aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

24. సూరా అన్ నూర్

24:1  سُورَةٌ أَنزَلْنَاهَا وَفَرَضْنَاهَا وَأَنزَلْنَا فِيهَا آيَاتٍ بَيِّنَاتٍ لَّعَلَّكُمْ تَذَكَّرُونَ
ఇది మేము అవతరింపజేసిన (ఒక) సూరా. మరి మేమే దానిని విధించాము. మీరు జ్ఞాపకముంచుకునేందుకు, అందులో మేము స్పష్టమైన ఆయతులను (ఆజ్ఞలను) అవతరింపజేశాము.
24:2  الزَّانِيَةُ وَالزَّانِي فَاجْلِدُوا كُلَّ وَاحِدٍ مِّنْهُمَا مِائَةَ جَلْدَةٍ ۖ وَلَا تَأْخُذْكُم بِهِمَا رَأْفَةٌ فِي دِينِ اللَّهِ إِن كُنتُمْ تُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۖ وَلْيَشْهَدْ عَذَابَهُمَا طَائِفَةٌ مِّنَ الْمُؤْمِنِينَ
వ్యభిచారం చేసే స్త్రీ, వ్యభిచారం చేసే పురుషుడు - వారిద్దరిలో ఒక్కొక్కరికి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి. మీరు అల్లాహ్‌పై, అంతిమదినంపై విశ్వాసం గలవారే అయితే వారిపై దైవాజ్ఞను (షరీయతు ప్రకారం శిక్షను) విధించేటప్పుడు మీకు ఎంతమాత్రం జాలి కలగకూడదు. పైగా వారిని శిక్షించే సమయంలో ముస్లింలలో కొంతమంది అక్కడ ఉండాలి.
24:3  الزَّانِي لَا يَنكِحُ إِلَّا زَانِيَةً أَوْ مُشْرِكَةً وَالزَّانِيَةُ لَا يَنكِحُهَا إِلَّا زَانٍ أَوْ مُشْرِكٌ ۚ وَحُرِّمَ ذَٰلِكَ عَلَى الْمُؤْمِنِينَ
వ్యభిచారి అయిన పురుషుడు వ్యభిచారం చేసే స్త్రీని లేక ముష్రిక్కు స్త్రీని తప్ప మరెవరినీ వివాహమాడలేడు. అలాగే వ్యభిచారానికి పాల్పడే స్త్రీ కూడా వ్యభిచారం చేసే పురుషుడిని లేక ముష్రిక్కు మగాణ్ణి తప్ప వేరితరులను మనువాడజాలదు. విశ్వాసుల కొరకు ఇది నిషేధించబడింది.
24:4  وَالَّذِينَ يَرْمُونَ الْمُحْصَنَاتِ ثُمَّ لَمْ يَأْتُوا بِأَرْبَعَةِ شُهَدَاءَ فَاجْلِدُوهُمْ ثَمَانِينَ جَلْدَةً وَلَا تَقْبَلُوا لَهُمْ شَهَادَةً أَبَدًا ۚ وَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
శీలవతులైన స్త్రీలపై అపనిందను మోపి, దానికి సంబంధించిన నలుగురు సాక్షుల్ని తీసుకురాలేని వారికి ఎనభై కొరడా దెబ్బలు కొట్టండి. ఇక మీదట ఎన్నడూ వారి సాక్ష్యాన్ని ఆమోదించకండి. వారు అవిధేయులు.
24:5  إِلَّا الَّذِينَ تَابُوا مِن بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
అయితే ఆ తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది, తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారో (అలాంటి వారిని) అల్లాహ్‌ క్షమిస్తాడు, కరుణిస్తాడు.
24:6  وَالَّذِينَ يَرْمُونَ أَزْوَاجَهُمْ وَلَمْ يَكُن لَّهُمْ شُهَدَاءُ إِلَّا أَنفُسُهُمْ فَشَهَادَةُ أَحَدِهِمْ أَرْبَعُ شَهَادَاتٍ بِاللَّهِ ۙ إِنَّهُ لَمِنَ الصَّادِقِينَ
ఎవరయినా తమ భార్యలపై (అక్రమ సంబంధపు) నిందమోపి, దానికి స్వయంగా తాము తప్ప మరెవరూ సాక్షులు లేని పక్షంలో వారిలో ప్రతి ఒక్కరూ నాలుగుసార్లు అల్లాహ్‌పై ప్రమాణం చేసి, తాను చెప్పేది నిజం అని పలకాలి (అదే వారి సాక్ష్యం).
24:7  وَالْخَامِسَةُ أَنَّ لَعْنَتَ اللَّهِ عَلَيْهِ إِن كَانَ مِنَ الْكَاذِبِينَ
అయిదవసారి -'ఒకవేళ తాను చెప్పేది అబద్ధమైతే తనపై అల్లాహ్‌ శాపం పడుగాక!' అని చెప్పాలి.
24:8  وَيَدْرَأُ عَنْهَا الْعَذَابَ أَن تَشْهَدَ أَرْبَعَ شَهَادَاتٍ بِاللَّهِ ۙ إِنَّهُ لَمِنَ الْكَاذِبِينَ
ఇక ఆ స్త్రీ శిక్ష నుంచి బయటపడే మార్గం ఏమిటంటే, ఆమె నాలుగుసార్లు అల్లాహ్‌పై ప్రమాణం చేసి, 'తన భర్త చెప్పేది అబద్ధం' అని పలకాలి.
24:9  وَالْخَامِسَةَ أَنَّ غَضَبَ اللَّهِ عَلَيْهَا إِن كَانَ مِنَ الصَّادِقِينَ
అయిదవసారి -'ఒకవేళ అతను (తన భర్త) చెప్పేదే నిజమైతే, తనపై అల్లాహ్‌ ఆగ్రహం పడుగాక!'(అ) అని చెప్పాలి.
24:10  وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ وَأَنَّ اللَّهَ تَوَّابٌ حَكِيمٌ
అల్లాహ్‌ అనుగ్రహము, ఆయన దయాదాక్షిణ్యాలే గనక మీపైన లేకుండా పోతే (మీరు కష్టాల పాలయ్యేవారు). అల్లాహ్‌ పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు, వివేకవంతుడు.
24:11  إِنَّ الَّذِينَ جَاءُوا بِالْإِفْكِ عُصْبَةٌ مِّنكُمْ ۚ لَا تَحْسَبُوهُ شَرًّا لَّكُم ۖ بَلْ هُوَ خَيْرٌ لَّكُمْ ۚ لِكُلِّ امْرِئٍ مِّنْهُم مَّا اكْتَسَبَ مِنَ الْإِثْمِ ۚ وَالَّذِي تَوَلَّىٰ كِبْرَهُ مِنْهُمْ لَهُ عَذَابٌ عَظِيمٌ
ఈ పెద్ద అపనిందను కల్పించి తెచ్చినది కూడా మీలోని ఒక వర్గమే. మీరు దీనిని మీ పాలిట కీడుగా భావించకండి. పైగా ఇది మీ కొరకు మేలైనదే. కాకపోతే (ఈ వ్యవహారంలో), వారిలో ప్రతి ఒక్కరికీ వారు సంపాదించిన దాన్నిబట్టి పాపం లభిస్తుంది. మరి వారిలో చాలా పెద్ద పాత్రను పోషించిన వాడికి మాత్రం మహా శిక్ష పడుతుంది.
24:12  لَّوْلَا إِذْ سَمِعْتُمُوهُ ظَنَّ الْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بِأَنفُسِهِمْ خَيْرًا وَقَالُوا هَٰذَا إِفْكٌ مُّبِينٌ
దాన్ని గురించి వినగానే విశ్వాసులైన స్త్రీ పురుషులు తమ వారిపట్ల మంచి తలంపుతో, "ఇది పచ్చి అభాండం" అని ఎందుకనలేదు?
24:13  لَّوْلَا جَاءُوا عَلَيْهِ بِأَرْبَعَةِ شُهَدَاءَ ۚ فَإِذْ لَمْ يَأْتُوا بِالشُّهَدَاءِ فَأُولَٰئِكَ عِندَ اللَّهِ هُمُ الْكَاذِبُونَ
దీనిపై వారు నలుగురు సాక్షుల్ని ఎందుకు తీసుకురాలేదు? సాక్షుల్ని తీసుకురానందున ఈ నీలాపనిందను మోపినవారు అల్లాహ్‌ సన్నిధిలో అబద్ధాల కోరులయ్యారు.
24:14  وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ لَمَسَّكُمْ فِي مَا أَفَضْتُمْ فِيهِ عَذَابٌ عَظِيمٌ
ఇహపరలోకాలలో మీపై అల్లాహ్‌ అనుగ్రహం, ఆయన దయ గనక ఉండకపోతే ఏ మాటల్లోనయితే మీరు పడిపోయారో, దానికి పర్యవసానంగా, ఓ పెద్ద శిక్ష మిమ్మల్ని చుట్టుకునేదే.
24:15  إِذْ تَلَقَّوْنَهُ بِأَلْسِنَتِكُمْ وَتَقُولُونَ بِأَفْوَاهِكُم مَّا لَيْسَ لَكُم بِهِ عِلْمٌ وَتَحْسَبُونَهُ هَيِّنًا وَهُوَ عِندَ اللَّهِ عَظِيمٌ
(ఎందుకంటే) అప్పుడు మీరు ఆ విషయాన్ని ఆ నోటా ఈ నోటా అందుకుని (వ్యాపింపజేశారు.) మీకు ఏమాత్రం తెలియని విషయాన్ని మీ నోటితో పేలటం మొదలెట్టారు. మీరు దాన్ని చిన్న విషయంగా భావించారు. కాని అల్లాహ్‌ దృష్టిలో మాత్రం అది చాలా పెద్ద విషయం.
24:16  وَلَوْلَا إِذْ سَمِعْتُمُوهُ قُلْتُم مَّا يَكُونُ لَنَا أَن نَّتَكَلَّمَ بِهَٰذَا سُبْحَانَكَ هَٰذَا بُهْتَانٌ عَظِيمٌ
అసలు మీరు ఆ మాట వినగానే, "ఇలాంటి మాట చెప్పటం మనకు ఎంత మాత్రం తగదు. ఓ అల్లాహ్‌! నీవు పరమ పవిత్రుడవు. ఇది మాత్రం పెద్ద అభాండమే" అని ఎందుకు అనలేదు?
24:17  يَعِظُكُمُ اللَّهُ أَن تَعُودُوا لِمِثْلِهِ أَبَدًا إِن كُنتُم مُّؤْمِنِينَ
మీరు నిజమైన విశ్వాసులే అయితే ఇక మీదట ఎన్నడూ ఇలాంటి చేష్టకు పాల్పడరాదని అల్లాహ్‌ మీకు బోధపరుస్తున్నాడు.
24:18  وَيُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ ۚ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
అల్లాహ్‌ మీకు తన ఆయతులను విశదపరుస్తున్నాడు. అల్లాహ్‌ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు.
24:19  إِنَّ الَّذِينَ يُحِبُّونَ أَن تَشِيعَ الْفَاحِشَةُ فِي الَّذِينَ آمَنُوا لَهُمْ عَذَابٌ أَلِيمٌ فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۚ وَاللَّهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ
ముస్లింలలో అశ్లీలత వ్యాపించాలని కోరుకునేవారికి ప్రపంచంలోనూ, పరలోకంలోనూ వ్యధాభరితమైన యాతన ఉంది. అల్లాహ్‌కు అంతా తెలుసు. కాని మీకు తెలియదు.
24:20  وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ وَأَنَّ اللَّهَ رَءُوفٌ رَّحِيمٌ
అల్లాహ్‌ దయానుగ్రహాలే గనక మీపై లేకపోయినట్లయితే (మీ నిర్వాకానికిగాను ఇప్పటికే శిక్ష అవతరించేది). అల్లాహ్‌ ప్రేమ మయుడు, కనికరం కలవాడు (కాబట్టి సరిపోయింది).
24:21  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ وَمَن يَتَّبِعْ خُطُوَاتِ الشَّيْطَانِ فَإِنَّهُ يَأْمُرُ بِالْفَحْشَاءِ وَالْمُنكَرِ ۚ وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ مَا زَكَىٰ مِنكُم مِّنْ أَحَدٍ أَبَدًا وَلَٰكِنَّ اللَّهَ يُزَكِّي مَن يَشَاءُ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
ఓ విశ్వాసులారా! షైతాను అడుగు జాడల్లో నడవకండి. షైతాను అడుగు జాడలలో నడిచే వారికి వాడు అశ్లీలతను, చెడు పనులను గురించి మాత్రమే ఆదేశిస్తాడు. అల్లాహ్‌ చలువ, ఆయన దాక్షిణ్యం గనక మీపై లేకపోతే మీలో ఎవడూ, ఎన్నటికీ పరిశుద్ధుడు అయ్యేవాడు కాడు. అయితే అల్లాహ్‌ తాను కోరిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. అల్లాహ్‌ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
24:22  وَلَا يَأْتَلِ أُولُو الْفَضْلِ مِنكُمْ وَالسَّعَةِ أَن يُؤْتُوا أُولِي الْقُرْبَىٰ وَالْمَسَاكِينَ وَالْمُهَاجِرِينَ فِي سَبِيلِ اللَّهِ ۖ وَلْيَعْفُوا وَلْيَصْفَحُوا ۗ أَلَا تُحِبُّونَ أَن يَغْفِرَ اللَّهُ لَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
మీలోని ఐశ్వర్యవంతులు, స్థితిమంతులు తమ బంధువులకు, నిరుపేదలకు, అల్లాహ్‌ మార్గంలో స్వస్థలం వదలి వచ్చిన వారికి 'ఇవ్వబోము' అని ఒట్టేసుకోరాదు. పైగా వారిని క్షమించాలి. (వారి పట్ల) మన్నింపుల వైఖరిని అవలంబించాలి. ఏమిటీ, అల్లాహ్‌ మిమ్మల్ని క్షమించాలని మీరు అభిలషించరా ? అల్లాహ్‌ మాత్రం (తప్పులను) క్షమించేవాడు, కరుణామయుడు.
24:23  إِنَّ الَّذِينَ يَرْمُونَ الْمُحْصَنَاتِ الْغَافِلَاتِ الْمُؤْمِنَاتِ لُعِنُوا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ
సౌశీల్యవతులుగా ఉన్న, ఏ పాపం ఎరుగని విశ్వసించిన స్త్రీలపై అపనింద మోపేవారు ఇహపరాలలో శపించబడ్డారు. వారి కోసం చాలా పెద్ద శిక్ష ఉంది.
24:24  يَوْمَ تَشْهَدُ عَلَيْهِمْ أَلْسِنَتُهُمْ وَأَيْدِيهِمْ وَأَرْجُلُهُم بِمَا كَانُوا يَعْمَلُونَ
ఆ రోజు వారి నోళ్లూ, వారి కాళ్లూ చేతులు స్వయంగా వారి చేష్టలను గురించి సాక్ష్యమిస్తాయి.
24:25  يَوْمَئِذٍ يُوَفِّيهِمُ اللَّهُ دِينَهُمُ الْحَقَّ وَيَعْلَمُونَ أَنَّ اللَّهَ هُوَ الْحَقُّ الْمُبِينُ
ఆ రోజు అల్లాహ్‌ వారికి న్యాయబద్ధంగా పూర్తి ప్రతిఫలాన్ని (శిక్షను) ఇస్తాడు. అప్పుడు అల్లాహ్‌యే సత్యమనీ, (ఆయనే సత్యాన్ని) స్పష్టపరచేవాడనీ వారు తెలుసుకుంటారు.
24:26  الْخَبِيثَاتُ لِلْخَبِيثِينَ وَالْخَبِيثُونَ لِلْخَبِيثَاتِ ۖ وَالطَّيِّبَاتُ لِلطَّيِّبِينَ وَالطَّيِّبُونَ لِلطَّيِّبَاتِ ۚ أُولَٰئِكَ مُبَرَّءُونَ مِمَّا يَقُولُونَ ۖ لَهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ
అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషులకు తగినవారు. అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీలకు తగినవారు. (అలాగే) పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషులకు తగినవారు. పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీలకు తగినవారు. అలాంటి పవిత్రుల గురించి వారు (కపటులు) బొంకే మాటలతో వారికెలాంటి సంబంధం లేదు. వారి కొరకు మన్నింపుతో పాటు గౌరవప్రదమైన ఉపాధి ఉంది.
24:27  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَدْخُلُوا بُيُوتًا غَيْرَ بُيُوتِكُمْ حَتَّىٰ تَسْتَأْنِسُوا وَتُسَلِّمُوا عَلَىٰ أَهْلِهَا ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُونَ
ఓ విశ్వాసులారా! మీరు మీ ఇళ్లల్లోకి తప్ప ఇతరుల ఇళ్లల్లోకి - వారి అనుమతి పొందనంతవరకూ, అక్కడున్న వారికి 'సలామ్‌' చేయనంతవరకూ - ప్రవేశించకండి. ఇదే మీ కొరకు మేలైన పద్ధతి. మీరు గుర్తుంచుకునేందుకుగాను (ఈ విధంగా బోధపరచ బడింది).
24:28  فَإِن لَّمْ تَجِدُوا فِيهَا أَحَدًا فَلَا تَدْخُلُوهَا حَتَّىٰ يُؤْذَنَ لَكُمْ ۖ وَإِن قِيلَ لَكُمُ ارْجِعُوا فَارْجِعُوا ۖ هُوَ أَزْكَىٰ لَكُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ عَلِيمٌ
మరి మీకు అక్కడ ఎవరూ కనిపించకపోతే (అప్పటికీ) అనుమతి లేకుండా లోనికి ప్రవేశించకండి. తిరిగి వెళ్ళిపొమ్మని ఒకవేళ మీతో అనబడితే, మీరు (సంస్కారవంతుల్లా) తిరిగి వెళ్ళిపోండి. అదే మీ కొరకు ఎంతో పవిత్రమైనది. మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు సుమా!
24:29  لَّيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَدْخُلُوا بُيُوتًا غَيْرَ مَسْكُونَةٍ فِيهَا مَتَاعٌ لَّكُمْ ۚ وَاللَّهُ يَعْلَمُ مَا تُبْدُونَ وَمَا تَكْتُمُونَ
అయితే ఎవరూ నివసించని ఇండ్లలో, మీకు చెందిన ప్రయోజనకరమైన వస్తు సామగ్రి ఏదన్నా ఉన్నప్పుడు మీరు వాటిలోకి ప్రవేశిస్తే అందులో తప్పులేదు. మీరు బహిర్గతం చేసేదీ, గోప్యంగా ఉంచేదీ - అంతా అల్లాహ్‌కు తెలుసు.
24:30  قُل لِّلْمُؤْمِنِينَ يَغُضُّوا مِنْ أَبْصَارِهِمْ وَيَحْفَظُوا فُرُوجَهُمْ ۚ ذَٰلِكَ أَزْكَىٰ لَهُمْ ۗ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا يَصْنَعُونَ
(ఓ ప్రవక్తా!) ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలనీ, అది వారి కొరకు పవిత్రమైనదని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.
24:31  وَقُل لِّلْمُؤْمِنَاتِ يَغْضُضْنَ مِنْ أَبْصَارِهِنَّ وَيَحْفَظْنَ فُرُوجَهُنَّ وَلَا يُبْدِينَ زِينَتَهُنَّ إِلَّا مَا ظَهَرَ مِنْهَا ۖ وَلْيَضْرِبْنَ بِخُمُرِهِنَّ عَلَىٰ جُيُوبِهِنَّ ۖ وَلَا يُبْدِينَ زِينَتَهُنَّ إِلَّا لِبُعُولَتِهِنَّ أَوْ آبَائِهِنَّ أَوْ آبَاءِ بُعُولَتِهِنَّ أَوْ أَبْنَائِهِنَّ أَوْ أَبْنَاءِ بُعُولَتِهِنَّ أَوْ إِخْوَانِهِنَّ أَوْ بَنِي إِخْوَانِهِنَّ أَوْ بَنِي أَخَوَاتِهِنَّ أَوْ نِسَائِهِنَّ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُنَّ أَوِ التَّابِعِينَ غَيْرِ أُولِي الْإِرْبَةِ مِنَ الرِّجَالِ أَوِ الطِّفْلِ الَّذِينَ لَمْ يَظْهَرُوا عَلَىٰ عَوْرَاتِ النِّسَاءِ ۖ وَلَا يَضْرِبْنَ بِأَرْجُلِهِنَّ لِيُعْلَمَ مَا يُخْفِينَ مِن زِينَتِهِنَّ ۚ وَتُوبُوا إِلَى اللَّهِ جَمِيعًا أَيُّهَ الْمُؤْمِنُونَ لَعَلَّكُمْ تُفْلِحُونَ
(ఓ ప్రవక్తా!) ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలనీ, బహిర్గతమై ఉండేది తప్ప - తమ అలంకరణను బహిర్గతం చేయరాదనీ, తమ వక్షస్థలాలపై ఓణీలు వేసుకోవాలనీ, తమ భర్త లేక తమ తండ్రి లేక తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ భర్త కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేక తమ అక్కాచెల్లెళ్ల కొడుకులు లేక తమతో కలిసిమెలిసి ఉండే స్త్రీలు, లేక తమ బానిసలు లేక ఇతరత్రా ఉద్దేశాలు లేకుండా తమకు లోబడి ఉన్న పురుష సేవకులు లేక స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా తెలియని బాలురు - వీళ్ల ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అలంకరణలను (అంద చందాలను) కనబడనివ్వకూడదనీ, దాగివున్న తమ అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్ళను నేలపై కొడుతూ నడవరాదని వారితో చెప్పు. ముస్లింలారా! మీరంతా కలసి అల్లాహ్‌ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.
24:32  وَأَنكِحُوا الْأَيَامَىٰ مِنكُمْ وَالصَّالِحِينَ مِنْ عِبَادِكُمْ وَإِمَائِكُمْ ۚ إِن يَكُونُوا فُقَرَاءَ يُغْنِهِمُ اللَّهُ مِن فَضْلِهِ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
మీలో వివాహం కాకుండా ఉన్న స్త్రీ పురుషుల వివాహం చేయండి. అలాగే మంచి నడవడికగల మీ బానిసల, బానిస స్త్రీల వివాహం కూడా జరిపించండి. ఒకవేళ వారు పేదవారై ఉంటే అల్లాహ్‌ తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేస్తాడు. అల్లాహ్‌ విశాల సంపన్నుడు, సమస్తమూ తెలిసిన వాడు.
24:33  وَلْيَسْتَعْفِفِ الَّذِينَ لَا يَجِدُونَ نِكَاحًا حَتَّىٰ يُغْنِيَهُمُ اللَّهُ مِن فَضْلِهِ ۗ وَالَّذِينَ يَبْتَغُونَ الْكِتَابَ مِمَّا مَلَكَتْ أَيْمَانُكُمْ فَكَاتِبُوهُمْ إِنْ عَلِمْتُمْ فِيهِمْ خَيْرًا ۖ وَآتُوهُم مِّن مَّالِ اللَّهِ الَّذِي آتَاكُمْ ۚ وَلَا تُكْرِهُوا فَتَيَاتِكُمْ عَلَى الْبِغَاءِ إِنْ أَرَدْنَ تَحَصُّنًا لِّتَبْتَغُوا عَرَضَ الْحَيَاةِ الدُّنْيَا ۚ وَمَن يُكْرِههُّنَّ فَإِنَّ اللَّهَ مِن بَعْدِ إِكْرَاهِهِنَّ غَفُورٌ رَّحِيمٌ
వివాహం చేసుకునే ఆర్థిక స్థోమతలేనివారు, అల్లాహ్‌ తన అనుగ్రహంతో తమకు స్థోమతను ప్రసాదించేవరకూ శీల శుద్ధతను పాటించాలి. మీ బానిసలలో ఎవరయినా మీకేదైనా (సొమ్మును) ఇచ్చి, విడుదలకు సంబంధించిన లిఖిత పూర్వక ఒప్పందం (ముకాతబత్‌) మీతో చేసుకోదలిస్తే - వారిలో మీకు మంచితనం కానవచ్చిన పక్షంలో - వారికి వ్రాతపత్రం వ్రాసి ఇవ్వండి. అల్లాహ్‌ మీకు ప్రసాదించిన ధనంలో నుంచి వారికీ కొంత ఇవ్వండి. మీ బానిస స్త్రీలు శీలవతులుగా ఉండగోరి నప్పుడు, మీరు మీ ప్రాపంచిక జీవితపు స్వలాభాల కోసం వాళ్ళను వేశ్యావృత్తికై బలవంతపెట్టకండి. ఒకవేళ ఎవరయినా వారిని (ఆ నీచమైన పని కోసం) బలవంతం చేస్తే, ఆ బలాత్కారం తరువాత అల్లాహ్‌ (ఆ అభాగినులను) క్షమించేవాడు, కనికరించేవాడు.
24:34  وَلَقَدْ أَنزَلْنَا إِلَيْكُمْ آيَاتٍ مُّبَيِّنَاتٍ وَمَثَلًا مِّنَ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُمْ وَمَوْعِظَةً لِّلْمُتَّقِينَ
మేము మీ వద్దకు స్పష్టమైన ఆయతులను, మీకు పూర్వం గతించిన వారి ఉదాహరణలను, భయభక్తులు గల వారి కొరకు ఉపదేశాన్నీ పంపాము.
24:35  اللَّهُ نُورُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ مَثَلُ نُورِهِ كَمِشْكَاةٍ فِيهَا مِصْبَاحٌ ۖ الْمِصْبَاحُ فِي زُجَاجَةٍ ۖ الزُّجَاجَةُ كَأَنَّهَا كَوْكَبٌ دُرِّيٌّ يُوقَدُ مِن شَجَرَةٍ مُّبَارَكَةٍ زَيْتُونَةٍ لَّا شَرْقِيَّةٍ وَلَا غَرْبِيَّةٍ يَكَادُ زَيْتُهَا يُضِيءُ وَلَوْ لَمْ تَمْسَسْهُ نَارٌ ۚ نُّورٌ عَلَىٰ نُورٍ ۗ يَهْدِي اللَّهُ لِنُورِهِ مَن يَشَاءُ ۚ وَيَضْرِبُ اللَّهُ الْأَمْثَالَ لِلنَّاسِ ۗ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
అల్లాహ్‌ ఆకాశాలకూ, భూమికి కాంతి. ఆయన కాంతి ఒక గూటిని పోలి వున్నది. ఆ గూటిలో ఒక దీపం ఉంది. ఆ దీపం ఒక గాజు చిమ్నీలో ఉంది. ఆ గాజు చిమ్నీ మెరిసే నక్షత్రం మాదిరిగా ఉంది. ఆ దీపం శుభప్రదమైన ఒక జైతూను వృక్షం (నుండి తీసిన) నూనెతో వెలిగించబడుతోంది. ఆ వృక్షం తూర్పుకూ చెందదు, పడమరకూ చెందదు; దాని నూనె - అగ్ని తగలకపోయినా-దానంతట అదే జ్వలిస్తున్నట్లు ఉంది. కాంతిపై కాంతి వుంది. అల్లాహ్‌ తాను కోరిన వారికి తన కాంతి వైపు మార్గదర్శకత్వం వహిస్తాడు. ప్రజలకు (విషయం అర్థం అవటానికి) ఈ ఉపమానాలను అల్లాహ్‌ విశదపరుస్తున్నాడు. అల్లాహ్‌కు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు.
24:36  فِي بُيُوتٍ أَذِنَ اللَّهُ أَن تُرْفَعَ وَيُذْكَرَ فِيهَا اسْمُهُ يُسَبِّحُ لَهُ فِيهَا بِالْغُدُوِّ وَالْآصَالِ
ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తన నామస్మరణ చేయాలని అల్లాహ్‌ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతుంటారు,
24:37  رِجَالٌ لَّا تُلْهِيهِمْ تِجَارَةٌ وَلَا بَيْعٌ عَن ذِكْرِ اللَّهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ ۙ يَخَافُونَ يَوْمًا تَتَقَلَّبُ فِيهِ الْقُلُوبُ وَالْأَبْصَارُ
(కొందరు) పురుషులు. వర్తకంగానీ, క్రయవిక్రయాలుగానీ అల్లాహ్‌ నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్‌ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై, కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు.
24:38  لِيَجْزِيَهُمُ اللَّهُ أَحْسَنَ مَا عَمِلُوا وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۗ وَاللَّهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
తమ సత్కార్యాలకు అల్లాహ్‌ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లాహ్‌ తన కృపతో మరింత అధికంగా వొసగటానికి (వారు ఈ విధంగా మసలుకుంటారు). అల్లాహ్‌ తాను తలచిన వారికి లెక్క లేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు.
24:39  وَالَّذِينَ كَفَرُوا أَعْمَالُهُمْ كَسَرَابٍ بِقِيعَةٍ يَحْسَبُهُ الظَّمْآنُ مَاءً حَتَّىٰ إِذَا جَاءَهُ لَمْ يَجِدْهُ شَيْئًا وَوَجَدَ اللَّهَ عِندَهُ فَوَفَّاهُ حِسَابَهُ ۗ وَاللَّهُ سَرِيعُ الْحِسَابِ
అవిశ్వాసుల కర్మల ఉపమానం చదునైన ఎడారి ప్రదేశంలో మెరిసే ఎండమావి లాంటిది. దప్పిక గొన్నవాడు దూరం నుంచి చూసి దాన్ని నీరని భ్రమ చెందుతాడు. తీరా దాని దగ్గరకు వెళితే అక్కడ ఏమీ ఉండదు. అయితే అతనక్కడ అల్లాహ్‌ను పొందుతాడు. ఆయన అక్కడికక్కడే అతని లెక్కను తేల్చివేస్తాడు. అల్లాహ్‌ లెక్క తీసుకోవటంలో మహా శీఘ్రగామి.
24:40  أَوْ كَظُلُمَاتٍ فِي بَحْرٍ لُّجِّيٍّ يَغْشَاهُ مَوْجٌ مِّن فَوْقِهِ مَوْجٌ مِّن فَوْقِهِ سَحَابٌ ۚ ظُلُمَاتٌ بَعْضُهَا فَوْقَ بَعْضٍ إِذَا أَخْرَجَ يَدَهُ لَمْ يَكَدْ يَرَاهَا ۗ وَمَن لَّمْ يَجْعَلِ اللَّهُ لَهُ نُورًا فَمَا لَهُ مِن نُّورٍ
లేదా (వారికర్మల ఉపమానం) లోతైన సముద్రపు (అట్టడుగున ఉన్న) చీకట్ల వంటిది. దానిపై అల, ఆపైన మరో అల కమ్ముకొని ఉంది. వాటిపై మేఘాలు ఆవరించి వున్నాయి. ఆ విధంగా చీకట్లు ఒకదానిపై ఒకటి (దట్టంగా) అలుముకుని ఉన్నాయి. ఎవరయినా తమ చేతిని బయటికి తీస్తే కానరాని పరిస్థితి అది! (యదార్థ మేమిటంటే) అల్లాహ్‌ ఎవరికి కాంతిని వొసగడో అతనికి కాంతి అనేదే లభించదు.
24:41  أَلَمْ تَرَ أَنَّ اللَّهَ يُسَبِّحُ لَهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَالطَّيْرُ صَافَّاتٍ ۖ كُلٌّ قَدْ عَلِمَ صَلَاتَهُ وَتَسْبِيحَهُ ۗ وَاللَّهُ عَلِيمٌ بِمَا يَفْعَلُونَ
భూమ్యాకాశాలలో వున్న సమస్త సృష్టితాలు, రెక్కలు చాచి ఎగురుతున్న పక్షులూ అల్లాహ్‌ పవిత్రతను కొనియాడటాన్ని నువ్వు చూడటం లేదా? వాటిలో ప్రతిదీ తన నమాజు విధానాన్ని, స్తోత్రాన్ని గురించి ఎరిగి ఉన్నది. వారు (జనులు) చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.
24:42  وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَإِلَى اللَّهِ الْمَصِيرُ
భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్‌దే. (కడకు అంతా) అల్లాహ్‌ వైపుకే మరలవలసి ఉంది.
24:43  أَلَمْ تَرَ أَنَّ اللَّهَ يُزْجِي سَحَابًا ثُمَّ يُؤَلِّفُ بَيْنَهُ ثُمَّ يَجْعَلُهُ رُكَامًا فَتَرَى الْوَدْقَ يَخْرُجُ مِنْ خِلَالِهِ وَيُنَزِّلُ مِنَ السَّمَاءِ مِن جِبَالٍ فِيهَا مِن بَرَدٍ فَيُصِيبُ بِهِ مَن يَشَاءُ وَيَصْرِفُهُ عَن مَّن يَشَاءُ ۖ يَكَادُ سَنَا بَرْقِهِ يَذْهَبُ بِالْأَبْصَارِ
అల్లాహ్‌ మేఘాలను నడిపించటాన్నీ, మరి వాటిని పరస్పరం కలపటాన్ని, ఆ తరువాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా పేర్చటాన్ని నువ్వు గమనించటం లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షం కురవటాన్ని నువ్వు చూస్తావు. మరి ఆయనే ఆకాశంలోని వడగండ్ల పర్వతాల నుంచి వడగండ్లను కురిపిస్తాడు. తాను కోరినవారిపై వాటిని కురిపిస్తాడు, తాను కోరిన వారినుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాల నుంచి వెలువడే మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది.
24:44  يُقَلِّبُ اللَّهُ اللَّيْلَ وَالنَّهَارَ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِّأُولِي الْأَبْصَارِ
అల్లాహ్‌ రేయింబవళ్ళను మారుస్తూ ఉంటాడు. కళ్లున్న వారికి ఇందులో గొప్ప గుణపాఠం ఉంది.
24:45  وَاللَّهُ خَلَقَ كُلَّ دَابَّةٍ مِّن مَّاءٍ ۖ فَمِنْهُم مَّن يَمْشِي عَلَىٰ بَطْنِهِ وَمِنْهُم مَّن يَمْشِي عَلَىٰ رِجْلَيْنِ وَمِنْهُم مَّن يَمْشِي عَلَىٰ أَرْبَعٍ ۚ يَخْلُقُ اللَّهُ مَا يَشَاءُ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
సంచరించే సమస్త ప్రాణులను అల్లాహ్‌ నీటితో సృజించాడు. వాటిలో కొన్ని తమ పొట్ట ఆధారంగా ప్రాకుతుండగా, కొన్ని రెండు కాళ్ళపై నడుస్తున్నాయి. మరి కొన్ని నాలుగు కాళ్లపై నడుస్తున్నాయి. అల్లాహ్‌ తాను కోరిన దాన్ని సృజిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.
24:46  لَّقَدْ أَنزَلْنَا آيَاتٍ مُّبَيِّنَاتٍ ۚ وَاللَّهُ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
నిస్సందేహంగా మేము స్పష్టంగా విడమరచి చెప్పే సూచనలను అవతరింపజేశాము. అల్లాహ్‌ తాను కోరిన వారికి రుజు మార్గం చూపుతాడు.
24:47  وَيَقُولُونَ آمَنَّا بِاللَّهِ وَبِالرَّسُولِ وَأَطَعْنَا ثُمَّ يَتَوَلَّىٰ فَرِيقٌ مِّنْهُم مِّن بَعْدِ ذَٰلِكَ ۚ وَمَا أُولَٰئِكَ بِالْمُؤْمِنِينَ
"మేము అల్లాహ్‌ను, ప్రవక్తను విశ్వసించాము, విధేయులమయ్యాము" అని వారంటారు. మరి ఆ తరువాత వారిలోని ఒక వర్గం వెనుతిరిగిపోతుంది. వారసలు విశ్వసించినవారే కారు.
24:48  وَإِذَا دُعُوا إِلَى اللَّهِ وَرَسُولِهِ لِيَحْكُمَ بَيْنَهُمْ إِذَا فَرِيقٌ مِّنْهُم مُّعْرِضُونَ
వారి మధ్య గల వివాదాలను పరిష్కరించటానికి అల్లాహ్‌వైపు, ఆయన ప్రవక్త వద్దకు రమ్మని వారిని పిలిచినప్పుడు కూడా వారిలోని ఒక వర్గం విముఖత చూపుతుంది.
24:49  وَإِن يَكُن لَّهُمُ الْحَقُّ يَأْتُوا إِلَيْهِ مُذْعِنِينَ
అయితే హక్కు తమకే లభిస్తుందనుకున్నప్పుడు మాత్రం ఎంతో వినయంతో అతని వద్దకు వస్తారు.
24:50  أَفِي قُلُوبِهِم مَّرَضٌ أَمِ ارْتَابُوا أَمْ يَخَافُونَ أَن يَحِيفَ اللَّهُ عَلَيْهِمْ وَرَسُولُهُ ۚ بَلْ أُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
ఏమిటీ, వారి హృదయాలలో రోగం ఉందా? లేక వారు సంశయంలో పడి ఊగిసలాడుతున్నారా? లేక అల్లాహ్‌, ఆయన ప్రవక్త తమకు అన్యాయం చేస్తారని వారికి భయం పట్టుకున్నదా? యదార్థానికి వారే అన్యాయపరులు.
24:51  إِنَّمَا كَانَ قَوْلَ الْمُؤْمِنِينَ إِذَا دُعُوا إِلَى اللَّهِ وَرَسُولِهِ لِيَحْكُمَ بَيْنَهُمْ أَن يَقُولُوا سَمِعْنَا وَأَطَعْنَا ۚ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
అదే విశ్వసించిన వారిని తమ మధ్యగల వివాదాలను పరిష్కరించటానికి అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త వద్దకు పిలిచి నప్పుడు, "మేము విన్నాము, శిరసావహించాము" అని వారు అంటారు. సాఫల్యం పొందేవారు వారే.
24:52  وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ وَيَخْشَ اللَّهَ وَيَتَّقْهِ فَأُولَٰئِكَ هُمُ الْفَائِزُونَ
ఎవరు అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో, అల్లాహ్‌కు భయపడుతూ, ఆయన (శిక్షల) నుండి తమను కాపాడు కుంటారో వారే విజయం సాధించేవారు.
24:53  وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ لَئِنْ أَمَرْتَهُمْ لَيَخْرُجُنَّ ۖ قُل لَّا تُقْسِمُوا ۖ طَاعَةٌ مَّعْرُوفَةٌ ۚ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
"తమరు ఆజ్ఞాపించగానే బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాము" అని (కపటులు) అల్లాహ్‌పై గట్టిగా ప్రమాణం చేసి మరీ చెబుతారు. "ప్రమాణాలు చేయకండి. మీ విధేయత (లోని చిత్తశుద్ధి) ఏ పాటిదో విదితమే. మీ కార్యకలాపాల గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు" అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
24:54  قُلْ أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ ۖ فَإِن تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْهِ مَا حُمِّلَ وَعَلَيْكُم مَّا حُمِّلْتُمْ ۖ وَإِن تُطِيعُوهُ تَهْتَدُوا ۚ وَمَا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ الْمُبِينُ
(ఓ ప్రవక్తా! వారికి ఈ విధంగా) చెప్పు: "అల్లాహ్‌ ఆదేశాన్ని పాలించండి. దైవప్రవక్తను అనుసరించండి. ఒకవేళ మీరు గనక విముఖత చూపితే దైవప్రవక్తపై మోపబడిన కార్యభారం వరకే అతను బాధ్యుడు, మీపై ఉన్న కర్తవ్య నిర్వహణకు మీరే సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది. మీరు దైవప్రవక్త మాటను విన్నప్పుడే మీకు సన్మార్గం లభిస్తుంది. విషయాన్ని స్పష్టంగా చేరవేయటం వరకే ప్రవక్త బాధ్యత (అని తెలుసుకోండి!")
24:55  وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَعَمِلُوا الصَّالِحَاتِ لَيَسْتَخْلِفَنَّهُمْ فِي الْأَرْضِ كَمَا اسْتَخْلَفَ الَّذِينَ مِن قَبْلِهِمْ وَلَيُمَكِّنَنَّ لَهُمْ دِينَهُمُ الَّذِي ارْتَضَىٰ لَهُمْ وَلَيُبَدِّلَنَّهُم مِّن بَعْدِ خَوْفِهِمْ أَمْنًا ۚ يَعْبُدُونَنِي لَا يُشْرِكُونَ بِي شَيْئًا ۚ وَمَن كَفَرَ بَعْدَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
మీలో ఎవరు విశ్వసించి, మంచి పనులు చేశారో వారికి అల్లాహ్‌, వారి పూర్వీకులను భూమికి ప్రతినిధులుగా చేసినట్లుగానే వారికి కూడా తప్పకుండా ప్రాతినిధ్యం వొసగుతానని, తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కొరకు పటిష్టం చేసి, దానికి స్థిరత్వాన్ని కల్పిస్తానని, వారికున్న భయాందోళనల స్థానే శాంతిభద్రతల స్థితిని కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. వారు నన్నే ఆరాధిస్తారు. నాకు సహవర్తులుగా ఎవరినీ కల్పించరు. ఇంత జరిగిన తరువాత కూడా ఎవరైనా విశ్వాస ఘాతుకానికి పాల్పడితే ముమ్మాటికీ వారు అవిధేయు లవుతారు.
24:56  وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَأَطِيعُوا الرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ
నమాజును నెలకొల్పండి. జకాతును ఇవ్వండి. దైవప్రవక్తకు విధేయులుగా మసలుకోండి. తద్వారానే మీరు కరుణించబడతారు.
24:57  لَا تَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا مُعْجِزِينَ فِي الْأَرْضِ ۚ وَمَأْوَاهُمُ النَّارُ ۖ وَلَبِئْسَ الْمَصِيرُ
ఈ అవిశ్వాసులు రాజ్యంలో (అటూ ఇటూ పరుగులు తీసి) మమ్మల్ని అశక్తుల్ని చేస్తారని ఎన్నడూ తలపోయకు. వారి అసలు నివాసస్థలం నరకమే. అది మహా చెడ్డ గమ్యస్థానం.
24:58  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لِيَسْتَأْذِنكُمُ الَّذِينَ مَلَكَتْ أَيْمَانُكُمْ وَالَّذِينَ لَمْ يَبْلُغُوا الْحُلُمَ مِنكُمْ ثَلَاثَ مَرَّاتٍ ۚ مِّن قَبْلِ صَلَاةِ الْفَجْرِ وَحِينَ تَضَعُونَ ثِيَابَكُم مِّنَ الظَّهِيرَةِ وَمِن بَعْدِ صَلَاةِ الْعِشَاءِ ۚ ثَلَاثُ عَوْرَاتٍ لَّكُمْ ۚ لَيْسَ عَلَيْكُمْ وَلَا عَلَيْهِمْ جُنَاحٌ بَعْدَهُنَّ ۚ طَوَّافُونَ عَلَيْكُم بَعْضُكُمْ عَلَىٰ بَعْضٍ ۚ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
ఓ విశ్వాసులారా! మీ అధీనంలో వున్న మీ బానిసలుగానీ, ఇంకా ప్రాజ్ఞవయస్సుకు చేరని మీ పిల్లలుగానీ మూడు వేళల్లో మాత్రం మీ అనుమతి పొందిన మీదటే మీ వద్దకు రావాలి - 1.ఫజ్ర్‌ నమాజుకు పూర్వం, 2.మధ్యాహ్నం (జుహ్ర్‌) వేళ మీరు మీ బట్టలు విడిచి ఉన్నప్పుడు, 3.ఇషా నమాజు తరువాత. ఈ మూడు వేళలు మీరు ఏకాంతం (పరదా)లో ఉండే వేళలు. ఈ మూడు వేళల్ని మినహాయిస్తే (రాకపోకలు సాగించటంలో) మీపై గానీ, వారిపైగానీ ఎలాంటి దోషం లేదు. (ఎందుకంటే) మీరు తరచూ ఒండొకరి దగ్గరకు వస్తూపోతూ ఉండవలసిన వారే. ఈ విధంగా అల్లాహ్‌ తన ఆజ్ఞలను మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. అల్లాహ్‌ సంపూర్ణ జ్ఞాని, పరిపూర్ణ వివేకవంతుడు.
24:59  وَإِذَا بَلَغَ الْأَطْفَالُ مِنكُمُ الْحُلُمَ فَلْيَسْتَأْذِنُوا كَمَا اسْتَأْذَنَ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ آيَاتِهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
మరి మీ పిల్లలు (కూడా) ప్రాజ్ఞ వయస్సుకు చేరుకున్న తరువాత, తమ పూర్వీకులు అనుమతి పొందినట్లే వారు కూడా అనుమతి పొంది మరీ రావాలి. అల్లాహ్‌ ఈ విధంగా తన ఆదేశాలను మీకు విశదపరుస్తున్నాడు. అల్లాహ్‌యే సర్వజ్ఞాని, వివేకసంపన్నుడు.
24:60  وَالْقَوَاعِدُ مِنَ النِّسَاءِ اللَّاتِي لَا يَرْجُونَ نِكَاحًا فَلَيْسَ عَلَيْهِنَّ جُنَاحٌ أَن يَضَعْنَ ثِيَابَهُنَّ غَيْرَ مُتَبَرِّجَاتٍ بِزِينَةٍ ۖ وَأَن يَسْتَعْفِفْنَ خَيْرٌ لَّهُنَّ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
పెళ్ళిపై ఆశ (కోరిక) లేని వృద్ధ స్త్రీలు - తమ అందాలంకరణలు ప్రదర్శించే ఉద్దేశం లేకుండా - తమపై దుప్పట్లను తీసేసినా తప్పులేదు. అయినప్పటికీ వారు జాగ్రత్త వహిస్తే అది వారికే శ్రేయస్కరం. అల్లాహ్‌ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
24:61  لَّيْسَ عَلَى الْأَعْمَىٰ حَرَجٌ وَلَا عَلَى الْأَعْرَجِ حَرَجٌ وَلَا عَلَى الْمَرِيضِ حَرَجٌ وَلَا عَلَىٰ أَنفُسِكُمْ أَن تَأْكُلُوا مِن بُيُوتِكُمْ أَوْ بُيُوتِ آبَائِكُمْ أَوْ بُيُوتِ أُمَّهَاتِكُمْ أَوْ بُيُوتِ إِخْوَانِكُمْ أَوْ بُيُوتِ أَخَوَاتِكُمْ أَوْ بُيُوتِ أَعْمَامِكُمْ أَوْ بُيُوتِ عَمَّاتِكُمْ أَوْ بُيُوتِ أَخْوَالِكُمْ أَوْ بُيُوتِ خَالَاتِكُمْ أَوْ مَا مَلَكْتُم مَّفَاتِحَهُ أَوْ صَدِيقِكُمْ ۚ لَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَأْكُلُوا جَمِيعًا أَوْ أَشْتَاتًا ۚ فَإِذَا دَخَلْتُم بُيُوتًا فَسَلِّمُوا عَلَىٰ أَنفُسِكُمْ تَحِيَّةً مِّنْ عِندِ اللَّهِ مُبَارَكَةً طَيِّبَةً ۚ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ لَعَلَّكمْ تَعْقِلُونَ
గుడ్డివానిపైగానీ, కుంటివానిపైగానీ, వ్యాధిగ్రస్తునిపైగానీ, స్వయంగా మీపైనగానీ - మీ ఇండ్లలో నుంచి అయినా లేదా మీ తండ్రుల ఇళ్ళ నుంచి అయినా లేదా మీ తల్లుల ఇళ్ల నుంచి అయినా, లేదా మీ అన్నదమ్ముల ఇళ్లనుంచి అయినా లేదా మీ అక్కాచెల్లెళ్ల ఇళ్ల నుంచి అయినా, లేదా మీ పిన తండ్రుల ఇళ్లనుంచి అయినా, లేదా మీ మేనత్తల ఇళ్లనుంచి అయినా లేదా మీ మేనమామల ఇళ్లనుంచి అయినా లేదా మీ పినతల్లుల ఇళ్లనుంచి అయినా లేదా తాళపు చెవులు మీ అధీనంలో వున్న ఇళ్లనుంచి అయినా లేదా మీ స్నేహితుల ఇళ్లనుంచి అయినా - ఏమైనా (ఆహార వస్తువులు) తీసుకుని తింటే అది అభ్యంతరకరం ఏమీ కాదు. మీరంతా కలిసి భుజించినా, లేక వేర్వేరుగా భుజించినా తప్పులేదు. అయితే మీరు ఇండ్లలో ప్రవేశించేటప్పుడు మాత్రం మీ స్వయానికి సలాం చేసుకోండి. ఇది అల్లాహ్‌ తరఫు నుంచి అవతరించిన, మేలు కొరకు చేయబడే ప్రార్థన, శుభకరమైనది, పవిత్రమైనది. ఈ విధంగా అల్లాహ్‌ మీరు గ్రహించగలందులకు తన ఆజ్ఞలను మీకు తేటతెల్లం చేస్తున్నాడు.
24:62  إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَإِذَا كَانُوا مَعَهُ عَلَىٰ أَمْرٍ جَامِعٍ لَّمْ يَذْهَبُوا حَتَّىٰ يَسْتَأْذِنُوهُ ۚ إِنَّ الَّذِينَ يَسْتَأْذِنُونَكَ أُولَٰئِكَ الَّذِينَ يُؤْمِنُونَ بِاللَّهِ وَرَسُولِهِ ۚ فَإِذَا اسْتَأْذَنُوكَ لِبَعْضِ شَأْنِهِمْ فَأْذَن لِّمَن شِئْتَ مِنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمُ اللَّهَ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను నమ్ముతూ, ఏదైనా సామూహిక వ్యవహారంలో దైవప్రవక్త వెంట ఉన్నప్పుడు ఆయన అనుమతి పొందనంత వరకూ ఎక్కడికీ పోకుండా ఉండేవారే సిసలైన విశ్వాసులు. అలాంటి (కీలక) సమయాలలో నీ నుండి అనుమతి తీసుకునేవారే వాస్తవానికి అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను విశ్వసించినవారు. కనుక (ఓ ప్రవక్తా!) అలాంటి వారు ఎప్పుడయినా, ఏదయినా తమ పని మీద నీ నుండి సెలవు కోరితే, వారిలో నువ్వు తలచిన వారికి సెలవు ఇస్తూ ఉండు. ఇంకా వారి మన్నింపు కొరకు అల్లాహ్‌ను వేడుకుంటూ ఉండు. నిశ్చయంగా అల్లాహ్‌ క్షమాశీలి, కృపాకరుడు.
24:63  لَّا تَجْعَلُوا دُعَاءَ الرَّسُولِ بَيْنَكُمْ كَدُعَاءِ بَعْضِكُم بَعْضًا ۚ قَدْ يَعْلَمُ اللَّهُ الَّذِينَ يَتَسَلَّلُونَ مِنكُمْ لِوَاذًا ۚ فَلْيَحْذَرِ الَّذِينَ يُخَالِفُونَ عَنْ أَمْرِهِ أَن تُصِيبَهُمْ فِتْنَةٌ أَوْ يُصِيبَهُمْ عَذَابٌ أَلِيمٌ
మీరు దైవప్రవక్త పిలుపును, మీలో ఒండొకరిని పిలుచుకునే మామూలు పిలుపులా అనుకోకండి. మీలో ఒకరి వెనుక ఒకరు దాక్కుంటూ మెల్లగా జారుకునే వారెవరో అల్లాహ్‌కు తెలుసు. వినండి! ఎవరు ప్రవక్త ఆజ్ఞను ఎదిరిస్తున్నారో వారు, తమపై ఏదయినా ఘోర విపత్తు వచ్చిపడుతుందేమోనని లేదా తమను ఏదయినా బాధాకరమైన శిక్ష చుట్టు ముడుతుందేమోనని భయపడాలి.
24:64  أَلَا إِنَّ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ قَدْ يَعْلَمُ مَا أَنتُمْ عَلَيْهِ وَيَوْمَ يُرْجَعُونَ إِلَيْهِ فَيُنَبِّئُهُم بِمَا عَمِلُوا ۗ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
వినండి! భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ అల్లాహ్‌దే. మీ స్థితిగతుల గురించి ఆయనకు బాగా తెలుసు. వారందరూ ఆయన వైపుకు మరలించబడిన రోజున, వారు చేసిన కర్మలన్నింటినీ ఆయన వారికి తెలియపరుస్తాడు. అల్లాహ్‌ ప్రతిదీ క్షుణ్ణంగా తెలిసినవాడు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.