స్త్రీల హక్కులు - భాద్యతలు


స్త్రీలకు  వారి   మహర్‌  సొమ్మును మనస్ఫూర్తిగా  ఇవ్వండి. ఒకవేళ వారు గనక తమంతట తాముగా -  ఇష్ట పూర్వకంగా - మహర్‌లో కొంత మొత్తాన్ని  వదలి పెట్టినట్లయితే  సంతోషంగా (నిస్సంకోచంగా)  దాన్ని అనుభవించండి. సూరా అన్ నిసా 4:4

 

విషయసూచిక

 

స్త్రీల మహర్‌


స్త్రీలకు  వారి   మహర్‌  సొమ్మును మనస్ఫూర్తిగా  ఇవ్వండి. ఒకవేళ వారు గనక తమంతట తాముగా - ఇష్ట పూర్వకంగా - మహర్‌లో కొంత మొత్తాన్ని  వదలి పెట్టినట్లయితే  సంతోషంగా (నిస్సంకోచంగా)  దాన్ని అనుభవించండి. సూరా అన్ నిసా : 4 : 4

 

నచ్చని  ఆ  విషయంలోనే అల్లాహ్‌ అపారమైన  శుభాన్ని  పొందుపరచాడేమో!(మీకేం తెలుసు?)


విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు బలవంతంగా స్త్రీలకు వారసులై కూర్చోవటం మీకు ధర్మసమ్మతం కానేరదు. మీరు వారికి ఇచ్చిన దానిలో (మహర్‌) నుంచి కొంత సొమ్ము  కాజేసే ఉద్దేశ్యంతో వారిని ఆపి ఉంచుకోకండి. ఒకవేళ వారు గనక బాహాటంగా ఏదైనా నీతిమాలిన  పనికి పాల్పడితే అది వేరే విషయం. వారితో ఉత్తమ రీతిలో కాపురం చేయండి. ఒకవేళ వారు మీకు నచ్చకపోతే బహుశా ఏదో ఒక్క విషయం మూలంగా మీకు నచ్చక పోవచ్చు. కాని   మీకు నచ్చని ఆ విషయంలోనే అల్లాహ్‌ అపారమైన శుభాన్ని పొందుపరచాడేమో!  (మీకేం తెలుసు?)

 

మహర్ తిరిగి తీసుకోవడం 


మీరు  ఒక  భార్య  స్థానంలో  మరోభార్యను చేసుకోదలిస్తే, వారిలో  ఎవరికయినా  మీరు  పెద్ద ధనరాశిని  ఇచ్చివున్నాసరే, దానిలో నుంచి ఏ కొంచెం కూడా తిరిగి తీసుకోకండి.  ఏమిటీ, అది అన్యాయం, స్పష్టమైన  పాపం  అయినప్పటికీ  మీరు దాన్ని తీసుకుంటారా?  మీరు పరస్పరం కలుసుకున్న తరువాత, ఆ స్త్రీలు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తరువాత కూడా ఆ ధనాన్ని  మీరెలా  (తిరిగి)  తీసుకోగలుగుతారు? సూరా అన్ నిసా : 4 :19 – 21

 

ఆస్తిలో సంతాన అర్హత 


తల్లిదండ్రులు సమీప బంధువులు వదలి వెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అలాగే  తల్లిదండ్రులు సమీప బంధువులు వదలి వెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆ ఆస్తి తక్కువైనా సరే ఎక్కువైనా సరే (అందులో) వాటా మాత్రం నిర్ధారితమై ఉంది.   సూరా అన్ నిసా : 4 : 7

 

నలుగురు  వ్యక్తుల  సాక్ష్యం  


మీ స్త్రీలలో ఎవరయినా అక్రమ సంబంధం పెట్టుకుంటే వారికి వ్యతిరేకంగా మీలోని నలుగురు వ్యక్తులను సాక్షులుగా తీసుకురండి. వారు గనక సాక్ష్యం ఇస్తే ఆ స్త్రీలను మరణకాలం వచ్చేవరకుగానీ  లేదా అల్లాహ్‌ వారికోసం ఏదైనా మార్గాంతరం సూచించే వరకు గానీ - గృహాల్లో నిర్బంధించి ఉంచండి. మీలో ఏ ఇద్దరయినా ఈ (పాడు) పనిచేస్తే వారిద్దరినీ బాధించండి. ఒకవేళ వారు పశ్చాత్తాపపడి, తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటే వారిని ఉపేక్షించండి.  నిస్సందేహంగా అల్లాహ్‌ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు కరుణించేవాడు కూడా. అవివేకం వల్ల ఏదైనా చెడు కార్యానికి పాల్పడి వెనువెంటనే తప్పుతెలుసుకుని పశ్చాత్తాపం చెందేవారి  పశ్చాత్తాపాన్ని స్వీకరించే బాధ్యత మాత్రమే అల్లాహ్‌ పై ఉంది. అటువంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్‌ స్వీకరిస్తాడు. అల్లాహ్‌ మహాజ్ఞాని గొప్ప వివేకవంతుడు.   సూరా అన్ నిసా : 4 :15 -17 

 

విశిష్ఠత 


అల్లాహ్‌ మీలో కొందరికి మరికొందరిపై  దేని  మూలంగా విశిష్ఠతను ప్రసాదించాడో దాని కోసం ఆశపడకండి. పురుషులు సంపాదించిన దానిని బట్టి వారి భాగం వారికుంటుంది. అలాగే స్త్రీలు  సంపాదించిన దానిని బట్టి వారి భాగం వారికుంటుంది. కాకపోతే మీరు అల్లాహ్‌ నుండి ఆయన అనుగ్రహాన్ని అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతిదీ తెలిసినవాడు.

 

ఒప్పందం


తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలి వెళ్ళిన ఆస్తికి మేము వారి వారసులను నిర్థారించి పెట్టాము. మీరు ఎవరితోనయినా ఏదయినా ఒప్పందం చేసుకుని ఉంటే,  తదనుగుణంగా వారి భాగాన్నివారికి ఇవ్వండి. యదార్థానికి అల్లాహ్‌ అన్నింటిపై సాక్షిగా ఉన్నాడు.   సూరా అన్ నిసా : 4 : 32 - 33  

 

స్త్రీల  విషయమై ధర్మాదేశం 


(ఓ ప్రవక్తా!) వారు నిన్ను స్త్రీల  విషయమై ధర్మాదేశం ఏమిటని అడుగుతున్నారు. వారికి చెప్పు : 'అల్లాహ్‌ స్వయంగా వారి విషయంలో మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు. ఇంకా తండ్రిలేని  ఆడపిల్లలకు మీరు, వారి  కొరకు నిర్ధారించబడిన హక్కును వారికివ్వకుండా  వారిని  వివాహమాడాలనే మీకోరిక గురించీ, బలహీనులైన పిల్లల గురించీ మీకు వినిపించబడుతున్నఖుర్‌ఆన్‌ ఆయతులు  కూడా  (మిమ్మల్ని ఆదేశిస్తున్నాయి).   ఇంకా తండ్రిలేని బిడ్డల విషయంలో న్యాయంగా వ్యవహరించమని కూడా ఆయన  మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు ఏ మంచి పని చేసినా దాని గురించి అల్లాహ్‌కు పూర్తిగా తెలుసు.   సూరా అన్ నిసా : 4 :127

 

సహాయకులు 


విశ్వాసులైన  పురుషులూ విశ్వాసులైన స్త్రీలూ - వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడు వాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి  ఆజ్ఞాపిస్తారు.  చెడుల నుంచి వారిస్తారు. నమాజులను  నెలకొల్పుతారు జకాత్‌ను చెల్లిస్తారు. అల్లాహ్‌కు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్‌ అతిత్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే.  నిస్సందేహంగా అల్లాహ్‌ సర్వాధిక్యుడు వివేచనాశీలి. సూరా తౌబా  9 :71

 

మన్నింపు, గొప్పపుణ్యఫలం  


నిశ్చయంగా ముస్లిం పురుషులు - ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన పురుషులు - విశ్వాసులైన స్త్రీలు, విధేయులైన పురుషులు - విధేయులైన స్త్రీలు, సత్యసంధులైన పురుషులు - సత్యసంధులైన స్త్రీలు, సహనశీలురైన  పురుషులు - సహనవతులైన  స్త్రీలు,అణకువగల పురుషులు - అణకువగల  స్త్రీలు, దానధర్మాలు చేసే పురుషులు - దానధర్మాలు  చేసే స్త్రీలు, ఉపవాసం ఉండే పురుషులు -  ఉపవాసం ఉండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే  పురుషులు - కాపాడుకునే స్త్రీలు, అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించే పురుషులు - స్మరించే స్త్రీలు - వీరందరికోసం అల్లాహ్? (విస్తృతమైన) మన్నింపును, గొప్పపుణ్యఫలాన్ని సిద్ధంచేసి ఉంచాడు. సూరా అల్ ఆహ్ జాబ్ 33 :35

 

ఆధారాలు 


www.teluguislam.net/ahsanul

890 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్