Translation
| 21. సూరా అల్ అంబియా 21:1 اقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِي غَفْلَةٍ مُّعْرِضُونَ ప్రజల లెక్కల ఘడియ సమీపించింది. అయినప్పటికీ వారు పరధ్యానంలో పడి, విముఖత చూపుతున్నారు. 21:2 مَا يَأْتِيهِم مِّن ذِكْرٍ مِّن رَّبِّهِم مُّحْدَثٍ إِلَّا اسْتَمَعُوهُ وَهُمْ يَلْعَبُونَ వారి వద్దకు వారి ప్రభువు తరఫు నుంచి క్రొత్తగా ఏ ఉపదేశం వచ్చినా దాన్ని వారు ఆడుకుంటూ వింటారు. (ఆషామాషీగా తీసుకుంటారు). 21:3 لَاهِيَةً قُلُوبُهُمْ ۗ وَأَسَرُّوا النَّجْوَى الَّذِينَ ظَلَمُوا هَلْ هَٰذَا إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۖ أَفَتَأْتُونَ السِّحْرَ وَأَنتُمْ تُبْصِرُونَ అసలు వారి హృదయాలు ప్రమత్తతలో పడి ఉన్నాయి. "ఇతనూ మీలాంటి మానవ మాత్రుడే కదా! మరలాంటప్పుడు మీరు చూస్తూ చూస్తూ ఇతని మాయాజాలంలో ఎందుకు పడిపోతున్నారు?" అంటూ ఈ దుర్మార్గులు రహస్య మంతనాలు సాగించారు. 21:4 قَالَ رَبِّي يَعْلَمُ الْقَوْلَ فِي السَّمَاءِ وَالْأَرْضِ ۖ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ "నా ప్రభువు భూమ్యాకాశాలలోని ప్రతి మాటనూ ఎరిగినవాడు. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు" అని ప్రవక్త అన్నాడు. 21:5 بَلْ قَالُوا أَضْغَاثُ أَحْلَامٍ بَلِ افْتَرَاهُ بَلْ هُوَ شَاعِرٌ فَلْيَأْتِنَا بِآيَةٍ كَمَا أُرْسِلَ الْأَوَّلُونَ అంతేకాదు, "ఈ ఖుర్ఆన్ పీడకలల పుట్ట. పైగా ఇతను స్వయంగా దీన్ని కల్పించాడు. అదికాదు, అసలితను ఒక కవి. అదే కాకపోతే వెనుకటి ప్రవక్తలు ఇచ్చిపంపబడినట్లుగా ఇతగాడు కూడా మా వద్దకు ఏదైనా సూచనను ఎందుకు తీసుకురాడు?!" అని వారంటున్నారు. 21:6 مَا آمَنَتْ قَبْلَهُم مِّن قَرْيَةٍ أَهْلَكْنَاهَا ۖ أَفَهُمْ يُؤْمِنُونَ వీరికి మునుపు మేము నాశనం చేసిన ఏ జనవాసం కూడా విశ్వసించలేదు. ఇప్పుడు వీళ్లు మాత్రం విశ్వసిస్తారా?! 21:7 وَمَا أَرْسَلْنَا قَبْلَكَ إِلَّا رِجَالًا نُّوحِي إِلَيْهِمْ ۖ فَاسْأَلُوا أَهْلَ الذِّكْرِ إِن كُنتُمْ لَا تَعْلَمُونَ (ఓ ముహమ్మద్-సఅసం!) నీకు పూర్వం మేము ప్రవక్తలుగా పంపిన వారంతా పురుషులే. వారివద్దకు మేము మా సందేశాన్ని (వహీని) పంపేవాళ్ళం. ఈ సంగతి మీకు తెలియకపోతే జ్ఞానులను (గ్రంథవహులను) అడిగి తెలుసుకోండి. 21:8 وَمَا جَعَلْنَاهُمْ جَسَدًا لَّا يَأْكُلُونَ الطَّعَامَ وَمَا كَانُوا خَالِدِينَ మేము వారి శరీరాన్ని వారు అన్నం తినకుండా ఉండగలిగేలా నిర్మించలేదు. వారు ఎల్లకాలం ఉండేవారు కూడా కాదు. 21:9 ثُمَّ صَدَقْنَاهُمُ الْوَعْدَ فَأَنجَيْنَاهُمْ وَمَن نَّشَاءُ وَأَهْلَكْنَا الْمُسْرِفِينَ ఆ తరువాత మేము వారికి చేసిన వాగ్దానాలన్నింటినీ సత్యమైనవిగా నిరూపించాము. వారినీ, ఇంకా మేము కోరిన వాళ్ళనూ కాపాడాము. హద్దుమీరిపోయిన వారిని మాత్రం అంతమొందించాము. 21:10 لَقَدْ أَنزَلْنَا إِلَيْكُمْ كِتَابًا فِيهِ ذِكْرُكُمْ ۖ أَفَلَا تَعْقِلُونَ నిశ్చయంగా మేము మీ వద్దకు (ఖుర్ఆన్) గ్రంథాన్ని పంపాము. అందులో మీ కొరకు హితబోధ ఉంది. అయినా మీరు గ్రహించరా? 21:11 وَكَمْ قَصَمْنَا مِن قَرْيَةٍ كَانَتْ ظَالِمَةً وَأَنشَأْنَا بَعْدَهَا قَوْمًا آخَرِينَ దురాగతాలకు ఒడిగట్టే ఎన్నో జనవాసాలను మేము చెరిగేశాము. వారి తరువాత (వారి స్థానంలో) మేము మరో జాతిని ప్రభవింపజేశాము. 21:12 فَلَمَّا أَحَسُّوا بَأْسَنَا إِذَا هُم مِّنْهَا يَرْكُضُونَ వారు మా శిక్షను పసిగట్టగానే పలాయనం చిత్తగించారు. 21:13 لَا تَرْكُضُوا وَارْجِعُوا إِلَىٰ مَا أُتْرِفْتُمْ فِيهِ وَمَسَاكِنِكُمْ لَعَلَّكُمْ تُسْأَلُونَ "పారిపోకండి. మీకు సుఖసౌఖ్యాలు ఇవ్వబడిన చోటికే, మీ విశ్రాంతి నిలయాల వైపే మరలిపోండి - బహుశా మీరు దానిని గురించి ప్రశ్నించబడతారేమో!" (అని వారితో అనబడింది). 21:14 قَالُوا يَا وَيْلَنَا إِنَّا كُنَّا ظَالِمِينَ (దానికి వారు) "మా పాడుగాను! నిశ్చయంగా మేమే దుర్మార్గులం" అని అనసాగారు. 21:15 فَمَا زَالَت تِّلْكَ دَعْوَاهُمْ حَتَّىٰ جَعَلْنَاهُمْ حَصِيدًا خَامِدِينَ చివరకు మేము వారిని కోతకోసిన చేనులా, చల్లారిపోయిన అగ్నిలా చేసి వేసేంతవరకూ వారు ఆ విధంగా మొత్తుకుంటూనే ఉండిపోయారు. 21:16 وَمَا خَلَقْنَا السَّمَاءَ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَاعِبِينَ మేము ఆకాశాన్నీ భూమిని, వాటి మధ్యనున్న సమస్తాన్నీ ఏదో ఆటగా సృష్టించలేదు. 21:17 لَوْ أَرَدْنَا أَن نَّتَّخِذَ لَهْوًا لَّاتَّخَذْنَاهُ مِن لَّدُنَّا إِن كُنَّا فَاعِلِينَ ఏదో కాలక్షేపం చేసుకోవాలన్న ఉద్దేశమే మాకుంటే, నిజంగానే, మా వద్దనున్న దానితోనే చేసుకుని ఉండేవారము. 21:18 بَلْ نَقْذِفُ بِالْحَقِّ عَلَى الْبَاطِلِ فَيَدْمَغُهُ فَإِذَا هُوَ زَاهِقٌ ۚ وَلَكُمُ الْوَيْلُ مِمَّا تَصِفُونَ అది కాదు. మేము సత్యాన్ని అసత్యంపై విసరికొడతాము. అది అసత్యం మాడు బద్దలుగొడుతుంది. దాంతో అది (అసత్యం) అంతమయిపోతుంది. మీరు కల్పించే మాటలన్నీ మీ పాలిట వినాశకరంగా పరిణమిస్తాయి సుమా! 21:19 وَلَهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَمَنْ عِندَهُ لَا يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِهِ وَلَا يَسْتَحْسِرُونَ భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనదే. ఆయన వద్ద ఉన్నవారు ఆయన్ని ఆరాధించటం పట్ల గర్వం ప్రదర్శించరు. (ఆయన దాస్యం చేస్తూ) అలసిపోరు. 21:20 يُسَبِّحُونَ اللَّيْلَ وَالنَّهَارَ لَا يَفْتُرُونَ వారు రేయింబవళ్లు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు. ఏమాత్రం బద్దకం కూడా చూపరు. 21:21 أَمِ اتَّخَذُوا آلِهَةً مِّنَ الْأَرْضِ هُمْ يُنشِرُونَ ఏమిటీ, వీరు భువిలో దేవుళ్ళుగా కల్పించుకున్నవారు వీరిని సజీవులుగా చేసి నిలబెడతారా? 21:22 لَوْ كَانَ فِيهِمَا آلِهَةٌ إِلَّا اللَّهُ لَفَسَدَتَا ۚ فَسُبْحَانَ اللَّهِ رَبِّ الْعَرْشِ عَمَّا يَصِفُونَ ఒకవేళ భూమ్యాకాశాలలో అల్లాహ్ గాక ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉంటే ఈ రెండింటిలో అరాచకం ఏర్పడేది. కాబట్టి సింహాసనానికి (అర్ష్కు) అధిపతి అయిన అల్లాహ్ వారు కల్పించే భాగస్వామ్య (షిర్క్) విషయాలన్నింటికీ అతీతుడు, పవిత్రుడు. 21:23 لَا يُسْأَلُ عَمَّا يَفْعَلُ وَهُمْ يُسْأَلُونَ ఆయన తాను చేసే పనులకు (ఎవరికీ) జవాబుదారు కాడు. అయితే అందరూ (ఆయన ముందు) జవాబుదారులే. 21:24 أَمِ اتَّخَذُوا مِن دُونِهِ آلِهَةً ۖ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ ۖ هَٰذَا ذِكْرُ مَن مَّعِيَ وَذِكْرُ مَن قَبْلِي ۗ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ الْحَقَّ ۖ فَهُم مُّعْرِضُونَ ఏమిటీ, వారు అల్లాహ్ను కాకుండా ఇతర దేవుళ్ళను కూడా కల్పించుకున్నారా? ఒకవేళ వారలాచేస్తే, "మీరు మీ ప్రమాణాన్ని సమర్పించండి. ఇది నా సహచరుల గ్రంథం. నా పూర్వీకుల నిదర్శనం" అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. అసలు విషయం ఏమిటంటే వారిలో చాలామందికి యదార్థం తెలియదు. అందుకే వారు విముఖులై ఉన్నారు. 21:25 وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా, "నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి" అనే సందేశాన్ని (వహీని) అతనికి పంపాము. 21:26 وَقَالُوا اتَّخَذَ الرَّحْمَٰنُ وَلَدًا ۗ سُبْحَانَهُ ۚ بَلْ عِبَادٌ مُّكْرَمُونَ కరుణామయునికి సంతానం ఉందని వారు (ముష్రిక్కులు) చెబుతున్నారు. (ఇది నిజం కాదు) ఆయన పవిత్రుడు. పైగా వారంతా (దైవదూతలంతా) గౌరవించబడిన ఆయన దాసులు. 21:27 لَا يَسْبِقُونَهُ بِالْقَوْلِ وَهُم بِأَمْرِهِ يَعْمَلُونَ ఏ విషయంలోనూ వారు ఆయనకంటే ముందు మాట్లాడరు. పైగా ఆయన ఆజ్ఞను ఖచ్చితంగా పాటిస్తారు. 21:28 يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يَشْفَعُونَ إِلَّا لِمَنِ ارْتَضَىٰ وَهُم مِّنْ خَشْيَتِهِ مُشْفِقُونَ వారికి ముందున్నవాటి గురించి, వెనుక ఉన్న వాటి గురించి కూడా ఆయనకు తెలుసు. సిఫారసు వినటానికి అల్లాహ్ ఇష్టపడిన వారి విషయంలో తప్ప వారు ఎవరి గురించి కూడా సిఫారసు చేయజాలరు. వారు స్వయంగా అల్లాహ్ రౌద్రానికి భీతిల్లుతూ ఉంటారు. 21:29 وَمَن يَقُلْ مِنْهُمْ إِنِّي إِلَٰهٌ مِّن دُونِهِ فَذَٰلِكَ نَجْزِيهِ جَهَنَّمَ ۚ كَذَٰلِكَ نَجْزِي الظَّالِمِينَ వారిలో ఎవరయినా "అల్లాహ్తో పాటు నేనూ పూజ్యుడినే" అని అంటే మేమతన్ని నరకయాతనకు గురి చేస్తాము. మేము దుర్మార్గులకు వొసగే ప్రతిఫలం ఇదే. 21:30 أَوَلَمْ يَرَ الَّذِينَ كَفَرُوا أَنَّ السَّمَاوَاتِ وَالْأَرْضَ كَانَتَا رَتْقًا فَفَتَقْنَاهُمَا ۖ وَجَعَلْنَا مِنَ الْمَاءِ كُلَّ شَيْءٍ حَيٍّ ۖ أَفَلَا يُؤْمِنُونَ భూమ్యాకాశాలు కలిసి వుండగా, మేము వాటిని విడదీసినవైనాన్ని తిరస్కారులు చూడలేదా? ఇంకా, ప్రాణమున్న ప్రతి దానినీ మేము నీటితోనే చేశాము. అయినప్పటికీ వీళ్లు విశ్వసించరా? 21:31 وَجَعَلْنَا فِي الْأَرْضِ رَوَاسِيَ أَن تَمِيدَ بِهِمْ وَجَعَلْنَا فِيهَا فِجَاجًا سُبُلًا لَّعَلَّهُمْ يَهْتَدُونَ భూమి వారిని కుదిపివేయకుండా ఉండటానికని మేము అందులో పర్వతాలను చేశాము. వారు తమ మార్గాలను పొందటానికి అందులో సువిశాలమైన రహదార్లను ఏర్పరచాము. 21:32 وَجَعَلْنَا السَّمَاءَ سَقْفًا مَّحْفُوظًا ۖ وَهُمْ عَنْ آيَاتِهَا مُعْرِضُونَ మరి ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేసినది కూడా మేమే. కాని ప్రజలు దాని సూచనలపై (పనితనంపై, సృష్టి ప్రక్రియపై) బొత్తిగా ధ్యాస కనబరచరు. 21:33 وَهُوَ الَّذِي خَلَقَ اللَّيْلَ وَالنَّهَارَ وَالشَّمْسَ وَالْقَمَرَ ۖ كُلٌّ فِي فَلَكٍ يَسْبَحُونَ రేయింబవళ్లనూ, సూర్యచంద్రులనూ సృష్టించినవాడు కూడా ఆయనే. వాటిలో ప్రతిదీ తన తన కక్ష్యలో తేలియాడుతూ ఉంది. 21:34 وَمَا جَعَلْنَا لِبَشَرٍ مِّن قَبْلِكَ الْخُلْدَ ۖ أَفَإِن مِّتَّ فَهُمُ الْخَالِدُونَ (ఓ ప్రవక్తా!) నీకు పూర్వం కూడా మేము ఏ మానవుణ్ణీ శాశ్వతంగా జీవించి ఉండేట్లుగా చేయలేదు. ఒకవేళ నువ్వు చనిపోతే, వాళ్లు మాత్రం శాశ్వతంగా బ్రతికి ఉంటారా ఏమిటీ? 21:35 كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ ۗ وَنَبْلُوكُم بِالشَّرِّ وَالْخَيْرِ فِتْنَةً ۖ وَإِلَيْنَا تُرْجَعُونَ ప్రతి ప్రాణీ మృత్యువును చవి చూడవలసిందే. మేము మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కష్టసుఖాలకు (కలిమి లేములకు) గురిచేస్తూ ఉంటాము. ఎట్టకేలకు మీరు మా వద్దకే మరలించబడతారు. 21:36 وَإِذَا رَآكَ الَّذِينَ كَفَرُوا إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَٰذَا الَّذِي يَذْكُرُ آلِهَتَكُمْ وَهُم بِذِكْرِ الرَّحْمَٰنِ هُمْ كَافِرُونَ ఈ అవిశ్వాసులు నిన్ను చూసినప్పుడల్లా నిన్ను ఎగతాళి చేయటం తప్ప వారికి వేరే పనీపాటాలేదు. "మీ దేవుళ్లను గురించి (చెడుగా) ప్రస్తావించేది ఈయన గారేనా!?" అని (వెటకారంగా) వారంటారు. మరి (చూడబోతే) కరుణామయుని ప్రస్తావన రాగానే తిరస్కారానికి పాల్పడుతున్నది వారే. 21:37 خُلِقَ الْإِنسَانُ مِنْ عَجَلٍ ۚ سَأُرِيكُمْ آيَاتِي فَلَا تَسْتَعْجِلُونِ మానవుడు మహా తొందరపాటు స్వభావిగా పుట్టించబడ్డాడు. మీకు నా సూచనలను ఇప్పుడే చూపిస్తాను-కనుక నన్ను తొందర పెట్టకండి. 21:38 وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ "మీరు సత్యవంతులే అయితే ఆ వాగ్దానం ఎప్పుడు సంభవిస్తుందో చెప్పండి?" అని వారు అంటున్నారు. 21:39 لَوْ يَعْلَمُ الَّذِينَ كَفَرُوا حِينَ لَا يَكُفُّونَ عَن وُجُوهِهِمُ النَّارَ وَلَا عَن ظُهُورِهِمْ وَلَا هُمْ يُنصَرُونَ ఆ సమయంలో తాము ఈ నరకాగ్నిని తమ ముఖాల నుంచి గానీ, తమ వీపుల నుంచి గానీ తొలగించజాలరనీ, తమకు సహాయం కూడా అందజాలదనీ అవిశ్వాసులు తెలుసుకుంటే ఎంత బావుంటుంది! 21:40 بَلْ تَأْتِيهِم بَغْتَةً فَتَبْهَتُهُمْ فَلَا يَسْتَطِيعُونَ رَدَّهَا وَلَا هُمْ يُنظَرُونَ (అవును!) ఆ ఘడియ అకస్మాత్తుగా వారిపై వచ్చిపడుతుంది. అది వారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. మరి వారు దాన్ని దాట వేయనూ లేరు, కొద్దిపాటి గడువు కూడా వారికి ఇవ్వబడదు. 21:41 وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّن قَبْلِكَ فَحَاقَ بِالَّذِينَ سَخِرُوا مِنْهُم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ (ఓ ముహమ్మద్ - సఅసం!) నీకు పూర్వం వచ్చిన ప్రవక్తలను కూడా పరిహసించటం జరిగింది. అయితే చివరికి పరిహసిస్తూ ఉన్నవారికే, తాము పరిహసించినది చుట్టుకున్నది. 21:42 قُلْ مَن يَكْلَؤُكُم بِاللَّيْلِ وَالنَّهَارِ مِنَ الرَّحْمَٰنِ ۗ بَلْ هُمْ عَن ذِكْرِ رَبِّهِم مُّعْرِضُونَ "(ఓ ప్రవక్తా!) కరుణామయుని (ఆగ్రహం) నుంచి రేయీ పగలూ మిమ్మల్ని రక్షించగల వాడెవడు?" అని వారిని అడుగు. అసలు విషయమేమిటంటే వాళ్లు తమ ప్రభువు ధ్యానం పట్ల విముఖులై ఉన్నారు. 21:43 أَمْ لَهُمْ آلِهَةٌ تَمْنَعُهُم مِّن دُونِنَا ۚ لَا يَسْتَطِيعُونَ نَصْرَ أَنفُسِهِمْ وَلَا هُم مِّنَّا يُصْحَبُونَ ఏమిటీ, మేము తప్ప వారిని ఆపదల నుంచి కాపాడే వేరే దేవుళ్లు కూడా ఎవరయినా ఉన్నారా? వారు స్వయంగా తమకు సహాయం చేసుకునే శక్తిని కలిగిలేరు. మా తరఫున కూడా వారికెలాంటి అండదండలూ లేవు. 21:44 بَلْ مَتَّعْنَا هَٰؤُلَاءِ وَآبَاءَهُمْ حَتَّىٰ طَالَ عَلَيْهِمُ الْعُمُرُ ۗ أَفَلَا يَرَوْنَ أَنَّا نَأْتِي الْأَرْضَ نَنقُصُهَا مِنْ أَطْرَافِهَا ۚ أَفَهُمُ الْغَالِبُونَ పైగా మేము వారికీ, వారి తాత ముత్తాతలకూ జీవన సామగ్రిని ఇచ్చాము. చివరికి (దాన్ని అనుభవిస్తూనే) వారి ఆయుషు గడచిపోయింది. మేము భూమిని దాని అంచుల నుంచి కుదించుకుంటూ రావటాన్నివారు చూడటం లేదా? ఏమిటి, ఇప్పటికీ వీళ్ళే ప్రాబల్యం వహిస్తారటనా? 21:45 قُلْ إِنَّمَا أُنذِرُكُم بِالْوَحْيِ ۚ وَلَا يَسْمَعُ الصُّمُّ الدُّعَاءَ إِذَا مَا يُنذَرُونَ (ఓ ప్రవక్తా!) "నేను మిమ్మల్ని కేవలం దైవసందేశం (వహీ) ఆధారంగా హెచ్చరిస్తున్నాను" అని వారికి చెప్పు. అయితే తమను హెచ్చరించినప్పుడు, చెవిటివారు ఆ పిలుపును వినరు. 21:46 وَلَئِن مَّسَّتْهُمْ نَفْحَةٌ مِّنْ عَذَابِ رَبِّكَ لَيَقُولُنَّ يَا وَيْلَنَا إِنَّا كُنَّا ظَالِمِينَ ఒకవేళ నీ ప్రభువు శిక్షా తాకిడి వారికి ఏ కాస్త తగిలినా "అయ్యో! మా పాడుగాను! ముమ్మాటికీ మేమే దుర్మార్గులం" అని హాహాకారాలు చేస్తారు. 21:47 وَنَضَعُ الْمَوَازِينَ الْقِسْطَ لِيَوْمِ الْقِيَامَةِ فَلَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا ۖ وَإِن كَانَ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ أَتَيْنَا بِهَا ۗ وَكَفَىٰ بِنَا حَاسِبِينَ మేము ప్రళయదినాన న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాము. మరి ఏ ప్రాణికీ రవంత అన్యాయం కూడా జరగదు. ఒకవేళ ఆవగింజంత ఆచరణ ఉన్నా మేము దానిని హాజరు పరుస్తాము. లెక్క తీసుకోవటానికి మేము చాలు. 21:48 وَلَقَدْ آتَيْنَا مُوسَىٰ وَهَارُونَ الْفُرْقَانَ وَضِيَاءً وَذِكْرًا لِّلْمُتَّقِينَ మేము మూసా, హారూనులకు తీర్పులు చేసే గీటురాయిని, జ్యోతినీ, భయభక్తులు గలవారికి హితోపదేశంతో కూడిన గ్రంథాన్నీ ఇచ్చాము. 21:49 الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِالْغَيْبِ وَهُم مِّنَ السَّاعَةِ مُشْفِقُونَ తమ ప్రభువును చూడకుండానే భయపడే భక్తులు వారు. ప్రళయ ఘడియపట్ల (గల తలంపుతోనే) వారు వణికిపోతారు. 21:50 وَهَٰذَا ذِكْرٌ مُّبَارَكٌ أَنزَلْنَاهُ ۚ أَفَأَنتُمْ لَهُ مُنكِرُونَ ఇది శుభప్రదమైన ఉపదేశం. దీనిని అవతరింపజేసినది కూడా మేమే. అయినా మీరు దీనిని త్రోసిపుచ్చుతున్నారా? 21:51 وَلَقَدْ آتَيْنَا إِبْرَاهِيمَ رُشْدَهُ مِن قَبْلُ وَكُنَّا بِهِ عَالِمِينَ అంతకుముందే మేము ఇబ్రాహీముకు అతని మార్గదర్శకత్వాన్ని (ప్రజ్ఞను) ప్రసాదించాము. అతని (యోగ్యత) గురించి మాకు ముందు నుంచే బాగా తెలుసు. 21:52 إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَا هَٰذِهِ التَّمَاثِيلُ الَّتِي أَنتُمْ لَهَا عَاكِفُونَ అతను తన తండ్రితో, తన జాతి వారితో, "ఇంతకీ మీరు ఇంతటి శ్రద్ధాభక్తులతో పూజిస్తూ కూర్చున్న ఈ విగ్రహాల సంగతేమిటీ?" అని అడిగినప్పుడు, 21:53 قَالُوا وَجَدْنَا آبَاءَنَا لَهَا عَابِدِينَ "మా తాతముత్తాతలు వీటిని పూజిస్తూ ఉండగా మేము చూసి ఉన్నాము" అని వారంతా సమాధానమిచ్చారు. 21:54 قَالَ لَقَدْ كُنتُمْ أَنتُمْ وَآبَاؤُكُمْ فِي ضَلَالٍ مُّبِينٍ "అలాగయితే మీరూ, మీ తాత ముత్తాతలంతా స్పష్టమైన అపమార్గానికి లోనై ఉన్నారు" అని అతను అన్నాడు. 21:55 قَالُوا أَجِئْتَنَا بِالْحَقِّ أَمْ أَنتَ مِنَ اللَّاعِبِينَ "ఏమిటీ? నువ్వు మా వద్దకు నిజంగానే సత్యం తీసుకుని వచ్చావా? లేక ఇట్టే ఆటపట్టిస్తున్నావా?" అని అడిగారు వారు. 21:56 قَالَ بَل رَّبُّكُمْ رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ الَّذِي فَطَرَهُنَّ وَأَنَا عَلَىٰ ذَٰلِكُم مِّنَ الشَّاهِدِينَ అతను ఇలా చెప్పాడు: "కాదు, వాస్తవానికి భూమ్యాకాశాల ప్రభువే మీ ప్రభువు. ఆయనే వాటిని సృష్టించాడు. ఈ విషయానికి సాక్ష్యమిచ్చే వారిలో నేనూ ఒకణ్ణి. 21:57 وَتَاللَّهِ لَأَكِيدَنَّ أَصْنَامَكُم بَعْدَ أَن تُوَلُّوا مُدْبِرِينَ "అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. మీరు వెనుతిరిగి వెళ్ళి పోయిన తరువాత నేను మీ విగ్రహాల అంతు చూస్తాను." 21:58 فَجَعَلَهُمْ جُذَاذًا إِلَّا كَبِيرًا لَّهُمْ لَعَلَّهُمْ إِلَيْهِ يَرْجِعُونَ ఆ తరువాత అతను వాటన్నింటినీ ముక్కలు ముక్కలుగా పగులగొట్టాడు. అయితే పెద్ద విగ్రహాన్ని మాత్రం విడిచి పెట్టాడు. వారంతా దానివైపు మరలటానికే (అలా చేశాడు). 21:59 قَالُوا مَن فَعَلَ هَٰذَا بِآلِهَتِنَا إِنَّهُ لَمِنَ الظَّالِمِينَ "మా దేవుళ్లకు ఈ దుర్గతిని పట్టించిందెవరు? వాడెవడో నిజంగా పెద్ద దుర్మార్గుడే" అని వారు అనసాగారు. 21:60 قَالُوا سَمِعْنَا فَتًى يَذْكُرُهُمْ يُقَالُ لَهُ إِبْرَاهِيمُ "ఒక యువకుడు మా విగ్రహాలను గురించి (చెడుగా) ప్రస్తావించటం మేము విన్నాము. అతను ఇబ్రాహీంగా పిలువ బడతాడు" అని కొందరు చెప్పారు. 21:61 قَالُوا فَأْتُوا بِهِ عَلَىٰ أَعْيُنِ النَّاسِ لَعَلَّهُمْ يَشْهَدُونَ "అయితే అతన్ని ప్రజలందరి సమక్షంలోకి తీసుకురండి, అందరూ అతనికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంటార"ని అన్నారు. 21:62 قَالُوا أَأَنتَ فَعَلْتَ هَٰذَا بِآلِهَتِنَا يَا إِبْرَاهِيمُ "ఓ ఇబ్రాహీం! మా విగ్రహాలకు ఈ (దు)స్థితిని కలిగించింది నువ్వేనా?" అని అతన్ని అడిగారు. 21:63 قَالَ بَلْ فَعَلَهُ كَبِيرُهُمْ هَٰذَا فَاسْأَلُوهُمْ إِن كَانُوا يَنطِقُونَ "ఆహా! ఆ పనిని వీళ్ళ పెద్దాయనే చేశాడు. ఒకవేళ వాళ్లు చెప్పగలిగితే వాళ్లనే అడిగి తెలుసుకోండి" అన్నాడు ఇబ్రాహీం. 21:64 فَرَجَعُوا إِلَىٰ أَنفُسِهِمْ فَقَالُوا إِنَّكُمْ أَنتُمُ الظَّالِمُونَ దాంతో వారు మనసుల్లోనే (వాస్తవాన్ని ఒప్పుకుని,)" అసలు దుర్మార్గులు మీరే కదా!" అని (పరస్పరం) గొణుక్కున్నారు. 21:65 ثُمَّ نُكِسُوا عَلَىٰ رُءُوسِهِمْ لَقَدْ عَلِمْتَ مَا هَٰؤُلَاءِ يَنطِقُونَ కాని తరువాత వారి బుద్ధి తలక్రిందులైంది; "ఇవి మాట్లాడలేవన్న సంగతి నీకూ తెలుసు కదా!" అన్నారు వారు. 21:66 قَالَ أَفَتَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُكُمْ شَيْئًا وَلَا يَضُرُّكُمْ (ఇబ్రాహీమ్ అప్పటికప్పుడే) అడిగేశాడు : "(మీ పరిస్థితి కడు శోచనీయం!) మీరు అల్లాహ్ను వదలి మీకు ఏమాత్రం లాభం గానీ, నష్టంగానీ కలిగించలేని వాటిని పూజిస్తున్నారా?" 21:67 أُفٍّ لَّكُمْ وَلِمَا تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ ۖ أَفَلَا تَعْقِلُونَ "ధూత్కారం, మీపైనా, అల్లాహ్ను కాదని మీరు పూజించే దేవుళ్ళపైనా. మీకు ఈపాటి ఇంగిత జ్ఞానం కూడా లేదా?" 21:68 قَالُوا حَرِّقُوهُ وَانصُرُوا آلِهَتَكُمْ إِن كُنتُمْ فَاعِلِينَ (దానికి వారి అహం దెబ్బతిన్నది) "మీరేదన్నా చేయాలనే అనుకుంటే ఇతన్ని అగ్నికి ఆహుతి చేయండి. మీ దేవుళ్లకు సహాయంగా నిలబడండి" అని వారన్నారు. 21:69 قُلْنَا يَا نَارُ كُونِي بَرْدًا وَسَلَامًا عَلَىٰ إِبْرَاهِيمَ "ఓ అగ్నీ, నువ్వు ఇబ్రాహీమ్ కొరకు చల్లగానూ, సురక్షితం గానూ మారిపో" అని మేము ఆదేశించాము. 21:70 وَأَرَادُوا بِهِ كَيْدًا فَجَعَلْنَاهُمُ الْأَخْسَرِينَ వారు ఇబ్రాహీముకు కీడు చేయాలనుకున్నారు. కాని మేము వాళ్ళనే ఎక్కువగా నష్టానికి గురిచేశాము. 21:71 وَنَجَّيْنَاهُ وَلُوطًا إِلَى الْأَرْضِ الَّتِي بَارَكْنَا فِيهَا لِلْعَالَمِينَ మేము అతనినీ, లూతునూ కాపాడి, లోకవాసుల కోసం శుభాలను పొందుపరచిన భూభాగం వైపుకు తీసుకువెళ్ళాము. 21:72 وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ نَافِلَةً ۖ وَكُلًّا جَعَلْنَا صَالِحِينَ ఇంకా మేము అతనికి (ఇబ్రాహీమునకు) ఇస్హాఖును ప్రసాదించాము. ఆపైన అదనంగా (మనవడిగా) యాఖూబును కూడా అనుగ్రహించాము. వారందరినీ సద్వర్తనులుగా చేశాము. 21:73 وَجَعَلْنَاهُمْ أَئِمَّةً يَهْدُونَ بِأَمْرِنَا وَأَوْحَيْنَا إِلَيْهِمْ فِعْلَ الْخَيْرَاتِ وَإِقَامَ الصَّلَاةِ وَإِيتَاءَ الزَّكَاةِ ۖ وَكَانُوا لَنَا عَابِدِينَ ఇంకా - మా ఆదేశానుసారం ప్రజలకు మార్గదర్శకత్వం వహించటానికి మేము వారిని ఇమాములు (నాయకులు)గా తీర్చిదిద్దాము. పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలనీ, నమాజులను నెలకొల్పుతూ ఉండాలనీ, జకాత్ (దానాన్ని) చెల్లిస్తూ ఉండాలనీ మేము వారికి సూచించాము (వారి వైపుకు వహీ పంపాము). వారంతా మమ్మల్నే ఆరాధించేవారు. 21:74 وَلُوطًا آتَيْنَاهُ حُكْمًا وَعِلْمًا وَنَجَّيْنَاهُ مِنَ الْقَرْيَةِ الَّتِي كَانَت تَّعْمَلُ الْخَبَائِثَ ۗ إِنَّهُمْ كَانُوا قَوْمَ سَوْءٍ فَاسِقِينَ మేము లూతు (అలైహిస్సలాం)కు నిర్ణయం గైకొనే శక్తినీ, జ్ఞానాన్నీ ప్రసాదించాము. నీతిమాలిన పనులకు లోనై ఉన్న జనవాసం బారి నుంచి అతనికి విముక్తిని కల్పించాము. ఆ జాతి వారు పరమ నీచులు, అవిధేయులు. 21:75 وَأَدْخَلْنَاهُ فِي رَحْمَتِنَا ۖ إِنَّهُ مِنَ الصَّالِحِينَ మేము లూతును మా కారుణ్యంలో చేర్చుకున్నాము. నిశ్చయంగా అతను సజ్జనుల కోవకు చెందినవాడు. 21:76 وَنُوحًا إِذْ نَادَىٰ مِن قَبْلُ فَاسْتَجَبْنَا لَهُ فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ అంతకుముందు నూహ్ మొరపెట్టుకున్నప్పటి సమయాన్ని కూడా గుర్తు చేసుకోండి. మేము అతని మొరను ఆలకించి ఆమోదిం చాము. అతన్నీ, అతని ఇంటి వారినీ తీవ్రమైన వ్యధ నుంచి కాపాడాము. 21:77 وَنَصَرْنَاهُ مِنَ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۚ إِنَّهُمْ كَانُوا قَوْمَ سَوْءٍ فَأَغْرَقْنَاهُمْ أَجْمَعِينَ మా ఆయతులను ధిక్కరిస్తూ వచ్చిన జాతికి వ్యతిరేకంగా మేము అతనికి సహాయం చేశాము. నిశ్చయంగా ఆ జాతి వారు పాపాత్ములు. అందుకే మేము వారందరినీ ముంచివేశాము. 21:78 وَدَاوُودَ وَسُلَيْمَانَ إِذْ يَحْكُمَانِ فِي الْحَرْثِ إِذْ نَفَشَتْ فِيهِ غَنَمُ الْقَوْمِ وَكُنَّا لِحُكْمِهِمْ شَاهِدِينَ దావూదు, సులైమానులను కూడా (జ్ఞప్తికి తెచ్చుకోండి). కొందరి మేకలు రాత్రి పూట పొలంలో పడి మేయగా, ఆ పొలం విషయంలో వారిద్దరూ తీర్పు చేస్తున్నప్పుడు, ఆ తీర్పునంతటినీ మేము గమనిస్తూనే ఉన్నాము. 21:79 فَفَهَّمْنَاهَا سُلَيْمَانَ ۚ وَكُلًّا آتَيْنَا حُكْمًا وَعِلْمًا ۚ وَسَخَّرْنَا مَعَ دَاوُودَ الْجِبَالَ يُسَبِّحْنَ وَالطَّيْرَ ۚ وَكُنَّا فَاعِلِينَ మరి (ఆ సమయంలో ఆ వివాదంపై) మేము సులైమానుకు సరైన అవగాహనను కలుగజేశాము. ఆ మాటకొస్తే వారిలో ప్రతి ఒక్కరికీ మేము నిర్ణయం తీసుకునే శక్తినీ, జ్ఞానాన్నీఇచ్చి ఉన్నాము. మేము దావూదుతోపాటు పర్వతాలు, పక్షులు అతనికి లోబడి (దైవ) స్తోత్రం చేసేవిగా చేశాము. ఇదంతా చేసినది మేమే. 21:80 وَعَلَّمْنَاهُ صَنْعَةَ لَبُوسٍ لَّكُمْ لِتُحْصِنَكُم مِّن بَأْسِكُمْ ۖ فَهَلْ أَنتُمْ شَاكِرُونَ మీ కోసం ఒక (ప్రత్యేక) వస్త్రాన్ని అల్లే కళను మేమతనికి నేర్పాము - తద్వారా మీరు యుద్ధంలో (వేటు పడకుండా) రక్షణ పొందటానికి! మరి మీరు కృతజ్ఞులుగా మసలుకుంటున్నారా? 21:81 وَلِسُلَيْمَانَ الرِّيحَ عَاصِفَةً تَجْرِي بِأَمْرِهِ إِلَى الْأَرْضِ الَّتِي بَارَكْنَا فِيهَا ۚ وَكُنَّا بِكُلِّ شَيْءٍ عَالِمِينَ ఇంకా మేము ప్రచండ వేగంతో వీచే గాలిని సులైమానుకు లోబరచాము. అది అతని ఆజ్ఞలననుసరించి, మేము శుభాలను ప్రోదిచేసిన భూభాగం వైపుకు నడిచేది. అన్ని విషయాలూ మా జ్ఞాన పరిధిలో ఉన్నాయి. 21:82 وَمِنَ الشَّيَاطِينِ مَن يَغُوصُونَ لَهُ وَيَعْمَلُونَ عَمَلًا دُونَ ذَٰلِكَ ۖ وَكُنَّا لَهُمْ حَافِظِينَ అలాగే ఎన్నో షైతానులను కూడా మేము అతని అదుపాజ్ఞలలో ఉంచాము. అతని కోసం అవి (సముద్రంలో) మునకలు వేసేవి. ఇది గాకుండా ఇంకా ఇతరత్రా ఎన్నో పనులు కూడా చేసి పెట్టేవి. వాటన్నింటినీ మేమే పర్యవేక్షిస్తూ ఉండేవారం. 21:83 وَأَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُ أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ మరి అయ్యూబు (స్థితిని గురించి కూడా ఓసారి మననం చేసుకోండి). అతను "నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించేవాడవు" అని తన ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు, 21:84 فَاسْتَجَبْنَا لَهُ فَكَشَفْنَا مَا بِهِ مِن ضُرٍّ ۖ وَآتَيْنَاهُ أَهْلَهُ وَمِثْلَهُم مَّعَهُمْ رَحْمَةً مِّنْ عِندِنَا وَذِكْرَىٰ لِلْعَابِدِينَ మేము అతని ప్రార్థనను ఆలకించి, ఆమోదించాము. అతని బాధను దూరం చేశాము. అతనికి అతని ఇంటివారలను ప్రసాదించాము. పైగా వారితోపాటు వారిని పోలిన మరి అంతే మందిని మా ప్రత్యేక కటాక్షంతో అతనికి వొసగాము - నికార్సయిన దాసుల కొరకు ఇదొక గుణపాఠం కావాలని! 21:85 وَإِسْمَاعِيلَ وَإِدْرِيسَ وَذَا الْكِفْلِ ۖ كُلٌّ مِّنَ الصَّابِرِينَ ఇంకా ఇస్మాయీలు, ఇద్రీసు, జుల్కిఫ్ల్(లను కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి). వారంతా సహనశీలుర కోవకు చెందినవారు. 21:86 وَأَدْخَلْنَاهُمْ فِي رَحْمَتِنَا ۖ إِنَّهُم مِّنَ الصَّالِحِينَ మేము వారందరినీ మా కారుణ్యం లోనికి చేర్చుకున్నాము. ఎందుకంటే వారందరూ సజ్జనుల కోవకు చెందినవారు. 21:87 وَذَا النُّونِ إِذ ذَّهَبَ مُغَاضِبًا فَظَنَّ أَن لَّن نَّقْدِرَ عَلَيْهِ فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ إِنِّي كُنتُ مِنَ الظَّالِمِينَ చేపవాడు (యూనుస్ అలైహిస్సలాం) కోపగించుకుని వెళ్ళిపోయినప్పటి స్థితి(ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి.) మేము తనను పట్టుకోలేమని అతడు భావించాడు. ఆఖరికి అతను చీకట్లలో నుంచి, "అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి" అని మొరపెట్టుకున్నాడు. 21:88 فَاسْتَجَبْنَا لَهُ وَنَجَّيْنَاهُ مِنَ الْغَمِّ ۚ وَكَذَٰلِكَ نُنجِي الْمُؤْمِنِينَ అందువల్ల మేము అతని మొరను ఆలకించాము. దుఃఖం నుంచి అతనికి విముక్తిని కల్పించాము. విశ్వాసులను మేము ఇలాగే కాపాడుతాము. 21:89 وَزَكَرِيَّا إِذْ نَادَىٰ رَبَّهُ رَبِّ لَا تَذَرْنِي فَرْدًا وَأَنتَ خَيْرُ الْوَارِثِينَ జకరియ్యా (వృత్తాంతాన్నికూడా స్మరించుకోండి). అతను తన ప్రభువుతో, "నా ప్రభూ! నన్ను ఒంటరివానిగా వదలకు. నీవు అందరికన్నా అత్యుత్తమ వారసుడవు" అని మొరపెట్టుకున్నాడు. 21:90 فَاسْتَجَبْنَا لَهُ وَوَهَبْنَا لَهُ يَحْيَىٰ وَأَصْلَحْنَا لَهُ زَوْجَهُ ۚ إِنَّهُمْ كَانُوا يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَيَدْعُونَنَا رَغَبًا وَرَهَبًا ۖ وَكَانُوا لَنَا خَاشِعِينَ మేము అతని ప్రార్థనను స్వీకరించి, అతనికి యహ్యాను ప్రసాదించాము. అతని భార్యను అతని కోసం బాగు చేశాము. ఈ సద్వర్తనులు సత్కార్యాల కోసం త్వరపడేవారు. ఆశతోనూ, భయంతోనూ మమ్మల్ని వేడుకునేవారు. మా ముందు అశక్తతను, అణకువను కనబరచేవారు. 21:91 وَالَّتِي أَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِيهَا مِن رُّوحِنَا وَجَعَلْنَاهَا وَابْنَهَا آيَةً لِّلْعَالَمِينَ ఇక తన శీలాన్ని కాపాడుకున్న ఆ శీలవతి గురించి; ఆమె(చొక్కా చేతి)యందు మేము మా ఆత్మ (జిబ్రీల్) ద్వారా ఊదాము. స్వయంగా ఆమెనూ, ఆమె కుమారుణ్ణీ లోకవాసుల కోసం నిదర్శనంగా చేశాము. 21:92 إِنَّ هَٰذِهِ أُمَّتُكُمْ أُمَّةً وَاحِدَةً وَأَنَا رَبُّكُمْ فَاعْبُدُونِ మీ ఈ సమాజం (లేక మతధర్మం) వాస్తవానికి ఒకే సమాజం (ఒకే మత ధర్మం). నేను మీ అందరి ప్రభువును. కనుక మీరు నన్నే ఆరాధించండి. 21:93 وَتَقَطَّعُوا أَمْرَهُم بَيْنَهُمْ ۖ كُلٌّ إِلَيْنَا رَاجِعُونَ కాని ప్రజలు పరస్పరం (విభేదించుకుని) తమ ధర్మంలో ముఠాలు సృష్టించుకున్నారు. అయితే అందరూ మా వద్దకు మరలి రావలసిన వారే. 21:94 فَمَن يَعْمَلْ مِنَ الصَّالِحَاتِ وَهُوَ مُؤْمِنٌ فَلَا كُفْرَانَ لِسَعْيِهِ وَإِنَّا لَهُ كَاتِبُونَ మరెవరయితే సత్కార్యాలు చేస్తూ ఉంటాడో అతను విశ్వాసి (కూడా) అయి వుంటే, అతని కృషికి గుర్తింపు లభించకపోవటం అంటూ జరగదు. మేము దాన్ని వ్రాసి ఉంచుతాము. 21:95 وَحَرَامٌ عَلَىٰ قَرْيَةٍ أَهْلَكْنَاهَا أَنَّهُمْ لَا يَرْجِعُونَ ఏ పట్టణాన్ని మేము నాశనం చేశామో అక్కడి ప్రజలు మళ్లీ తిరిగి రావటం అన్నది అసంభవం. 21:96 حَتَّىٰ إِذَا فُتِحَتْ يَأْجُوجُ وَمَأْجُوجُ وَهُم مِّن كُلِّ حَدَبٍ يَنسِلُونَ చివరికి యాజూజ్ మాజూజ్లు వదలి పెట్టబడతారు. వారు ఎత్తయిన ప్రదేశాలన్నింటి నుంచీ ఎగబడి వస్తారు. 21:97 وَاقْتَرَبَ الْوَعْدُ الْحَقُّ فَإِذَا هِيَ شَاخِصَةٌ أَبْصَارُ الَّذِينَ كَفَرُوا يَا وَيْلَنَا قَدْ كُنَّا فِي غَفْلَةٍ مِّنْ هَٰذَا بَلْ كُنَّا ظَالِمِينَ మరి సత్యమైన వాగ్దానం సంభవించే సమయం ఆసన్నమవుతుంది. ఆ సమయంలో అవిశ్వాసుల కనుగుడ్లు విచ్చుకున్నవి విచ్చుకున్నట్లుగానే ఉండిపోతాయి. "అయ్యో! మా పాడు గాను! మేము ఈ పరిస్థితి పట్ల పరధ్యానానికి గురయ్యాము. అసలు మేమే దుర్మార్గులం" (అని వారు ఒప్పుకుంటారు). 21:98 إِنَّكُمْ وَمَا تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ حَصَبُ جَهَنَّمَ أَنتُمْ لَهَا وَارِدُونَ (ఓ అవిశ్వాసులారా!) మీరూ, అల్లాహ్ను వదలి మీరు పూజించే మీ దైవాలు - అందరూ నరకానికి ఇంధనం అవుతారు. మీరంతా దానికి ఆహుతి కావలసినవారే. 21:99 لَوْ كَانَ هَٰؤُلَاءِ آلِهَةً مَّا وَرَدُوهَا ۖ وَكُلٌّ فِيهَا خَالِدُونَ వీళ్ళే గనక (నిజమైన) దైవాలు అయివుంటే నరకానికి ఆహుతి అయ్యేవారే కారు. ఇక వారంతా శాశ్వతంగా అందులో పడి ఉండాల్సినవారే. 21:100 لَهُمْ فِيهَا زَفِيرٌ وَهُمْ فِيهَا لَا يَسْمَعُونَ అందులో వారు పెడబొబ్బలు పెడుతూ ఉంటారు. అయితే అందులో వారేమీ వినలేరు. 21:101 إِنَّ الَّذِينَ سَبَقَتْ لَهُم مِّنَّا الْحُسْنَىٰ أُولَٰئِكَ عَنْهَا مُبْعَدُونَ అయితే ముందు నుంచే మా వద్ద ఎవరి కొరకు మేలు ఖరారై ఉందో వారంతా నరకానికి దూరంగానే ఉంచబడతారు. 21:102 لَا يَسْمَعُونَ حَسِيسَهَا ۖ وَهُمْ فِي مَا اشْتَهَتْ أَنفُسُهُمْ خَالِدُونَ వారు నరకం సవ్వడి అయినా వినరు. తమ మనసు మెచ్చిన సుఖవిలాసాల మధ్య వారు శాశ్వతంగా ఉంటారు. 21:103 لَا يَحْزُنُهُمُ الْفَزَعُ الْأَكْبَرُ وَتَتَلَقَّاهُمُ الْمَلَائِكَةُ هَٰذَا يَوْمُكُمُ الَّذِي كُنتُمْ تُوعَدُونَ ఆ మహాకలవరం (కూడా) వారిని వ్యాకుల పరచదు. దైవదూతలు వారిని తీసుకోవటానికి వచ్చి, "మీకు వాగ్దానం చేయబడుతూ ఉన్న రోజు ఇదే" అని అంటారు. 21:104 يَوْمَ نَطْوِي السَّمَاءَ كَطَيِّ السِّجِلِّ لِلْكُتُبِ ۚ كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُّعِيدُهُ ۚ وَعْدًا عَلَيْنَا ۚ إِنَّا كُنَّا فَاعِلِينَ ఆ రోజున మేము వ్రాతప్రతులను చుట్టిపెట్టినట్లుగా ఆకాశాన్ని చుట్టివేస్తాము. ఏ విధంగా మేము మొదటిసారి సృష్టించామో అదేవిధంగా మలిసారి కూడా చేస్తాము. ఈ వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాపైన ఉంది. దాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాము. 21:105 وَلَقَدْ كَتَبْنَا فِي الزَّبُورِ مِن بَعْدِ الذِّكْرِ أَنَّ الْأَرْضَ يَرِثُهَا عِبَادِيَ الصَّالِحُونَ సజ్జనులైన నా దాసులే భూమికి వారసులవుతారని మేము జబూర్ (గ్రంథం)లో హితబోధ అనంతరం వ్రాసిపెట్టాము. 21:106 إِنَّ فِي هَٰذَا لَبَلَاغًا لِّقَوْمٍ عَابِدِينَ అల్లాహ్ను ఆరాధించే దాసుల కోసం ఇందులో (ఈ ఖుర్ఆనులో) ఓ గొప్ప సందేశం ఉంది. 21:107 وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِّلْعَالَمِينَ (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము. 21:108 قُلْ إِنَّمَا يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ فَهَلْ أَنتُم مُّسْلِمُونَ వారికి చెప్పు: "మీరందరి ఆరాధ్య దైవం ఒక్కడే అని మాత్రమే నా వద్దకు సందేశం (వహీ) పంపబడుతోంది. మరి మీరు కూడా విధేయులవుతారా?" 21:109 فَإِن تَوَلَّوْا فَقُلْ آذَنتُكُمْ عَلَىٰ سَوَاءٍ ۖ وَإِنْ أَدْرِي أَقَرِيبٌ أَم بَعِيدٌ مَّا تُوعَدُونَ ఒకవేళ వారు గనక ముఖం త్రిప్పుకుంటే వారికీవిధంగా చెప్పెయ్యి: "నేను మిమ్మల్ని సమానంగా హెచ్చరించాను. మీకు వాగ్దానం చేయబడుతున్న విషయం సమీపంలో ఉందో, దూరాన ఉందో నాకైతే తెలియదు." 21:110 إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ مِنَ الْقَوْلِ وَيَعْلَمُ مَا تَكْتُمُونَ అయితే మీరు బిగ్గరగా పలికేదీ ఆ ప్రభువుకు తెలుసు. మీరు దాచి పెట్టేది కూడా ఆయనకు తెలుసు. 21:111 وَإِنْ أَدْرِي لَعَلَّهُ فِتْنَةٌ لَّكُمْ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ బహుశా ఇది మీకొక పరీక్ష కాబోలు! ఒక నిర్ణీత గడువు వరకు లబ్ది (చేకూర్చటం) దీని ఉద్దేశం కాబోలు! ఇది కూడా నాకు తెలియదు. 21:112 قَالَ رَبِّ احْكُم بِالْحَقِّ ۗ وَرَبُّنَا الرَّحْمَٰنُ الْمُسْتَعَانُ عَلَىٰ مَا تَصِفُونَ "ఓ ప్రభూ! న్యాయంగా తీర్పు చెయ్యి. మా ప్రభువు అపార కరుణామయుడు. మీరు కల్పించే విషయాలపై ఆయన సహాయమే కోరబడుతోంది" అని (ప్రవక్త) స్వయంగా పలికాడు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |