స్వర్గం


ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ స్వర్గం దొరకాలని ఆశ ఉంటుంది, కాని దాని కోసం ప్రయత్నం మాత్రం చేయరు. ఉదాహరణకు ఒక విద్యార్థికి పరీక్షల్లో 100 శాతం మార్కులు రావాలని కోరుకుంటాడు. కాని దాని కోసం చదవాల్సిన విధంగా చదవడు.


మనలో చాలా మంది ప్రాపంచిక సుఖాల కోసం కష్టపడుతున్నారు, పరలోకానికి బదులుగా! ఎంత అవివేకం!! చాలా మంది వారానికి 40 గంటల కన్నా ఎక్కువ సమయం తమ ఉద్యోగం కోసం, ఇతర పనుల కోసం వెచ్చిస్తున్నారు. కాని అదే మన ధర్మం కోసం చాలా తక్కువ సమయం కేటాయిస్తారు. మనిషి దేని కోసం అయితే పాటుపడుతాడో, కష్టపడుతాడో అల్లాహ్ అతనికి దాని యొక్క ప్రతిఫలం ఇస్తాడు అని అంటున్నాడు. ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే, మనంపాటుపడుతున్నది దేని కోసం?


అంతిమ దినం తథ్యం అని తెలిసి కూడా మనిషి దాని కోసం పరితపించాల్సిన విధంగా పరితపించడు. ఎందుకంటేపరలోకపు ప్రతిఫలం అప్పటికప్పుడే దొరకదు. మనం చేసిన కర్మల ప్రతిఫలం మనం చనిపోయాక దొరుకుతుంది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు: “ప్రతి ప్రాణీ మృత్యువు రుచి చూడవలసిందే. ప్రళయదినాన మీరు అందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుంచి కాపాడబడి, స్వర్గంలో  ప్రవేశం  కల్పించబడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయావస్తువు తప్ప మరేమీ కాదు.(ఖుర్ఆన్, సూరా ఆలి ఇమ్రాన్ 3:185)

 

విషయసూచిక

 

అంతిమ గమ్యం

మన అంతిమ గమ్యం పరలోకం. ఇహలోకంలో చేసిన కర్మలను బట్టి అక్కడ స్వర్గం లేదా నరకం లభిస్తుంది.ప్రతి ముస్లింకు స్వర్గం దొరకాలనే ఆశ ఉంటుంది. ఏ లక్ష్యాన్నైనా, గమ్యాన్నైనా చేరుకోవాలంటే, దాన్ని సాధించే తపన, పట్టుదల, ప్రణాళిక చాలా అవసరం. దాని ప్రకారం అమలు చేయడం కూడా అంతే అవసరం. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా అన్నాడు:“విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. ఆయన మార్గంలో(యుద్ధ ప్రాతిపదికన) కృషిసలపండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.” (ఖుర్ఆన్, సూరా మాయిదా 5:35)


“మరెవరయితే పరలోకాన్ని కోరుకుని, దానికోసం కృషి చేయవలసిన విధంగా కృషిచేస్తాడో, విశ్వాసి అయిఉంటాడో అలాంటి వాని కృషి అల్లాహ్‌ వద్ద ఆదరణ పొందుతుంది.” (ఖుర్ఆన్, సూరా ఇస్రా 17:19)

 

లక్ష్య నిర్ధారణ

ఒక మనిషికి ఆస్ట్రేలియా నుండి భారత దేశానికి సోమవారం రోజు సాయంత్రం ఐదు గంటలకు విమానం ద్వారా బయలుదేరవలసి ఉంటే, అతను దాని ప్రకారం తన కార్యక్రమాలను నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే అతను ఎప్పుడు, ఎక్కడికివెళ్ళాలో, ఎవరిని కలవాలో, ఎలా వెళ్ళాలో అంతా ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకున్నాడు.


దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: స్వర్గంలో ఉన్న వాటిని ఇప్పటి వరకూ ఏ కన్నూ చూడలేదు, ఏ చెవి వినలేదు. అందులో ఉన్నవిమనిషి ఊహకు, గ్రహణ శక్తికి అందనివి. (సహీహ్ అల్ ముస్లిం 6780)


అల్లాహ్ విశ్వాసుల కొరకు ఉంచింది దీని కంటే చాలా ఎక్కువ. అల్లాహ్ తన ప్రవక్త ద్వారా, తన గ్రంథం ద్వారా మన గమ్యాన్ని స్పష్టంగా తెలియపరిచాడు. దీని వల్ల మనిషి ఎల్లప్పుడూ దాన్ని సాధించే ప్రయత్నం చేయగలడు. దొరికే బహుమానం పై మన కన్ను ఉన్నచో, మనం పడే కష్టం మనకు కనిపించదు.


అల్లాహ్ ఖుర్ఆన్ లో అనేక చోట్ల స్వర్గం గురించి వివరించాడు.అల్లాహ్ ఖుర్ఆన్ లో విశ్వాసుల కొరకు ఏమేమి ఉంచాడో తెలుసుకుందాం.

 

ఖుర్ఆన్

“భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గ విశిష్టత ఇలా ఉంటుంది: దుర్వాసనకు (కాలుష్యానికి) తావులేని నీటి కాలువలు ఉన్నాయి. రుచిలో మార్పురాని పాల కాలువలు కూడా ఉన్నాయి. త్రాగే వారికి మృదు మధురంగా ఉండే మద్యం కాలువలు కూడా ఉన్నాయి. ఇంకా వారికోసం అందులో అన్ని రకాల పండ్లు ఫలాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, వారి ప్రభువు తరఫునుంచి మన్నింపు కూడా ఉంది.” (ఖుర్ఆన్, సూరా ముహమ్మద్ 47:15)


“వారి సహనానికి బదులుగా వారికి స్వర్గాన్నీ , పట్టువస్త్రాలను ప్రసాదించాడు.వారక్కడ దిండ్లను ఆనుకొని పీటలపై కూర్చుని ఉంటారు. అక్కడ వారు సూర్య తాపాన్ని గానీ, చలి తీవ్రతను గానీ చూడరు. స్వర్గవనాల నీడలు వారిపై పడుతూ ఉంటాయి.వారి సేవలో వెండి పాత్రలు, గాజు గిన్నెలు తిప్పబడుతూ ఉంటాయి. ఆ గాజు గిన్నెలు కూడా వెండివై ఉంటాయి. వాటిని నింపేవారు ఒక అంచనాప్రకారం సరిగ్గా నింపి ఉంటారు. వారికక్కడ సొంటి కలిపిన మధు పాత్రలు త్రాగడానికి ఇవ్వబడతాయి -స్వర్గంలోని ఒక సెలయేరు నుండి. దాని పేరు సల్ సబీల్.వారి చుట్టూ (నవ నవలాడే) పిన్న వయస్కులైన అబ్బాయిలు తిరుగాడుతూ ఉంటారు. వాళ్ళు నిత్యం అబ్బాయిలుగానే ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు చెదిరిన ముత్యాలా! అని భావిస్తావు.నువ్వు అక్కడ ఎటు చూసినా గొప్ప అనుగ్రహాలు, మహా సామ్రాజ్య వైభవమే కానవస్తాయి.వారి శరీరాలపై పచ్చని, నాణ్యమైన సన్నని సిల్కు వస్త్రాలు, దళసరి పట్టు వస్త్రాలే ఉంటాయి. ఇంకా, వారికి వెండి కంకణాలు – ఆభరణంగా – తొడిగింపబడతాయి. వారి ప్రభువు వారికి స్వచ్చమైన, పరిశుద్ధమైన మధువును త్రాగిస్తాడు.” (ఖుర్ఆన్, సూరా ఇన్సాన్ 76:12-21)


“మరియు (ఇహలోకంలో విశ్వాసంలో) ముందున్న వారు (స్వర్గంలో కూడా) ముందుంటారు. అలాంటి వారు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందుతారు. వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు. మొదటి తరాల వారిలో నుండి చాలామంది; మరియు తరువాత తరాల వారిలో నుండి కొంతమంది. (బంగారు) జలతారు అల్లిన ఆసనాల మీద; ఒకరికొకరు ఎదురెదురుగా, వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. వారిచుట్టు ప్రక్కలలో చిరంజీవులైన (నిత్య బాల్యం) గల బాలురు (సేవకులు) తిరుగుతూ ఉంటారు. (మధువు) ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు, గిన్నెలు మరియు కప్పులతో! దాని వలన వారికి తలనొప్పి గానీ లేక మత్తు గానీ కలుగదు. మరియు వారుకోరే పండ్లూ, ఫలాలు ఉంటాయి. మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం. మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు (హూరున్); దాచబడిన ముత్యాలవలే! ఇదంతా వారు చేస్తూ ఉండిన వాటికి (సత్కార్యాలకు) ప్రతిఫలంగా! అందులో వారు వ్యర్ధమైన మాటలు గానీ, పాప విషయాలు గానీ వినరు. “శాంతి (సలాం) శాంతి (సలాం)!” అనే మాటలు తప్ప! మరియు కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు)! వారు ముళ్ళు లేని సిద్ ర వృక్షాల మధ్య! మరియు పండ్లగెలలతో నిండిన అరటిచెట్లు, మరియు వ్యాపించి ఉన్న నీడలు, మరియు ఎల్లప్పుడు ప్రవహించే నీరు, మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు ఫలాలు, ఎడతెగకుండా మరియు అంతం కాకుండా (ఉండే వనాలలో); మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని ఉంటారు). నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము; మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము; వారు ప్రేమించే వారుగానూ, సమ వయస్సుగల వారుగానూ (ఉంటారు); కుడిపక్షం వారి కొరకు.” (ఖుర్ఆన్, సూరా వాఖియా 56:10-38)


“స్వర్గవాసులు ఈ రోజు తమ (ఆహ్లాదకర) వ్యాపకాలలో నిమగ్నులై ఆనందిస్తూ ఉన్నారు. వారూ, వారి  సతీమణులు (చల్లని) నీడలలో పీఠాలపై దిండ్లకు  ఆనుకుని ఆసీనులై ఉంటారు. అందులో వారి కోసం అన్ని రకాల పండ్లు ఉంటాయి. ఇంకా  వారు కోరినదల్లా ఉంటుంది. కృపాశీలుడైన ప్రభువు తరఫున వారికి 'సలామ్‌' చెప్పబడుతుంది.” (ఖుర్ఆన్, సూరా యాసీన్ 36:55-58)

 

మీరు ఊహించగలరా?

ఖుర్ఆన్ లోని స్వర్గపు వర్ణన గురించి విన్నప్పుడు, అవిశ్వాసులు ఇదంతా ఓ కట్టు కథ అని అంటారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం దీన్ని అల్లారు అని కూడా అంటారు. కాని అల్లాహ్ సత్యమే పలుకుతాడని మరియుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ తరఫున అవతరించిన దైవవాక్కునే చెబుతారని వారికి తెలియదు.ఖుర్ఆన్ లో ఇలా సెలవీయబడింది:“వారు చేసిన కర్మలకు ప్రతిఫలంగా, వారి కళ్లకు చలువనిచ్చే ఎలాంటి సామగ్రిని మేము దాచిపెట్టామో (దాని గురించి) ఏ ప్రాణికీ తెలియదు.” (ఖుర్ఆన్, సూరా సజ్దా 32:17)


ఖుర్ఆన్ లో స్వర్గపు వివరణ ఇవ్వబడినట్లే,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కూడా తన అనుచరులకు స్వర్గం గురించి వివరించేవారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం స్వర్గం గురించి తెలిపే విధానం సహచరుల మనసులను కదిలించివేసేది. వారు దాని కోసం తహతహలాడేవారు.అనస్బిన్ మాలిక్ ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన అనుచరులతో బద్ర్ యుద్ధ సమయంలో (మక్కా) అవిశ్వాసుల కన్నా ముందే బద్ర్ చేరుకున్నారు. అవిశ్వాసులుఅక్కడ చేరాక దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంఇలా అన్నారు: “స్వర్గం పొందడానికి లేవండి. దానివెడల్పు భూమ్యాకాశాలకు ఆవరించి ఉంది.” “ఓ ప్రవక్తా! స్వర్గం భూమ్యాకాశాలకు వెడల్పులో సమానంగా ఉందా?” అని అడిగారు ఉమైర్ ఇబ్న్ అల్ హుమం అల్ అన్సారీ రజిఅల్లాహుఅన్హు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం “ఔను” అన్నారు. ఉమైర్ రజిఅల్లాహుఅన్హు “బఖిన్! బఖిన్!” అన్నారు. బఖిన్ అంటే అరబీలో ఉద్రేకం, ఆశ్చర్యం. “ఈ పదాలు అనడానికి కారణం ఏమిటి?” అని అడిగారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం.“ఏమీ లేదు. అందులో నివాసం పొందాలని ఆశిస్తున్నాను” అని అన్నారు ఉమైర్ రజిఅల్లాహుఅన్హు. “నువ్వు ఖచ్చితంగా అందులో స్థానం పొందుతావు” అని అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం. అప్పుడు ఉమైర్ రజిఅల్లాహుఅన్హు తన సంచిలో నుంచి ఖర్జూరాలు తీసి తినసాగారు. “ఈ ఖర్జూరాలు అయిపోయేంతవరకు నేను బ్రతికి ఉంటే, ఆ జీవితం చాలా పెద్దదై పోతుంది” అని అన్నారు. ఆ తరువాత అనస్ రజిఅల్లాహుఅన్హు ఇలా అన్నారు: “ఆయన తన దగ్గరున్న మిగతా ఖర్జూరాలను పడేసి, మరణించేవరకు అవిశ్వాసులతోపోరాడారు.” (సహీహ్ ముస్లిం 4680)


ఉమైర్ రజిఅల్లాహుఅన్హు మరియు ఇతరులు ఇలా స్వర్గం కోసం తమ జీవితాలను అర్పించడానికి కారణం ఏమిటి?దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం స్వర్గం గురించి ఏమన్నారో కాస్త గమనిద్దాం.


హదీసులలో స్వర్గ వివరణ

అబూ సైద్ అల్ ఖుద్రీ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు, “భూమిపై మనిషి తూర్పులో లేదా పడమరలో కనిపించే నక్షత్రాన్ని ఎలా చూస్తాడో, స్వర్గ వాసులు స్వర్గంలోని ఉన్నత భవనాలలో ఉన్న వారిని అలా చూస్తారు. ప్రతిఫలం మూలంగా ఒకరి పై ఇంకొకరు ఆధిక్యత పొందుతారు. “ఓ దైవప్రవక్తా! స్వర్గంలోని ఈ ఉన్నత భవనాలు కేవలం దైవప్రవక్తల కోసమేనా?” అని ఓ సహాబి(అనుచరుడు) అడిగారు.


దానికిదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా జవాబిచ్చారు: “కాదు! అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను, ఈ భవనాలు అల్లాహ్ ను,ఆయన ప్రవక్తనువిశ్వసించిన వారి కొరకు.” (సహీహ్ అల్ బుఖారీ, సహీహ్ అల్ ముస్లిం)


అబూ మూసా అల్ అషరి ఉల్లేఖనం ప్రకారందైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలాఅన్నారు, “స్వర్గంలో విశ్వాసుల కొరకు ముత్యాలతో నిర్మించబడిన గుడారాలు ఉంటాయి. అవి అన్ని వైపుల నుంచి అరవై మైళ్ళు పొడువు ఉంటాయి. అందులో వారి భార్యలు ఉంటారు. విశ్వాసి వారి దగ్గరకు వెళ్తాడు, కాని వారు ఒకరికొకరు కనిపించరు.” (సహీహ్ బుఖారీ 4879, సహీహ్ ముస్లిం 2838)


అబూ హురైరా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా సెలవిచ్చారు: “స్వర్గంలో బంగారపు మొండెం లేని చెట్టు ఉండదు.” (సహీహ్ అల్ జామి)


అనస్ బిన్ మాలిక్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “స్వర్గంలో ఓ మార్కెట్ ఉంటుంది. స్వర్గవాసులందరూ ప్రతి శుక్రవారం అక్కడ వస్తారు. అప్పుడు ఓ సుగంధం వారి ముఖాలపై మరియు వారి వస్త్రాలపై గాలి ద్వారా వీస్తుంది. దీని వల్ల వారి అందం, ఆకర్షణ పెరుగుతుంది.ఆ తరువాత వారు తమ ఇంటివారివైపు వెళ్తారు. అప్పుడు వారి అందం మరింత పెరిగి ఉంటుంది.వారి ఇంటి వారు వారిని చూసి, ‘అల్లాహ్ ప్రమాణం! మీరు మా దగ్గరి నుంచి వెళ్ళాక మీ అందం చాలా పెరిగింది.’ డానికి వారు ఇలా అంటారు, ‘అల్లాహ్ ప్రమాణం! మేము వెళ్ళాక మీ అందం కూడా చాలా పెరిగింది.’ (సహీహ్ ముస్లిం 6792)


అనస్ ఇబ్న్ మాలిక్ రజిఅల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నేను స్వర్గంలో ప్రవేశించినపుడు ఒక సెలయేరును చూశాను. దాని అంచుల్లో ముత్యాలు కనిపించాయి. నేను నీళ్ళలో చేయి వేశాను. కస్తూరి సువాసన రాసాగింది. ‘ఇదేమిటి జిబ్రయీల్’ అని నేను అడిగాను. ‘ఇది కౌసర్ (స్వర్గంలోని ఓ సెలయేరు). ఇది అల్లాహ్ మీకు ఇచ్చాడు.’” (సహీహ్ ఉల్ జామి 3365, తిర్మిజి 3360)

 

స్వర్గ వాసులు ఎవరు?

స్వర్గంలో ఓ చోటు ఉంది. అక్కడ బంగారం మరియు వెండి ఇటుకలతో నిర్మితమైన భవనాలు ఉంటాయి. అక్కడి దుమ్ము కెంపులతో తయారై ఉంటుంది. అందులో నివసించే వారు ఉత్తమమైన పట్టువస్త్రాలే ధరిస్తారు. వీరు నా సహవాసులుగా ఉంటారు.ఇంత ఉన్నత స్థానంలో ఎవరుంటారు? యూదులు మేముంటామని అంటారు, అలాగే క్రైస్తవులు మేము అంటారు. అల్లాహ్ ఏమన్నాడో చూడండి: “యూదులు, క్రైస్తవులు తప్ప వేరెవరూ స్వర్గంలో ప్రవేశించలేర''ని వారంటున్నారు. ఇవి వారి ఆశలు, ఆకాంక్షలు మాత్రమే. ''మీరు మీ వాదనలో సత్యవంతులే అయితే ఆమేరకు ఏదన్నా నిదర్శనం సమర్పించండి'' అని వారిని అడుగు. (ఖుర్ఆన్, సూరా బఖర 2:111)


అల్లాహ్ ఇలా కూడా అన్నాడు:

“వారు పవిత్రులుగా ఉన్న స్థితిలో దైవ దూతలు వారి  ప్రాణాలు స్వాధీనం చేసుకుంటూ, ''మీకు శాంతి కల్గుగాక! మీరు చేసుకున్న సత్కర్మల ఫలితంగా స్వర్గంలో ప్రవేశించండి'' అని అంటారు.” (ఖుర్ఆన్, సూరా నహల్ 16:32)


అల్లాహ్ ఖుర్ఆన్ లో స్వర్గ వాసుల గురించి ప్రస్తావించినప్పుడు, ముస్లింలు అని అనడు, విశ్వాసులు అని అంటాడు. ఇంకా ఇలా అన్నాడు: “నిశ్చయంగా  దైవభక్తిగలవారు  ఉద్యానవనాల, సెలయేరుల మధ్యన ఉంటారు.” (ఖుర్ఆన్, సూరా హిజ్ర్15:45)


నిశ్చయంగా దైవభీతి పరాయణులు సురక్షిత (ప్రశాంత) స్థలంలో ఉంటారు. ఉద్యానవనాల, చెలమల మధ్యన...పల్చటి సిల్కు వస్త్రాలను,  దళసరి పట్టు వస్త్రాలను ధరించి ఎదురెదురుగా ఆసీనులై ఉంటారు.(భక్తిపరాయణుల పట్ల)  ఇలాగే వ్యవహరించబడుతుంది. (అంతేకాదు)  పెద్ద  పెద్ద  కన్నులు గల  (హూరు)  అందగత్తెలతో  మేము వారి వివాహం జరిపిస్తాము. వారక్కడ నిక్షేపంగా (కూర్చొని) అన్నిరకాల పండ్లు ఫలాదులను తెప్పించుకుంటూ ఉంటారు. (ఖుర్ఆన్, సూరా దుఖ్ఖాన్ 44:51-55)


విశ్వాసులు ఎవరు? వారిలో చేరాలంటే ఏం చేయాలి?

“అల్లాహ్‌ను, అంతిమదినాన్ని కూడా వారు విశ్వసిస్తారు. మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. సత్కార్యాల  కోసం పరస్పరం పోటీపడతారు.  వీరు సజ్జనుల కోవకు చెందినవారు.” (ఖుర్ఆన్, సూరా ఆలిఇమ్రాన్ 3:114)


“కాని స్వయంగా ప్రవక్తనూ, ఆయనతో పాటు విశ్వసించిన వారినీ చూడండి; వారు తమ ధన ప్రాణాలతో దైవమార్గంలో పోరాడుతున్నారు. కాబట్టి మేళ్లు గలవారు వీరే. సాఫల్యభాగ్యం పొందేవారు కూడా వీరే.” (ఖుర్ఆన్, సూరా తౌబా 9:88)


“నిస్సందేహంగా అల్లాహ్‌ ముస్లింల నుండి, వారి ధనప్రాణాలను స్వర్గానికి బదులుగా కొన్నాడు. వారు అల్లాహ్‌ మార్గంలో పోరాడుతారు; చంపుతారు, చంపబడతారు. దీనిపై తౌరాతులోనూ, ఇంజీలులోనూ, ఖుర్‌ఆన్‌లోనూ సత్యమైన వాగ్దానం చేయబడింది. వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్‌ను మించిన వాడెవడుంటాడు? కాబట్టి మీరు ఖరారు చేసిన ఈ వర్తకానికిగాను సంబరపడండి. ఘనవిజయం అంటే ఇదే.” (ఖుర్ఆన్, సూరా తౌబా 9:111)


“మరెవరు విశ్వసించి, మంచిపనులు చేస్తారో వారు స్వర్గవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.” (ఖుర్ఆన్, సూరా బఖర 2:82)


ఓ దైవదాసులారా! ఇంత మంచి స్థానంలో ఉండే అర్హత పొందడం, అంత సులభం కాదు. అల్లాహ్ ఇలా అంటున్నాడు:


“ఏమిటీ, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురుకానేలేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చిపడ్డాయి. వారు ఎంతగా కుదిపివేయబడ్డారంటే, (ఆ ధాటికి తాళలేక)   ''ఇంతకీ దైవసహాయం ఎప్పుడొస్తుంది?'' అని ప్రవక్తలు, వారి సహచరులు ప్రశ్నించసాగారు. ''వినండి! దైవసహాయం సమీపంలోనే ఉంది'' (అని వారిని ఓదార్చటం జరిగింది).” (ఖుర్ఆన్, సూరా బఖర 2:214)


దైవభీతి గలవారు, దైవ పరాయణత గలవారు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తారు. కేవలం‘అల్లాహ్’ అనడం వల్లనో లేదా షహాద చెప్పడం వల్లనో స్వర్గంలో ప్రవేశించలేరు.


అల్లాహ్ కు భయపడవలసిన విధంగా భయపడుతూ, పుణ్య కార్యాలు చేసినవారే సాఫల్యం పొందుతారు.అన్ని విషయాల్లో అల్లాహ్ కు భయపడుతూ, ఎల్లవేళలా అల్లాహ్ వైపు మరలేవాడే, ప్రళయదినాన(అల్లాహ్ తప్పఎవరూ సహాయపడని) భద్రత పొందుతాడు.దీని గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ మనిషిని రెండు సార్లు భయానికి లేదా భద్రతకు గురిచేయడు. ప్రపంచంలో నాకు భయపడనివాడిని, ప్రళయదినాన నేను భయానికి గురి చేస్తాను. ప్రపంచంలో నాకు భయపడేవాడిని, నేను ప్రళయదినాన భద్రతవొసగుతాను.” (సహీహ్ అల్ జామి)


అందుకొరకే, ముస్లింలకు స్వర్గవాసులు ఎవరో తెలుసుకోవడం చాలా అవసరం. కాని, నేటి ముస్లింలు ‘షహాద’ ఉచ్చరిస్తే చాలు, ఇస్లాంపై అమలు చేసినా, చేయకపోయినా స్వర్గానికి వెళ్లిపోవచ్చు అని భావిస్తున్నారు. కాని, కేవలం‘షహాద’ పలకడం వల్ల సరిపోదు, దాంతోపాటు ఇస్లాంపై ఆచరించడం కూడా చాలా అవసరం. ఈ విషయం ఖుర్ఆన్ మరియు సున్నత్ లలో అనేక సార్లు గుర్తుచేయబడింది. విశ్వాసానికి సారాంశం కార్యచరణ. మనసుతో, నోటితో, చేతలతో విశ్వాసాన్ని తెలియజేయడం అవశ్యం. మరణించే వరకు మంచి ఆచరణలు చేస్తూ ఉండాలి. ఇందువల్లే మక్కా అవిశ్వాసులు ఇస్లాంను త్రోసిపుచ్చారు. మనకు లభించే ప్రతిఫలం, మన కర్మల

 

ఆధారంగానే ఉంటుంది అని ఖుర్ఆన్ తెలియజేస్తుంది.


“నిజస్థితి (సాఫల్యం) మీ ఆకాంక్షల కనుగుణంగా గానీ, గ్రంథవహుల ఆశలు, అభిలాషలపై   ఆధారపడిగానీ లేదు. చెడుకు పాల్పడినవాడు ఎవడైనా దాని ఫలితాన్ని అనుభవిస్తాడు.  దైవసమక్షంలో తనను సమర్థించే, తనను ఆదుకునే వారెవరినీ అతడు పొందలేడు.” (ఖుర్ఆన్, సూరా నిసా 4:123)


విశ్వాసులుగా బ్రతికి, విశ్వాసులుగా మరణించినవారే స్వర్గంలో ప్రవేశిస్తారు. దీనికి మొదటి మెట్టు అల్లాహ్ ను మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను విశ్వసించడం. దీని మరో కోణం బహుదైవారాధన(షిర్క్) కు దూరంగా ఉండడం. అంటే, ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్ కొరకే అయి ఉండాలి. రెండో మెట్టు అల్లాహ్ కు మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు విధేయత చూపడం. ధర్మంలో కొత్త పోకడలను సృష్టించరాదు. తప్పనిసరి(విధి) గావించబడిన ప్రతి ఆరాధనను నెరవేర్చడం. విధి గావించబడిన ఆరాధనలను క్రమం తప్పకుండా నెరవేర్చాక, ప్రోత్సహించబడిన ఆరాధనలను నెరవేర్చాలి. ఇలా ఆరాధనలు ఎంత ఎక్కువగా చేస్తే అంతే ఎక్కువ పాపాల నుంచి రక్షణ దొరుకుతుంది. ఈ విధంగా మనం నరకాగ్ని నుంచి మనల్ని కాపాడుకోగలుగుతాము.

 

స్వర్గం కోసం ప్రయత్నించుట

 • మన మనస్సుల్లో చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి, ఎందుకంటే చెడు ఆలోచనలే చెడు కార్యాలకు దారితీస్తాయి.
   
 • మన చూపుల్ని క్రింద ఉంచాలి, దీని మూలంగా నిషిద్ధ వస్తువులను చూడకుండా ఉండగలుగుతాము.
   
 • చెడుమాటల నుండి మన చెవులను దూరంగా ఉంచాలి. అబధ్ధాలు, అభాండాలు, సంగీతం, అపవాదు, దైవదూషణ లాంటి పాపకార్యాల నుండి చెవులను దూరంగా ఉంచాలి.
   
 • మన నోటితో ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి. అల్లాహ్ నామస్మరణతో నాలుకను తడిగా ఉంచాలి. చాడీలు మరియు చెడు మాటల నుండి నోటినిదూరంగా ఉంచాలి.
   
 • హలాల్ (ధర్మసమ్మతం) అయిన ఆహారపదార్థాలే తినాలి, హరాం(నిషిద్ధమైన) వాటికి దూరంగా ఉండాలి. వడ్డీ, పంది మాంసం, మత్తుపదార్థాలు లాంటి నిషేధించబడిన వాటి నుండి మనల్ని కాపాడుకోవాలి.
   
 • మనకు సంబంధించని వాటిని పొందే ప్రయత్నం చేయకూడదు. తోటి ముస్లింకు మన వల్ల ఎలాంటి హాని కలిగించకూడదు.
   
 • మనకాళ్ళు చెడు వైపు వెళ్ళకుండా ఆపుకోవాలి.
   
 • మన మర్మాంగాలను నిషిద్ధ లైంగిక చర్యల నుండి కాపాడుకోవాలి.
   
 • మన ధనాన్ని యదేచ్చగా ఖర్చు చేయకూడదు, అలాగే పిసినారితనం కూడా చూపించకూడదు.
   
 • ప్రమాణాలను, సాక్ష్యాలను, నమ్మకాన్ని కావాలని ఎప్పుడూ త్రెంచకూడదు. ఒప్పందాలనుఉల్లంఘించరాదు, అసత్యానికి సాక్ష్యం ఇవ్వకూడదు.
   
 • ఏ విషయాలైతే మనిషి మస్తిష్కాన్ని, అంతరాత్మలను చెడు వైపుకు పురికొల్పుతాయో అలాంటి వాటి నుండి మన సంతానాన్ని, కుటుంబాన్ని రక్షించాలి.

 
అసలైన విశ్వాసులెవరో అల్లాహ్ కు బాగా తెలుసు అని మనకు అర్ధమైపోయింది.కాని, వారిలో చేరటానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. విశ్వాసులు జీవితంలో చేసిన పుణ్యకార్యాల వల్ల వారికి స్వర్గంలో అంతంకాని కారుణ్యాలు లభిస్తాయి. అల్లాహ్ ఇలా అంటున్నాడు: “వారు చేసిన కర్మలకు ప్రతిఫలంగా, వారి కళ్లకు చలువనిచ్చే ఎలాంటి  సామగ్రిని  మేము  దాచిపెట్టామో (దాని గురించి) ఏ ప్రాణికీ తెలియదు.” (ఖుర్ఆన్, సూరా సజ్దా 32:17)


దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “స్వర్గం ఇబ్బందులు, కష్టాలతోచుట్టు ముట్టి ఉంది, అదేనరకం కోరికలు, ఆకాంక్షలతో చుట్టు ముట్టి ఉంది.” (సహీహ్ అల్ జామి)


స్వర్గపు దారిని ఎలా సులభంగా అధిగమించాలో అల్లాహ్ మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మనకు తెలిపారు.మనం ఈ యాత్రను కేవలం అల్లాహ్ మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చూపించినవిధంగా పూర్తి చేస్తేనే సాఫల్యం పొందగలుగుతాము.

 

స్వర్గానికి తీసుకెళ్ళే దారులు

విశ్వాసం, సదాచరణ – ఈ రెండే స్వర్గానికి తీసుకెళ్ళే దారులు. సదాచరణ ద్వారం చాలా విస్తృతమైనది. దాని ద్వారా లభించే ప్రతిఫలాలు కూడా విశాలమైనవి. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “మరెవరు విశ్వసించి, మంచిపనులు చేస్తారో వారు స్వర్గవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.” (ఖుర్ఆన్, సూరా బఖర 2:82)


“నిశ్చయంగా  దైవభక్తిగలవారు  ఉద్యానవనాల, సెలయేరుల  మధ్యన ఉంటారు.” (ఖుర్ఆన్, సూరా హిజ్ర్ 15:45)


దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “దైవభక్తి, సదాచరణ సామాన్యంగా మనిషిని స్వర్గానికి తీసుకుపోతాయి. అలాగే సామాన్యంగా మనిషిని నరకానికి తీసుకుపోయేవి నోరు మరియు మర్మాంగాలు.”(అత్ తిర్మిజి)


అల్లాహ్ మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు విధేయత చూపడం తప్పకుండ స్వర్గానికి తీసుకెళుతుంది. అల్లాహ్ సెలవిచ్చాడు: “ఎవడు అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయుడై మసలుకుంటాడో అల్లాహ్ అతన్ని క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. మరి వెన్నుచూపి తిరిగిపోయిన వానికి వ్యధాభరితమైన శిక్షకు గురిచేస్తాడు.” (ఖుర్ఆన్, సూరా ఫత్ 48:17)


దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ప్రబోధించారు: “నన్ను తిరస్కరించిన వారు తప్ప, నా అనుచరులందరూ స్వర్గంలో ప్రవేశిస్తారు.” “మిమ్మల్ని తిరస్కరించిన వారు ఎవరు?” అని అడగబడింది. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా జవాబిచ్చారు: “నాకు విధేయత చూపినవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు మరియు నాకు అవిధేయత చూపినవాడు నన్ను తిరస్కరించిన వాడవుతాడు.” (సహీహ్ అల్ బుఖారీ)


దైవమార్గంలో తన ధన ప్రాణాలతో పోరాడేవాని గురించి అల్లాహ్ సెలవిచ్చాడు: “ఓ విశ్వాసులారా! మిమ్మల్ని వ్యధాభరితమైన శిక్ష నుండి రక్షించే వర్తకమేదో నేను మీకు తెలుపనా?మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మార్గంలో మీ ధన ప్రాణాలొడ్డి పోరాడండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీకు ఎంతో మేలైనది. అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో మీకు ప్రవేశం కల్పిస్తాడు. శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో గల పరిశుబ్రమైన గృహాలలో ప్రవేశింపజేస్తాడు. నిజానికి ఇదే గొప్ప సాఫల్యం.” (ఖుర్ఆన్, సూరా అస్ సఫ్ 61: 10-12)


దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “పాపం చేసి పశ్చాత్తాపం చెందినవాడు, అసలు పాపం చేయనివాడిలా అయిపోతాడు.” (సహీహ్అల్ జామి)


“కాని పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు (మాత్రం నష్టపోరు). వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి  రవంత కూడా అన్యాయం జరగదు.” (ఖుర్ఆన్, సూరా మర్యం 19:60)


మస్జిద్ కట్టడం, ఇస్లామీయధార్మిక విద్యనభ్యసించడం, భర్తలకు విధేయులుగా ఉండడం, పిల్లల్ని సరిఅయినరీతిలో పెంచడం లాంటి ఎన్నో కర్మల ద్వారా మనంస్వర్గాన్ని పొందవచ్చు.వీటి కోసం కాస్తసమయం మరియు నిజాయితీతో కూడిన కృషి అవసరం. ఒక్కోసారి మనం ఆ ఉన్నత స్థానానికి చేరుకోగలమా? అనే సందేహం వస్తుంది. మానవునిఈమాన్ మరియు సదాచరణలలో హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. కాని మనం అల్లాహ్ పై ఆశను వదలుకోరాదు.అవిశ్వాసులే అల్లాహ్ పై ఆశను వదలుకుంటారు.


మనం స్వర్గంలో సృష్టించబడ్డాము, ఆ తరువాత దాని నుంచి బయటకు వచ్చాము, ఇన్ షా అల్లాహ్ మళ్ళి దానిలోకి ప్రవేశిస్తాము. మన గమ్యస్థానం అదే, దాన్ని మనం తప్పకుండా చేరుకుంటాము. దాని కోసం అల్లాహ్ చెప్పిన మార్గంపై నడవాలి. స్వర్గం అంత సులువుగా దొరకదు. అది పొందాలంటే అల్లాహ్ ను విశ్వసించి, దైవప్రవక్త సల్లల్లాహు అలహివ సల్లం సున్నత్ ప్రకారం జీవితం గడిపి, అనుచరులు(సహాబా) ఇస్లాంను అర్ధం చేసుకున్నట్లు అర్ధం చేసుకోవాలి. వారు(సహాబా) చేసిన కృషి అంతా పరలోకం కోసమే, ఇహలోకం కోసం దానికిఅవసరమైనంత మేరకే కృషిచేసేవారు. ఒక ముస్లింగా మనం చేసేదంతా అల్లాహ్ కోసమే అయి ఉండాలి.మన కుటుంబాన్ని పోషించటానికి చేసే కృషిలోనూ, వంట చేయడంలోనూ, పిల్లల్ని పెంచడంలోనూ, విశ్రాంతితీసుకోవటంలోనూ– వీటన్నిటిలోనూ అల్లాహ్ నామస్మరణ, దుఆ (ప్రార్ధన) కూడా ఉంటే, ఈ ప్రాపంచిక కార్యాలు కూడా రేపు పరలోకంలో ప్రతిఫలాలుగా పరిణమిస్తాయి.కనుక ఎల్లప్పుడూ మనము పరలోకంలో లభించే ప్రతిఫలంపై దృష్టి పెట్టి ఇహలోకంలో జీవితం గడపాలి. అల్లాహ్ ఇలా అన్నాడు: “ఎవరయితే  మా  మార్గంలో బాధలు భరిస్తారో, వారికి మేము తప్పకుండా  మా 'మార్గాలు' చూపుతాము. నిశ్చయంగా  అల్లాహ్‌ సద్వర్తనులకు తోడుగా ఉంటాడు.” (ఖుర్ఆన్, సూరా అన్ కబూత్ 29:69)

 

ఆధారాలు

http://sunnahonline.com/library/paradise-hell-and-the-hereafter/144-paradise (ఇంగ్లీష్)
 
 

944 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్