aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

11. సూరా హూద్

11:1  الر ۚ كِتَابٌ أُحْكِمَتْ آيَاتُهُ ثُمَّ فُصِّلَتْ مِن لَّدُنْ حَكِيمٍ خَبِيرٍ
అలిఫ్‌-లామ్‌-రా. ఇది ఒక గ్రంథం. దీని వాక్యాలు నిర్దుష్టమైనవిగా చేయబడ్డాయి. అవి వివేచనాపరుడు, సర్వం ఎరిగిన వాని తరఫు నుండి స్పష్టంగా విశదీకరించబడ్డాయి.
11:2  أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ ۚ إِنَّنِي لَكُم مِّنْهُ نَذِيرٌ وَبَشِيرٌ
అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించరాదు (అని వాటిలో చెప్పబడింది). నేను ఆయన తరఫున మిమ్మల్ని భయపెట్టేవాడిని, మీకు శుభవార్తను వినిపించేవాడిని.
11:3  وَأَنِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُمَتِّعْكُم مَّتَاعًا حَسَنًا إِلَىٰ أَجَلٍ مُّسَمًّى وَيُؤْتِ كُلَّ ذِي فَضْلٍ فَضْلَهُ ۖ وَإِن تَوَلَّوْا فَإِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ كَبِيرٍ
ఇంకా మీరు మీతప్పుల మన్నింపుకోసం మీప్రభువును వేడుకోండి. తర్వాత (పశ్చాత్తాపంతో) ఆయన వైపుకే మరలండి. ఒక నిర్థారిత కాలం వరకూ ఆయన మీకు మంచి (జీవన) సామగ్రిని సమకూరుస్తాడు. ఎక్కువగా ఆచరణచేసే ప్రతిఒక్కరికీ ఎక్కువ పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఒకవేళ మీరు గనక విముఖత ప్రదర్శించిన పక్షంలో ఒకానొక మహాదినాన మిమ్మల్ని చుట్టుముట్టే శిక్ష గురించి నేను భయపడుతున్నాను.
11:4  إِلَى اللَّهِ مَرْجِعُكُمْ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
మీరు మరలిపోవలసింది అల్లాహ్‌ వద్దకే. ఆయన అన్నింటిపై అధికారం కలవాడు.
11:5  أَلَا إِنَّهُمْ يَثْنُونَ صُدُورَهُمْ لِيَسْتَخْفُوا مِنْهُ ۚ أَلَا حِينَ يَسْتَغْشُونَ ثِيَابَهُمْ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
వారు తమ (గోప్య) విషయాలను (అల్లాహ్‌ నుండి) రహస్యంగా పెట్టడానికి తమ రొమ్ములను ముడుచుకుంటున్నారు. వినండి! వారు బట్టలతో తమను తాము కప్పుకున్నప్పుడు కూడా వారు దాచేదీ, బయల్పరచేదీ, అంతా ఆయన తెలుసుకుంటాడు. నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టును సయితం ఎరిగినవాడు.
11:6  وَمَا مِن دَابَّةٍ فِي الْأَرْضِ إِلَّا عَلَى اللَّهِ رِزْقُهَا وَيَعْلَمُ مُسْتَقَرَّهَا وَمُسْتَوْدَعَهَا ۚ كُلٌّ فِي كِتَابٍ مُّبِينٍ
భూమిలో సంచరించే ప్రాణులన్నింటికీ ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాహ్‌దే. అవి ఆగి ఉండే, అప్పగించబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు. అవన్నీ స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉన్నాయి.
11:7  وَهُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ وَكَانَ عَرْشُهُ عَلَى الْمَاءِ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا ۗ وَلَئِن قُلْتَ إِنَّكُم مَّبْعُوثُونَ مِن بَعْدِ الْمَوْتِ لَيَقُولَنَّ الَّذِينَ كَفَرُوا إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ
మీలో మంచి పనులు చేసే వారెవరూ పరీక్షించే నిమిత్తం ఆయన ఆరు రోజులలో ఆకాశాలనూ, భూమినీ సృష్టించాడు. (అంతకుముందు) ఆయన సింహాసనం (అర్ష్‌) నీటిపై ఉండేది. "మీరు చనిపోయిన తరువాత మళ్లీలేపబడతారు" అని నువ్వు వారికి చెప్పావంటే, "ఇది పచ్చి ఇంద్రజాలం తప్ప మరొకటి కాదు" అని అవిశ్వాసులు తప్పకుండా సమాధానమిస్తారు.
11:8  وَلَئِنْ أَخَّرْنَا عَنْهُمُ الْعَذَابَ إِلَىٰ أُمَّةٍ مَّعْدُودَةٍ لَّيَقُولُنَّ مَا يَحْبِسُهُ ۗ أَلَا يَوْمَ يَأْتِيهِمْ لَيْسَ مَصْرُوفًا عَنْهُمْ وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
ఒకవేళ మేము వారికి పడే శిక్షను కొంత వ్యవధి వరకు వాయిదా వేస్తే, "ఆ శిక్ష పడకుండా అడ్డుకుంటున్న వస్తువు ఏది?" అంటారు. వినండి! అది వచ్చిపడిన రోజువారి నుంచి అది తొలగిపోవటం అనేది జరగదు. దేని గురించి వారు పరిహసించేవారో అదే వారిని చుట్టుముడుతుంది.
11:9  وَلَئِنْ أَذَقْنَا الْإِنسَانَ مِنَّا رَحْمَةً ثُمَّ نَزَعْنَاهَا مِنْهُ إِنَّهُ لَيَئُوسٌ كَفُورٌ
మేము మనిషికి ఏదైనా మాకారుణ్యం రుచిని చూపి, దాన్ని గనక అతన్నుంచి తిరిగి తీసేసుకుంటే అతను నిరాశ చెందుతాడు; కృతఘ్నుడుగా మారిపోతాడు.
11:10  وَلَئِنْ أَذَقْنَاهُ نَعْمَاءَ بَعْدَ ضَرَّاءَ مَسَّتْهُ لَيَقُولَنَّ ذَهَبَ السَّيِّئَاتُ عَنِّي ۚ إِنَّهُ لَفَرِحٌ فَخُورٌ
అతనికి కలిగిన కష్టాల తరువాత మేము గనక అతనికే దైనాఅనుగ్రహం రుచిచూపితే, "(హమ్మయ్య!) నా దురవస్థలన్నీ దూరమైపోయాయి" అని అంటాడు. నిశ్చయంగా అతడు మిడిసి పడతాడు. గొప్పలు చెప్పుకుంటాడు.
11:11  إِلَّا الَّذِينَ صَبَرُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ
అయితే సహనం వహించి, మంచిపనులు చేసేవారు మాత్రం అటువంటి వారు కారు. ఇలాంటి వారికోసమే మన్నింపూ, గొప్పపుణ్యఫలమూ ఉన్నాయి.
11:12  فَلَعَلَّكَ تَارِكٌ بَعْضَ مَا يُوحَىٰ إِلَيْكَ وَضَائِقٌ بِهِ صَدْرُكَ أَن يَقُولُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ كَنزٌ أَوْ جَاءَ مَعَهُ مَلَكٌ ۚ إِنَّمَا أَنتَ نَذِيرٌ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ وَكِيلٌ
(ఓప్రవక్తా!) బహుశా నీవద్దకు పంపబడే వహీలో ఏదైనా భాగాన్నివదలివేస్తావేమో! "ఇతని పైధనాగారం ఎందుకు అవతరించలేదు? పోనీ, ఇతనితో పాటు దైవదూత అయినా ఎందుకు రాలేదు?" అని వారు చెప్పే మాటలు నీకు మనస్తాపం కలిగించినట్లున్నాయి. చూడు! నువ్వు భయపెట్టేవాడివి మాత్రమే. అన్ని విషయాలకు బాధ్యుడు అల్లాహ్‌.
11:13  أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ فَأْتُوا بِعَشْرِ سُوَرٍ مِّثْلِهِ مُفْتَرَيَاتٍ وَادْعُوا مَنِ اسْتَطَعْتُم مِّن دُونِ اللَّهِ إِن كُنتُمْ صَادِقِينَ
ఏమిటీ, అతనే (ప్రవక్తే) ఈ ఖురానును కల్పించుకున్నాడని వాళ్ళంటున్నారా? "మరైతే మీరు కూడా ఇలాంటి పది సూరాలు కల్పించి తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే, అల్లాహ్‌ను తప్ప మీరు పిలువగలిగితే దీని సహాయం కోసం ఎవరినైనా పిలుచుకోండి" అని (ఓప్రవక్తా!) వారికిచెప్పు.
11:14  فَإِلَّمْ يَسْتَجِيبُوا لَكُمْ فَاعْلَمُوا أَنَّمَا أُنزِلَ بِعِلْمِ اللَّهِ وَأَن لَّا إِلَٰهَ إِلَّا هُوَ ۖ فَهَلْ أَنتُم مُّسْلِمُونَ
మరి వారు గనక మీ సవాలును స్వీకరించకపోతే, ఈ ఖుర్‌ఆన్‌ దైవజ్ఞానంతో అవతరింపజేయబడిందనీ, ఆయన తప్ప మరో ఆరాధ్యదైవం లేనే లేడని తెలుసుకోండి. మరి ఇప్పుడైనా మీరు ముస్లింలవుతారా?
11:15  مَن كَانَ يُرِيدُ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا نُوَفِّ إِلَيْهِمْ أَعْمَالَهُمْ فِيهَا وَهُمْ فِيهَا لَا يُبْخَسُونَ
ఎవరయితే ప్రాపంచిక జీవితం పట్ల, దాని అందచందాల పట్ల వ్యామోహితులవుతున్నారో అలాంటి వారికి వారి కర్మలను (వాటి ఫలితాన్ని) మేము ఇక్కడే పూర్తిగా ఇచ్చేస్తాము. ఇక్కడ (ప్రపంచంలో) వారికి ఏ లోటూ జరగదు.
11:16  أُولَٰئِكَ الَّذِينَ لَيْسَ لَهُمْ فِي الْآخِرَةِ إِلَّا النَّارُ ۖ وَحَبِطَ مَا صَنَعُوا فِيهَا وَبَاطِلٌ مَّا كَانُوا يَعْمَلُونَ
అయితే అలాంటి వారికి పరలోకంలో అగ్ని తప్ప మరేమీ లభించదు. ప్రపంచంలో వారు చేసుకున్నదంతా వృథా అయిపోతుంది. వారు చేసే పనులన్నీ మిథ్యగా మారిపోతాయి.
11:17  أَفَمَن كَانَ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّهِ وَيَتْلُوهُ شَاهِدٌ مِّنْهُ وَمِن قَبْلِهِ كِتَابُ مُوسَىٰ إِمَامًا وَرَحْمَةً ۚ أُولَٰئِكَ يُؤْمِنُونَ بِهِ ۚ وَمَن يَكْفُرْ بِهِ مِنَ الْأَحْزَابِ فَالنَّارُ مَوْعِدُهُ ۚ فَلَا تَكُ فِي مِرْيَةٍ مِّنْهُ ۚ إِنَّهُ الْحَقُّ مِن رَّبِّكَ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُونَ
ఒక వ్యక్తి తన ప్రభువు తరఫు నుండి వచ్చిన నిదర్శనాన్ని కలిగివున్నాడు, దాంతో పాటు అల్లాహ్‌ వద్ద నుంచి వచ్చిన దానిని సాక్షిగా కలిగి ఉన్నాడు,అంతకుమునుపు మార్గదర్శకంగా, కారుణ్యంగా ఉన్న మూసా గ్రంథాన్ని (కూడా సాక్షిగా) కలిగి ఉన్నాడు. అటువంటి వ్యక్తి (ఇతరులతో ఎలాసమానుడవుతాడు?) ఇలాంటి వారే దానిని (ఖుర్‌ఆన్‌ను) విశ్వసిస్తారు. అన్ని వర్గాలలోనూ ఎవరెవరు దానిని త్రోసిపుచ్చుతారో – వారికి వాగ్దానం చెయ్యబడిన – గమ్యస్థానం నరకం. కనుక (ఓప్రవక్తా!) దీని విషయంలో నువ్వు ఎలాంటి సందేహానికి లోను కారాదు. నిస్సందేహంగా ఇది నీప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యం. కాని చాలా మంది (ఈ సత్యాన్ని) విశ్వసించరు.
11:18  وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا ۚ أُولَٰئِكَ يُعْرَضُونَ عَلَىٰ رَبِّهِمْ وَيَقُولُ الْأَشْهَادُ هَٰؤُلَاءِ الَّذِينَ كَذَبُوا عَلَىٰ رَبِّهِمْ ۚ أَلَا لَعْنَةُ اللَّهِ عَلَى الظَّالِمِينَ
అల్లాహ్‌కు అబద్ధాన్ని అంటగట్టే వాడికన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి వారంతా తమ ప్రభువు సమక్షంలో హాజరు పరచబడతారు. "తమ ప్రభువుపై అసత్యాలను కల్పించిన వారు వీళ్ళే" అని సాక్షులు సాక్ష్యమిస్తారు. వినండి! (అలాంటి) దుర్మార్గుల పై దేవుని శాపం పడుతుంది.
11:19  الَّذِينَ يَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ وَيَبْغُونَهَا عِوَجًا وَهُم بِالْآخِرَةِ هُمْ كَافِرُونَ
వారు దైవమార్గం నుంచి (జనులను) ఆపుతారు. అందులో వక్రతను వెతుకుతారు – వారే పరలోకాన్ని తిరస్కరించేవారు.
11:20  أُولَٰئِكَ لَمْ يَكُونُوا مُعْجِزِينَ فِي الْأَرْضِ وَمَا كَانَ لَهُم مِّن دُونِ اللَّهِ مِنْ أَوْلِيَاءَ ۘ يُضَاعَفُ لَهُمُ الْعَذَابُ ۚ مَا كَانُوا يَسْتَطِيعُونَ السَّمْعَ وَمَا كَانُوا يُبْصِرُونَ
వారు భూమిపై (అల్లాహ్‌ను) నిస్సహాయుని గానూ చేయలేక పోయారు, అల్లాహ్‌కు వ్యతిరేకంగా వారిని సమర్థించేవారు కూడా లేకపోయారు. వారికి విధించబడే శిక్ష రెండింతలు చేయబడుతుంది. వారు వినగలిగే వారూ కాదు, చూడగలిగే వారూ కాదు.
11:21  أُولَٰئِكَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ
తమను తాము స్వయంగా నష్టానికి గురి చేసుకున్న వారు వీరే. వారు కల్పించుకున్నదంతా వారి నుండి మటు మాయమై పోయింది.
11:22  لَا جَرَمَ أَنَّهُمْ فِي الْآخِرَةِ هُمُ الْأَخْسَرُونَ
నిశ్చయంగా పరలోకంలో అందరికన్నా ఘోరంగా నష్టపోయేవారంటే వారే.
11:23  إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَأَخْبَتُوا إِلَىٰ رَبِّهِمْ أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
ఇకపోతే విశ్వసించి మంచి పనులు చేసిన వారూ, తమ ప్రభువు వైపుకు మొగ్గిన వారూ – వారే స్వర్గవాసులు. అందులో వారు కలకాలం ఉంటారు.
11:24  مَثَلُ الْفَرِيقَيْنِ كَالْأَعْمَىٰ وَالْأَصَمِّ وَالْبَصِيرِ وَالسَّمِيعِ ۚ هَلْ يَسْتَوِيَانِ مَثَلًا ۚ أَفَلَا تَذَكَّرُونَ
ఈ రెండు వర్గాల ఉదాహరణ ఇలా ఉంది: వారిలో ఒకడు గుడ్డివాడు, చెవిటివాడు. మరొకడు చూడగలిగే, వినగలిగేవాడు – వీరిద్దరూ పోలికలో సమానులవుతారా? అయినా మీరు గుణపాఠం గ్రహించరే?!
11:25  وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ إِنِّي لَكُمْ نَذِيرٌ مُّبِينٌ
మేము నూహు (అలైహిస్సలాం)ను ప్రవక్తగా చేసి అతని జాతి వద్దకు పంపాము. "నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడను.
11:26  أَن لَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ ۖ إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ أَلِيمٍ
"మీరు అల్లాహ్‌ను తప్ప మరొకరిని ఆరాధించకండి. మీరు బాధాకరమైన దినాన శిక్షించబడతారేమోనన్న భయం నాకుంది" (అని అతను చెప్పాడు.)
11:27  فَقَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِن قَوْمِهِ مَا نَرَاكَ إِلَّا بَشَرًا مِّثْلَنَا وَمَا نَرَاكَ اتَّبَعَكَ إِلَّا الَّذِينَ هُمْ أَرَاذِلُنَا بَادِيَ الرَّأْيِ وَمَا نَرَىٰ لَكُمْ عَلَيْنَا مِن فَضْلٍ بَلْ نَظُنُّكُمْ كَاذِبِينَ
అప్పుడు అతని జాతికి చెందిన అవిశ్వాసుల సర్దారులు ఇలా సమాధానమిచ్చారు: "మా దృష్టిలో నువ్వు మాలాంటి ఒక మానవ మాత్రుడివే తప్ప మరేమీ కావు. ఇంకా మేము గమనిస్తున్నాము, మాలోని అల్పులైనవారే ఆలోచించకుండా, అర్థంచేసుకోకుండా నిన్ను అనుసరిస్తున్నారు. కనుక మాపై మీకెలాంటి ప్రాధాన్యతగాని ఉన్నట్లు కానరావటంలేదు. పైగా మేము మిమ్మల్ని అబద్ధాలకోరులుగా భావిస్తున్నాము."
11:28  قَالَ يَا قَوْمِ أَرَأَيْتُمْ إِن كُنتُ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّي وَآتَانِي رَحْمَةً مِّنْ عِندِهِ فَعُمِّيَتْ عَلَيْكُمْ أَنُلْزِمُكُمُوهَا وَأَنتُمْ لَهَا كَارِهُونَ
నూహ్‌ ఇలా అన్నాడు: "నాజాతి వారలారా! ఒకవేళ నేను నాప్రభువు తరఫున వచ్చిన స్పష్టమైన నిదర్శనంపై ఉండి, ఆయన నాకు తన ప్రత్యేక కారుణ్య భాగాన్ని కూడా కలుగ జేసి ఉండి, అది మీకు కనిపించకపోతే (నేనేం చేయను?!) మీకిష్టం లేకపోయినా బలవంతంగా మేము దాన్ని మీ మీద ఎలా రుద్దగలం?
11:29  وَيَا قَوْمِ لَا أَسْأَلُكُمْ عَلَيْهِ مَالًا ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى اللَّهِ ۚ وَمَا أَنَا بِطَارِدِ الَّذِينَ آمَنُوا ۚ إِنَّهُم مُّلَاقُو رَبِّهِمْ وَلَٰكِنِّي أَرَاكُمْ قَوْمًا تَجْهَلُونَ
"నా జాతి ప్రజలారా! ఈ కర్తవ్య నిర్వహణకు గాను నేను మీనుంచి ఎలాంటి ధనాన్నీ కోరటం లేదు. నా ప్రతిఫలమైతే అల్లాహ్‌ వద్ద ఉంది. నేను విశ్వాసులను నావద్ద నుంచి గెంటి వేయలేను. వారెలాగూ తమ ప్రభువును కలుసుకోవలసిన వాళ్ళే. కాని మీరు మాత్రం నాకు అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
11:30  وَيَا قَوْمِ مَن يَنصُرُنِي مِنَ اللَّهِ إِن طَرَدتُّهُمْ ۚ أَفَلَا تَذَكَّرُونَ
"నాజాతి జనులారా! ఒకవేళ నేను వారిని నావద్ద నుంచి గెంటి వేసినట్లయితే, అల్లాహ్‌కు వ్యతిరేకంగా నాకు సహాయపడే వాడెవడుంటాడు? మీరు బొత్తిగా హితబోధను గ్రహించరా?
11:31  وَلَا أَقُولُ لَكُمْ عِندِي خَزَائِنُ اللَّهِ وَلَا أَعْلَمُ الْغَيْبَ وَلَا أَقُولُ إِنِّي مَلَكٌ وَلَا أَقُولُ لِلَّذِينَ تَزْدَرِي أَعْيُنُكُمْ لَن يُؤْتِيَهُمُ اللَّهُ خَيْرًا ۖ اللَّهُ أَعْلَمُ بِمَا فِي أَنفُسِهِمْ ۖ إِنِّي إِذًا لَّمِنَ الظَّالِمِينَ
"నా దగ్గర అల్లాహ్‌ నిధులున్నాయని నేను మీతో అనటం లేదే! (వినండి!) నాదగ్గర అగోచర జ్ఞానం కూడా లేదు. నేను దైవదూతనని కూడా అనటం లేదు. మీరు చిన్న చూపు చూస్తున్న వారికి అల్లాహ్‌ ఏమేలూ చెయ్యబోడని కూడా నేను చెప్పటం లేదు. వారి ఆంతర్యాలలో ఉన్న దానిని అల్లాహ్‌ బాగా ఎరిగినవాడు. ఒకవేళ నేను గనక అలాంటి మాట ఏదైనా అంటే నేనూ దుర్మార్గుల్లో ఒకడిగా పరిగణించబడతాను."
11:32  قَالُوا يَا نُوحُ قَدْ جَادَلْتَنَا فَأَكْثَرْتَ جِدَالَنَا فَأْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
"ఓ నూహ్‌! నువ్వు మాతో వాదించావు. మరీ మరీ వాదించావు. మరి నువ్వు సత్యవంతుడవే అయితే మమ్మల్ని హెచ్చరించే దానిని (శిక్షను) తీసుకురా" అని అతని జాతి వారు అన్నారు.
11:33  قَالَ إِنَّمَا يَأْتِيكُم بِهِ اللَّهُ إِن شَاءَ وَمَا أَنتُم بِمُعْجِزِينَ
"దానిని తెచ్చేవాడు కూడా అల్లాహ్‌యే, ఆయన గనక తలచుకుంటే (తెచ్చి తీరుతాడు). మీరు మాత్రం ఆయన్ని ఓడించలేరు.
11:34  وَلَا يَنفَعُكُمْ نُصْحِي إِنْ أَرَدتُّ أَنْ أَنصَحَ لَكُمْ إِن كَانَ اللَّهُ يُرِيدُ أَن يُغْوِيَكُمْ ۚ هُوَ رَبُّكُمْ وَإِلَيْهِ تُرْجَعُونَ
"అల్లాహ్‌ మిమ్మల్ని అపమార్గాన వదిలేయదలచుకుంటే నేను మీశ్రేయాన్ని ఎంతగా అభిలషించినా నా శ్రేయోభిలాష మీకే విధంగానూ ఉపకరించదు. ఆయనే మీ అందరి ప్రభువు. ఆయన వైపునకే మీరంతా మరలించబడతారు" అని (నూహు) సమాధానమిచ్చాడు.
11:35  أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ إِنِ افْتَرَيْتُهُ فَعَلَيَّ إِجْرَامِي وَأَنَا بَرِيءٌ مِّمَّا تُجْرِمُونَ
ఏమిటీ, అతను (ముహమ్మదు) స్వయంగా దీనిని (ఖుర్‌ఆన్‌ను) కల్పించుకున్నాడని వాళ్లంటున్నారా? (ఓ ముహమ్మద్‌!) వారికి చెప్పు: "ఒకవేళ నేనే గనక దాన్ని కల్పించుకుని ఉంటే నానేరం నాపై పడుతుంది. మీరు చేస్తున్న నేరానికి మాత్రం నేను బాధ్యుణ్ణి కాను."
11:36  وَأُوحِيَ إِلَىٰ نُوحٍ أَنَّهُ لَن يُؤْمِنَ مِن قَوْمِكَ إِلَّا مَن قَدْ آمَنَ فَلَا تَبْتَئِسْ بِمَا كَانُوا يَفْعَلُونَ
"నీ జాతివారిలో (ఇంత వరకూ) విశ్వసించిన వారు తప్ప, ఇక మీదట ఎవరూ విశ్వసించబోరు. కాబట్టి నువ్వు వారి చేష్టలపై దుఃఖించకు" అని నూహు వద్దకు వహీ పంపబడింది.
11:37  وَاصْنَعِ الْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا وَلَا تُخَاطِبْنِي فِي الَّذِينَ ظَلَمُوا ۚ إِنَّهُم مُّغْرَقُونَ
"మాకళ్ల ముందరే, మా వహీ అనుసారం ఒక ఓడను తయారుచెయ్యి. మాముందు దుర్మార్గుల ఊసు ఎత్తకు. వారంతా ఎలాగూ ముంచి వేయబడేవారే" (అని అల్లాహ్‌ సెలవిచ్చాడు).
11:38  وَيَصْنَعُ الْفُلْكَ وَكُلَّمَا مَرَّ عَلَيْهِ مَلَأٌ مِّن قَوْمِهِ سَخِرُوا مِنْهُ ۚ قَالَ إِن تَسْخَرُوا مِنَّا فَإِنَّا نَسْخَرُ مِنكُمْ كَمَا تَسْخَرُونَ
అతను (నూహు) ఓడ నిర్మాణంలో నిమగ్నుడయ్యాడు. అతని జాతి నాయకులలో అతని వద్ద నుంచి సాగిపోయే వారంతా అతన్ని ఎగతాళి చేసేవారు. "మీరు మాస్థితిపై నవ్విపోతున్నారా? మీరు మాస్థితిపై నవ్విపోతున్నట్లే మేము కూడా ఒకనాడు మీస్థితిపై నవ్వుతాము.
11:39  فَسَوْفَ تَعْلَمُونَ مَن يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَيَحِلُّ عَلَيْهِ عَذَابٌ مُّقِيمٌ
"పరాభవానికి గురిచేసే శిక్ష, శాశ్వతంగా ఉండే శిక్ష ఎవరిపై వచ్చిపడుతుందో అతి త్వరలోనే మీకు తెలిసిపోతుంది" అని నూహు పలికాడు.
11:40  حَتَّىٰ إِذَا جَاءَ أَمْرُنَا وَفَارَ التَّنُّورُ قُلْنَا احْمِلْ فِيهَا مِن كُلٍّ زَوْجَيْنِ اثْنَيْنِ وَأَهْلَكَ إِلَّا مَن سَبَقَ عَلَيْهِ الْقَوْلُ وَمَنْ آمَنَ ۚ وَمَا آمَنَ مَعَهُ إِلَّا قَلِيلٌ
తుదకు మాఆదేశం వచ్చి, పొయ్యి పొంగినప్పుడు, "ఈ ఓడలోకి ప్రతి (జీవ)రాసి నుంచి రెండేసి (ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువు) చొప్పున ఎక్కించుకో. నీ ఇంటి వారలను కూడా తీసుకో. ఎవరి విషయంలోనయితే ముందుగానే మాట ఖరారయిందో వారిని వదిలేయి. ఇంకా విశ్వాసులందరిని కూడా ఎక్కించుకో" అని మేము (అతనికి) చెప్పాము. అయితే అతనితో బాటు విశ్వసించిన వారు బహుకొద్ది మంది మాత్రమే.
11:41  وَقَالَ ارْكَبُوا فِيهَا بِسْمِ اللَّهِ مَجْرَاهَا وَمُرْسَاهَا ۚ إِنَّ رَبِّي لَغَفُورٌ رَّحِيمٌ
"మీరు ఈ ఓడలో కూర్చోండి, అల్లాహ్‌ పేరుతోనే, దీని గమనం, దీనిఆగటం. నిశ్చయంగా నాప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు" అని (నూహు) అన్నాడు.
11:42  وَهِيَ تَجْرِي بِهِمْ فِي مَوْجٍ كَالْجِبَالِ وَنَادَىٰ نُوحٌ ابْنَهُ وَكَانَ فِي مَعْزِلٍ يَا بُنَيَّ ارْكَب مَّعَنَا وَلَا تَكُن مَّعَ الْكَافِرِينَ
ఆ ఓడ వారిని పర్వతాల్లాంటి అలల్లో నుంచి తీసుకుపోసాగింది. నూహ్‌ (అలైహిస్సలాం) ఒడ్డున ఉన్న తన కుమారుణ్ణి ఉద్దేశించి, "ఒరేయ్‌ నాయనా! మాతో పాటే వచ్చి కూర్చోరా. అవిశ్వాసులతో వెళ్ళకురా" అని బిగ్గరగా పిలిచాడు.
11:43  قَالَ سَآوِي إِلَىٰ جَبَلٍ يَعْصِمُنِي مِنَ الْمَاءِ ۚ قَالَ لَا عَاصِمَ الْيَوْمَ مِنْ أَمْرِ اللَّهِ إِلَّا مَن رَّحِمَ ۚ وَحَالَ بَيْنَهُمَا الْمَوْجُ فَكَانَ مِنَ الْمُغْرَقِينَ
దానికి వాడు, "(నాన్నా!) నేను ఏదయినా ఒక పెద్ద పర్వతాన్ని ఆశ్రయిస్తాను. అది నన్ను ఈ నీళ్ళ నుంచి కాపాడుతుంది" అని జవాబిచ్చాడు. "అల్లాహ్‌ ఉత్తర్వు నుండి ఈ రోజు కాపాడేవాడెవడూలేడురా! అల్లాహ్‌ తాను దయదలచిన వారిని మాత్రమే కాపాడతాడు" అని నూహ్‌ చెప్పాడు. అంతలోనే వారిద్దరి మధ్యా ఒక అల అడ్డుగా వచ్చింది. అంతే! వాడు కూడా ముంపుకు గురైన వారిలో చేరిపోయాడు.
11:44  وَقِيلَ يَا أَرْضُ ابْلَعِي مَاءَكِ وَيَا سَمَاءُ أَقْلِعِي وَغِيضَ الْمَاءُ وَقُضِيَ الْأَمْرُ وَاسْتَوَتْ عَلَى الْجُودِيِّ ۖ وَقِيلَ بُعْدًا لِّلْقَوْمِ الظَّالِمِينَ
"ఓ భూమీ! నీ నీళ్ళంతటినీ మ్రింగెయ్యి. ఓ ఆకాశమా! ఇక ఆగిపో (కురిసింది చాలు)!" అని సెలవీయబడింది. అప్పటికప్పుడే నీరంతా ఇంకిపోయింది. కావలసిన పని పూర్తయింది. ఓడ 'జూదీ' పర్వతంపై నిలిచింది. "దుర్మార్గులు (దేవుని) అభిశాపానికి గురవుదురుగాక!" అని సెలవీయబడింది.
11:45  وَنَادَىٰ نُوحٌ رَّبَّهُ فَقَالَ رَبِّ إِنَّ ابْنِي مِنْ أَهْلِي وَإِنَّ وَعْدَكَ الْحَقُّ وَأَنتَ أَحْكَمُ الْحَاكِمِينَ
నూహ్‌ (అలైహిస్సలాం) తన ప్రభువును పిలుస్తూ, "నా ప్రభూ! నా కుమారుడు కూడా నా కుటుంబీకుడే కదా! నిశ్చయంగా నీవాగ్దానం సత్యమైనది. నీవు పాలకుల్లోకెల్లా గొప్ప పాలకుడవు" అని విన్నవించుకున్నాడు.
11:46  قَالَ يَا نُوحُ إِنَّهُ لَيْسَ مِنْ أَهْلِكَ ۖ إِنَّهُ عَمَلٌ غَيْرُ صَالِحٍ ۖ فَلَا تَسْأَلْنِ مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ ۖ إِنِّي أَعِظُكَ أَن تَكُونَ مِنَ الْجَاهِلِينَ
దీనికి సమాధానంగా, "ఓ నూహు! ముమ్మాటికీ వాడు నీ కుటుంబీకుడుకాడు. వాడి పనులు ఏమాత్రం మంచివి కావు. నీకు తెలియని వాటి గురించి నన్ను అడగకు. (ఈ విధంగా అడిగి) నువ్వు అజ్ఞానులలో ఒకడివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నాను" అని అల్లాహ్‌ అన్నాడు.
11:47  قَالَ رَبِّ إِنِّي أَعُوذُ بِكَ أَنْ أَسْأَلَكَ مَا لَيْسَ لِي بِهِ عِلْمٌ ۖ وَإِلَّا تَغْفِرْ لِي وَتَرْحَمْنِي أَكُن مِّنَ الْخَاسِرِينَ
"నా ప్రభూ! నాకు తెలియని దాని గురించి నిన్ను అర్థించటం నుండి నీ శరణు వేడుతున్నాను. నీవు గనక నన్ను క్షమించి దయదలచకపోతే నేను నష్టపోయేవారిలో చేరిపోతాను" అని నూహు అభ్యర్థించాడు.
11:48  قِيلَ يَا نُوحُ اهْبِطْ بِسَلَامٍ مِّنَّا وَبَرَكَاتٍ عَلَيْكَ وَعَلَىٰ أُمَمٍ مِّمَّن مَّعَكَ ۚ وَأُمَمٌ سَنُمَتِّعُهُمْ ثُمَّ يَمَسُّهُم مِّنَّا عَذَابٌ أَلِيمٌ
అప్పుడు ఈ విధంగా సెలవీయబడింది: "ఓ నూహు! మా తరఫు నుండి ప్రశాంతంగా దిగు. నీపైన, నీతోటి వారిపైన శుభాలు కలుగుతాయి. ఇంకా అనేక సమూహాలకు కూడా మేము తప్పకుండా లాభం చేకూర్చుతాము. కాని తర్వాత వారికి మా తరఫున బాధాకరమైన శిక్ష కూడా పడుతుంది."
11:49  تِلْكَ مِنْ أَنبَاءِ الْغَيْبِ نُوحِيهَا إِلَيْكَ ۖ مَا كُنتَ تَعْلَمُهَا أَنتَ وَلَا قَوْمُكَ مِن قَبْلِ هَٰذَا ۖ فَاصْبِرْ ۖ إِنَّ الْعَاقِبَةَ لِلْمُتَّقِينَ
(ఓ ముహమ్మద్‌!) ఇవి అగోచర సమాచారాలు. వీటిని మేము నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇంతకు మునుపు నీకు గానీ, నీజాతి వారికి గానీ వీటి గురించి ఏమీ తెలియదు. కనుక నీవు ఓర్పు వహిస్తూ ఉండు, నిస్సందేహంగా సత్ఫలితం భయభక్తులు గలవారికే లభిస్తుంది.
11:50  وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۚ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ إِنْ أَنتُمْ إِلَّا مُفْتَرُونَ
మరి మేము ఆద్‌ జాతి వైపుకు వారి సోదరుడైన హూద్‌ను పంపాము. అతను (తన వారినుద్దేశించి) ఇలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మీరు కల్పించేవన్నీ అబద్ధాలు తప్ప మరేమీ కావు."
11:51  يَا قَوْمِ لَا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى الَّذِي فَطَرَنِي ۚ أَفَلَا تَعْقِلُونَ
"ఓ నాజాతి ప్రజలారా! ఈ పనికై నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత నన్నుసృష్టించిన వానిదే. అయినప్పటికీ మీరు వివేకవంతులుగా వ్యవహరించరే?!"
11:52  وَيَا قَوْمِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا وَيَزِدْكُمْ قُوَّةً إِلَىٰ قُوَّتِكُمْ وَلَا تَتَوَلَّوْا مُجْرِمِينَ
"ఓ నా జాతి వారలారా! మీ పోషకుని (అంటే అల్లాహ్‌) సమక్షంలో మీ తప్పుల మన్నింపుకై ప్రార్థించండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. ఆయన మీపై (ఆకాశం నుండి) ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీకున్న బలిమికి మరింత శక్తినీ, బలాన్నీ చేకూరుస్తాడు. మీరు మాత్రం అపరాధులుగా తిరిగిపోకండి."
11:53  قَالُوا يَا هُودُ مَا جِئْتَنَا بِبَيِّنَةٍ وَمَا نَحْنُ بِتَارِكِي آلِهَتِنَا عَن قَوْلِكَ وَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِينَ
దానికి వారు, "ఓ హూద్‌! నువ్వు మావద్దకు ఏ నిదర్శనాన్నీ తేలేదు. నువ్వు (నోటితో) చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదలి పెట్టలేము. నిన్ను మేము విశ్వసించబోవటం లేదు.
11:54  إِن نَّقُولُ إِلَّا اعْتَرَاكَ بَعْضُ آلِهَتِنَا بِسُوءٍ ۗ قَالَ إِنِّي أُشْهِدُ اللَّهَ وَاشْهَدُوا أَنِّي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ
పైగా మా ఆరాధ్య దైవాలలో ఎవరో నిన్ను ఏదైనా వ్యాధికి గురిచేసి ఉంటారని మేము అనుకుంటున్నాము" అని పలికారు. అప్పుడు హూద్‌ ఇలా సమాధానమిచ్చాడు: "అల్లాహ్‌ తప్ప మీరు భాగస్వాములుగా నిలబెట్టే వారందరితో నేను విసుగెత్తి పోయాను. (వారితో నాకెలాంటి సంబంధం లేదు). నేను ఈ విషయానికి అల్లాహ్‌ను సాక్షిగా పెడుతున్నాను, మీరు కూడా దీనికి సాక్షులుగా ఉండండి."
11:55  مِن دُونِهِ ۖ فَكِيدُونِي جَمِيعًا ثُمَّ لَا تُنظِرُونِ
"సరే. మీరంతా కలసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి. నాకు ఏమాత్రం కూడా గడువు ఇవ్వకండి.
11:56  إِنِّي تَوَكَّلْتُ عَلَى اللَّهِ رَبِّي وَرَبِّكُم ۚ مَّا مِن دَابَّةٍ إِلَّا هُوَ آخِذٌ بِنَاصِيَتِهَا ۚ إِنَّ رَبِّي عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
"నేను కేవలం అల్లాహ్‌నే నమ్ముకున్నాను. ఆయన నాకూ ప్రభువే. మీ అందరికీ ప్రభువే. ప్రతి ప్రాణి యొక్క జుట్టు ఆయన చేతిలోనే ఉంది. నిశ్చయంగా నా ప్రభువు సన్మార్గాన ఉన్నాడు.
11:57  فَإِن تَوَلَّوْا فَقَدْ أَبْلَغْتُكُم مَّا أُرْسِلْتُ بِهِ إِلَيْكُمْ ۚ وَيَسْتَخْلِفُ رَبِّي قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّونَهُ شَيْئًا ۚ إِنَّ رَبِّي عَلَىٰ كُلِّ شَيْءٍ حَفِيظٌ
ఒకవేళ మీరు మరలి పోదలిస్తే (పొండి), నేను మాత్రం నాకిచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేశాను. నా ప్రభువు మీ స్థానంలో ఇంకొకరిని తీసుకువస్తాడు. మీరు ఆయనకు ఏవిధమైన కీడూ కలిగించలేరు. నిస్సందేహంగా నా ప్రభువు అన్నింటినీ పర్యవేక్షిస్తున్నాడు.''
11:58  وَلَمَّا جَاءَ أَمْرُنَا نَجَّيْنَا هُودًا وَالَّذِينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَنَجَّيْنَاهُم مِّنْ عَذَابٍ غَلِيظٍ
మరి మా ఆజ్ఞ (అమల్లోకి) వచ్చినప్పుడు మేము హూద్‌నూ, అతనితో పాటు విశ్వసించిన అతని సహచరులనూ మా ప్రత్యేక కృపతో కాపాడాము. ఘోరమైన శిక్ష నుంచి వారిని రక్షించాము.
11:59  وَتِلْكَ عَادٌ ۖ جَحَدُوا بِآيَاتِ رَبِّهِمْ وَعَصَوْا رُسُلَهُ وَاتَّبَعُوا أَمْرَ كُلِّ جَبَّارٍ عَنِيدٍ
ఇదీ ఆద్‌ జాతి (వృత్తాంతం). వీరు తమ ప్రభువు ఆయతులను త్రోసి పుచ్చారు. ఆయన ప్రవక్తల పట్ల అవిధేయతకు పాల్పడ్డారు. ఇంకా అహంకారి, అవిధేయీ అయిన ప్రతివ్యక్తినీ వారు అనుసరించారు.
11:60  وَأُتْبِعُوا فِي هَٰذِهِ الدُّنْيَا لَعْنَةً وَيَوْمَ الْقِيَامَةِ ۗ أَلَا إِنَّ عَادًا كَفَرُوا رَبَّهُمْ ۗ أَلَا بُعْدًا لِّعَادٍ قَوْمِ هُودٍ
ప్రపంచంలోనూ వారికి శాపం అంటగట్టబడింది. ప్రళయదినాన కూడా అది (వారిని) వెన్నంటి ఉంటుంది. చూడండి! ఆద్‌ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. హూద్‌ జాతి వారైన ఆదు జనులు (దైవ కారుణ్యానికి) దూరం చెయ్యబడ్డారు.
11:61  وَإِلَىٰ ثَمُودَ أَخَاهُمْ صَالِحًا ۚ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ هُوَ أَنشَأَكُم مِّنَ الْأَرْضِ وَاسْتَعْمَرَكُمْ فِيهَا فَاسْتَغْفِرُوهُ ثُمَّ تُوبُوا إِلَيْهِ ۚ إِنَّ رَبِّي قَرِيبٌ مُّجِيبٌ
మరి సమూద్‌ జాతి వైపుకు వారి సోదరుడైన సాలిహ్‌ను పంపాము. అతను (వారినుద్దేశించి), "ఓ నా జాతి వారలారా! మీరు అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి పుట్టించి, అందులో మిమ్మల్ని వసింపజేశాడు. కాబట్టి మీరు మన్నింపు కోసం ఆయన్నే వేడుకోండి, ఆయన వైపుకే మరలండి (పశ్చాత్తాపం చెందండి). నిశ్చయంగా నా ప్రభువు చాలా సమీపంలో ఉన్నాడు. ఆయన ప్రార్థనలను ఆలకించి ఆమోదిస్తాడు" అని చెప్పాడు.
11:62  قَالُوا يَا صَالِحُ قَدْ كُنتَ فِينَا مَرْجُوًّا قَبْلَ هَٰذَا ۖ أَتَنْهَانَا أَن نَّعْبُدَ مَا يَعْبُدُ آبَاؤُنَا وَإِنَّنَا لَفِي شَكٍّ مِّمَّا تَدْعُونَا إِلَيْهِ مُرِيبٍ
(దానికి సమాధానంగా వారు) ఇలా అన్నారు: "ఓ సాలిహ్‌! ఇంతకు మునుపు వరకూ మేము నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. ఏమిటీ, మా తాతముత్తాతలు పూజిస్తూ వచ్చిన వారిని పూజించకుండా నువ్వు మమ్మల్ని ఆపుతున్నావా?! నువ్వు మమ్మల్ని ఏ ధర్మం వైపుకు పిలుస్తున్నావో దానిపై మాకు తీవ్రమయిన సందేహం ఉంది."
11:63  قَالَ يَا قَوْمِ أَرَأَيْتُمْ إِن كُنتُ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّي وَآتَانِي مِنْهُ رَحْمَةً فَمَن يَنصُرُنِي مِنَ اللَّهِ إِنْ عَصَيْتُهُ ۖ فَمَا تَزِيدُونَنِي غَيْرَ تَخْسِيرٍ
"ఓ నా జాతి ప్రజలారా! మీరే చెప్పండి, నేను నా ప్రభువు తరఫున ఒక బలమైన నిదర్శనాన్ని పొంది ఉండి, ఆయన నాకు తన కారుణ్యాన్ని కూడా ప్రసాదించి ఉండగా, నేను ఆయన పట్ల అవిధేయతను కనబరిస్తే ఆయనకు వ్యతిరేకంగా నన్ను ఆదుకోగలవాడెవడు? మీరు నాకు మరింత నష్టాన్ని కలిగించటం తప్ప ఏమీ చెయ్యలేరు."
11:64  وَيَا قَوْمِ هَٰذِهِ نَاقَةُ اللَّهِ لَكُمْ آيَةً فَذَرُوهَا تَأْكُلْ فِي أَرْضِ اللَّهِ وَلَا تَمَسُّوهَا بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذَابٌ قَرِيبٌ
"ఓ నా జాతి వారలారా! అల్లాహ్‌ మీ కోసం ఒక సూచనగా పంపిన ఆడ ఒంటె ఇది. మీరు ఈ ఒంటెను అల్లాహ్‌ భూమిపై స్వేచ్ఛగా మేస్తూ తిరిగేలా వదిలిపెట్టండి. దానికి ఎలాంటి కీడూ తలపెట్టకండి. మీరు గనక దాని జోలికి పోయారంటే తొందరగానే శిక్ష మీపై విరుచుకుపడుతుంది" అని సాలిహ్‌ వారికి చెప్పాడు.
11:65  فَعَقَرُوهَا فَقَالَ تَمَتَّعُوا فِي دَارِكُمْ ثَلَاثَةَ أَيَّامٍ ۖ ذَٰلِكَ وَعْدٌ غَيْرُ مَكْذُوبٍ
అయినా సరే వారు ఆ ఒంటె కాళ్ళను నరికేశారు. అప్పుడు సాలిహ్‌ "మీరు మీ ఇళ్ళల్లో మూడు రోజుల పాటు ఉండి జీవితాన్ని అనుభవించండి. ఈ వాగ్దానం (నిర్థారిత గడువు) అబద్ధం కానేరదు" అని చెప్పాడు.
11:66  فَلَمَّا جَاءَ أَمْرُنَا نَجَّيْنَا صَالِحًا وَالَّذِينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَمِنْ خِزْيِ يَوْمِئِذٍ ۗ إِنَّ رَبَّكَ هُوَ الْقَوِيُّ الْعَزِيزُ
మరి మా ఉత్తర్వు (అమలు పరచబడే సమయం) ఆసన్నమైనప్పుడు మేము సాలిహ్‌ను, అతనితోపాటు విశ్వాసులను మాకారుణ్యంతో కాపాడాము. ఆ దినపు అవమానం నుంచి కూడా వారిని రక్షించాము. నిస్సందేహంగా నీ ప్రభువు బలవంతుడు, ఆధిక్యతగలవాడు.
11:67  وَأَخَذَ الَّذِينَ ظَلَمُوا الصَّيْحَةُ فَأَصْبَحُوا فِي دِيَارِهِمْ جَاثِمِينَ
ఇకపోతే దుర్మార్గులను భయంకరమైన అరుపు ఒకటి కబళించింది. దాంతో వారు తమ ఇళ్ళల్లోనే సాగిలపడి (చచ్చి)పోయారు -
11:68  كَأَن لَّمْ يَغْنَوْا فِيهَا ۗ أَلَا إِنَّ ثَمُودَ كَفَرُوا رَبَّهُمْ ۗ أَلَا بُعْدًا لِّثَمُودَ
-అసలు వారెప్పుడూ అక్కడ నివసించనే లేదన్నట్లుగా! తెలుసుకోండి! సమూద్‌ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. తెలుసుకోండి! సమూద్‌ జాతి వారు (దైవకారుణ్యానికి) దూరం చేయబడ్డారు.
11:69  وَلَقَدْ جَاءَتْ رُسُلُنَا إِبْرَاهِيمَ بِالْبُشْرَىٰ قَالُوا سَلَامًا ۖ قَالَ سَلَامٌ ۖ فَمَا لَبِثَ أَن جَاءَ بِعِجْلٍ حَنِيذٍ
మా ద్వారా పంపబడిన దూతలు శుభవార్తను మోసుకుని ఇబ్రాహీము దగ్గరకు వెళ్ళారు. అతనికి 'సలామ్‌' చేశారు. అతను కూడా 'ప్రతి సలాం' చేశాడు. మరి అతను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేపిన ఆవుదూడను తెచ్చాడు.
11:70  فَلَمَّا رَأَىٰ أَيْدِيَهُمْ لَا تَصِلُ إِلَيْهِ نَكِرَهُمْ وَأَوْجَسَ مِنْهُمْ خِيفَةً ۚ قَالُوا لَا تَخَفْ إِنَّا أُرْسِلْنَا إِلَىٰ قَوْمِ لُوطٍ
అయితే వారి చేతులు దాని వైపుకు చేరకపోవటం చూసి అతను వారిని శంకించాడు. లోలోపలే భయపడసాగాడు. అప్పుడువారు, "భయపడకు. మేము లూత్‌ జాతి వైపుకు పంపబడ్డాము" అన్నారు.
11:71  وَامْرَأَتُهُ قَائِمَةٌ فَضَحِكَتْ فَبَشَّرْنَاهَا بِإِسْحَاقَ وَمِن وَرَاءِ إِسْحَاقَ يَعْقُوبَ
అక్కడ నిలబడి ఉన్న అతని భార్య నవ్వేసింది. ఆ సమయంలో మేము ఆమెకు ఇస్‌హాఖ్‌ గురించి, ఇస్‌హాఖు తరువాత యాఖూబు గురించిన శుభవార్తను వినిపించాము.
11:72  قَالَتْ يَا وَيْلَتَىٰ أَأَلِدُ وَأَنَا عَجُوزٌ وَهَٰذَا بَعْلِي شَيْخًا ۖ إِنَّ هَٰذَا لَشَيْءٌ عَجِيبٌ
"అయ్యో! నా దౌర్భాగ్యం! నేను ముసలిదాన్ని. నా భర్త కూడా వృద్ధుడే. అయినా నాకు సంతానం కలుగుతుందా? ఇదేదో వింతగా ఉందే!" అని ఆమె అన్నది.
11:73  قَالُوا أَتَعْجَبِينَ مِنْ أَمْرِ اللَّهِ ۖ رَحْمَتُ اللَّهِ وَبَرَكَاتُهُ عَلَيْكُمْ أَهْلَ الْبَيْتِ ۚ إِنَّهُ حَمِيدٌ مَّجِيدٌ
దానికి దైవదూతలు, "నువ్వు దైవ శక్తి పట్ల ఆశ్చర్యపడుతున్నావా?! (ఇబ్రాహీము) ఇంటివారలారా! మీపై అల్లాహ్‌ కారుణ్యం, ఆయన శుభాలు కురియుగాక! నిశ్చయంగా ఆయన స్తుతించదగినవాడు, మహాఘనత కలవాడు" అని చెప్పారు.
11:74  فَلَمَّا ذَهَبَ عَنْ إِبْرَاهِيمَ الرَّوْعُ وَجَاءَتْهُ الْبُشْرَىٰ يُجَادِلُنَا فِي قَوْمِ لُوطٍ
ఇబ్రాహీము భయాందోళనలు తొలగిపోయి, శుభవార్త కూడా అతనికి అందిన మీదట, అతను లూత్‌ జాతి వారి విషయంలో మాతో వాదించసాగాడు.
11:75  إِنَّ إِبْرَاهِيمَ لَحَلِيمٌ أَوَّاهٌ مُّنِيبٌ
నిశ్చయంగా ఇబ్రాహీం ఎంతో సహనశీలి. మృదుమనస్కుడు. నమ్రతతో అల్లాహ్‌ వైపుకు మరలేవాడు.
11:76  يَا إِبْرَاهِيمُ أَعْرِضْ عَنْ هَٰذَا ۖ إِنَّهُ قَدْ جَاءَ أَمْرُ رَبِّكَ ۖ وَإِنَّهُمْ آتِيهِمْ عَذَابٌ غَيْرُ مَرْدُودٍ
"ఓ ఇబ్రాహీం! ఈ ఆలోచనను వదలిపెట్టు. నీ ప్రభువు ఉత్తర్వు వచ్చేసింది. ఎవరూ తప్పించలేని శిక్ష వారిపై వచ్చి పడటం తథ్యం" (అని దైవదూతలు పలికారు).
11:77  وَلَمَّا جَاءَتْ رُسُلُنَا لُوطًا سِيءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالَ هَٰذَا يَوْمٌ عَصِيبٌ
మేము పంపిన దూతలు లూత్‌ వద్దకు చేరుకున్నప్పుడు వారి రాకపై అతను దుఃఖవదనుడయ్యాడు. లోలోపలే కుంచించుకుపోతూ, "ఇది చాలా గడ్డురోజు" అని అన్నాడు.
11:78  وَجَاءَهُ قَوْمُهُ يُهْرَعُونَ إِلَيْهِ وَمِن قَبْلُ كَانُوا يَعْمَلُونَ السَّيِّئَاتِ ۚ قَالَ يَا قَوْمِ هَٰؤُلَاءِ بَنَاتِي هُنَّ أَطْهَرُ لَكُمْ ۖ فَاتَّقُوا اللَّهَ وَلَا تُخْزُونِ فِي ضَيْفِي ۖ أَلَيْسَ مِنكُمْ رَجُلٌ رَّشِيدٌ
(మరో వైపు నుంచి) అతని జాతి వారు పరుగులు తీస్తూ అతని వద్దకు వచ్చారు. వారు మొదటి నుంచే ఇటువంటి నీచపు పనులు చేస్తుండేవారు. "నా జాతి ప్రజలారా! ఇదిగో, నా కూతుళ్ళు ఉన్నారు. మీకొరకు వీరు పరిశుద్ధులు. మీరు అల్లాహ్‌కు భయపడండి. నా అతిథుల విషయంలో నన్నునవ్వుల పాలు చెయ్యకండి. ఏమిటీ, మీలో ఒక్కరైనా మంచివాడు లేడా?" అని లూతు నచ్చజెప్పాడు.
11:79  قَالُوا لَقَدْ عَلِمْتَ مَا لَنَا فِي بَنَاتِكَ مِنْ حَقٍّ وَإِنَّكَ لَتَعْلَمُ مَا نُرِيدُ
"నీ కూతుళ్ళపై మాకెలాంటి హక్కులేదన్న సంగతి నీకు బాగా తెలుసు. మా కిష్టమైనది ఏదో కూడా నీకు తెలుసు కదా!" అని వారు సమాధానమిచ్చారు.
11:80  قَالَ لَوْ أَنَّ لِي بِكُمْ قُوَّةً أَوْ آوِي إِلَىٰ رُكْنٍ شَدِيدٍ
"(అయ్యో!) మిమ్మల్ని ప్రతిఘటించే బలం నాకుంటే ఎంత బావుండేది! లేదా నేను ఆశ్రయం పొందటానికి ఏదైనా దృఢమైన ఆధారం ఉంటే ఎంత బావుండేది!" అని లూత్‌ అన్నాడు.
11:81  قَالُوا يَا لُوطُ إِنَّا رُسُلُ رَبِّكَ لَن يَصِلُوا إِلَيْكَ ۖ فَأَسْرِ بِأَهْلِكَ بِقِطْعٍ مِّنَ اللَّيْلِ وَلَا يَلْتَفِتْ مِنكُمْ أَحَدٌ إِلَّا امْرَأَتَكَ ۖ إِنَّهُ مُصِيبُهَا مَا أَصَابَهُمْ ۚ إِنَّ مَوْعِدَهُمُ الصُّبْحُ ۚ أَلَيْسَ الصُّبْحُ بِقَرِيبٍ
అప్పుడు దైవదూతలు "ఓ లూత్‌! మేము నీ ప్రభువు తరఫున పంపబడిన వారము. వారు నీదాకా రాలేరు. కాబట్టి నువ్వు నీ ఇంటి వారిని తీసుకుని కొంత రాత్రి ఉండగానే బయలుదేరు. మీలో ఎవరూ వెనుతిరిగి చూడకూడదు. అయితే నీభార్య; వారందరికీ పట్టేగతే ఆవిడకూ పట్టనున్నది. వారికోసం ఉదయ సమయం నిశ్చయించబడింది. ఏమిటీ, ఉదయసమయం దగ్గరలో లేదా?" అని పలికారు.
11:82  فَلَمَّا جَاءَ أَمْرُنَا جَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهَا حِجَارَةً مِّن سِجِّيلٍ مَّنضُودٍ
మరి మా ఉత్తర్వు (ను అమలుపరచే సమయం) రాగానే ఆబస్తీని తలక్రిందులుగా చేసేసి, వారిపై నిరాఘాటంగా గులకరాళ్ళను కురిపించాము.
11:83  مُّسَوَّمَةً عِندَ رَبِّكَ ۖ وَمَا هِيَ مِنَ الظَّالِمِينَ بِبَعِيدٍ
అవి నీ ప్రభువు తరఫున గుర్తు వేయబడినవి. అవి ఈ దుర్మార్గులకు ఎంతో దూరానలేవు.
11:84  وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا ۚ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ وَلَا تَنقُصُوا الْمِكْيَالَ وَالْمِيزَانَ ۚ إِنِّي أَرَاكُم بِخَيْرٍ وَإِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ مُّحِيطٍ
ఇంకా మేము మద్‌యన్‌ వారి వైపుకు వారి సోదరుడగు షుఐబ్‌ను పంపాము. అతనిలా ప్రబోధించాడు : "ఓ నా జాతిప్రజలారా! అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీ ఆరాధ్య దేవుడెవడూ లేడు. కొలతలు తూనికలలో తగ్గించి ఇవ్వకండి. మీరు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నట్టు చూస్తున్నాను. మీ విషయంలో చుట్టుముట్టే దినపు శిక్ష గురించి నేను భయపడుతున్నాను.
11:85  وَيَا قَوْمِ أَوْفُوا الْمِكْيَالَ وَالْمِيزَانَ بِالْقِسْطِ ۖ وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
"ఓ నా జాతివారలారా! కొలతలు, తూనికలలో పూర్తిగా, న్యాయంగా వ్యవహరించండి (పూర్తిగా ఇవ్వండి). ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో సంక్షోభాన్ని సృష్టించకండి.
11:86  بَقِيَّتُ اللَّهِ خَيْرٌ لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ ۚ وَمَا أَنَا عَلَيْكُم بِحَفِيظٍ
"మీరు విశ్వాసులే అయితే, అల్లాహ్‌ ధర్మ సమ్మతం గావించిన మిగులు మాత్రమే మీ కొరకు శ్రేయస్కరమైనది. నేను మీపై కావలివాణ్ణి మాత్రంకాను."
11:87  قَالُوا يَا شُعَيْبُ أَصَلَاتُكَ تَأْمُرُكَ أَن نَّتْرُكَ مَا يَعْبُدُ آبَاؤُنَا أَوْ أَن نَّفْعَلَ فِي أَمْوَالِنَا مَا نَشَاءُ ۖ إِنَّكَ لَأَنتَ الْحَلِيمُ الرَّشِيدُ
వారిలా అన్నారు : "ఓ షుఐబ్‌! మేము మా తాతముత్తాతలు పూజిస్తూ వస్తున్న దైవాలను వదలి పెట్టాలనీ, మా సొమ్ములను మా ఇష్టప్రకారం ఖర్చు పెట్టడం మానుకోవాలని నీ నమాజు నీకు ఆజ్ఞాపిస్తోందా? నువ్వు మరీ ఉదాత్త హృదయునిలా,రుజువర్తనునిలా ఉన్నావే?!"
11:88  قَالَ يَا قَوْمِ أَرَأَيْتُمْ إِن كُنتُ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّي وَرَزَقَنِي مِنْهُ رِزْقًا حَسَنًا ۚ وَمَا أُرِيدُ أَنْ أُخَالِفَكُمْ إِلَىٰ مَا أَنْهَاكُمْ عَنْهُ ۚ إِنْ أُرِيدُ إِلَّا الْإِصْلَاحَ مَا اسْتَطَعْتُ ۚ وَمَا تَوْفِيقِي إِلَّا بِاللَّهِ ۚ عَلَيْهِ تَوَكَّلْتُ وَإِلَيْهِ أُنِيبُ
దానికి షుఐబు ఇలా సమాధానమిచ్చాడు : "ఓ నా జాతిసోదరులారా! చూడండి, నేను నా ప్రభువు వద్ద నుంచి ఒక స్పష్టమైన నిదర్శనాన్ని పొంది ఉన్నాను. ఆయన నాకు తన వద్ద నుండి అత్యుత్తమమైన ఉపాధిని ప్రసాదించాడు.(అలాంటప్పుడు నేను అక్రమార్జనకు పాల్పడగలనా?) ఏవిషయాలను మానుకోమని మిమ్మల్ని గట్టిగా చెబుతున్నానో వాటి వైపుకు నేను స్వయంగా మొగ్గిపోయే ఉద్దేశం నాకు లేనే లేదు. శాయశక్తులా దిద్దుబాటుచేయాలన్నదే నా ఉద్దేశం. నా ఈ సద్వర్తన అంతా దైవసహాయం పైనే ఆధారపడి ఉంది. నేను ఆయన్నే నమ్ముకున్నాను. ఆయన వైపుకే మరలుతున్నాను.
11:89  وَيَا قَوْمِ لَا يَجْرِمَنَّكُمْ شِقَاقِي أَن يُصِيبَكُم مِّثْلُ مَا أَصَابَ قَوْمَ نُوحٍ أَوْ قَوْمَ هُودٍ أَوْ قَوْمَ صَالِحٍ ۚ وَمَا قَوْمُ لُوطٍ مِّنكُم بِبَعِيدٍ
"ఓ నా జాతివారలారా! నాకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న మీ మొండి వైఖరి నూహ్‌ జాతిపై, హూద్‌ జాతిపై, సాలెహ్‌ జాతిపై వచ్చిపడిన శిక్షల్లాంటి శిక్షలకే మిమ్మల్ని కూడా పాత్రులుగా చేస్తుందేమో (జాగ్రత్త!) ఇక లూతు జాతి వారైతే మీకు ఎంతో దూరాన కూడా లేరు.
11:90  وَاسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ ۚ إِنَّ رَبِّي رَحِيمٌ وَدُودٌ
"మీరు క్షమాపణ కోసం మీ ప్రభువును వేడుకోండి. మరి ఆయన వైపుకే మరలండి. నిశ్చయంగా నా ప్రభువు అమిత దయామయుడు, అపారప్రేమమయుడు."
11:91  قَالُوا يَا شُعَيْبُ مَا نَفْقَهُ كَثِيرًا مِّمَّا تَقُولُ وَإِنَّا لَنَرَاكَ فِينَا ضَعِيفًا ۖ وَلَوْلَا رَهْطُكَ لَرَجَمْنَاكَ ۖ وَمَا أَنتَ عَلَيْنَا بِعَزِيزٍ
"ఓ షుఐబ్‌! నువ్వు చెప్పే వాటిలో చాలా విషయాలు మాకు అర్థం కావటం లేదు. మేము నిన్ను మా మధ్య ఎంతో బలహీనునిగా చూస్తున్నాము. నీ వంశస్థులే లేకపోతే ఈ పాటికి నీపై రాళ్ళు రువ్వి ఉండేవాళ్ళం. మా దృష్టిలో నువ్వు ఘనాపాటివి ఏమీకావు" అని వాళ్ళు చెప్పారు.
11:92  قَالَ يَا قَوْمِ أَرَهْطِي أَعَزُّ عَلَيْكُم مِّنَ اللَّهِ وَاتَّخَذْتُمُوهُ وَرَاءَكُمْ ظِهْرِيًّا ۖ إِنَّ رَبِّي بِمَا تَعْمَلُونَ مُحِيطٌ
దానికి అతను ఇలా అన్నాడు: "ఓ నా జాతివారలారా! మీ దృష్టిలో నా వంశస్థులు అల్లాహ్‌ కన్నా ఎక్కువ గౌరవనీయులా?! తత్కారణంగానే మీరు ఆయన్ని వెనక్కి నెట్టేశారా? నిశ్చయంగా నా ప్రభువు మీ కార్యకలాపాలన్నింటినీ పరివేష్ఠించి ఉన్నాడు."
11:93  وَيَا قَوْمِ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنِّي عَامِلٌ ۖ سَوْفَ تَعْلَمُونَ مَن يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَمَنْ هُوَ كَاذِبٌ ۖ وَارْتَقِبُوا إِنِّي مَعَكُمْ رَقِيبٌ
(షుఐబ్‌ ఇంకా ఇలా అన్నాడు:) "ఓ నా జాతిసోదరులారా! మీరు మీ స్థానాలలో మీ పనులు చేస్తూ ఉండండి. నేనూ నా పని చేసుకుంటాను. పరాభవానికి లోను చేసే శిక్ష ఎవరికి పడుతుందో, అసత్యవాది ఎవరో అతిత్వరలోనే మీకు తెలిసిపోతుంది. మీరూ ఎదురు చూడండి, మీతో పాటు నేనూ ఎదురుచూస్తాను."
11:94  وَلَمَّا جَاءَ أَمْرُنَا نَجَّيْنَا شُعَيْبًا وَالَّذِينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَأَخَذَتِ الَّذِينَ ظَلَمُوا الصَّيْحَةُ فَأَصْبَحُوا فِي دِيَارِهِمْ جَاثِمِينَ
మరి మా ఉత్తర్వు (శిక్ష) వచ్చేసినప్పుడు, మేము షుఐబును, అతని వెంటనున్న విశ్వాసులను మా ప్రత్యేక కటాక్షంతో కాపాడాము. దుర్మార్గానికి ఒడిగట్టిన వారిని మాత్రం భయంకరమైన శబ్దం కబళించింది. దాంతో వారు తమ ఇంట్లో బోర్లా పడి పడినట్లే ఉండిపోయారు.
11:95  كَأَن لَّمْ يَغْنَوْا فِيهَا ۗ أَلَا بُعْدًا لِّمَدْيَنَ كَمَا بَعِدَتْ ثَمُودُ
అసలు వారక్కడ ఎప్పుడూ నివసించనే లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. వినండి! సమూదు వారు దూరం చేయబడినట్లే మద్‌యను వారు కూడా (దైవ కారుణ్యానికి) దూరం అవుదురుగాక!
11:96  وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا وَسُلْطَانٍ مُّبِينٍ
ఇంకా – మేము మూసాకు మా సూచనలను, స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము.
11:97  إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ فَاتَّبَعُوا أَمْرَ فِرْعَوْنَ ۖ وَمَا أَمْرُ فِرْعَوْنَ بِرَشِيدٍ
ఫిరౌను వద్దకు, అతని సర్దారుల వద్దకు పంపాము. అయినప్పటికీ వారు ఫిరౌను ఆదేశాలనే అనుసరించారు. మరి (చూడబోతే) ఫిరౌను ఆదేశాలలో ఏ ఒక్కటీ సరియైనది కాదు.
11:98  يَقْدُمُ قَوْمَهُ يَوْمَ الْقِيَامَةِ فَأَوْرَدَهُمُ النَّارَ ۖ وَبِئْسَ الْوِرْدُ الْمَوْرُودُ
వాడు ప్రళయదినాన తన జాతికి సారథ్యం వహిస్తూ వస్తాడు. వారందరినీ నరకంలోకి తీసుకుపోయి నిలబెడతాడు. వారు నిలబెట్టబడే ఆ చోటు అత్యంతచెడ్డది.
11:99  وَأُتْبِعُوا فِي هَٰذِهِ لَعْنَةً وَيَوْمَ الْقِيَامَةِ ۚ بِئْسَ الرِّفْدُ الْمَرْفُودُ
ఇహలోకంలోనూ వారికి శాపం అంటగట్టబడింది. ప్రళయదినాన కూడా అది వారిని వెంబడిస్తుంది. వారికి ఇవ్వబడిన బహుమతి బహుచెడ్డది.
11:100  ذَٰلِكَ مِنْ أَنبَاءِ الْقُرَىٰ نَقُصُّهُ عَلَيْكَ ۖ مِنْهَا قَائِمٌ وَحَصِيدٌ
ఇవి (తుదముట్టించబడిన) బస్తీలకు సంబంధించిన కొన్ని సమాచారాలు. వీటిని మేము నీకు వివరిస్తున్నాము. వాటిలో కొన్ని నిలిచి ఉన్నాయి. మరికొన్ని సమూలంగా తుడిచి పెట్టబడ్డాయి.
11:101  وَمَا ظَلَمْنَاهُمْ وَلَٰكِن ظَلَمُوا أَنفُسَهُمْ ۖ فَمَا أَغْنَتْ عَنْهُمْ آلِهَتُهُمُ الَّتِي يَدْعُونَ مِن دُونِ اللَّهِ مِن شَيْءٍ لَّمَّا جَاءَ أَمْرُ رَبِّكَ ۖ وَمَا زَادُوهُمْ غَيْرَ تَتْبِيبٍ
మేము వారికి ఏ మాత్రం అన్యాయం చేయలేదు. కాని వారే తమ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. నీ ప్రభువు ఉత్తర్వు వచ్చినప్పుడు, అల్లాహ్‌ను వదలి వారు పూజించే వారి ఆరాధ్యదైవాలు వారికెలాంటి ప్రయోజనమూ చేకూర్చలేదు. పైగా వారి నష్టాన్ని మరింత అధికం చేశారు.
11:102  وَكَذَٰلِكَ أَخْذُ رَبِّكَ إِذَا أَخَذَ الْقُرَىٰ وَهِيَ ظَالِمَةٌ ۚ إِنَّ أَخْذَهُ أَلِيمٌ شَدِيدٌ
బస్తీలలో నివసించే దుర్మార్గులను పట్టదలచుకున్నప్పుడు నీ ప్రభువు పట్టుకునే తీరు ఇలాగే ఉంటుంది. నిశ్చయంగా ఆయన పట్టు బాధాకరంగానూ, కఠినంగానూ ఉంటుంది.
11:103  إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّمَنْ خَافَ عَذَابَ الْآخِرَةِ ۚ ذَٰلِكَ يَوْمٌ مَّجْمُوعٌ لَّهُ النَّاسُ وَذَٰلِكَ يَوْمٌ مَّشْهُودٌ
నిశ్చయంగా పరలోక శిక్షకు భయపడేవారికి ఇందులో గుణపాఠపు సూచన ఉంది. అది జనులంతా సమీకరించబడే రోజు. ఇంకా అది అందరూ హాజరు పరచబడే రోజు.
11:104  وَمَا نُؤَخِّرُهُ إِلَّا لِأَجَلٍ مَّعْدُودٍ
మేము దానిని (తీర్పుదినమును) ఒక నియమిత గడువు వరకు మాత్రమే వాయిదా వేస్తాము.
11:105  يَوْمَ يَأْتِ لَا تَكَلَّمُ نَفْسٌ إِلَّا بِإِذْنِهِ ۚ فَمِنْهُمْ شَقِيٌّ وَسَعِيدٌ
అది వచ్చేసిన రోజు ఆయన అనుమతి లేకుండా పల్లెత్తు మాట అనే ధైర్యం ఎవరికీ ఉండదు. వారిలో కొందరు దౌర్భాగ్యులూ ఉంటారు, కొందరు సౌభాగ్యవంతులూ ఉంటారు.
11:106  فَأَمَّا الَّذِينَ شَقُوا فَفِي النَّارِ لَهُمْ فِيهَا زَفِيرٌ وَشَهِيقٌ
అయితే దౌర్భాగ్యులు నరకంలో ఉంటారు. అక్కడ వారు అరుస్తూ, పెడబొబ్బలు పెడుతూ ఉంటారు.
11:107  خَالِدِينَ فِيهَا مَا دَامَتِ السَّمَاوَاتُ وَالْأَرْضُ إِلَّا مَا شَاءَ رَبُّكَ ۚ إِنَّ رَبَّكَ فَعَّالٌ لِّمَا يُرِيدُ
నీ ప్రభువు వేరొకటి తలిస్తే తప్ప భూమ్యాకాశాలున్నంత వరకూ వారు అందులోనే శాశ్వతంగా ఉంటారు. నిశ్చయంగా నీ ప్రభువు తాను కోరిందల్లా చేసి తీరుతాడు.
11:108  وَأَمَّا الَّذِينَ سُعِدُوا فَفِي الْجَنَّةِ خَالِدِينَ فِيهَا مَا دَامَتِ السَّمَاوَاتُ وَالْأَرْضُ إِلَّا مَا شَاءَ رَبُّكَ ۖ عَطَاءً غَيْرَ مَجْذُوذٍ
ఇక సౌభాగ్యవంతులుగా చేయబడినవారు – నీ ప్రభువు కోరితే తప్ప, వారు భూమ్యాకాశాలున్నంత వరకూ స్వర్గంలోనే కలకాలం ఉంటారు. ఇది అనంతమైన వరం.
11:109  فَلَا تَكُ فِي مِرْيَةٍ مِّمَّا يَعْبُدُ هَٰؤُلَاءِ ۚ مَا يَعْبُدُونَ إِلَّا كَمَا يَعْبُدُ آبَاؤُهُم مِّن قَبْلُ ۚ وَإِنَّا لَمُوَفُّوهُمْ نَصِيبَهُمْ غَيْرَ مَنقُوصٍ
కనుక (ఓ ముహమ్మద్‌!) వారు పూజించే వాటి విషయంలో నువ్వు సందేహాలకు లోను కారాదు. ఇంతకు మునుపు వారి తాతముత్తాతలు పూజించినట్లుగానే వీళ్ళూ పూజిస్తున్నారు. మేమువాళ్లందరికీ వారి వారి భాగాన్నిపూర్తిగా – ఏ మాత్రం తగ్గించకుండా ఇస్తాము.
11:110  وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَاخْتُلِفَ فِيهِ ۚ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ لَقُضِيَ بَيْنَهُمْ ۚ وَإِنَّهُمْ لَفِي شَكٍّ مِّنْهُ مُرِيبٍ
నిశ్చయంగా మేము మూసా (అలైహిస్సలాం)కు గ్రంథాన్ని ఇచ్చాము. మరి అందులో విభేదించుకోవటం జరిగింది. ఒకవేళ ముందుగానే నీ ప్రభువు తరఫున మాట ఖరారు కాకుండా ఉన్నట్లయితే, వారి మధ్య తీర్పు జరిగి ఉండేది. ఈ విషయంలో వారికి తీవ్రమయిన సందేహం ఉంది.
11:111  وَإِنَّ كُلًّا لَّمَّا لَيُوَفِّيَنَّهُمْ رَبُّكَ أَعْمَالَهُمْ ۚ إِنَّهُ بِمَا يَعْمَلُونَ خَبِيرٌ
వారిలో ప్రతి ఒక్కరికీ నీ ప్రభువు వారి కర్మల యొక్క పూర్తి ప్రతిఫలం ఇస్తాడు. నిశ్చయంగా ఆయనకు వారు చేస్తున్న పనులన్నీ తెలుసు.
11:112  فَاسْتَقِمْ كَمَا أُمِرْتَ وَمَن تَابَ مَعَكَ وَلَا تَطْغَوْا ۚ إِنَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
కనుక (ఓ ముహమ్మద్‌!) నీకు ఆజ్ఞాపించబడినట్లుగా నువ్వూ, నీతోపాటు (పశ్చాత్తాపభావంతో) మరలివచ్చిన వారూ గట్టిగా నిలబడి ఉండండి. హద్దు మీరకండి. నిస్సందేహంగా అల్లాహ్‌ మీ కర్మలన్నింటినీ చూస్తున్నాడు.
11:113  وَلَا تَرْكَنُوا إِلَى الَّذِينَ ظَلَمُوا فَتَمَسَّكُمُ النَّارُ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِنْ أَوْلِيَاءَ ثُمَّ لَا تُنصَرُونَ
చూడండి! ఎట్టి పరిస్థితిలోనూ దుర్మార్గుల పక్షాన మొగ్గకండి. మొగ్గారో మీక్కూడా నిప్పు (నరకాగ్ని) అంటుకుంటుంది. మరి అల్లాహ్‌ తప్ప మిమ్మల్ని ఆదుకునే వాడెవడూ ఉండడు. మీకు సహాయమూ అందదు.
11:114  وَأَقِمِ الصَّلَاةَ طَرَفَيِ النَّهَارِ وَزُلَفًا مِّنَ اللَّيْلِ ۚ إِنَّ الْحَسَنَاتِ يُذْهِبْنَ السَّيِّئَاتِ ۚ ذَٰلِكَ ذِكْرَىٰ لِلذَّاكِرِينَ
దినము యొక్క రెండు అంచులలోనూ నమాజును స్థాపించు – రాత్రి ఘడియలలో కూడా! నిశ్చయంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి. హితబోధను గ్రహించగలిగే వారికి ఇదొక హితోపదేశం.
11:115  وَاصْبِرْ فَإِنَّ اللَّهَ لَا يُضِيعُ أَجْرَ الْمُحْسِنِينَ
నువ్వు సహనంతో మసలుకో. నిశ్చయంగా సద్వర్తనుల పుణ్యఫలాన్ని అల్లాహ్‌ వృథా కానివ్వడు.
11:116  فَلَوْلَا كَانَ مِنَ الْقُرُونِ مِن قَبْلِكُمْ أُولُو بَقِيَّةٍ يَنْهَوْنَ عَنِ الْفَسَادِ فِي الْأَرْضِ إِلَّا قَلِيلًا مِّمَّنْ أَنجَيْنَا مِنْهُمْ ۗ وَاتَّبَعَ الَّذِينَ ظَلَمُوا مَا أُتْرِفُوا فِيهِ وَكَانُوا مُجْرِمِينَ
మీకు పూర్వం గతించిన కాలాల వారిలో భూమిలో కల్లోలాన్ని వ్యాపింపజేయకుండా అడ్డుకునే మంచివారు ఎందుకు లేరు? ఉన్నా బహు కొద్దిమంది మాత్రమే ఉండేవారు. వారిని మేము రక్షించాము. కాగా; దుర్మార్గులైన వారు తమకు ప్రసాదించబడిన సుఖసౌఖ్యాల వెంటపడ్డారు. వారు అపరాధులు.
11:117  وَمَا كَانَ رَبُّكَ لِيُهْلِكَ الْقُرَىٰ بِظُلْمٍ وَأَهْلُهَا مُصْلِحُونَ
పురములలో నివసించే వారు మంచి పనులు చేస్తున్నప్పుడు నీ ప్రభువు అలాంటి పురములను అన్యాయంగా తుదముట్టించడు.
11:118  وَلَوْ شَاءَ رَبُّكَ لَجَعَلَ النَّاسَ أُمَّةً وَاحِدَةً ۖ وَلَا يَزَالُونَ مُخْتَلِفِينَ
నీ ప్రభువు గనక తలచుకుంటే మనుషులందరినీ ఒకే సమూహంగా చేసి ఉంచేవాడు. కాని వారు మాత్రం విభేదించుకునే వారుగానే ఉంటారు.
11:119  إِلَّا مَن رَّحِمَ رَبُّكَ ۚ وَلِذَٰلِكَ خَلَقَهُمْ ۗ وَتَمَّتْ كَلِمَةُ رَبِّكَ لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ أَجْمَعِينَ
కాని నీ ప్రభువు దయచూపిన వారు మాత్రం అలా చేయరు. ఆయన వారిని పుట్టించిందే అందుకోసం. "నేను నరకాన్ని జిన్నాతులు, మనుషులు – అందరితోనూ నింపుతాను" అని నీ ప్రభువు అన్నమాట నెరవేరింది.
11:120  وَكُلًّا نَّقُصُّ عَلَيْكَ مِنْ أَنبَاءِ الرُّسُلِ مَا نُثَبِّتُ بِهِ فُؤَادَكَ ۚ وَجَاءَكَ فِي هَٰذِهِ الْحَقُّ وَمَوْعِظَةٌ وَذِكْرَىٰ لِلْمُؤْمِنِينَ
(ఓ ప్రవక్తా!) ప్రవక్తల ఈ సమాచారాలన్నింటినీ మేము నీ మనోనిబ్బరం కోసం నీకు తెలియపరుస్తున్నాము. ఈ సూరాలో కూడా నీకు సత్యం లభించింది. విశ్వాసులకు ఇది హితోపదేశం మరియు జ్ఞాపిక.
11:121  وَقُل لِّلَّذِينَ لَا يُؤْمِنُونَ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنَّا عَامِلُونَ
విశ్వసించని వారితో, "మీరు మీ పద్ధతి ప్రకారం పనులు చేస్తూ ఉండండి, మా పనులు మేము చేస్తూ ఉంటాము.
11:122  وَانتَظِرُوا إِنَّا مُنتَظِرُونَ
మీరూ నిరీక్షించండి, మేమూ నిరీక్షిస్తూ ఉంటాము" అని (ఓ ప్రవక్తా!) చెప్పు.
11:123  وَلِلَّهِ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَإِلَيْهِ يُرْجَعُ الْأَمْرُ كُلُّهُ فَاعْبُدْهُ وَتَوَكَّلْ عَلَيْهِ ۚ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
భూమ్యాకాశాల రహస్య జ్ఞానం అల్లాహ్‌ వద్దనే ఉంది. సమస్త వ్యవహారాలూ ఆయన వైపుకే మరలించబడతాయి. కాబట్టి (ఓ ప్రవక్తా!) నువ్వు ఆయన్నే ఆరాధించాలి. ఆయన్నేనమ్ముకోవాలి. మీరు చేసే పనులు అల్లాహ్‌కు తెలియకుండా లేవు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.