపించేటట్లు చేశాము. అందుచేత వారు దారితప్పి తిరుగుతుంటారు.
27:5  أُولَٰئِكَ الَّذِينَ لَهُمْ سُوءُ الْعَذَابِ وَهُمْ فِي الْآخِرَةِ هُمُ الْأَخْسَرُونَ
చెడ్డ శిక్షను పొందేవారు వీరే. పరలోకంలో కూడా వారు తీవ్రమైన నష్టాన్ని పొందుతారు.
27:6  وَإِنَّكَ لَتُلَقَّى الْقُرْآنَ مِن لَّدُنْ حَكِيمٍ عَلِيمٍ
(ఓ ప్రవక్తా!) వివేచనాపరుడు, జ్ఞాన సంపన్నుడైన అల్లాహ్‌ తరఫు నుంచి నీకు ఖుర్‌ఆన్‌ బోధించబడుతున్నది.
27:7  إِذْ قَالَ مُوسَىٰ لِأَهْلِهِ إِنِّي آنَسْتُ نَارًا سَآتِيكُم مِّنْهَا بِخَبَرٍ أَوْ آتِيكُم بِشِهَابٍ قَبَسٍ لَّعَلَّكُمْ تَصْطَلُونَ
మూసా తన ఇంటివారితో, "నేను అగ్నిని చూశాను. నేను అక్కణ్ణుంచి ఏదైనా సమాచారంగానీ లేదా మీరు (చలి) కాచుకోవటానికి నిప్పు కొరివినిగానీ తెస్తాను" అని చెప్పినప్పటి విషయం (జ్ఞాపకమేనా?!)
27:8  فَلَمَّا جَاءَهَا نُودِيَ أَن بُورِكَ مَن فِي النَّارِ وَمَنْ حَوْلَهَا وَسُبْحَانَ اللَّهِ رَبِّ الْعَالَمِينَ
తీరా అతను అక్కడకు చేరుకోగానే పిలుపు (విన)వచ్చింది: "ఈ అగ్నిలో ఉన్నవాడు, శుభవంతుడు, దాని చుట్టు ప్రక్కల ఉన్న వారికి శుభము వొసగబడింది. సర్వలోకాల పోషకుడైన అల్లాహ్‌ పవిత్రుడు.
27:9  يَا مُوسَىٰ إِنَّهُ أَنَا اللَّهُ الْعَزِيزُ الْحَكِيمُ
"ఓ మూసా! విను! సర్వశక్తుణ్ణి, వివేకవంతుణ్ణి అయిన అల్లాహ్‌ను నేనే.
27:10  وَأَلْقِ عَصَاكَ ۚ فَلَمَّا رَآهَا تَهْتَزُّ كَأَنَّهَا جَانٌّ وَلَّىٰ مُدْبِرًا وَلَمْ يُعَقِّبْ ۚ يَا مُوسَىٰ لَا تَخَفْ إِنِّي لَا يَخَافُ لَدَيَّ الْمُرْسَلُونَ
"నీ చేతి కర్రను పడవెయ్యి." ఆ తరువాత అదొక పాము మాదిరిగా ప్రాకుతూ ఉండటం చూచి మూసా వెన్ను చూపి పారిపోయాడు. వెనక్కి తిరిగి చూడనయినా లేదు. "ఓ మూసా! భయపడకు. నా ముందర ప్రవక్తలు భీతి చెందరు.
27:11  إِلَّا مَن ظَلَمَ ثُمَّ بَدَّلَ حُسْنًا بَعْدَ سُوءٍ فَإِنِّي غَفُورٌ رَّحِيمٌ
"కాని తప్పు చేసిన వారు (మాత్రం భయపడతారు.) మరి ఆ తరువాత ఆ దుష్కార్యానికి బదులుగా సత్కార్యం చేస్తే నేను క్షమించేవాడను, కనికరించేవాడను.
27:12  وَأَدْخِلْ يَدَكَ فِي جَيْبِكَ تَخْرُجْ بَيْضَاءَ مِنْ غَيْرِ سُوءٍ ۖ فِي تِسْعِ آيَاتٍ إِلَىٰ فِرْعَوْنَ وَقَوْمِهِ ۚ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ
"నీ చేతిని నీ చొక్కా లోపల పెట్టుకో- అది ఎలాంటి లోపం లేకుండా ప్రకాశిస్తూ బయటికి వస్తుంది. నువ్వు తొమ్మిది నిదర్శనాలను తీసుకుని ఫిర్‌ఔన్‌ మరియు అతని జాతి వారి వద్దకు వెళ్ళు. నిశ్చయంగా వారు పరమ అవిధేయులు."
27:13  فَلَمَّا جَاءَتْهُمْ آيَاتُنَا مُبْصِرَةً قَالُوا هَٰذَا سِحْرٌ مُّبِينٌ
మరి కళ్లు తెరిపించే మా సూచనలు వారి వద్దకు చేరిన తరువాత కూడా "ఇది స్పష్టమైన ఇంద్రజాలం" అని వారు తేలిగ్గా కొట్టేశారు.
27:14  وَجَحَدُوا بِهَا وَاسْتَيْقَنَتْهَا أَنفُسُهُمْ ظُلْمًا وَعُلُوًّا ۚ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِينَ
నిజానికి వారి మనసులు (సత్యాన్ని) నమ్మినప్పటికీ అన్యాయం, అహంకారంతో వారు దాన్ని త్రోసిపుచ్చారు. కాబట్టి ఆ కల్లోల జనకులకు ఏ గతి పట్టిందో చూడు!
27:15  وَلَقَدْ آتَيْنَا دَاوُودَ وَسُلَيْمَانَ عِلْمًا ۖ وَقَالَا الْحَمْدُ لِلَّهِ الَّذِي فَضَّلَنَا عَلَىٰ كَثِيرٍ مِّنْ عِبَادِهِ الْمُؤْمِنِينَ
నిశ్చయంగా మేము దావూదు, సులైమానులకు జ్ఞానాన్ని వొసగాము. "విశ్వాసులైన తన దాసులెందరిపైనో మాకు ప్రాధాన్యతను వొసగిన అల్లాహ్‌కు సర్వస్తోత్రాలు" అని వారిద్దరూ పలికారు.
27:16  وَوَرِثَ سُلَيْمَانُ دَاوُودَ ۖ وَقَالَ يَا أَيُّهَا النَّاسُ عُلِّمْنَا مَنطِقَ الطَّيْرِ وَأُوتِينَا مِن كُلِّ شَيْءٍ ۖ إِنَّ هَٰذَا لَهُوَ الْفَضْلُ الْمُبِينُ
సులైమాను దావూదుకు వారసుడయ్యాడు. అతను ఇలా అన్నాడు : "ఓ ప్రజలారా! మాకు పక్షుల భాష నేర్పబడింది. ఇంకా మాకు ప్రతిదీ ప్రసాదించబడింది. ముమ్మాటికీ ఇది స్పష్టమైన దైవానుగ్రహమే."
27:17  وَحُشِرَ لِسُلَيْمَانَ جُنُودُهُ مِنَ الْجِنِّ وَالْإِنسِ وَالطَّيْرِ فَهُمْ يُوزَعُونَ
సులైమాను ఎదుట అతని జిన్నాతుల దళం, మనుషుల సైన్యం, పక్షుల గుంపు సమీకరించబడింది. అవన్నీ (వేర్వేరుగా) వివిధ జట్లుగా మోహరించబడ్డాయి.
27:18  حَتَّىٰ إِذَا أَتَوْا عَلَىٰ وَادِ النَّمْلِ قَالَتْ نَمْلَةٌ يَا أَيُّهَا النَّمْلُ ادْخُلُوا مَسَاكِنَكُمْ لَا يَحْطِمَنَّكُمْ سُلَيْمَانُ وَجُنُودُهُ وَهُمْ لَا يَشْعُرُونَ
చివరకు వారంతా ఒక చీమల లోయకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా ప్రకటించింది: "ఓ చీమల్లారా! సులైమాను, అతని సైన్యాలు తెలీకుండా మిమ్మల్ని నలిపివేసే స్థితి ఏర్పడకుండా ఉండేందుకు, మీరు మీ మీ పుట్టలలోనికి దూరిపోండి."
27:19  فَتَبَسَّمَ ضَاحِكًا مِّن قَوْلِهَا وَقَالَ رَبِّ أَوْزِعْنِي أَنْ أَشْكُرَ نِعْمَتَكَ الَّتِي أَنْعَمْتَ عَلَيَّ وَعَلَىٰ وَالِدَيَّ وَأَنْ أَعْمَلَ صَالِحًا تَرْضَاهُ وَأَدْخِلْنِي بِرَحْمَتِكَ فِي عِبَادِكَ الصَّالِحِينَ
దాని మాటపై సులైమాను చిరునవ్వును చిందించాడు. అతనిలా ప్రార్థించసాగాడు : "నా ప్రభూ! నువ్వు నాకూ, నా తల్లి దండ్రులకూ ప్రసాదించిన అనుగ్రహాలకుగాను నిత్యం నీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధిని నాకు ఇవ్వు. నేను, నీ మెప్పును పొందే మంచిపనులు చేసేలా చూడు. నీ దయతో నన్ను నీ సజ్జన దాసులలో చేర్చుకో."
27:20  وَتَفَقَّدَ الطَّيْرَ فَقَالَ مَا لِيَ لَا أَرَى الْهُدْهُدَ أَمْ كَانَ مِنَ الْغَائِبِينَ
అతను పక్షులను తనిఖీ చేసి, "హుద్‌ హుద్‌ పక్షి (వడ్రంగి పిట్ట!) నాకు కనిపించటంలేదేమిటి? అది నిజంగానే హాజరు కాలేదా?" అని అన్నాడు.
27:21  لَأُعَذِّبَنَّهُ عَذَابًا شَدِيدًا أَوْ لَأَذْبَحَنَّهُ أَوْ لَيَأْتِيَنِّي بِسُلْطَانٍ مُّبِينٍ
"నేను దానిని కఠినంగా శిక్షిస్తాను లేదా దాన్ని కోసివేస్తాను లేదా అది నాకు సరైన సంజాయిషీ అన్నా ఇవ్వాలి" (అని చెప్పాడు).
27:22  فَمَكَثَ غَيْرَ بَعِيدٍ فَقَالَ أَحَطتُ بِمَا لَمْ تُحِطْ بِهِ وَجِئْتُكَ مِن سَبَإٍ بِنَبَإٍ يَقِينٍ
కొద్ది సేపట్లోనే అది వచ్చి ఇలా విన్న వించుకోసాగింది : "మీకు తెలియని ఒక సమాచారాన్ని నేను సేకరించాను. నేను 'సబా' (జాతి)కి చెందిన ఒక నిజవార్తను మోసుకువచ్చాను.
27:23  إِنِّي وَجَدتُّ امْرَأَةً تَمْلِكُهُمْ وَأُوتِيَتْ مِن كُلِّ شَيْءٍ وَلَهَا عَرْشٌ عَظِيمٌ
"(ఆ జాతి) వారిని ఒక స్త్రీ పరిపాలిస్తుండటం నేను కనుగొన్నాను. ఆమెకు అన్ని వస్తువులలో నుంచి (అంతో ఇంతో) ప్రసాదించబడింది. ఆమె సింహాసనం కూడా వైభవోపేతమైనదే.
27:24  وَجَدتُّهَا وَقَوْمَهَا يَسْجُدُونَ لِلشَّمْسِ مِن دُونِ اللَّهِ وَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ فَصَدَّهُمْ عَنِ السَّبِيلِ فَهُمْ لَا يَهْتَدُونَ
"అయితే ఆమె, ఆమె ప్రజలు కూడా అల్లాహ్‌ను వదలి సూర్యునికి ప్రణమిల్లటం నేను గమనించాను. షైతాను వారి కర్మలను వారికి మంచివిగా కనిపించేటట్లు చేసి, వాళ్లను సన్మార్గం పొందకుండా అడ్డుకున్నాడు. అందువల్ల వారు సన్మార్గ భాగ్యం పొందలేకపోతున్నారు."
27:25  أَلَّا يَسْجُدُوا لِلَّهِ الَّذِي يُخْرِجُ الْخَبْءَ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَيَعْلَمُ مَا تُخْفُونَ وَمَا تُعْلِنُونَ
ఆకాశాలలోనూ, భూమిలోను నిక్షిప్తమై ఉన్న వస్తువులను వెలికితీసేవాడు, మీరు గోప్యంగా ఉంచే, బహిర్గతం చేసే విషయాలన్నీ తెలిసినవాడైన అల్లాహ్‌కు వారు సాష్టాంగపడాల్సింది (కాని వారలా చేయటం లేదు).
27:26  اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ ۩
అల్లాహ్‌-ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేడు. ఆయనే మహోన్నతమైన సింహాసనానికి అధిపతి.
27:27  قَالَ سَنَنظُرُ أَصَدَقْتَ أَمْ كُنتَ مِنَ الْكَاذِبِينَ
సులైమాను ఇలా అన్నాడు: "సరే, నువ్వు నిజం చెబుతున్నావో లేక అబద్ధం చెబుతున్నావో మేము చూస్తాము.
27:28  اذْهَب بِّكِتَابِي هَٰذَا فَأَلْقِهْ إِلَيْهِمْ ثُمَّ تَوَلَّ عَنْهُمْ فَانظُرْ مَاذَا يَرْجِعُونَ
"నా ఈ ఉత్తరాన్ని తీసుకుపోయి వారివద్ద పడవెయ్యి. వారి దగ్గరి నుంచి తొలగిపోయి, వారేవిధంగా స్పందిస్తారో చూడు."
27:29  قَالَتْ يَا أَيُّهَا الْمَلَأُ إِنِّي أُلْقِيَ إِلَيَّ كِتَابٌ كَرِيمٌ
ఆమె (రాణి) ఇలా చెప్పింది : "సభాసదులారా! నా వద్ద గౌరవప్రదమైన ఒక ఉత్తరం వెయ్యబడింది.
27:30  إِنَّهُ مِن سُلَيْمَانَ وَإِنَّهُ بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
"ఇది సులైమాను దగ్గరి నుంచి వచ్చింది. - ఇది అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్‌ పేరుతో ప్రారంభం" (అయింది అంటూ చదువసాగింది).
27:31  أَلَّا تَعْلُوا عَلَيَّ وَأْتُونِي مُسْلِمِينَ
"మీరు నాకు వ్యతిరేకంగా ఏమాత్రం తలబిరుసుతనం చూపకుండా, విధేయులై (ముస్లింలై) నా దగ్గరకు వచ్చేయండి (అని ఇందులో లిఖించబడివుంది)."
27:32  قَالَتْ يَا أَيُّهَا الْمَلَأُ أَفْتُونِي فِي أَمْرِي مَا كُنتُ قَاطِعَةً أَمْرًا حَتَّىٰ تَشْهَدُونِ
"ఓ ప్రముఖులారా! ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. ఏ విషయాన్నయినా మీ దృష్టికి తేకుండా, (మిమ్మల్ని సంప్రతించకుండా) నేను ఏ నిర్ణయమూ తీసుకోను కదా!" అని రాణి చెప్పింది.
27:33  قَالُوا نَحْنُ أُولُو قُوَّةٍ وَأُولُو بَأْسٍ شَدِيدٍ وَالْأَمْرُ إِلَيْكِ فَانظُرِي مَاذَا تَأْمُرِينَ
దానికి వారంతా, "(అమ్మా!) మనం బలవంతులం. గొప్ప పోరాటపటిమగల వారం. ఇకమీదట ఏం చేయాలన్నది మీపైనే ఆధారపడి ఉంది. మాకే ఆదేశం ఇవ్వాలో స్వయంగా మీరే ఆలోచించుకోండి" అన్నారు.
27:34  قَالَتْ إِنَّ الْمُلُوكَ إِذَا دَخَلُوا قَرْيَةً أَفْسَدُوهَا وَجَعَلُوا أَعِزَّةَ أَهْلِهَا أَذِلَّةً ۖ وَكَذَٰلِكَ يَفْعَلُونَ
ఆమె (రాణి)గారు ఇలా అభిప్రాయపడ్డారు : "సాధారణంగా రాజులు ఏ నగరంలో జొరబడినా దాన్ని ధ్వంసం చేస్తారు. అక్కడి మర్యాదస్తులను అవమానాలపాలు చేస్తారు. (బహుశా) వీళ్లూ అదే చేయవచ్చు.
27:35  وَإِنِّي مُرْسِلَةٌ إِلَيْهِم بِهَدِيَّةٍ فَنَاظِرَةٌ بِمَ يَرْجِعُ الْمُرْسَلُونَ
"నేను వాళ్ళకు ఒక కానుక పంపిస్తాను. ఆ తరువాత దౌత్యకారులు ఏం జవాబు తీసుకువస్తారో చూస్తాను."
27:36  فَلَمَّا جَاءَ سُلَيْمَانَ قَالَ أَتُمِدُّونَنِ بِمَالٍ فَمَا آتَانِيَ اللَّهُ خَيْرٌ مِّمَّا آتَاكُم بَلْ أَنتُم بِهَدِيَّتِكُمْ تَفْرَحُونَ
(రాణిగారి) దూత సులైమాను వద్దకు చేరుకున్నప్పుడు, "ఏమిటీ, మీరు నాకు ధనరూపేణా సహాయం చేయాలనుకుంటున్నారా? నా ప్రభువు నాకు, మీకిచ్చిన దానికన్నా మేలైనది ప్రసాదించాడు. కాబట్టి మీ కానుకతో మీరే సంతోషపడండి" అని సులైమాను అన్నాడు.
27:37  ارْجِعْ إِلَيْهِمْ فَلَنَأْتِيَنَّهُم بِجُنُودٍ لَّا قِبَلَ لَهُم بِهَا وَلَنُخْرِجَنَّهُم مِّنْهَا أَذِلَّةً وَهُمْ صَاغِرُونَ
"నువ్వు వారి వద్దకే తిరిగి వెళ్ళు. మేము వారిపైకి వారు నిలువరించలేని సైన్యాలను తీసుకువస్తాము. వారిని పరాభవం పాల్జేసి అక్కణ్ణుంచి వెళ్ళగొడతాము. తుదకు వారు కడు నిస్సహాయులుగా ఉండిపోతారు" (అని చెప్పాడు).
27:38  قَالَ يَا أَيُّهَا الْمَلَأُ أَيُّكُمْ يَأْتِينِي بِعَرْشِهَا قَبْلَ أَن يَأْتُونِي مُسْلِمِينَ
"ఓ ప్రముఖులారా! వారు విధేయులై ఇక్కడకు చేరుకొనక ముందే, ఆమె సింహాసనాన్ని నా దగ్గరకు తేగలవారు మీలో ఎవరయినా ఉన్నారా?" అని అతను అడిగాడు.
27:39  قَالَ عِفْرِيتٌ مِّنَ الْجِنِّ أَنَا آتِيكَ بِهِ قَبْلَ أَن تَقُومَ مِن مَّقَامِكَ ۖ وَإِنِّي عَلَيْهِ لَقَوِيٌّ أَمِينٌ
జిన్నులలో బలిష్టుడైన ఒకతను, "మీరు మీ స్థానం నుంచి లేచే లోపలే నేను దానిని మీ ముందు సమర్పిస్తాను. అంతటి శక్తి నాకుంది. నేను విశ్వసనీయుణ్ణి కూడాను" అని చెప్పాడు.
27:40  قَالَ الَّذِي عِندَهُ عِلْمٌ مِّنَ الْكِتَابِ أَنَا آتِيكَ بِهِ قَبْلَ أَن يَرْتَدَّ إِلَيْكَ طَرْفُكَ ۚ فَلَمَّا رَآهُ مُسْتَقِرًّا عِندَهُ قَالَ هَٰذَا مِن فَضْلِ رَبِّي لِيَبْلُوَنِي أَأَشْكُرُ أَمْ أَكْفُرُ ۖ وَمَن شَكَرَ فَإِنَّمَا يَشْكُرُ لِنَفْسِهِ ۖ وَمَن كَفَرَ فَإِنَّ رَبِّي غَنِيٌّ كَرِيمٌ
(అప్పుడు వారిలో) గ్రంథజ్ఞానం గల ఒకతను, "మీరు కళ్లుమూసి తెరిచే లోగానే నేను దాన్ని మీ ముందు తెచ్చిపెట్టగలను" అన్నాడు. తన కళ్ళముందర ఆ సింహాసనం ఉండటం చూసి సులైమాను, "ఇది నా ప్రభువు అనుగ్రహం. నేను కృతజ్ఞుణ్ణి అవుతానో లేక (ప్రభువు) చేసిన మేలును మరచిపోతానో పరీక్షించటానికే (ఆయన ఇదంతా చేశాడు). ఎవడైనా కృతజ్ఞతా పూర్వకంగా వ్యవహరిస్తే అతని కృతజ్ఞతాభావం అతనికే ప్రయోజనకరం అవుతుంది. మరెవరయినా మేలును మరచి ప్రవర్తిస్తే నా ప్రభువు లక్ష్యపెట్టనివాడు, గొప్ప ఉదాత్తుడు" అని పలికాడు.
27:41  قَالَ نَكِّرُوا لَهَا عَرْشَهَا نَنظُرْ أَتَهْتَدِي أَمْ تَكُونُ مِنَ الَّذِينَ لَا يَهْتَدُونَ
"ఆ సింహాసనం రూపురేఖలను (స్వల్పంగా) మార్చేయండి. ఆమె తన సింహాసనాన్ని గుర్తించే విషయంలో మార్గం పొందుతుందో లేక మార్గం తప్పిన వారిలో చేరుతుందో చూద్దాం" అని సులైమాను ఆదేశించాడు.
27:42  فَلَمَّا جَاءَتْ قِيلَ أَهَٰكَذَا عَرْشُكِ ۖ قَالَتْ كَأَنَّهُ هُوَ ۚ وَأُوتِينَا الْعِلْمَ مِن قَبْلِهَا وَكُنَّا مُسْلِمِينَ
ఆమె రాగానే, "నీ సింహాసనం కూడా ఇలాంటిదేనా?!" అని అనబడింది. దానికామె, "ఇది అచ్చం అలాగే ఉంది. మాకు ముందుగానే (విషయం) తెలిసి వచ్చింది. మేము అప్పుడే విధేయులం (ముస్లింలం) అయ్యాము" అని సమాధానమిచ్చింది.
27:43  وَصَدَّهَا مَا كَانَت تَّعْبُدُ مِن دُونِ اللَّهِ ۖ إِنَّهَا كَانَتْ مِن قَوْمٍ كَافِرِينَ
అల్లాహ్‌ను వదలి ఆమె ఎవరెవరినయితే పూజించేదో వారు ఆమెను (సన్మార్గం నుంచి) ఆపి ఉంచేవారు. నిశ్చయంగా (లోగడ) ఆమె అవిశ్వాస జనులకు చెందినది.
27:44  قِيلَ لَهَا ادْخُلِي الصَّرْحَ ۖ فَلَمَّا رَأَتْهُ حَسِبَتْهُ لُجَّةً وَكَشَفَتْ عَن سَاقَيْهَا ۚ قَالَ إِنَّهُ صَرْحٌ مُّمَرَّدٌ مِّن قَوَارِيرَ ۗ قَالَتْ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي وَأَسْلَمْتُ مَعَ سُلَيْمَانَ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
"మేడలోనికి పదండి" అని ఆమెతో అనబడింది. దాన్ని చూడగానే, ' ఇది నీటి కొలను కాబోలు' అని అనుకుని ఆమె తన పిక్కలపైని వస్త్రాన్ని ఎత్తిపట్టుకుంది. అప్పుడతను, "ఇది గాజుతో చేయబడిన నున్నని నిర్మాణం మాత్రమే" అన్నాడు. "ప్రభూ! నేను (ఇప్పటివరకూ) నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను. ఇప్పుడు నేను సులైమానుతో పాటు సర్వలోక ప్రభువు అయిన అల్లాహ్‌కు విధేయత చూపుతున్నాను" అని ఆమె ప్రకటించింది.
27:45  وَلَقَدْ أَرْسَلْنَا إِلَىٰ ثَمُودَ أَخَاهُمْ صَالِحًا أَنِ اعْبُدُوا اللَّهَ فَإِذَا هُمْ فَرِيقَانِ يَخْتَصِمُونَ
మేము సమూద్‌ జాతి వారి వైపు వారి సోదరుడైన సాలెహ్‌ను "మీరంతా అల్లాహ్‌ను ఆరాధించండి" అని సందేశం ఇచ్చి పంపాము. కాని వారు మాత్రం రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం పోట్లాడుకోసాగారు.
27:46  قَالَ يَا قَوْمِ لِمَ تَسْتَعْجِلُونَ بِالسَّيِّئَةِ قَبْلَ الْحَسَنَةِ ۖ لَوْلَا تَسْتَغْفِرُونَ اللَّهَ لَعَلَّكُمْ تُرْحَمُونَ
అతను (సాలెహ్‌) ఇలా అన్నాడు : "ఓ నా జాతివారలారా! మీరు మంచి పనికి ముందు చెడుకోసం ఎందుకింత ఆత్రం చేస్తున్నారు? మీరు క్షమాపణ కొరకు అల్లాహ్‌ను ఎందుకు వేడుకోరు? తద్వారా మీరు కరుణించబడవచ్చు కదా!"
27:47  قَالُوا اطَّيَّرْنَا بِكَ وَبِمَن مَّعَكَ ۚ قَالَ طَائِرُكُمْ عِندَ اللَّهِ ۖ بَلْ أَنتُمْ قَوْمٌ تُفْتَنُونَ
దానికి వారు, "నీ మూలంగా, నీ వెంటవున్న వారి మూలంగానే మాకు ఈ దరిద్రం పట్టుకుందని మేము భావిస్తున్నాము" అన్నారు. "మీ దరిద్రం ఏదో అల్లాహ్‌ వద్దనే ఉంది. నిజానికి మీరు పరీక్షించబడుతున్నారు" అని సాలెహ్‌ చెప్పాడు.
27:48  وَكَانَ فِي الْمَدِينَةِ تِسْعَةُ رَهْطٍ يُفْسِدُونَ فِي الْأَرْضِ وَلَا يُصْلِحُونَ
ఆ నగరంలో తొమ్మిది మందితో కూడిన (దుష్ట) మూక ఒకటి ఉండేది. వారు భువిలో అరాచకాన్ని సృష్టించేవారు. సంస్కరణ కోసం ఏమాత్రం ప్రయత్నించేవారు కారు.
27:49  قَالُوا تَقَاسَمُوا بِاللَّهِ لَنُبَيِّتَنَّهُ وَأَهْلَهُ ثُمَّ لَنَقُولَنَّ لِوَلِيِّهِ مَا شَهِدْنَا مَهْلِكَ أَهْلِهِ وَإِنَّا لَصَادِقُونَ
వారిలా కూడబలుక్కున్నారు : "రాత్రికి రాత్రే సాలెహ్‌పై, అతని ఇంటివారిపై దాడి జరుపుదాం. అతని ఇంటివారు హతమార్చబడినప్పుడు మేమక్కడ లేమని, మేము చెప్పేది సత్యమని అతని వారసులతో చెబుదాము. ఈ మేరకు అల్లాహ్‌పై ప్రమాణం చేసి మరీ శపథం చేయండి."
27:50  وَمَكَرُوا مَكْرًا وَمَكَرْنَا مَكْرًا وَهُمْ لَا يَشْعُرُونَ
ఈ విధంగా వారు (రహస్యంగా) కుట్ర పన్నారు. మరి మేము కూడా మా వ్యూహాన్ని రచించాము. కాని దాని గురించి వారికి తెలీదు.
27:51  فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ مَكْرِهِمْ أَنَّا دَمَّرْنَاهُمْ وَقَوْمَهُمْ أَجْمَعِينَ
మరి వారి కుట్ర ఎలా పరిణమించిందో చూడండి! మేము వారినీ, వారి జాతి జనులందరినీ మట్టుపెట్టాము.
27:52  فَتِلْكَ بُيُوتُهُمْ خَاوِيَةً بِمَا ظَلَمُوا ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَعْلَمُونَ
అవిగో, అవే వారి ఇండ్లు! వారి దౌర్జన్యం మూలంగా పాడుబడి ఉన్నాయి. జ్ఞానమున్న వారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది.
27:53  وَأَنجَيْنَا الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
అయితే విశ్వసించి, భయభక్తులతో మెలిగే వారిని మేము కాపాడాము.
27:54  وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِ أَتَأْتُونَ الْفَاحِشَةَ وَأَنتُمْ تُبْصِرُونَ
ఇంకా లూతు (ను పంపినప్పటి సంగతిని జ్ఞాపకం తెచ్చుకో) - అతను తన జాతివారితో, "మీరు అంతా తెలిసి కూడా సిగ్గుమాలిన పని చేస్తున్నారే?! అని చెప్పాడు.
27:55  أَئِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ شَهْوَةً مِّن دُونِ النِّسَاءِ ۚ بَلْ أَنتُمْ قَوْمٌ تَجْهَلُونَ
"మీరు ఆడవారిని వదిలేసి, మగవారి వద్దకు కామవాంఛతో ఎగబడి వస్తారేమిటి? నిజానికి మీరు వట్టి మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు" (అని చెప్పాడు).
27:56  فَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا أَخْرِجُوا آلَ لُوطٍ مِّن قَرْيَتِكُمْ ۖ إِنَّهُمْ أُنَاسٌ يَتَطَهَّرُونَ
"లూతు పరివారాన్ని మీ నగరం నుంచి వెళ్ళగొట్టండి. వారు మహా పవిత్రులుగా చెలామణీ కాగోరుతున్నారు" అనటం తప్ప అతని జాతి వద్ద మరో సమాధానం లేకపోయింది.
27:57  فَأَنجَيْنَاهُ وَأَهْلَهُ إِلَّا امْرَأَتَهُ قَدَّرْنَاهَا مِنَ الْغَابِرِينَ
అందుచేత మేము అతని భార్య మినహా అతన్నీ, అతని పరివారాన్నీ కాపాడాము. ఆమె వెనుక ఉండిపోయేవారిలో చేరుతుందని మేము ముందే నిర్ధారించాము.
27:58  وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًا ۖ فَسَاءَ مَطَرُ الْمُنذَرِينَ
వారిపై ఒక (ప్రత్యేకమైన రాళ్ల) వాన కురిపించాము. హెచ్చరించబడిన ఆ జనులపై చాలా చెడ్డ వాన కురిసింది.
27:59  قُلِ الْحَمْدُ لِلَّهِ وَسَلَامٌ عَلَىٰ عِبَادِهِ الَّذِينَ اصْطَفَىٰ ۗ آللَّهُ خَيْرٌ أَمَّا يُشْرِكُونَ
(ఓ ప్రవక్తా!) ఇలా చెప్పు : "ప్రశంసలన్నీ అల్లాహ్‌కే శోభిస్తాయి. ఆయన ఎన్నుకున్న దాసులపై శాంతి కురియుగాక! ఏమిటీ, అల్లాహ్‌ మేలా? లేక వారు భాగస్వాములుగా కల్పించుకున్న బూటకపు దేముళ్ళు మేలా?"
27:60  أَمَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ لَكُم مِّنَ السَّمَاءِ مَاءً فَأَنبَتْنَا بِهِ حَدَائِقَ ذَاتَ بَهْجَةٍ مَّا كَانَ لَكُمْ أَن تُنبِتُوا شَجَرَهَا ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ بَلْ هُمْ قَوْمٌ يَعْدِلُونَ
కాస్త చెప్పండి, ఆకాశాలనూ, భూమిని సృష్టించిన వారెవరు? ఆకాశం నుంచి మీ కొరకు వర్షాన్ని కురిపించిందెవరు? మరి దాని ద్వారా అందాలు జాలువారే తోటలను ఉత్పత్తి చేసింది ఎవరు? ఆ తోటల చెట్లను మొలకెత్తించటం అనేది మీ వల్ల కాని పని. మరి అల్లాహ్‌తో పాటు మరో ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? (లేనే లేడు) కాని ఈ జనులు సమతౌల్యం నుంచి తొలగిపోతున్నారు.
27:61  أَمَّن جَعَلَ الْأَرْضَ قَرَارًا وَجَعَلَ خِلَالَهَا أَنْهَارًا وَجَعَلَ لَهَا رَوَاسِيَ وَجَعَلَ بَيْنَ الْبَحْرَيْنِ حَاجِزًا ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ
భూమిని నివాసయోగ్యంగా చేసినదెవరు? దాని మధ్య నదీనదాలను ప్రవహింపజేసింది, దాని నిలకడ కోసం పర్వతాలను పాతిపెట్టింది ఎవరు? రెండు సముద్రాల మధ్య అడ్డుతెరను ఏర్పరచినదెవరు? (ఈ ఏర్పాట్లలో) అల్లాహ్‌తో పాటు ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా (సహాయకుడుగా) ఉన్నాడా? (ముమ్మాటికీ లేడు). అయితే వారిలో అనేకులకు అసలేమీ తెలీదు.
27:62  أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الْأَرْضِ ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
కలత చెందినవాడు మొరపెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి, అతని వ్యాకులతను దూరం చేసేవాడెవడు? మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేసేవాడెవడు? ఏమిటీ, అల్లాహ్‌తో పాటు మరో ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? మీరు మాత్రం గుణపాఠం గ్రహించేది బహు తక్కువ.
27:63  أَمَّن يَهْدِيكُمْ فِي ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ وَمَن يُرْسِلُ الرِّيَاحَ بُشْرًا بَيْنَ يَدَيْ رَحْمَتِهِ ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ تَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ
భూమిపైన, సముద్రంపైన - అలుముకున్న చీకట్లలో మీకు దారి చూపేవాడెవడు? తన కారుణ్యానికి (వర్షానికి) ముందే శుభవార్తల్ని అందజేసే గాలులను పంపేవాడెవడు? ఏమిటీ, అల్లాహ్‌తో పాటు వేరొక ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? వారు కల్పించే భాగస్వామ్యాలకు అల్లాహ్‌ అతీతుడు, ఉన్నతుడు.
27:64  أَمَّن يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَمَن يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ
చెప్పండి, తొలిసారి సృష్టిని చేసినదెవరు? మళ్ళీ దాన్ని పునరావృతం చేయగలవాడెవడు? భూమ్యాకాశాల నుంచి మీకు ఉపాధిని (ఆహార వనరులను) సమకూర్చేవాడెవడు? ఏమిటీ, అల్లాహ్‌తో పాటు (ఈ కార్యనిర్వహణలో) ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? మీరు సత్యవంతులే అయితే ఆ మేరకు మీ ప్రమాణం ఏదన్నా తీసుకురండి అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
27:65  قُل لَّا يَعْلَمُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ الْغَيْبَ إِلَّا اللَّهُ ۚ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ
"అల్లాహ్‌కు తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతామో కూడా వారికి తెలియదు" అని ఓ ప్రవక్తా (స) వారికి చెప్పు.
27:66  بَلِ ادَّارَكَ عِلْمُهُمْ فِي الْآخِرَةِ ۚ بَلْ هُمْ فِي شَكٍّ مِّنْهَا ۖ بَلْ هُم مِّنْهَا عَمُونَ
అసలు పరలోకానికి సంబంధించి వారి జ్ఞానం స్థంభించిపోయింది. పైగా దాని గురించి వారు సంశయంలో పడి ఉన్నారు. కాదు, దానిపట్ల వారు అంధులైపోయారు.
27:67  وَقَالَ الَّذِينَ كَفَرُوا أَإِذَا كُنَّا تُرَابًا وَآبَاؤُنَا أَئِنَّا لَمُخْرَجُونَ
అవిశ్వాసులు ఇలా అన్నారు : "ఏమిటీ, మేమును, మా తాతముత్తాతలూను మట్టిగా మారిపోయిన తరువాత కూడా మమ్మల్ని మళ్లీ బయటికి తీయటం జరుగుతుందా?
27:68  لَقَدْ وُعِدْنَا هَٰذَا نَحْنُ وَآبَاؤُنَا مِن قَبْلُ إِنْ هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ
"చాలా కాలంగా మాకు, మా తాతముత్తాతలకు కూడా ఇలాంటి వాగ్దానాలే చేయబడుతూ వచ్చాయి. ఇవి పూర్వీకుల కట్టుకథలు తప్ప మరేమీ కావు."
27:69  قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُجْرِمِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: "అపరాధులకు పట్టిన గతేమిటో కాస్త భూమిలో సంచరించి చూడండి!"
27:70  وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَلَا تَكُن فِي ضَيْقٍ مِّمَّا يَمْكُرُونَ
నువ్వు వాళ్ల గురించి దుఃఖించకు. వాళ్లు పన్నే కుట్రలకు కూడా నీకు మనస్తాపం కలగకూడదు.
27:71  وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ
"మీరు చెప్పేదే నిజమైతే ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో?" అని వారు (వెటకారంగా) అంటున్నారు కదూ!
27:72  قُلْ عَسَىٰ أَن يَكُونَ رَدِفَ لَكُم بَعْضُ الَّذِي تَسْتَعْجِلُونَ
"మీరు వేటిని గురించి తొందరపెడుతున్నారో వాటిలో కొన్ని విషయాలు బహుశా మీకు అత్యంత సమీపంలోనే ఉన్నాయేమో!" అని వారికి సమాధానం ఇవ్వు.
27:73  وَإِنَّ رَبَّكَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَشْكُرُونَ
వాస్తవానికి నీ ప్రభువు మానవులపై ఎంతో దయగలవాడు. కాని వారిలో చాలా మంది కృతజ్ఞులుగా మెలగరు.
27:74  وَإِنَّ رَبَّكَ لَيَعْلَمُ مَا تُكِنُّ صُدُورُهُمْ وَمَا يُعْلِنُونَ
నిశ్చయంగా నీ ప్రభువుకు వారి ఆంతర్యాలు దాచి ఉంచేవీ తెలుసు, బహిర్గతం చేసేవి కూడా తెలుసు.
27:75  وَمَا مِنْ غَائِبَةٍ فِي السَّمَاءِ وَالْأَرْضِ إِلَّا فِي كِتَابٍ مُّبِينٍ
భూమ్యాకాశాలలో దాగివున్న ఏ వస్తువు కూడా స్పష్టమైన ఒక గ్రంథంలో నమోదవకుండా లేదు.
27:76  إِنَّ هَٰذَا الْقُرْآنَ يَقُصُّ عَلَىٰ بَنِي إِسْرَائِيلَ أَكْثَرَ الَّذِي هُمْ فِيهِ يَخْتَلِفُونَ
నిశ్చయంగా ఈ ఖుర్‌ఆన్‌ ఇస్రాయీలు వంశీయులకు వారు విభేదించుకునే ఎన్నో విషయాల (లోని వాస్తవికత)ను విడమరచి చెబుతున్నది.
27:77  وَإِنَّهُ لَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ
ఇంకా నిస్సందేహంగా ఈ ఖుర్‌ఆన్‌ విశ్వాసుల కొరకు మార్గదర్శిగానూ, కారుణ్యంగానూ ఉన్నది.
27:78  إِنَّ رَبَّكَ يَقْضِي بَيْنَهُم بِحُكْمِهِ ۚ وَهُوَ الْعَزِيزُ الْعَلِيمُ
నీ ప్రభువు వీరి మధ్య తన ఆజ్ఞానుసారం తీర్పు చేస్తాడు. ఆయన అత్యంత శక్తిసంపన్నుడు, అన్నీ తెలిసినవాడు.
27:79  فَتَوَكَّلْ عَلَى اللَّهِ ۖ إِنَّكَ عَلَى الْحَقِّ الْمُبِينِ
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అల్లాహ్‌ పైనే భారం మోపు. ముమ్మాటికీ నువ్వు స్పష్టమైన సత్యపథాన ఉన్నావు.
27:80  إِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتَىٰ وَلَا تُسْمِعُ الصُّمَّ الدُّعَاءَ إِذَا وَلَّوْا مُدْبِرِينَ
నువ్వు మృతులకు వినిపించలేవు. అలాగే వీపు తిప్పుకుని, విముఖతను ప్రదర్శిస్తూ పోయే చెవిటి వారికి కూడా నువ్వు నీ పిలుపును వినిపించలేవు.
27:81  وَمَا أَنتَ بِهَادِي الْعُمْيِ عَن ضَلَالَتِهِمْ ۖ إِن تُسْمِعُ إِلَّا مَن يُؤْمِنُ بِآيَاتِنَا فَهُم مُّسْلِمُونَ
గుడ్డివారిని కూడా నువ్వు వారి అపమార్గం నుంచి మళ్ళించి, సన్మార్గానికి తేలేవు. మా ఆయతులను విశ్వసించి, విధేయత చూపేవారికి మాత్రమే నువ్వు (నీ వాణిని) వినిపించగలవు.
27:82  وَإِذَا وَقَعَ الْقَوْلُ عَلَيْهِمْ أَخْرَجْنَا لَهُمْ دَابَّةً مِّنَ الْأَرْضِ تُكَلِّمُهُمْ أَنَّ النَّاسَ كَانُوا بِآيَاتِنَا لَا يُوقِنُونَ
వారిని శిక్షించే మాట ఖరారు అయినప్పుడు, మేము వారి కోసం భూమి నుండి ఒక జంతువును వెలికి తీస్తాము. అది వారితో మాట్లాడుతుంది: ఎందుకంటే ప్రజలు మా ఆయతులను నమ్మేవారుకారు.
27:83  وَيَوْمَ نَحْشُرُ مِن كُلِّ أُمَّةٍ فَوْجًا مِّمَّن يُكَذِّبُ بِآيَاتِنَا فَهُمْ يُوزَعُونَ
ఆ రోజు మేము ప్రతి మానవ సమాజం నుంచి, మా ఆయతులను ధిక్కరించే ఒక్కొక్క సమూహాన్ని చుట్టుముట్టి మరీ తెస్తాము. ఆ తరువాత వారంతా వర్గీకరించబడతారు.
27:84  حَتَّىٰ إِذَا جَاءُوا قَالَ أَكَذَّبْتُم بِآيَاتِي وَلَمْ تُحِيطُوا بِهَا عِلْمًا أَمَّاذَا كُنتُمْ تَعْمَلُونَ
వారంతా ఒకచోట చేరిన తరువాత (అల్లాహ్‌ ఇలా) అడుగుతాడు: "మీరు నా ఆయతులను గురించి పూర్తిగా తెలియక పోయినప్పటికీ ఎందుకు ఖండించారు? ఇంతకీ మీరేం చేస్తూ ఉండేవారో చెప్పండి?"
27:85  وَوَقَعَ الْقَوْلُ عَلَيْهِم بِمَا ظَلَمُوا فَهُمْ لَا يَنطِقُونَ
వారు చేసిన దురాగతాల మూలంగా శిక్షకు సంబంధించిన మాట వారి విషయంలో నెరవేరుతుంది. అందువల్ల వారేమీ మాట్లాడలేరు.
27:86  أَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا اللَّيْلَ لِيَسْكُنُوا فِيهِ وَالنَّهَارَ مُبْصِرًا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ
వారు విశ్రాంతి తీసుకునేందుకుగాను మేము రాత్రిని చేశాము. ఇంకా పగటిని చూపగలిగేదిగా చేశాము. దీనిని వారు గమనించటం లేదా? నిశ్చయంగా విశ్వసించే వారికోసం ఇందులో నిదర్శనాలున్నాయి.
27:87  وَيَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَفَزِعَ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ إِلَّا مَن شَاءَ اللَّهُ ۚ وَكُلٌّ أَتَوْهُ دَاخِرِينَ
శంఖం ఊదబడే రోజున ఆకాశాలలో ఉన్నవారు, భూమిపై ఉన్న వారంతా భీతావహులై పోతారు - కాని అల్లాహ్‌ తలచిన వారికి మాత్రం ఆ స్థితి ఏర్పడదు. అందరూ (అశక్తులై), కడు వినమ్రులై ఆయన ముందు హాజరవుతారు.
27:88  وَتَرَى الْجِبَالَ تَحْسَبُهَا جَامِدَةً وَهِيَ تَمُرُّ مَرَّ السَّحَابِ ۚ صُنْعَ اللَّهِ الَّذِي أَتْقَنَ كُلَّ شَيْءٍ ۚ إِنَّهُ خَبِيرٌ بِمَا تَفْعَلُونَ
నీవు పర్వతాలను చూచి, అవి ఉన్న చోటే స్థిరంగా ఉంటాయని అనుకుంటున్నావు. కాని అవి కూడా మేఘ మాలికల్లా తేలిపోతుంటాయి. ఇది అల్లాహ్‌ పనితనం, ఆయన ప్రతి వస్తువును చాలా గట్టిగా చేశాడు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు.
27:89  مَن جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ خَيْرٌ مِّنْهَا وَهُم مِّن فَزَعٍ يَوْمَئِذٍ آمِنُونَ
ఎవరయితే మంచిని తీసుకువస్తారో వారికి దానికంటే ఉత్తమమైన ప్రతిఫలం లభిస్తుంది. వారు ఆనాటి భయోత్పాతం నుండి సురక్షితంగా ఉంటారు.
27:90  وَمَن جَاءَ بِالسَّيِّئَةِ فَكُبَّتْ وُجُوهُهُمْ فِي النَّارِ هَلْ تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ
మరెవరయితే చెడును తీసుకువస్తారో వారు బోర్లాగా అగ్నిలో పడవేయబడతారు. మీరు చేసుకున్న కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతుంది (అని వారితో అనబడుతుంది).
27:91  إِنَّمَا أُمِرْتُ أَنْ أَعْبُدَ رَبَّ هَٰذِهِ الْبَلْدَةِ الَّذِي حَرَّمَهَا وَلَهُ كُلُّ شَيْءٍ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُسْلِمِينَ
నేను ఈ నగరం (మక్కా) ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని నాకు ఆదేశించబడింది. ఆయన దీన్ని పవిత్ర మైనదిగా చేశాడు. అన్నింటికీ ఆయనే యజమాని. నేను విధేయులలో ఒకడిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది.
27:92  وَأَنْ أَتْلُوَ الْقُرْآنَ ۖ فَمَنِ اهْتَدَىٰ فَإِنَّمَا يَهْتَدِي لِنَفْسِهِ ۖ وَمَن ضَلَّ فَقُلْ إِنَّمَا أَنَا مِنَ الْمُنذِرِينَ
ఇంకా, నేను ఖుర్‌ఆన్‌ను పారాయణం చేస్తూ ఉండాలి (అని కూడా నాకు ఆజ్ఞాపించబడింది). సన్మార్గానికి వచ్చినవాడు తన స్వయానికి మేలు చేసుకోవటానికే సన్మార్గానికి వచ్చాడు. మరెవరయినా అపమార్గానపోతే, "నేను హెచ్చరించేవాణ్ణి మాత్రమే" అని (ఓ ప్రవక్తా!) చెప్పు.
27:93  وَقُلِ الْحَمْدُ لِلَّهِ سَيُرِيكُمْ آيَاتِهِ فَتَعْرِفُونَهَا ۚ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
ఇంకా ఈ విధంగా చెప్పు : "సర్వస్తోత్రములు అల్లాహ్‌కే శోభిస్తాయి. ఆయన త్వరలోనే తన సూచనలను మీకు చూపిస్తాడు. వాటిని మీరు స్వయంగా తెలుసుకుంటారు. మీరు చేసే పనుల విషయంలో అల్లాహ్‌ ఏమాత్రం అజాగ్రత్తగా లేడు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.