దుస్తులు – వినయానికి ప్రతీక


శరీరాన్నికప్పుకోవడానికి వేసుకునే బట్టలను దుస్తులు అంటారు. దుస్తులు(వస్త్రధారణ) రకరకాలుగా ఉంటాయి.

ఇస్లామీయంగా, దుస్తుల ద్వారా రెండు లక్ష్యాలు పూర్తవుతాయి.

 1. మర్మస్థానాలు(అవ్రా) కప్పుకోవడం
   
 2. అలంకరణ మరియు అందం కోసం

 

విషయసూచిక

 

అవ్రా (మర్మస్థానాలు)

పురుషులఅవ్రా నాభి నుండి మోకాళ్ళ వరకు అని ఇస్లామీయ విద్వాంసులుఖుర్ఆన్ మరియు సున్నత్ ల ఆధారంగా నిర్ణయించారు. స్త్రిల కోసం అవ్రా ముఖం, అరచేతులు తప్ప మొత్తం శరీరం.

 

ఖుర్ఆన్

ఓ ఆదం సంతతి వారలారా!  మేము  మీ కోసం దుస్తుల్ని దించాము.  అవి మీ మర్మస్థానాలను కప్పి ఉంచటమేగాకుండా, మీ శరీరానికి శోభాయమానంగా కూడా ఉంటాయి.అయితే భయభక్తులతో కూడుకున్న దుస్తులు ఇంతకన్నా మంచివి. ఇవి వీళ్లు  జ్ఞాపకముంచుకునేందుకుగాను అల్లాహ్‌ (చేసిన) సూచనలలోనివి.ఖుర్ఆన్, సూరా అల్ ఆరాఫ్ 7:26

 

స్త్రీ, పురుషుల వస్త్రధారణ నియమాలు

స్త్రీ, పురుషుల వస్త్రధారణ నియమాలుఈ విధంగా ఉన్నాయి :

 • ప్రాధమిక సూత్రం ప్రకారం దుస్తుల్లో హరాం (దేని గురించి అయితే హరాం అని చెప్పబడిందో) కాని ప్రతీది హలాల్ అంటే ధరించదగ్గది. ఉదాహరణకు పురుషులకు పట్టువస్త్రాలు హరాం అని చెప్పబడింది. దీని గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : “ఈ రెండు (బంగారం, పట్టువస్త్రాలు) నా అనుచర సమాజంలోని పురుషులకు నిషిద్ధమైనవి, మరియు స్త్రీలకు అనుమతించబడినవి.” ఇబ్న్ మాజా 3640

   
 • చాలా పలుచటి వస్త్రాలు దేనిద్వారానైతే శరీరపు భాగాలు కనిపిస్తాయో అవి కూడా నిషిద్ధమైనవి.
   
 • బహుదైవారాధకులు, అవిశ్వాసులను పోలిన దుస్తులు ధరించరాదు. అబ్దు ల్లాహ్ ఇబ్న్ అమ్ర్ ఇబ్న్ అల్ ఆస్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం: నన్ను కాషాయ రంగు దుస్తులు ధరించి ఉండగా చూసి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఇవి అవిశ్వాసుల దుస్తులు, వీటిని తొడగకండి.” సహీహ్ అల్ ముస్లిం హదీస్ 2077
   
 • పురుషులు స్త్రీలను, స్త్రీలు పురుషులను అనుకరించరాదు. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలాచేసే స్త్రీలను, పురుషులను శపించారు.సహీహ్ అల్ బుఖారీ హదీస్ 5546
   
 • దుస్తులుతొడిగేటప్పుడు బిస్మిల్లాహ్ అంటూ కుడి వైపు నుంచి మొదలెట్టడం సున్నత్ (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సంప్రదాయం) మరియు తీసేటప్పుడు ఎడమ వైపు నుంచి మొదలెట్టాలి. అబూ హురైరారజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : “మీరు దుస్తులు ధరించేటప్పుడు మరియు వుజూ చేసేటప్పుడు కుడి వైపు నుంచి మొదలెట్టండి.”అబూ దావూద్ హదీస్ 4141 అల్ అల్బాని రహిముల్లాహ్ సహీహ్ అల్ జామి 787 లో దీన్ని ధృవీకరించారు.
   
 • కొత్తబట్టలు ధరించేటప్పుడు బిస్మిల్లాహ్ అని అల్లాహ్ నామస్మరణ చేస్తూ దువా చదవడం సున్నత్ (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆచారం).అబూ సయీద్ ఉల్లేఖనం ప్రకారం : దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కొత్త బట్టలు వేసుకునేటప్పుడు దాని పేరు చెప్పి “అల్లాహుమ్మ లకల్ హమ్ద్ అంత కసౌతనీహి అస్ అలుక ఖైరహు వ ఖైర మా సునిఅ లహు వ అఊజు బిక మిన్ షర్రిహి వ షర్రి మా సునిఅ లహు (ఓ అల్లాహ్! ప్రశంసలన్నీ నీకే. నీవు నాకు కొత్త బట్టలు ప్రసాదించావు.ఇది దేనికొరకైతే తయారుచేయబడిందో ఆ మంచిని నాకు ప్రసాదించు మరియు దిని చెడు నుండి నన్ను కాపాడు)” అల్ తిర్మిజి హదీస్ 1767; అబూ దావూద్ హదీస్ 4020; సహీహ్ అల్ జామి 4664లో అల్ అల్బాని దీన్ని ధృవీకరించారు.
   
 • బట్టల్ని శుభ్రంగా ఉంచుకోవడం సున్నత్ (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆచారం) కాని అవి అహంకారాన్ని ప్రదర్శించరాదు. అబ్దు ల్లాహ్ ఇబ్న్ మసూద్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : “మనసులో ఆవగింజంత అహంకారం ఉన్న ఏ మానవుడూ స్వర్గంలోకి ప్రవేశించజాలడు.” ఓ మనిషి అడిగాడు, “ఎవరైనా తన బట్టలు, తనబూట్లు అందంగా ఉండాలనుకోవడం తప్పా?” దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అన్నారు:“మహోన్నతుడైన అల్లాహ్ అందంగా ఉంటాడు మరియు అందాన్ని ప్రేమిస్తాడు; సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను చిన్న చూపు చూడడం అహంకారం.”సహీహ్ ముస్లిం హదీస్ 91
   
 • తెల్ల బట్టలు వేసుకొండని సిఫారసు చేయబడింది.

ఇబ్న్ అబ్బాస్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు:దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవచించారు: తెల్ల దుస్తులు వేసుకోండి, మీ దుస్తులన్నిటిలో అవే మేలైనవి. మృతులపై కూడా తెల్ల బట్ట కప్పండి.” అల్ తిర్మిజి హదీస్ 994, హసన్ సహీహ్. ఇస్లామీయ విద్వాంసులు దీన్నిఉత్తమం అన్నారు. ఇదిఅబూ దావూద్ హదీస్ 4061;ఇబ్న్ మాజా హదీస్ 1472 లో కూడా ఉంది.
 

 • చీలమండలం క్రింద దుస్తులు వేలాడే విధంగా ధరించడంముస్లిం పురుషులకు సబబు కాదు (ఈ చర్యను ఇస్బాల్ అంటారు). పురుషుల కోసం ఏ బట్టకైనా చీలమండలమే హద్దు. అబూ హురైరా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంఇలా ప్రవచించారు: “చీలమండలం క్రింద ఉన్నవస్త్ర భాగం అగ్గిలో ఉంటుంది.” సహీహ్ బుఖారీ హదీస్ 5450

అబూజర్రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ఉపదేశించారు: “అంతిమ దినాన అల్లాహ్ మూడు రకాల మనుషులను చూడడు, ప్రశంసించడు, వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది.” ఇలాదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మూడు సార్లు అన్నారు. “ఓదైవప్రవక్తా! అలాంటి దుర్గతి పట్టిన వారెవరు?” అనిఅబూ జర్ రజిఅల్లాహుఅన్హుఅడిగారు. అప్పుడుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఎవరి బట్టలైతే చీలమండలం క్రింద వరకు ఉంటాయో,చేసిన మేలునుగుర్తుచేసి ఇతరుల మనసులను నొప్పించేవాడు, అబద్ధపు ప్రమాణాలు చేసి తన వస్తువులను అమ్మేవాడు.” సహీహ్ అల్ ముస్లిం హదీస్ 106
 

 • ఏ దుస్తులు ధరిస్తే అందరిలో ఒక్కడు వేరుగా కనిపిస్తాడో (గర్వం, అహంకారం, కీర్తి ప్రదర్శించే దుస్తులు) అలాంటి దుస్తులు ధరించడం నిషిద్ధం.

ఇబ్న్ ఉమర్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు:దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఎవరైతే కీర్తి, గర్వం ప్రదర్శించే దుస్తులు ధరిస్తారో అలాంటి వారికి అల్లాహ్ అంతిమదినాన అలాంటి దుస్తులే ధరిస్తాడు.” మరో ఉల్లేఖనం ప్రకారం “ఆ పై దాన్ని కాల్చివేస్తాడు.” మూడో ఉల్లేఖనం ప్రకారం,“అవమానకరమైన దుస్తులు ధరింపజేస్తాడు.” అబూ దావూద్ హదీస్ 4029, ఇబ్న్ మాజా హదీస్ 3606, 3607; షేక్ అల్ అల్బాని హసన్ అని సహీహ్ అల్ తర్ఘీబ్ హదీస్ 2089 లో అన్నారు.   

 

ఆధారాలు

[1] http://www.thefreedictionary.com/dress+up (ఇంగ్లీష్)
[2] http://www.islamawareness.net/Dressing/dress_fatwa001.html (ఇంగ్లీష్)
[3] http://www.muslimaccess.com/articles/Women/womans_dress.asp (ఇంగ్లీష్)
[4] http://www.huda.tv/articles/women-in-islam/621-the-islamic-dress-code-(ఇంగ్లీష్)
[5] http://quran.com/7/26 (ఇంగ్లీష్)
[6] http://www.islamqa.com/en/ref/36891/dress(ఇంగ్లీష్)

 

 

740 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్