aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

12. సూరా యూసుఫ్

12:1  الر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ
అలిఫ్‌ - లామ్‌ - రా. ఇవి స్పష్టమైన గ్రంథవాక్యాలు.
12:2  إِنَّا أَنزَلْنَاهُ قُرْآنًا عَرَبِيًّا لَّعَلَّكُمْ تَعْقِلُونَ
మీరు అర్థం చేసుకునేటందుకు మేము దీనిని అరబీ ఖుర్‌ఆనుగా అవతరింపజేశాము.
12:3  نَحْنُ نَقُصُّ عَلَيْكَ أَحْسَنَ الْقَصَصِ بِمَا أَوْحَيْنَا إِلَيْكَ هَٰذَا الْقُرْآنَ وَإِن كُنتَ مِن قَبْلِهِ لَمِنَ الْغَافِلِينَ
(ఓ ప్రవక్తా!) మేము నీ వద్దకు 'వహీ' ద్వారా ఈ ఖుర్‌ఆన్‌ను పంపి, (దీని ద్వారా) అత్యుత్తమమైన గాధలను నీకు చెబుతున్నాము. నిశ్చయంగా ఇంతకు మునుపు నీకు దీని (ఈ గాధల) గురించి ఏమీ తెలియదు.
12:4  إِذْ قَالَ يُوسُفُ لِأَبِيهِ يَا أَبَتِ إِنِّي رَأَيْتُ أَحَدَ عَشَرَ كَوْكَبًا وَالشَّمْسَ وَالْقَمَرَ رَأَيْتُهُمْ لِي سَاجِدِينَ
యూసుఫ్‌ తన తండ్రితో, "నాన్నా! నేను (కలగన్నాను. ఆ కలలో) పదకొండు నక్షత్రాలను, సూర్యచంద్రులను చూశాను. – అవి నాకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నట్లు కనిపించాయి" అని చెప్పినప్పుడు,
12:5  قَالَ يَا بُنَيَّ لَا تَقْصُصْ رُؤْيَاكَ عَلَىٰ إِخْوَتِكَ فَيَكِيدُوا لَكَ كَيْدًا ۖ إِنَّ الشَّيْطَانَ لِلْإِنسَانِ عَدُوٌّ مُّبِينٌ
"నా ముద్దుల బాబూ! నువ్వు కన్న కలను గురించి నీ సోదరులకు మాత్రం చెప్పకురా. బహుశా వారు నీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చురా. నిశ్చయంగా షైతాన్‌ మనిషికి బద్ధవిరోధి.
12:6  وَكَذَٰلِكَ يَجْتَبِيكَ رَبُّكَ وَيُعَلِّمُكَ مِن تَأْوِيلِ الْأَحَادِيثِ وَيُتِمُّ نِعْمَتَهُ عَلَيْكَ وَعَلَىٰ آلِ يَعْقُوبَ كَمَا أَتَمَّهَا عَلَىٰ أَبَوَيْكَ مِن قَبْلُ إِبْرَاهِيمَ وَإِسْحَاقَ ۚ إِنَّ رَبَّكَ عَلِيمٌ حَكِيمٌ
"అలాగే (నువ్వు కలగన్నట్లుగానే) జరుగుతుంది. నీ ప్రభువు నిన్ను (తన కార్యం కొరకు) ఎన్నుకుంటాడు. నీకు విషయాలలోతును అందుకునే విద్యను (లేక స్వప్నాల సారాంశాన్ని గ్రహించే జ్ఞానాన్ని) కూడా నేర్పుతాడు. తన అనుగ్రహాన్ని నీపై పరిపూర్ణం గావిస్తాడు. యాఖూబు సంతానాన్నికూడా (అనుగ్రహిస్తాడు). ఆయన లోగడ నీ తాతముత్తాతలైన ఇబ్రాహీము, ఇస్‌హాఖులకు తన అనుగ్రహాన్ని సంపూర్ణంగా ప్రసాదించినట్లు. నిశ్చయంగా నీ ప్రభువు మహాజ్ఞాని, గొప్పవివేకవంతుడు" అని అతని తండ్రి (యాఖూబ్‌) ఉపదేశించాడు.
12:7  لَّقَدْ كَانَ فِي يُوسُفَ وَإِخْوَتِهِ آيَاتٌ لِّلسَّائِلِينَ
నిశ్చయంగా యూసుఫ్‌ మరియు అతని సోదరుల గాథలో అడిగే వారికోసం (గొప్ప) సూచనలున్నాయి.
12:8  إِذْ قَالُوا لَيُوسُفُ وَأَخُوهُ أَحَبُّ إِلَىٰ أَبِينَا مِنَّا وَنَحْنُ عُصْبَةٌ إِنَّ أَبَانَا لَفِي ضَلَالٍ مُّبِينٍ
అప్పుడు వారిలా చెప్పుకున్నారు: "మనం ఒక (బలమైన) జట్టుగా ఉన్నప్పటికీ మన తండ్రి మనకన్నా యూసుఫును, అతని సోదరుణ్ణే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ విషయంలో మా తండ్రి స్పష్టమైన తప్పుచేస్తున్నారు అనేది మాత్రం ముమ్మాటికీ నిజం.
12:9  اقْتُلُوا يُوسُفَ أَوِ اطْرَحُوهُ أَرْضًا يَخْلُ لَكُمْ وَجْهُ أَبِيكُمْ وَتَكُونُوا مِن بَعْدِهِ قَوْمًا صَالِحِينَ
"(అందుకే) యూసుఫ్‌ను చంపేయండి లేదా అతన్నిఏదైనా (తెలియని) చోటపారేయండి. అప్పుడైనా మీ తండ్రి శ్రద్ధాసక్తులు మీవైపుకు మళ్ళవచ్చు. ఆ తరువాత మీరు మంచి వారుగా మారాలి."
12:10  قَالَ قَائِلٌ مِّنْهُمْ لَا تَقْتُلُوا يُوسُفَ وَأَلْقُوهُ فِي غَيَابَتِ الْجُبِّ يَلْتَقِطْهُ بَعْضُ السَّيَّارَةِ إِن كُنتُمْ فَاعِلِينَ
అప్పుడు వారిలో ఒకడు, "యూసుఫ్‌ను చంపకండి. (ఒకవేళ ఏదైనా చేయాలనే అనుకుంటే) అతన్ని ఏదైనా లోతైన బావిలో పడవెయ్యండి – వచ్చేపోయే బాటసారుల బృందం ఏదైనా అతన్నిఎత్తుకుపోతుంది" అని అన్నాడు.
12:11  قَالُوا يَا أَبَانَا مَا لَكَ لَا تَأْمَنَّا عَلَىٰ يُوسُفَ وَإِنَّا لَهُ لَنَاصِحُونَ
వారంతా అన్నారు: "నాన్నగారూ! తమరు యూసుఫ్‌ విషయంలో మమ్మల్ని బొత్తిగా నమ్మరేమిటీ? మేము అతని బాగోగులను కోరేవారమేకదా!
12:12  أَرْسِلْهُ مَعَنَا غَدًا يَرْتَعْ وَيَلْعَبْ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
"రేపు మీరతన్ని ఎలాగైనా సరే మాతో పంపండి. అక్కడతను బాగాతిని, ఆడుకుంటాడు. అతన్ని కాపాడే బాధ్యత మాదికదా?"
12:13  قَالَ إِنِّي لَيَحْزُنُنِي أَن تَذْهَبُوا بِهِ وَأَخَافُ أَن يَأْكُلَهُ الذِّئْبُ وَأَنتُمْ عَنْهُ غَافِلُونَ
(యాఖూబు - అలైహిస్సలాం) ఇలా సమాధానమిచ్చారు: "మీరతన్ని తీసుకువెళ్లటం నన్ను వ్యాకుల పరుస్తోంది. మీరు పరధ్యానంలో ఉండగా ఎక్కడ తోడేలు వచ్చి అతన్ని తినేస్తుందోనన్న భయంకూడా నన్ను వెంటాడుతోంది."
12:14  قَالُوا لَئِنْ أَكَلَهُ الذِّئْبُ وَنَحْنُ عُصْبَةٌ إِنَّا إِذًا لَّخَاسِرُونَ
దానికి వారు, "(నాన్నా!) మాలాంటి (బలిష్టమైన) జట్టు ఉండగా తోడేలు వచ్చి ఇతన్ని తినేస్తే మేము ఏ మాత్రం చేతకాని చవటలం అవుతాము" అని చెప్పారు.
12:15  فَلَمَّا ذَهَبُوا بِهِ وَأَجْمَعُوا أَن يَجْعَلُوهُ فِي غَيَابَتِ الْجُبِّ ۚ وَأَوْحَيْنَا إِلَيْهِ لَتُنَبِّئَنَّهُم بِأَمْرِهِمْ هَٰذَا وَهُمْ لَا يَشْعُرُونَ
ఆ విధంగా వాళ్ళు అతన్ని తీసుకుపోయి, లోతైన బావిలో పడవేయాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు మేము యూసుఫ్‌కు 'వహీ' పంపుతూ, "నువ్వు(ఒకానొకరోజు) తప్పకుండా వారికి ఈ వ్యవహారాన్ని తెలియజేస్తావు. కాని అప్పుడు వారు (నిన్ను) గుర్తుపట్టే స్థితిలో ఉండరు" అని తెలిపాము.
12:16  وَجَاءُوا أَبَاهُمْ عِشَاءً يَبْكُونَ
రాత్రయ్యే సరికి వారంతా లబోదిబో మంటూ తమ తండ్రి వద్దకు వచ్చారు.
12:17  قَالُوا يَا أَبَانَا إِنَّا ذَهَبْنَا نَسْتَبِقُ وَتَرَكْنَا يُوسُفَ عِندَ مَتَاعِنَا فَأَكَلَهُ الذِّئْبُ ۖ وَمَا أَنتَ بِمُؤْمِنٍ لَّنَا وَلَوْ كُنَّا صَادِقِينَ
"ఓ నాన్నా! మేము యూసుఫ్‌ను సామాను వద్ద వదలి పెట్టి పరుగుపందెంలో మునిగిపోయాము. అంతలోనే తోడేలువచ్చి అతన్నితినేసింది. మేము నిజం చెప్పినా మీరు మా మాటను నమ్మరు" అన్నారు.
12:18  وَجَاءُوا عَلَىٰ قَمِيصِهِ بِدَمٍ كَذِبٍ ۚ قَالَ بَلْ سَوَّلَتْ لَكُمْ أَنفُسُكُمْ أَمْرًا ۖ فَصَبْرٌ جَمِيلٌ ۖ وَاللَّهُ الْمُسْتَعَانُ عَلَىٰ مَا تَصِفُونَ
అతని (యూసుఫ్‌) చొక్కాను బూటకపు (నకిలీ) రక్తంతో రంగరించి తెచ్చారు. "(ఇది నిజం కాదు). ఇది మీ మనోకల్పితమైన మాట మాత్రమే. సరే. ఇక ఓర్పు వహించటమే ఉత్తమం. మీరు కల్పించే మాటలపై నేను అల్లాహ్‌ సహాయాన్నేఅర్థిస్తున్నాను" అని ఆయన (యాఖూబు) పలికారు.
12:19  وَجَاءَتْ سَيَّارَةٌ فَأَرْسَلُوا وَارِدَهُمْ فَأَدْلَىٰ دَلْوَهُ ۖ قَالَ يَا بُشْرَىٰ هَٰذَا غُلَامٌ ۚ وَأَسَرُّوهُ بِضَاعَةً ۚ وَاللَّهُ عَلِيمٌ بِمَا يَعْمَلُونَ
ఒక ప్రయాణీకుల బృందం అటువైపు వచ్చింది. వారు నీళ్ళు తెచ్చే తమ మనిషిని నీళ్ళ కొరకు పంపగా, అతడు తన బొక్కెను బావిలో వేశాడు - (యూసుఫ్‌ను చూడగానే) "శుభం శుభం, ఇదిగో ఇక్కడ ఒక బాలుడున్నాడ" ని అన్నాడు. వారు అతన్ని వర్తక సామగ్రిగా పరిగణించి దాచి పెట్టారు. అయితే వారు చేస్తున్నదంతా అల్లాహ్‌కు తెలుసు!
12:20  وَشَرَوْهُ بِثَمَنٍ بَخْسٍ دَرَاهِمَ مَعْدُودَةٍ وَكَانُوا فِيهِ مِنَ الزَّاهِدِينَ
వాళ్ళు అతన్ని అతి తక్కువ ధరకు, అనగా కొన్నిదిర్హములకే అమ్మేశారు. ఎందుకంటే యూసుఫ్‌ వ్యవహారంలో వారికి అంతగా ఆసక్తి లేదు.
12:21  وَقَالَ الَّذِي اشْتَرَاهُ مِن مِّصْرَ لِامْرَأَتِهِ أَكْرِمِي مَثْوَاهُ عَسَىٰ أَن يَنفَعَنَا أَوْ نَتَّخِذَهُ وَلَدًا ۚ وَكَذَٰلِكَ مَكَّنَّا لِيُوسُفَ فِي الْأَرْضِ وَلِنُعَلِّمَهُ مِن تَأْوِيلِ الْأَحَادِيثِ ۚ وَاللَّهُ غَالِبٌ عَلَىٰ أَمْرِهِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
ఈజిప్టు వారిలో యూసుఫును కొన్న వ్యక్తి తన భార్యతో, "ఇతన్నిగౌరవాదరణలతో ఉంచు. బహుశా ఇతని వల్ల మనకు లాభం కలగవచ్చు. లేదా ఇతన్ని మనం మన కొడుకుగా నయినా చేసుకోవచ్చు" అన్నాడు. ఈ విధంగా మేము, స్వప్నాల సారాన్ని గ్రహించే విద్యను నేర్పడానికి ఈజిప్టు భూభాగంపై యూసుఫ్‌కు నిలదొక్కుకునే అవకాశం కల్పించాము. అల్లాహ్‌ తన నిర్ణయాన్ని అమలు పరచి తీరుతాడు. కాని ప్రజలలో చాలామందికి ఈ విషయం తెలియదు.
12:22  وَلَمَّا بَلَغَ أَشُدَّهُ آتَيْنَاهُ حُكْمًا وَعِلْمًا ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
మరి అతను (యూసుఫ్‌) నిండు యౌవనదశకు చేరుకున్నప్పుడు మేమతనికి నిర్ణయం గైకునే శక్తినీ, జ్ఞానాన్నీ ప్రసాదించాము. సదాచార సంపన్నులకు మేము ఈ విధంగానే ప్రతిఫలాన్నిఅనుగ్రహిస్తాము.
12:23  وَرَاوَدَتْهُ الَّتِي هُوَ فِي بَيْتِهَا عَن نَّفْسِهِ وَغَلَّقَتِ الْأَبْوَابَ وَقَالَتْ هَيْتَ لَكَ ۚ قَالَ مَعَاذَ اللَّهِ ۖ إِنَّهُ رَبِّي أَحْسَنَ مَثْوَايَ ۖ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ
అతను (యూసుఫ్‌) ఉంటున్న ఇంటి స్త్రీ అతని మానసిక ఏకాగ్రతను దెబ్బతీస్తూ కవ్వించటం మొదలెట్టింది. (ఒకసారి) తలుపులు మూసేసి, 'రా....రా!' అని అంది. "అల్లాహ్‌ శరణు! ఆయన నా ప్రభువు. ఆయన నన్ను చాలా మంచి స్థితిలో ఉంచాడు. అన్యాయం చేసేవారు ఎన్నటికీ బాగుపడరు" అని యూసుఫ్‌ అన్నాడు.
12:24  وَلَقَدْ هَمَّتْ بِهِ ۖ وَهَمَّ بِهَا لَوْلَا أَن رَّأَىٰ بُرْهَانَ رَبِّهِ ۚ كَذَٰلِكَ لِنَصْرِفَ عَنْهُ السُّوءَ وَالْفَحْشَاءَ ۚ إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُخْلَصِينَ
ఆమె అతన్ని (యూసుఫ్‌ను) ఆశించింది. ఒకవేళ అతను గనక తన ప్రభువు నిదర్శనాన్ని చూసి ఉండకపోతే అతను కూడా ఆమెను ఆశించి ఉండేవాడే. (కాని అలా జరగలేదు). ఎందుకంటే మేము అతన్నుంచి చెడును, నీతి బాహ్యతను దూరంచేశాము. నిశ్చయంగా అతను మాప్రత్యేక దాసులలో ఒకడు.
12:25  وَاسْتَبَقَا الْبَابَ وَقَدَّتْ قَمِيصَهُ مِن دُبُرٍ وَأَلْفَيَا سَيِّدَهَا لَدَى الْبَابِ ۚ قَالَتْ مَا جَزَاءُ مَنْ أَرَادَ بِأَهْلِكَ سُوءًا إِلَّا أَن يُسْجَنَ أَوْ عَذَابٌ أَلِيمٌ
వారిద్దరూ తలుపు వైపు పరుగెత్తారు. ఆ స్త్రీ యూసుఫ్‌ చొక్కాను వెనుకవైపు నుంచి లాగిచింపేసింది. తలుపు వద్దనే ఆమె భర్తవారిద్దరికీ ఎదురుపడ్డాడు. "నీ ఇల్లాలిపట్ల దురుద్దేశం కలవాడికి కారాగారశిక్ష విధించటమూ లేక మరేదైనా కఠినశిక్ష విధించటమూ తప్ప వేరేశిక్ష ఏముంటుంది?" అని ఆమె (భర్తను) ప్రశ్నించింది.
12:26  قَالَ هِيَ رَاوَدَتْنِي عَن نَّفْسِي ۚ وَشَهِدَ شَاهِدٌ مِّنْ أَهْلِهَا إِن كَانَ قَمِيصُهُ قُدَّ مِن قُبُلٍ فَصَدَقَتْ وَهُوَ مِنَ الْكَاذِبِينَ
"ఈమెగారే నన్నువలలో వేసుకోవటానికి ప్రయత్నించింది" అని యూసుఫ్‌ చెప్పాడు. ఆమె వంశానికే చెందిన ఒక వ్యక్తి సాక్ష్యమిస్తూ, "ఇతని చొక్కాగనక ముందువైపు నుంచి చినిగి ఉంటే స్త్రీ చెప్పేది నిజం. ఇతను చెప్పేది అబద్ధం.
12:27  وَإِن كَانَ قَمِيصُهُ قُدَّ مِن دُبُرٍ فَكَذَبَتْ وَهُوَ مِنَ الصَّادِقِينَ
ఒకవేళ ఇతని చొక్కా గనక వెనుక వైపు నుంచి చినిగి ఉంటే స్త్రీ చెప్పేది అబద్ధం. ఇతను చెప్పేది నిజం" అన్నాడు.
12:28  فَلَمَّا رَأَىٰ قَمِيصَهُ قُدَّ مِن دُبُرٍ قَالَ إِنَّهُ مِن كَيْدِكُنَّ ۖ إِنَّ كَيْدَكُنَّ عَظِيمٌ
యూసుఫ్‌ చొక్కా వెనుక వైపు నుంచి చినిగి ఉండటం గమనించిన ఆమె భర్త ఇలా అన్నాడు : "ఇవి మీఆడవాళ్ల మాయోపాయాలు. నిశ్చయంగా మీ మాయోపాయాలు మహాఘోరంగా ఉంటాయి!
12:29  يُوسُفُ أَعْرِضْ عَنْ هَٰذَا ۚ وَاسْتَغْفِرِي لِذَنبِكِ ۖ إِنَّكِ كُنتِ مِنَ الْخَاطِئِينَ
"యూసుఫ్‌! ఈ విషయాన్ని ఇంతటితో వదిలెయ్యి. (ఏమే!) నువ్వు మాత్రం నీతప్పుకు (అల్లాహ్‌ను) క్షమాపణ వేడుకో. ముమ్మాటికీ తప్పు నీదే" (అన్నాడు).
12:30  وَقَالَ نِسْوَةٌ فِي الْمَدِينَةِ امْرَأَتُ الْعَزِيزِ تُرَاوِدُ فَتَاهَا عَن نَّفْسِهِ ۖ قَدْ شَغَفَهَا حُبًّا ۖ إِنَّا لَنَرَاهَا فِي ضَلَالٍ مُّبِينٍ
నగర స్త్రీలలో గుసగుసలు మొదలయ్యాయి - "అజీజ్‌ భార్య తన వద్ద నున్న (యువ) బానిసపై (మోజుపడి), తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి వలపన్నుతోంది. ఆమె మనసులో అతని పట్ల ప్రేమ.గూడు కట్టుకుంది. (ఎంతయినా) మా దృష్టిలో ఆమె చేసేది ఘోరమైనతప్పే" అని వారు చెప్పుకోసాగారు.
12:31  فَلَمَّا سَمِعَتْ بِمَكْرِهِنَّ أَرْسَلَتْ إِلَيْهِنَّ وَأَعْتَدَتْ لَهُنَّ مُتَّكَأً وَآتَتْ كُلَّ وَاحِدَةٍ مِّنْهُنَّ سِكِّينًا وَقَالَتِ اخْرُجْ عَلَيْهِنَّ ۖ فَلَمَّا رَأَيْنَهُ أَكْبَرْنَهُ وَقَطَّعْنَ أَيْدِيَهُنَّ وَقُلْنَ حَاشَ لِلَّهِ مَا هَٰذَا بَشَرًا إِنْ هَٰذَا إِلَّا مَلَكٌ كَرِيمٌ
వారి మోసపు మాటల గురించి విని ఆమె వాళ్ళను పిలిపించింది. వారికోసం ఒక సదనాన్ని ఏర్పాటుచేసింది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో కత్తి ఇచ్చి, (వారంతా ఆసీనులైన తరువాత) "వీళ్లముందుకురా!" అని (యూసుఫ్‌ను) ఆదేశించింది. ఆ స్త్రీలు అతన్ని చూడగానే దిగ్భ్రమతో (మైమరచి) తమ చేతులనే కోసుకున్నారు. "హాషాలిల్లాహ్‌! (దైవమహిమ!) ఇతను మానవమాత్రుడు కాడు. నిశ్చయంగా ఇతను (దివి నుంచి భువికి దిగివచ్చిన) గొప్పదైవదూతే!" అన్నమాటలు వారినోట (అప్రయత్నంగా) వెలువడ్డాయి.
12:32  قَالَتْ فَذَٰلِكُنَّ الَّذِي لُمْتُنَّنِي فِيهِ ۖ وَلَقَدْ رَاوَدتُّهُ عَن نَّفْسِهِ فَاسْتَعْصَمَ ۖ وَلَئِن لَّمْ يَفْعَلْ مَا آمُرُهُ لَيُسْجَنَنَّ وَلَيَكُونًا مِّنَ الصَّاغِرِينَ
అప్పుడు ఆమె (అజీజ్‌ భార్య) ఇలా అన్నది: "ఎవరి విషయంలో మీరంతా నన్నునిందిస్తున్నారో ఆ వ్యక్తి ఇతనే. నేను ఇతన్ని వల్లో వేసుకోవాలని ప్రయత్నించాను. కాని ఇతను తప్పించుకున్నాడు. నేను ఆజ్ఞాపించిన పనిని ఇతను చేయకపోతే చెరసాలపాలై, తీవ్రమైన అవమానానికి గురవుతాడు."
12:33  قَالَ رَبِّ السِّجْنُ أَحَبُّ إِلَيَّ مِمَّا يَدْعُونَنِي إِلَيْهِ ۖ وَإِلَّا تَصْرِفْ عَنِّي كَيْدَهُنَّ أَصْبُ إِلَيْهِنَّ وَأَكُن مِّنَ الْجَاهِلِينَ
అప్పుడు యూసుఫ్‌, "ప్రభూ! ఈ స్త్రీలు దేనికోసం నన్నుపిలుస్తున్నారో దానికన్నా కారాగారమే నాకు ప్రీతికరమైనది. నీవు గనక వీళ్ల జిత్తులను నానుండి దూరం చేయకపోతే, నేను వీళ్ల వలలో పడిపోయి, అవివేకులలో చేరిపోతాను!" అని మొరపెట్టుకున్నాడు.
12:34  فَاسْتَجَابَ لَهُ رَبُّهُ فَصَرَفَ عَنْهُ كَيْدَهُنَّ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
అతని ప్రభువు అతని ప్రార్థనను ఆమోదించాడు. ఆ మగువల మాయోపాయాలను అతన్నుంచి తొలగించాడు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నీతెలిసినవాడు.
12:35  ثُمَّ بَدَا لَهُم مِّن بَعْدِ مَا رَأَوُا الْآيَاتِ لَيَسْجُنُنَّهُ حَتَّىٰ حِينٍ
నిదర్శనాలన్నిటిని చూసిన తరువాత కూడా యూసుఫ్‌ను కొంతకాలంపాటు కారాగారంలో ఉంచటమే ఉచితమని వారు భావించారు.
12:36  وَدَخَلَ مَعَهُ السِّجْنَ فَتَيَانِ ۖ قَالَ أَحَدُهُمَا إِنِّي أَرَانِي أَعْصِرُ خَمْرًا ۖ وَقَالَ الْآخَرُ إِنِّي أَرَانِي أَحْمِلُ فَوْقَ رَأْسِي خُبْزًا تَأْكُلُ الطَّيْرُ مِنْهُ ۖ نَبِّئْنَا بِتَأْوِيلِهِ ۖ إِنَّا نَرَاكَ مِنَ الْمُحْسِنِينَ
అతనితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా కారాగారానికి వచ్చారు. వారిలో ఒకడు, "నేను సారాయి పిండుతున్నట్లు కలగన్నాన" ని అన్నాడు. రెండో అతను, "నేను (కలలో) నా తలపై రొట్టెలు ఎత్తుకొని ఉన్నాను. వాటిని పక్షులు తింటున్నాయ" ని చెప్పాడు. "దీని మర్మం ఏమిటో కాస్త మాకు చెప్పండి. చూస్తుంటే,మీరు మాకు మంచివారుగా కనిపిస్తున్నారు" అని వారిద్దరూ విన్నవించుకున్నారు.
12:37  قَالَ لَا يَأْتِيكُمَا طَعَامٌ تُرْزَقَانِهِ إِلَّا نَبَّأْتُكُمَا بِتَأْوِيلِهِ قَبْلَ أَن يَأْتِيَكُمَا ۚ ذَٰلِكُمَا مِمَّا عَلَّمَنِي رَبِّي ۚ إِنِّي تَرَكْتُ مِلَّةَ قَوْمٍ لَّا يُؤْمِنُونَ بِاللَّهِ وَهُم بِالْآخِرَةِ هُمْ كَافِرُونَ
అప్పుడు యూసుఫ్‌ ఇలా అన్నాడు : "ఇక్కడ మీకు ఇవ్వబడే భోజనం మీ వద్దకు రాకముందే నేను మీకు వాటి భావార్థాన్ని వివరిస్తాను. ఇదంతా నా ప్రభువు నాకు నేర్పిన విద్యయే.(అసలు విషయం ఏమిటంటే) అల్లాహ్‌ను నమ్మనివారి, పరలోకాన్ని తిరస్కరించే వారి మతాన్ని నేను వదలిపెట్టాను.
12:38  وَاتَّبَعْتُ مِلَّةَ آبَائِي إِبْرَاهِيمَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ ۚ مَا كَانَ لَنَا أَن نُّشْرِكَ بِاللَّهِ مِن شَيْءٍ ۚ ذَٰلِكَ مِن فَضْلِ اللَّهِ عَلَيْنَا وَعَلَى النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَشْكُرُونَ
"నేను నా తాతతండ్రులైన ఇబ్రాహీం, ఇస్‌హాఖ్‌, యాఖూబ్‌ల ధర్మానికి కట్టుబడి ఉన్నాను. అల్లాహ్‌కు భాగస్వామిగా వేరితరులను కల్పించటం మాకు ఎంత మాత్రం తగదు. మాపైన, సమస్త జనులపైన గల దేవుని అనుగ్రహం ఇది. కాని ప్రజల్లో చాలామంది కృతజ్ఞతా పూర్వకంగా మెలగరు.
12:39  يَا صَاحِبَيِ السِّجْنِ أَأَرْبَابٌ مُّتَفَرِّقُونَ خَيْرٌ أَمِ اللَّهُ الْوَاحِدُ الْقَهَّارُ
"ఓ కారాగార సహచరులారా! అనేక మంది విభిన్న ప్రభువులు మేలా? లేక సర్వాధిక్యుడైన ఒక్క అల్లాహ్‌ మేలా? (మీరే చెప్పండి!)
12:40  مَا تَعْبُدُونَ مِن دُونِهِ إِلَّا أَسْمَاءً سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا أَنزَلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّهِ ۚ أَمَرَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
"ఆయనను వదలి మీరు పూజిస్తున్నవి మీరూ, మీ తాత ముత్తాతలూ స్వయంగా కల్పించుకున్న కొన్ని పేర్లు తప్ప మరేమీ కావు. వాటికి సంబంధించి అల్లాహ్‌ ఏ ప్రమాణాన్నీ అవతరింపజెయ్యలేదు. పరిపాలనాధికారం అల్లాహ్‌కు తప్ప వేరొకరికి లేదు. మీరంతా ఆయన దాస్యాన్ని తప్ప ఇంకొకరి దాస్యం చేయరాదన్నదే ఆయన ఆజ్ఞ. ఇదే సరైన - స్థిరమైన - ధర్మం. కాని చాలామంది ఈ విషయాన్నితెలుసుకోరు.
12:41  يَا صَاحِبَيِ السِّجْنِ أَمَّا أَحَدُكُمَا فَيَسْقِي رَبَّهُ خَمْرًا ۖ وَأَمَّا الْآخَرُ فَيُصْلَبُ فَتَأْكُلُ الطَّيْرُ مِن رَّأْسِهِ ۚ قُضِيَ الْأَمْرُ الَّذِي فِيهِ تَسْتَفْتِيَانِ
"చెరసాల జీవితం గడుపుతున్న నా సహవాసులారా! మీరిద్దరిలో ఒకడు తన చక్రవర్తికి మధువును పోయడానికి నియమించబడతాడు. మరొకతను శిలువ వేయబడతాడు. పక్షులు అతని తలను పొడిచితింటాయి. మీరిద్దరూ ఏ విషయం గురించి వాకబు చేశారో దాని నిర్ణయం జరిగిపోయింది."
12:42  وَقَالَ لِلَّذِي ظَنَّ أَنَّهُ نَاجٍ مِّنْهُمَا اذْكُرْنِي عِندَ رَبِّكَ فَأَنسَاهُ الشَّيْطَانُ ذِكْرَ رَبِّهِ فَلَبِثَ فِي السِّجْنِ بِضْعَ سِنِينَ
వారిద్దరిలో విడుదల చేయబడతాడని భావించిన వానితో యూసుఫ్‌, "నీ చక్రవర్తి ముందు నా గురించి కాస్త ప్రస్తావించు" అన్నాడు. కాని చక్రవర్తి ముందు ప్రస్తావన తీసుకురాకుండా షైతాన్‌ అతన్నిమరుపుకు లోనుచేశాడు. సంవత్సరాల తరబడి యూసుఫ్‌ కారాగారంలోనే ఉండిపోయాడు.
12:43  وَقَالَ الْمَلِكُ إِنِّي أَرَىٰ سَبْعَ بَقَرَاتٍ سِمَانٍ يَأْكُلُهُنَّ سَبْعٌ عِجَافٌ وَسَبْعَ سُنبُلَاتٍ خُضْرٍ وَأُخَرَ يَابِسَاتٍ ۖ يَا أَيُّهَا الْمَلَأُ أَفْتُونِي فِي رُؤْيَايَ إِن كُنتُمْ لِلرُّؤْيَا تَعْبُرُونَ
ఒకరోజు చక్రవర్తి (సభా సదులను ఉద్దేశించి) "బాగా బలిసిన ఏడు ఆవులను బక్కచిక్కిన ఏడు ఆవులు తినేస్తున్నట్లు, ఏడు ధాన్యపు వెన్నులు పచ్చగా ఉండగా మరో ఏడు వెన్నులు ఎండిపోయి ఉన్నట్లు నేను కలగన్నాను. ఓ సభాసదులారా! మీరు గనక కలల భావార్థం చెప్పగలిగితే నేను కన్న ఈ కలకు భావం ఏమిటో చెప్పండి" అన్నాడు.
12:44  قَالُوا أَضْغَاثُ أَحْلَامٍ ۖ وَمَا نَحْنُ بِتَأْوِيلِ الْأَحْلَامِ بِعَالِمِينَ
దానికి వారు, "ఇవి పీడకలకు సంబంధించిన విషయాలు. ఇలాంటి పీడకలల భావం మాకు తెలియదు" అని సమాధానమిచ్చారు.
12:45  وَقَالَ الَّذِي نَجَا مِنْهُمَا وَادَّكَرَ بَعْدَ أُمَّةٍ أَنَا أُنَبِّئُكُم بِتَأْوِيلِهِ فَأَرْسِلُونِ
ఆ ఇద్దరు ఖైదీలలో విడుదల అయిన వ్యక్తికి చాలా కాలం తరువాత (యూసుఫ్‌ సంగతి) జ్ఞాపకం వచ్చింది. "దీని భావం నేను వివరిస్తాను. బయటికెళ్ళేందుకు నాకు అనుమతి ఇవ్వండి" అని కోరాడతను.
12:46  يُوسُفُ أَيُّهَا الصِّدِّيقُ أَفْتِنَا فِي سَبْعِ بَقَرَاتٍ سِمَانٍ يَأْكُلُهُنَّ سَبْعٌ عِجَافٌ وَسَبْعِ سُنبُلَاتٍ خُضْرٍ وَأُخَرَ يَابِسَاتٍ لَّعَلِّي أَرْجِعُ إِلَى النَّاسِ لَعَلَّهُمْ يَعْلَمُونَ
"సత్యవంతుడవైన ఓ యూసుఫ్‌! ఈ కలకు భావం ఏమిటో కాస్త మాకు చెప్పండి – బలిసిన ఏడు ఆవులను బక్కచిక్కిన ఏడు ఆవులు భక్షిస్తున్నాయి. పచ్చగా కళకళలాడే ఏడు ధాన్యపు వెన్నులుండగా, మరో ఏడు వెన్నులు ఎండిపోయి ఉన్నాయి. (మీరు గనక దీని గూఢార్థం చెబితే) నేను తిరిగి వెళ్ళి, వారికి దీని గురించి చెబుతాను. వారు విషయం తెలుసుకుంటారు" (అని ఆ వ్యక్తి అభ్యర్థించాడు).
12:47  قَالَ تَزْرَعُونَ سَبْعَ سِنِينَ دَأَبًا فَمَا حَصَدتُّمْ فَذَرُوهُ فِي سُنبُلِهِ إِلَّا قَلِيلًا مِّمَّا تَأْكُلُونَ
(యూసుఫ్‌) ఇలా వివరించాడు: "మీరు ఏడు సంవత్సరాల పాటు నిరాఘాటంగా – ఆనవాయితీ ప్రకారం – సేద్యం చేయాలి. కోతలు కోసిన తరువాత మీరు తినటానికి కొంత భాగాన్ని తీసుకుని మిగిలిన ధాన్యాన్ని కంకుల సమేతంగా ఉంచేయండి.
12:48  ثُمَّ يَأْتِي مِن بَعْدِ ذَٰلِكَ سَبْعٌ شِدَادٌ يَأْكُلْنَ مَا قَدَّمْتُمْ لَهُنَّ إِلَّا قَلِيلًا مِّمَّا تُحْصِنُونَ
"ఆ తరువాత తీవ్రమైన (దుర్భిక్షంతో కూడుకున్న) ఏడు సంవత్సరాలు వస్తాయి. మీరు ముందుగా వాటి కోసం నిలువ చేసి ఉంచిన దానిని అవి హరిస్తాయి. ఒకవేళ కొద్దిగా ఏమైనా మిగిలితే అది మీరు దాచిపెట్టి ఉంచుకున్నదే.
12:49  ثُمَّ يَأْتِي مِن بَعْدِ ذَٰلِكَ عَامٌ فِيهِ يُغَاثُ النَّاسُ وَفِيهِ يَعْصِرُونَ
"ఆ తరువాత వచ్చే సంవత్సరంలో ప్రజలపై పుష్కలంగా వర్షాలు కురుస్తాయి. అందులో వారు (ద్రాక్ష) రసాన్ని కూడా దండిగా తీస్తారు.
12:50  وَقَالَ الْمَلِكُ ائْتُونِي بِهِ ۖ فَلَمَّا جَاءَهُ الرَّسُولُ قَالَ ارْجِعْ إِلَىٰ رَبِّكَ فَاسْأَلْهُ مَا بَالُ النِّسْوَةِ اللَّاتِي قَطَّعْنَ أَيْدِيَهُنَّ ۚ إِنَّ رَبِّي بِكَيْدِهِنَّ عَلِيمٌ
"అతన్ని నా దగ్గరకు తీసుకురండి" అని రాజు ఆజ్ఞాపించాడు. (రాజ) దూత యూసుఫ్‌ వద్దకు చేరుకున్నప్పుడు, "నువ్వు నీ రాజు వద్దకు తిరిగి వెళ్ళి, తమ చేతులను కోసుకున్న మహిళామణుల వ్యవహారంలోని నిజానిజాలేమిటో తేల్చమని అతన్నిఅడుగు. నిశ్చయంగా వారి జిత్తుల గురించి నా ప్రభువుకు అంతా తెలుసు" అన్నాడు యూసుఫ్‌.
12:51  قَالَ مَا خَطْبُكُنَّ إِذْ رَاوَدتُّنَّ يُوسُفَ عَن نَّفْسِهِ ۚ قُلْنَ حَاشَ لِلَّهِ مَا عَلِمْنَا عَلَيْهِ مِن سُوءٍ ۚ قَالَتِ امْرَأَتُ الْعَزِيزِ الْآنَ حَصْحَصَ الْحَقُّ أَنَا رَاوَدتُّهُ عَن نَّفْسِهِ وَإِنَّهُ لَمِنَ الصَّادِقِينَ
అప్పుడు రాజు (సంబంధిత స్త్రీలను పిలిపించి), "ఓ నారీమణులారా! మీరంతా వలపన్ని,యూసుఫ్‌ మనసును చలింపజేయటానికి ప్రయత్నించినప్పుడు అసలేం జరిగింది?" అని అడిగాడు. దానికి వారు, "హాషలిల్లాహ్‌ ! (అల్లాహ్‌ మమ్మల్ని రక్షించుగాక!) మేము యూసుఫ్‌లో ఏ దోషాన్నీ చూడలేదు" అని జవాబిచ్చారు. తర్వాత అజీజ్‌ భార్య కూడా ఈ విధంగా చెప్పింది: "ఇప్పుడు నిజం బయటపడింది. అతని మనసును కవ్వించినది నేనే. అతను మాత్రం సత్యవంతుడు."
12:52  ذَٰلِكَ لِيَعْلَمَ أَنِّي لَمْ أَخُنْهُ بِالْغَيْبِ وَأَنَّ اللَّهَ لَا يَهْدِي كَيْدَ الْخَائِنِينَ
నేను అతని (అజీజు) పరోక్షంలో అతని కెలాంటి ద్రోహం చేయలేదనీ, ద్రోహబుద్ధిగల వారి టక్కరిజిత్తులను అల్లాహ్‌ పారనివ్వడని (అజీజ్‌) తెలుసుకోవటానికి నేనిలా చేశాను (అన్నాడు యూసుఫ్‌).
12:53  وَمَا أُبَرِّئُ نَفْسِي ۚ إِنَّ النَّفْسَ لَأَمَّارَةٌ بِالسُّوءِ إِلَّا مَا رَحِمَ رَبِّي ۚ إِنَّ رَبِّي غَفُورٌ رَّحِيمٌ
నేను నా మనసు పవిత్రతను గురించి చాటు కోవటంలేదు. నిశ్చయంగా మనసైతే చెడువైపుకే పురికొల్పుతుంది. అయితే నా ప్రభువు దయదలచిన వారి విషయంలో మటుకు అలా జరగదు. నిస్సందేహంగా నా ప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా దయదలిచేవాడు.
12:54  وَقَالَ الْمَلِكُ ائْتُونِي بِهِ أَسْتَخْلِصْهُ لِنَفْسِي ۖ فَلَمَّا كَلَّمَهُ قَالَ إِنَّكَ الْيَوْمَ لَدَيْنَا مَكِينٌ أَمِينٌ
"అతన్ని నా వద్దకు పిలుచుకురండి. నేనతన్ని నా ఆంతరంగిక కార్యదర్శిగా నియమించుకుంటాను" అని రాజు చెప్పాడు. అతనితో మాట్లాడిన తరువాత, "ఈ రోజు నుంచి మీరు మాదగ్గర గౌరవనీయులు, నమ్మకస్థులు" అని రాజు పలికాడు.
12:55  قَالَ اجْعَلْنِي عَلَىٰ خَزَائِنِ الْأَرْضِ ۖ إِنِّي حَفِيظٌ عَلِيمٌ
అప్పుడు (యూసుఫ్‌) ఇలా అన్నాడు: "రాజ్యంలోని ఖజానాలపై నన్ను (పర్యవేక్షకునిగా) నియమించండి. నేను వాటిని కాపాడతాను. ఆ పరిజ్ఞానం నాకున్నది."
12:56  وَكَذَٰلِكَ مَكَّنَّا لِيُوسُفَ فِي الْأَرْضِ يَتَبَوَّأُ مِنْهَا حَيْثُ يَشَاءُ ۚ نُصِيبُ بِرَحْمَتِنَا مَن نَّشَاءُ ۖ وَلَا نُضِيعُ أَجْرَ الْمُحْسِنِينَ
ఈ విధంగా మేము యూసుఫ్‌కు (ఈజిప్టు రాజ్య) భూభాగంలో అధికారాన్ని ప్రసాదించాము. అక్కడ తాను కోరిన చోట నివసించే సౌలభ్యం అతనికి ఇచ్చాము. మేము కోరిన వారికి (ఇలాగే) మా కారుణ్య భాగ్యాన్ని ప్రసాదిస్తాము. సజ్జనుల పుణ్యఫలాన్ని మేము వృథా కానివ్వము.
12:57  وَلَأَجْرُ الْآخِرَةِ خَيْرٌ لِّلَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
విశ్వసించి, భయభక్తుల వైఖరిని అవలంబించిన వారి(కి లభించే) పరలోక పుణ్యఫలం చాలా శ్రేష్ఠమైనది.
12:58  وَجَاءَ إِخْوَةُ يُوسُفَ فَدَخَلُوا عَلَيْهِ فَعَرَفَهُمْ وَهُمْ لَهُ مُنكِرُونَ
యూసుఫ్‌ సోదరులు వచ్చి, అతని సమక్షంలో హాజరయ్యారు. అతను వాళ్ళను గుర్తుపట్టాడు గాని వాళ్ళు మాత్రం అతన్ని గుర్తుపట్టలేదు.
12:59  وَلَمَّا جَهَّزَهُم بِجَهَازِهِمْ قَالَ ائْتُونِي بِأَخٍ لَّكُم مِّنْ أَبِيكُمْ ۚ أَلَا تَرَوْنَ أَنِّي أُوفِي الْكَيْلَ وَأَنَا خَيْرُ الْمُنزِلِينَ
వారి సామానును సిద్ధం చేయించిన తరువాత, "(మరోసారి మీరు నావద్దకు వచ్చినప్పుడు), మీ తండ్రికి జన్మించిన మీ (సవతి) సోదరుణ్ణి కూడా తీసుకురండి. నేనెలా పూర్తిగా కొలిచి ఇస్తున్నానో, ఎంత చక్కగా అతిథి మర్యాద చేస్తున్నానో మీరు చూడటం లేదా!" అని అన్నాడు.
12:60  فَإِن لَّمْ تَأْتُونِي بِهِ فَلَا كَيْلَ لَكُمْ عِندِي وَلَا تَقْرَبُونِ
"మీరు గనక అతన్ని తీసుకురాని పక్షంలో నా తరఫున మీకు (ధాన్యం) కొలిచి ఇవ్వటం జరగదు. అసలు మీరు నా దరిదాపులకు కూడా రాకూడదు" (అని వారికి చెప్పాడు).
12:61  قَالُوا سَنُرَاوِدُ عَنْهُ أَبَاهُ وَإِنَّا لَفَاعِلُونَ
"సరే! అతని తండ్రి అతనిని పంపటానికి సమ్మతించేలా మేము ప్రయత్నం చేస్తాము. మేము అలా తప్పకుండా చేస్తాము" అని వారు సమాధానమిచ్చారు.
12:62  وَقَالَ لِفِتْيَانِهِ اجْعَلُوا بِضَاعَتَهُمْ فِي رِحَالِهِمْ لَعَلَّهُمْ يَعْرِفُونَهَا إِذَا انقَلَبُوا إِلَىٰ أَهْلِهِمْ لَعَلَّهُمْ يَرْجِعُونَ
"వారి మూలధనాన్ని (డబ్బును) వారి మూటలలోనే ఉంచండి. వారు తమ ఇంటి వారలవద్దకు పోయినప్పుడు, తమ మూల ధనాన్నిగుర్తించి బహుశా తిరిగివస్తారు" అని యూసుఫ్‌ తన సేవకులకు ఆజ్ఞాపిస్తూ చెప్పాడు.
12:63  فَلَمَّا رَجَعُوا إِلَىٰ أَبِيهِمْ قَالُوا يَا أَبَانَا مُنِعَ مِنَّا الْكَيْلُ فَأَرْسِلْ مَعَنَا أَخَانَا نَكْتَلْ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
వారు తిరిగి తమ తండ్రి వద్దకు వచ్చినప్పుడు, "నాన్నా! ఇక మీదట మనకు ధాన్యం కొలవటంపై ఆంక్ష విధించబడింది. కాబట్టి మేము కొలపాత్ర నిండా ధాన్యం తీసుకురావటానికి మీరు మా తమ్ముణ్ణి మా వెంట పంపండి. అతన్ని రక్షించే బాధ్యతమాది" అని విన్నవించుకున్నారు.
12:64  قَالَ هَلْ آمَنُكُمْ عَلَيْهِ إِلَّا كَمَا أَمِنتُكُمْ عَلَىٰ أَخِيهِ مِن قَبْلُ ۖ فَاللَّهُ خَيْرٌ حَافِظًا ۖ وَهُوَ أَرْحَمُ الرَّاحِمِينَ
"లోగడ ఇతని సోదరుని విషయంలో నేను మిమ్మల్ని నమ్మినట్లుగానే ఇతని విషయంలో కూడా నమ్మమంటున్నారు కదూ! అల్లాహ్‌యే అత్యుత్తమ రక్షకుడు. ఆయనే కరుణించే వారందరిలోకీ గొప్పకరుణాకరుడు" అని (యాఖూబ్‌) పలికాడు.
12:65  وَلَمَّا فَتَحُوا مَتَاعَهُمْ وَجَدُوا بِضَاعَتَهُمْ رُدَّتْ إِلَيْهِمْ ۖ قَالُوا يَا أَبَانَا مَا نَبْغِي ۖ هَٰذِهِ بِضَاعَتُنَا رُدَّتْ إِلَيْنَا ۖ وَنَمِيرُ أَهْلَنَا وَنَحْفَظُ أَخَانَا وَنَزْدَادُ كَيْلَ بَعِيرٍ ۖ ذَٰلِكَ كَيْلٌ يَسِيرٌ
వారు తమ సామాను విప్పినప్పుడు, తమ సొమ్ము తమకు వాపసు చేయబడిన సంగతి తెలుసుకున్నారు. "నాన్నగారూ! మనకు ఇంకేం కావాలి?! చూడండి, మన సొమ్ము కూడా మనకు వాపసు చేయబడింది. మళ్లీ వెళ్ళి మన కుటుంబంకోసం ఆహారపదార్థాలను తెచ్చుకుంటాం. మా తమ్ముణ్ణి కూడా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటాం. ఒక ఒంటె మోయగలిగేంత ధాన్యాన్ని అదనంగా తెచ్చుకుంటాం. ఈ పాటి కొలత (అదనపు ధాన్య ప్రాప్తి) చాలా తేలిక" అని ప్రాధేయపడ్డారు.
12:66  قَالَ لَنْ أُرْسِلَهُ مَعَكُمْ حَتَّىٰ تُؤْتُونِ مَوْثِقًا مِّنَ اللَّهِ لَتَأْتُنَّنِي بِهِ إِلَّا أَن يُحَاطَ بِكُمْ ۖ فَلَمَّا آتَوْهُ مَوْثِقَهُمْ قَالَ اللَّهُ عَلَىٰ مَا نَقُولُ وَكِيلٌ
"మీరతన్ని తిరిగి నా దగ్గరకు చేరుస్తామని దేవుని సాక్షిగా మాటిస్తే తప్ప, నేనతన్ని మీ వెంట పంపించను. ఒకవేళ మీరంతా నిర్బంధించబడితే అది వేరే విషయం" అని యాఖూబ్‌ (అలైహిస్సలాం) పలికాడు. అప్పుడు వారంతా ఆ మేరకు అతనికి మాటిచ్చారు. "మనం ఆడిన మాటలను అల్లాహ్‌ గమనిస్తూనే ఉన్నాడ"ని యాఖూబ్‌ అన్నాడు.
12:67  وَقَالَ يَا بَنِيَّ لَا تَدْخُلُوا مِن بَابٍ وَاحِدٍ وَادْخُلُوا مِنْ أَبْوَابٍ مُّتَفَرِّقَةٍ ۖ وَمَا أُغْنِي عَنكُم مِّنَ اللَّهِ مِن شَيْءٍ ۖ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّهِ ۖ عَلَيْهِ تَوَكَّلْتُ ۖ وَعَلَيْهِ فَلْيَتَوَكَّلِ الْمُتَوَكِّلُونَ
ఇంకా (యాఖూబ్‌) ఇలా ఉపదేశించాడు : "నా కుమారులారా! మీరంతా ఒకే ద్వారం గుండా (నగరంలోనికి) ప్రవేశించకండి. వేర్వేరు ద్వారాల గుండా వెళ్ళండి. అల్లాహ్‌ తరఫున మీపై విధించబడే ఏ విషయం నుంచి కూడా నేను మిమ్మల్ని తప్పించలేను. ఆయన ఆజ్ఞ మాత్రమే చెల్లుబాటవుతుంది. నేను పూర్తిగా ఆయన్నే నమ్ముకున్నాను. నమ్ముకునే వారంతా ఆయన్నే నమ్ముకోవాలి."
12:68  وَلَمَّا دَخَلُوا مِنْ حَيْثُ أَمَرَهُمْ أَبُوهُم مَّا كَانَ يُغْنِي عَنْهُم مِّنَ اللَّهِ مِن شَيْءٍ إِلَّا حَاجَةً فِي نَفْسِ يَعْقُوبَ قَضَاهَا ۚ وَإِنَّهُ لَذُو عِلْمٍ لِّمَا عَلَّمْنَاهُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
తమ తండ్రి ఆజ్ఞాపించిన మార్గాల ద్వారానే వారు (నగరంలోకి) ప్రవేశించారు. అల్లాహ్‌ నిర్థారించిన దాని నుండి యాఖూబ్‌ సుతారమూ వారిని తప్పించలేడు. కాకపోతే మనసులో జనించిన ఒక విషయాన్ని వెలిబుచ్చాడంతే. నిస్సందేహంగా అతను మేము నేర్పిన విద్య వల్ల జ్ఞాని అయిన వాడు. కాని చాలా మందికి తెలియదు.
12:69  وَلَمَّا دَخَلُوا عَلَىٰ يُوسُفَ آوَىٰ إِلَيْهِ أَخَاهُ ۖ قَالَ إِنِّي أَنَا أَخُوكَ فَلَا تَبْتَئِسْ بِمَا كَانُوا يَعْمَلُونَ
వారంతా యూసుఫ్‌ వద్దకు వెళ్ళినప్పుడు, అతను తన సోదరుణ్ణి (వేరుగా) తన దగ్గర కూర్చోబెట్టుకుని, "నేను నీ అన్నను (యూసుఫ్‌ను). కాబట్టి వీళ్ళ దుశ్చేష్టలపై నువ్వు బాధపడకు" అని ఓదార్చాడు.
12:70  فَلَمَّا جَهَّزَهُم بِجَهَازِهِمْ جَعَلَ السِّقَايَةَ فِي رَحْلِ أَخِيهِ ثُمَّ أَذَّنَ مُؤَذِّنٌ أَيَّتُهَا الْعِيرُ إِنَّكُمْ لَسَارِقُونَ
ఆ తరువాత వారి సామగ్రిని వారికిచ్చే ఏర్పాటు చేసి, తన (సొంత) సోదరుని సామానులో మాత్రం మంచి నీరు త్రాగే ఒక గిన్నెను ఉంచాడు. తరువాత పిలుపు ఇచ్చేవాడొకడు, "ఓ బిడారు జనులారా! మీరే ఈ దొంగతనం చేశారు" అని ఎలుగెత్తి మరీ చెప్పాడు.
12:71  قَالُوا وَأَقْبَلُوا عَلَيْهِم مَّاذَا تَفْقِدُونَ
వాళ్ళు వారి వైపుకు తిరిగి, "మీదే వస్తువు పోయిందీ?" అని అడిగారు.
12:72  قَالُوا نَفْقِدُ صُوَاعَ الْمَلِكِ وَلِمَن جَاءَ بِهِ حِمْلُ بَعِيرٍ وَأَنَا بِهِ زَعِيمٌ
"రాజు గారి గిన్నెపోయింది. దాన్ని తెచ్చిన వారికి ఒక ఒంటె బరువు ధాన్యం లభిస్తుంది. ఆ బాధ్యత నాది" అని చెప్పాడు.
12:73  قَالُوا تَاللَّهِ لَقَدْ عَلِمْتُم مَّا جِئْنَا لِنُفْسِدَ فِي الْأَرْضِ وَمَا كُنَّا سَارِقِينَ
"అల్లాహ్‌ తోడు! మేము రాజ్యంలో అరాచకాన్ని సృష్టించటానికి రాలేదు, మేము దొంగలం అంతకన్నాకాము. ఈ సంగతి మీకూ బాగాతెలుసు" అని వారు సమాధానమిచ్చారు.
12:74  قَالُوا فَمَا جَزَاؤُهُ إِن كُنتُمْ كَاذِبِينَ
"అలాగా. మరి మీ మాట అబద్ధమని తేలితే (దొంగిలించిన) అతనికి ఏ శిక్ష విధించాలి?" అని వారు (రాజభటులు) ప్రశ్నించారు.
12:75  قَالُوا جَزَاؤُهُ مَن وُجِدَ فِي رَحْلِهِ فَهُوَ جَزَاؤُهُ ۚ كَذَٰلِكَ نَجْزِي الظَّالِمِينَ
"ఎవరి సామానులో అది దొరుకుతుందో శిక్షగా అతనే (బానిసగా) ఉంచుకోబడాలి. మేము అలాంటి దుర్మార్గులకు విధించే శిక్ష ఇదే" అని వారు బదులిచ్చారు.
12:76  فَبَدَأَ بِأَوْعِيَتِهِمْ قَبْلَ وِعَاءِ أَخِيهِ ثُمَّ اسْتَخْرَجَهَا مِن وِعَاءِ أَخِيهِ ۚ كَذَٰلِكَ كِدْنَا لِيُوسُفَ ۖ مَا كَانَ لِيَأْخُذَ أَخَاهُ فِي دِينِ الْمَلِكِ إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ نَرْفَعُ دَرَجَاتٍ مَّن نَّشَاءُ ۗ وَفَوْقَ كُلِّ ذِي عِلْمٍ عَلِيمٌ
అప్పుడు యూసుఫ్‌ తన తమ్ముని సామానును సోదాచేసే ముందు వాళ్ళ సామానును సోదా చేశాడు. ఆ తరువాత ఆ పాత్రను తన తమ్ముని సంచిలో నుంచి తీశాడు. ఈ విధంగా మేము యూసుఫ్‌ కోసం ఉపాయం సూచించాము. ఎందుకంటే అల్లాహ్‌ తలిస్తే తప్ప - అక్కడి రాజు ధర్మం (రాజ్యశాసనం) ప్రకారం అతను తన తమ్ముణ్ణి తనతో ఆపుకోలేడు. మేము కోరిన వారి అంతస్థులను పెంచుతాము. ప్రతి జ్ఞానినీ మించిన జ్ఞాని ఒకడున్నాడు.
12:77  قَالُوا إِن يَسْرِقْ فَقَدْ سَرَقَ أَخٌ لَّهُ مِن قَبْلُ ۚ فَأَسَرَّهَا يُوسُفُ فِي نَفْسِهِ وَلَمْ يُبْدِهَا لَهُمْ ۚ قَالَ أَنتُمْ شَرٌّ مَّكَانًا ۖ وَاللَّهُ أَعْلَمُ بِمَا تَصِفُونَ
వాళ్ళు ఇలా అన్నారు: "ఇతను దొంగతనం చేశాడంటే (ఆశ్చర్యం చెందనవసరంలేదు), ఇంతకు ముందు ఇతని అన్న కూడా దొంగతనం చేసి ఉన్నాడు." వారి ఈ మాటను యూసుఫ్‌ లోలోపలే దిగమ్రింగాడు. తన మనోభావాన్ని వారి ముందు ఏ మాత్రం బయట పెట్టకుండానే, "మీరు ఇంతటి నీచ స్థితికి దిగజారారు! మీరు కల్పించి చెప్పే విషయాలు అల్లాహ్‌కు బాగా తెలుసు" అని (లోలోన) అనుకున్నాడు.
12:78  قَالُوا يَا أَيُّهَا الْعَزِيزُ إِنَّ لَهُ أَبًا شَيْخًا كَبِيرًا فَخُذْ أَحَدَنَا مَكَانَهُ ۖ إِنَّا نَرَاكَ مِنَ الْمُحْسِنِينَ
అప్పుడు వారు, "ఓ అజీజ్‌!(ఓ ఈజిప్టు అధినేతా!) ఇతని తండ్రి మరీ ముసలివాడు. మీరు ఇతనికి బదులుగా మాలో ఎవరినయినా సరే తీసేసుకోండి (ఇతన్ని మాత్రం విడిచిపెట్టండి). మీరు మాకు పుణ్యాత్మునిలా కనబడుతున్నారు" అని విన్నవించుకున్నారు.
12:79  قَالَ مَعَاذَ اللَّهِ أَن نَّأْخُذَ إِلَّا مَن وَجَدْنَا مَتَاعَنَا عِندَهُ إِنَّا إِذًا لَّظَالِمُونَ
"అల్లాహ్‌ శరణు! ఎవరి దగ్గర మా వస్తువు దొరికిందో అతన్ని వదిలేసి మరొకరిని ఎలా పట్టుకోగలం? అలా గనక చేస్తే మేము ముమ్మాటికీ అన్యాయస్థులం అవుతాము" అని యూసుఫ్‌ చెప్పాడు.
12:80  فَلَمَّا اسْتَيْأَسُوا مِنْهُ خَلَصُوا نَجِيًّا ۖ قَالَ كَبِيرُهُمْ أَلَمْ تَعْلَمُوا أَنَّ أَبَاكُمْ قَدْ أَخَذَ عَلَيْكُم مَّوْثِقًا مِّنَ اللَّهِ وَمِن قَبْلُ مَا فَرَّطتُمْ فِي يُوسُفَ ۖ فَلَنْ أَبْرَحَ الْأَرْضَ حَتَّىٰ يَأْذَنَ لِي أَبِي أَوْ يَحْكُمَ اللَّهُ لِي ۖ وَهُوَ خَيْرُ الْحَاكِمِينَ
వాళ్ళు అతని విషయంలో నిరాశ చెంది, ఏకాంతంలో కూర్చుని పరస్పరం సంప్రతించుకోసాగారు. వారిలో అందరి కన్నా పెద్దవాడు ఇలా అన్నాడు : "అల్లాహ్‌ పేరు మీద మీచేత ప్రమాణం చేయించి మీతండ్రి మీనుంచి మాట తీసుకున్న సంగతి మీకు తెలియదా? ఇంతకు ముందు మీరు యూసుఫ్‌ విషయంలో కూడా తప్పుచేసి ఉన్నారు. కాబట్టి! నాన్నగారు స్వయంగా నాకు అనుమతి ఇవ్వనంతవరకూ లేదా అల్లాహ్‌యే నా వ్యవహారంలో ఏదో ఒక తీర్పుచేయనంతవరకూ నేను ఈ భూభాగం నుంచి కదలను. ఆయన తీర్పుచేసే వారందరిలోకెల్లా ఉత్తముడు."
12:81  ارْجِعُوا إِلَىٰ أَبِيكُمْ فَقُولُوا يَا أَبَانَا إِنَّ ابْنَكَ سَرَقَ وَمَا شَهِدْنَا إِلَّا بِمَا عَلِمْنَا وَمَا كُنَّا لِلْغَيْبِ حَافِظِينَ
"మీరంతా నాన్నగారి దగ్గరకు తిరిగి వెళ్ళి ఇలా చెప్పండి: 'నాన్నగారూ! మీ కుమారుడు దొంగతనం చేశాడు. మేము మాకు తెలిసిన దాని గురించి మాత్రమే సాక్ష్యం ఇచ్చాము. అగోచర విషయాలను మేము కాపాడేవారముకాము!
12:82  وَاسْأَلِ الْقَرْيَةَ الَّتِي كُنَّا فِيهَا وَالْعِيرَ الَّتِي أَقْبَلْنَا فِيهَا ۖ وَإِنَّا لَصَادِقُونَ
కావాలంటే మేము విడిది చేసిన పట్టణవాసులను, తిరుగు ప్రయాణంలో మేము ఎవరితోపాటు తిరిగి వచ్చామో ఆ బిడారుజనులను కూడా అడిగి తెలుసుకోండి. మేము నిజం చెబుతున్నాము."
12:83  قَالَ بَلْ سَوَّلَتْ لَكُمْ أَنفُسُكُمْ أَمْرًا ۖ فَصَبْرٌ جَمِيلٌ ۖ عَسَى اللَّهُ أَن يَأْتِيَنِي بِهِمْ جَمِيعًا ۚ إِنَّهُ هُوَ الْعَلِيمُ الْحَكِيمُ
"కానేకాదు. ఇది మీ స్వీయకల్పన మాత్రమే. సరే, ఇప్పుడు ఓర్పు వహించడమే మంచిది. బహుశా అల్లాహ్‌ వారందరినీ త్వరలోనే నా దగ్గరకు చేర్చవచ్చు! నిశ్చయంగా ఆయన సర్వం తెలిసినవాడు, వివేచనాపరుడూను" అని (యాఖూబ్‌) చెప్పాడు.
12:84  وَتَوَلَّىٰ عَنْهُمْ وَقَالَ يَا أَسَفَىٰ عَلَىٰ يُوسُفَ وَابْيَضَّتْ عَيْنَاهُ مِنَ الْحُزْنِ فَهُوَ كَظِيمٌ
మరి వారందరి వైపునుంచి ముఖం త్రిప్పుకుని, (ఆవేదనతో) "ఆహ్‌! యూసుఫ్‌'' అన్నాడు. దుఃఖంతో ఆయన కళ్లు తెల్లగా పాలిపోయాయి. బాధను లోలోపలే అణచి పెట్టుకునేవాడు.
12:85  قَالُوا تَاللَّهِ تَفْتَأُ تَذْكُرُ يُوسُفَ حَتَّىٰ تَكُونَ حَرَضًا أَوْ تَكُونَ مِنَ الْهَالِكِينَ
కొడుకులు (తమ తండ్రినుద్దేశించి), "దైవసాక్షి! తమరు అనుక్షణం యూసుఫ్‌నే తలచుకుంటూ, కడకు ఆ బాధతోనే కృంగి కృశించి పోయేలా లేదా ప్రాణం విడిచేలా ఉన్నారే!" అని చెప్పారు.
12:86  قَالَ إِنَّمَا أَشْكُو بَثِّي وَحُزْنِي إِلَى اللَّهِ وَأَعْلَمُ مِنَ اللَّهِ مَا لَا تَعْلَمُونَ
"నేను నా ఆవేదనను,దుఃఖాన్ని గురించి నా దైవానికే ఫిర్యాదు చేసుకుంటున్నాను. అల్లాహ్‌ తరఫున మీకు తెలియని విషయాలు నాకు తెలుసు" అని దానికి ఆయన బదులిచ్చాడు.
12:87  يَا بَنِيَّ اذْهَبُوا فَتَحَسَّسُوا مِن يُوسُفَ وَأَخِيهِ وَلَا تَيْأَسُوا مِن رَّوْحِ اللَّهِ ۖ إِنَّهُ لَا يَيْأَسُ مِن رَّوْحِ اللَّهِ إِلَّا الْقَوْمُ الْكَافِرُونَ
"ఒరేయ్‌ అబ్బాయిలూ! మీరు వెళ్ళి యూసుఫ్‌ను గురించీ, అతని సోదరుని గురించీ బాగా దర్యాప్తు చేయండి. అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. అల్లాహ్‌ను తిరస్కరించిన వారు మాత్రమే ఆయన కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు" అని అన్నాడు.
12:88  فَلَمَّا دَخَلُوا عَلَيْهِ قَالُوا يَا أَيُّهَا الْعَزِيزُ مَسَّنَا وَأَهْلَنَا الضُّرُّ وَجِئْنَا بِبِضَاعَةٍ مُّزْجَاةٍ فَأَوْفِ لَنَا الْكَيْلَ وَتَصَدَّقْ عَلَيْنَا ۖ إِنَّ اللَّهَ يَجْزِي الْمُتَصَدِّقِينَ
తరువాత వారు యూసుఫ్‌ దగ్గరకు వెళ్ళి, "ఓ అజీజ్‌! (ఈజిప్టు అధినేతా!) మాకూ, మా కుటుంబానికీ గడ్డుకాలం వచ్చింది. మేము కొద్ది మొత్తాన్ని మాత్రమే తెచ్చాము. కనుక మాకు పూర్తి ధాన్యాన్నికొలచి ఇవ్వండి. మాకు దానం చెయ్యండి. అల్లాహ్‌ దానధర్మాలు చేసే వారికి తప్పకుండా మంచి ప్రతిఫలం ఇస్తాడు" అని అభ్యర్థించారు.
12:89  قَالَ هَلْ عَلِمْتُم مَّا فَعَلْتُم بِيُوسُفَ وَأَخِيهِ إِذْ أَنتُمْ جَاهِلُونَ
"అజ్ఞాన స్థితిలో మీరు యూసుఫ్‌ పట్లా, అతని సోదరునిపట్లా ఎలా వ్యవహరించారో మీకు తెలుసా?" అని యూసుఫ్‌ అడిగాడు.
12:90  قَالُوا أَإِنَّكَ لَأَنتَ يُوسُفُ ۖ قَالَ أَنَا يُوسُفُ وَهَٰذَا أَخِي ۖ قَدْ مَنَّ اللَّهُ عَلَيْنَا ۖ إِنَّهُ مَن يَتَّقِ وَيَصْبِرْ فَإِنَّ اللَّهَ لَا يُضِيعُ أَجْرَ الْمُحْسِنِينَ
"ఏమిటీ, (నిజంగా) నువ్వు యూసుఫువేనా?!" అని వారు ఆశ్చర్యపోయారు. "అవును. నేను యూసుఫ్‌నే. ఇతను (బిన్‌ యామిన్‌) నా సోదరుడు. అల్లాహ్‌ మాపై దయదలిచాడు. అసలు విషయం ఏమిటంటే భయభక్తులతో, సహన స్థయిర్యాలతో మెలిగే సజ్జనుల ప్రతిఫలాన్ని అల్లాహ్‌ వృధా పోనివ్వడు" అని యూసుఫ్‌ చెప్పాడు.
12:91  قَالُوا تَاللَّهِ لَقَدْ آثَرَكَ اللَّهُ عَلَيْنَا وَإِن كُنَّا لَخَاطِئِينَ
"దైవసాక్షి! దేవుడు నీకు మాపై ఔన్నత్యాన్ని ప్రసాదించాడు. ముమ్మాటికీ మేమే దోషులం" అని వారంతా చెప్పారు.
12:92  قَالَ لَا تَثْرِيبَ عَلَيْكُمُ الْيَوْمَ ۖ يَغْفِرُ اللَّهُ لَكُمْ ۖ وَهُوَ أَرْحَمُ الرَّاحِمِينَ
అప్పుడు యూసుఫ్‌, "ఈ రోజు మీపై ఎలాంటి నిందాలేదు. అల్లాహ్‌ మిమ్మల్ని క్షమించుగాక! ఆయన కరుణించే వారందరిలోకీ గొప్పగా కరుణించేవాడు."
12:93  اذْهَبُوا بِقَمِيصِي هَٰذَا فَأَلْقُوهُ عَلَىٰ وَجْهِ أَبِي يَأْتِ بَصِيرًا وَأْتُونِي بِأَهْلِكُمْ أَجْمَعِينَ
"నా ఈ చొక్కాను తీసుకెళ్ళి, నా తండ్రి ముఖంపై వేయండి. దాంతో ఆయనకు చూపు తిరిగి వస్తుంది. మరి మీ కుటుంబీకులందరినీ నా దగ్గరకు పిలుచుకురండి" అని చెప్పాడు.
12:94  وَلَمَّا فَصَلَتِ الْعِيرُ قَالَ أَبُوهُمْ إِنِّي لَأَجِدُ رِيحَ يُوسُفَ ۖ لَوْلَا أَن تُفَنِّدُونِ
(ఇక్కడ ఈజిప్టు నుంచి) ఈ బిడారు సెలవు తీసుకోగానే, (అక్కడ కన్‌ఆన్‌లో) "నాకు మతి భ్రమించిందని మీరు అనుకోనంటే (ఒక విషయం చెబుతాను) - నాకు యూసుఫ్‌ సువాసన వస్తోంది" అని తండ్రి చెప్పాడు.
12:95  قَالُوا تَاللَّهِ إِنَّكَ لَفِي ضَلَالِكَ الْقَدِيمِ
"అల్లాహ్‌ తోడు! మీరు ఇప్పటికీ ఆ పాతభ్రమలోనే పడి ఉన్నారు" అని అక్కడి వారు చెప్పారు.
12:96  فَلَمَّا أَن جَاءَ الْبَشِيرُ أَلْقَاهُ عَلَىٰ وَجْهِهِ فَارْتَدَّ بَصِيرًا ۖ قَالَ أَلَمْ أَقُل لَّكُمْ إِنِّي أَعْلَمُ مِنَ اللَّهِ مَا لَا تَعْلَمُونَ
ఆ తరువాత శుభవార్త అందించేవాడు వచ్చి అతని ముఖంపై ఆ చొక్కాను వేయగానే అతనికి కంటిచూపు వచ్చేసింది. "మీకు తెలియని విషయాలెన్నో అల్లాహ్‌ తరఫున నాకు తెలుసని నేను మీకు చెప్పలేదా?!" అన్నాడాయన.
12:97  قَالُوا يَا أَبَانَا اسْتَغْفِرْ لَنَا ذُنُوبَنَا إِنَّا كُنَّا خَاطِئِينَ
"ఓ నాన్నగారూ! మా పాపాల మన్నింపుకై (దైవసన్నిధిలో) అర్థించండి. మేము నిజంగానే దోషులం" అని వారు (కొడుకులు) విన్నవించుకున్నారు.
12:98  قَالَ سَوْفَ أَسْتَغْفِرُ لَكُمْ رَبِّي ۖ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
"సరే! త్వరలోనే నేను మీ మన్నింపుకోసం నా ప్రభువును వేడుకుంటాను. ఆయన అపారంగా మన్నించేవాడు, అమితంగా కరుణించేవాడు" అని అతను (యాఖూబ్‌) చెప్పాడు.
12:99  فَلَمَّا دَخَلُوا عَلَىٰ يُوسُفَ آوَىٰ إِلَيْهِ أَبَوَيْهِ وَقَالَ ادْخُلُوا مِصْرَ إِن شَاءَ اللَّهُ آمِنِينَ
తరువాత ఈ కుటుంబీకులంతా యూసుఫ్‌ వద్దకు చేరుకున్నప్పుడు, యూసుఫ్‌ తన తల్లిదండ్రులకు తన దగ్గర స్థానం ఇచ్చాడు. "అల్లాహ్‌కు సమ్మతమైనట్లయితే మీరంతా సురక్షితంగా ఈజిప్టులోకి వచ్చేయండి" అని అన్నాడు.
12:100  وَرَفَعَ أَبَوَيْهِ عَلَى الْعَرْشِ وَخَرُّوا لَهُ سُجَّدًا ۖ وَقَالَ يَا أَبَتِ هَٰذَا تَأْوِيلُ رُؤْيَايَ مِن قَبْلُ قَدْ جَعَلَهَا رَبِّي حَقًّا ۖ وَقَدْ أَحْسَنَ بِي إِذْ أَخْرَجَنِي مِنَ السِّجْنِ وَجَاءَ بِكُم مِّنَ الْبَدْوِ مِن بَعْدِ أَن نَّزَغَ الشَّيْطَانُ بَيْنِي وَبَيْنَ إِخْوَتِي ۚ إِنَّ رَبِّي لَطِيفٌ لِّمَا يَشَاءُ ۚ إِنَّهُ هُوَ الْعَلِيمُ الْحَكِيمُ
అతను తన తల్లిదండ్రులను ఎత్తయిన సింహాసనంపై కూర్చోబెట్టాడు. వారందరూ అతని ముందు సాష్టాంగపడ్డారు. అప్పుడు అతనిలా అన్నాడు : "నాన్నగారూ! పూర్వం నేను కన్నకలకు భావం ఇది. నా ప్రభువు దీన్ని నిజం చేసి చూపాడు. కారాగారం నుండి బయటకు తీసినపుడు ఆయన నాకు మహోపకారం చేశాడు. నాకూ - నా సోదరులకూ మధ్య షైతాన్‌ చిచ్చుపెట్టిన తరువాత అందరినీ ఎడారి ప్రాంతం నుంచి తీసుకొచ్చి కలిపాడు. నా ప్రభువు తన సంకల్పాన్ని ఎవరూ గ్రహించలేని యుక్తులద్వారా నెరవేరుస్తాడు. ఆయన అన్నీ తెలిసినవాడూ, వివేకవంతుడూను.
12:101  رَبِّ قَدْ آتَيْتَنِي مِنَ الْمُلْكِ وَعَلَّمْتَنِي مِن تَأْوِيلِ الْأَحَادِيثِ ۚ فَاطِرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ أَنتَ وَلِيِّي فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۖ تَوَفَّنِي مُسْلِمًا وَأَلْحِقْنِي بِالصَّالِحِينَ
"నా ప్రభూ! నీవు నాకు రాజ్యాన్ని ప్రసాదించావు. ఇంకా, నీవు నాకు కలల భావార్థాన్ని వివరించే విద్యను నేర్పావు. ఓ భూమ్యాకాశాల సృష్టికర్తా! ఇహంలోనూ, పరంలోనూ నువ్వే నా సంరక్షకుడవు. ముస్లింగా ఉన్న స్థితిలోనే నాకు మరణం వొసగు. నన్ను సజ్జనులలో చేర్చు" అని వేడుకున్నాడు.
12:102  ذَٰلِكَ مِنْ أَنبَاءِ الْغَيْبِ نُوحِيهِ إِلَيْكَ ۖ وَمَا كُنتَ لَدَيْهِمْ إِذْ أَجْمَعُوا أَمْرَهُمْ وَهُمْ يَمْكُرُونَ
(ఓ ముహమ్మద్‌!) ఇది అగోచర సమాచారాలలోనిది. దీన్ని మేము నీకు వహీ ద్వారా తెలియపరుస్తున్నాము. వారంతా కూడ బలుక్కుని, కుతంత్రం చేస్తున్నప్పుడు నువ్వు వారి దగ్గరలేవు.
12:103  وَمَا أَكْثَرُ النَّاسِ وَلَوْ حَرَصْتَ بِمُؤْمِنِينَ
నువ్వు ఎంతగా పరితపించినా వారిలో చాలామంది విశ్వసించేవారు కారు.
12:104  وَمَا تَسْأَلُهُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۚ إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ
ఈ పనికి గాను నువ్వు వారి నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ(వేతనాన్ని) అడగటంలేదు. ఇది సమస్త జగతికీ ఒక హితబోధ.
12:105  وَكَأَيِّن مِّنْ آيَةٍ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ يَمُرُّونَ عَلَيْهَا وَهُمْ عَنْهَا مُعْرِضُونَ
ఆకాశాలలో, భూమిలో ఎన్నో సూచనలున్నాయి. కాని వారు వాటిని పట్టించుకోకుండానే సాగిపోతుంటారు.
12:106  وَمَا يُؤْمِنُ أَكْثَرُهُم بِاللَّهِ إِلَّا وَهُم مُّشْرِكُونَ
వారిలో చాలామంది అల్లాహ్‌ను విశ్వసిస్తూ కూడా ఆయనతోపాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతున్నారు.
12:107  أَفَأَمِنُوا أَن تَأْتِيَهُمْ غَاشِيَةٌ مِّنْ عَذَابِ اللَّهِ أَوْ تَأْتِيَهُمُ السَّاعَةُ بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ
ఏమిటీ, దైవశిక్షలలో ఏ శిక్ష కూడా తమపై వచ్చిపడదనీ, అకస్మాత్తుగా – తమకు తెలియకుండా - ప్రళయం విరుచుకుపడదని వారునిశ్చింతగా ఉన్నారా?
12:108  قُلْ هَٰذِهِ سَبِيلِي أَدْعُو إِلَى اللَّهِ ۚ عَلَىٰ بَصِيرَةٍ أَنَا وَمَنِ اتَّبَعَنِي ۖ وَسُبْحَانَ اللَّهِ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ
(ఓ ప్రవక్తా!) నువ్వు వాళ్ళకు చెప్పేయి : "నా మార్గమైతే ఇదే. నేనూ, నా అనుయాయులూ పూర్తి అవగాహనతో, దృఢనమ్మకంతో అల్లాహ్‌ వైపుకు పిలుస్తున్నాము. అల్లాహ్‌ పరమపవిత్రుడు. నేను, అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించే (షిర్క్‌ చేసే) వారిలోనివాణ్ణికాను."
12:109  وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ إِلَّا رِجَالًا نُّوحِي إِلَيْهِم مِّنْ أَهْلِ الْقُرَىٰ ۗ أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ ۗ وَلَدَارُ الْآخِرَةِ خَيْرٌ لِّلَّذِينَ اتَّقَوْا ۗ أَفَلَا تَعْقِلُونَ
(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము పట్టణవాసుల్లో నుంచి పంపిన ప్రవక్తలందరూ పురుషులే. వారి వద్దకు మేము వహీ పంపుతూ ఉండేవాళ్ళం. ఏమిటీ, తమకు పూర్వం గతించిన వారికథ ఎలా ముగిసిందో వీళ్ళు భూమిపై సంచరించి చూడలేదా? నిశ్చయంగా భయభక్తులు గలవారికి పరలోక నిలయం ఎంతోమేలైనది. అయినా మీరు అర్థం చేసుకోరా?!
12:110  حَتَّىٰ إِذَا اسْتَيْأَسَ الرُّسُلُ وَظَنُّوا أَنَّهُمْ قَدْ كُذِبُوا جَاءَهُمْ نَصْرُنَا فَنُجِّيَ مَن نَّشَاءُ ۖ وَلَا يُرَدُّ بَأْسُنَا عَنِ الْقَوْمِ الْمُجْرِمِينَ
చివరకు ప్రవక్తలు ఆశలు వదులుకోగా, తమతో అబద్ధం చెప్పబడిందని వారు (జాతి జనులు) ఊహాగానాలు చేస్తుండగా, అకస్మాత్తుగా వారికి (ప్రవక్తలకు) మా తోడ్పాటు అందింది. మరి మేము కోరిన వారిని కాపాడాము. అసలు విషయం ఏమిటంటే మా శిక్ష అపరాధ జనుల నుంచి తొలగించబడదు.
12:111  لَقَدْ كَانَ فِي قَصَصِهِمْ عِبْرَةٌ لِّأُولِي الْأَلْبَابِ ۗ مَا كَانَ حَدِيثًا يُفْتَرَىٰ وَلَٰكِن تَصْدِيقَ الَّذِي بَيْنَ يَدَيْهِ وَتَفْصِيلَ كُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ
నిశ్చయంగా వీరి (ఈ జాతుల) గాథలలో విజ్ఞతగల వారికి గుణపాఠం ఉంది. ఈ ఖుర్‌ఆన్‌ కల్పితమైన విషయం ఎంతమాత్రం కాదు. పైగా ఇది తనకు పూర్వం ఉన్న గ్రంథాలను ధ్రువీకరిస్తుంది, ప్రతి విషయాన్నీ స్పష్టంగా విడమరచి చెబుతుంది. విశ్వసించే జనులకు ఇది సన్మార్గం, కారుణ్యం.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.