ఉపవాసాలను భంగపరిచే విషయాలు


ఉపవాసాన్ని అరబీలో ‘సౌమ్’ అంటారు. దాని అర్ధం “ఏదైనా చేయకుండా ఆగిపోవడం.” ఉదాహరణకు – ఖుర్ఆన్ లో అల్లాహ్ మర్యం అలైహిస్సలాం ఇలా అన్నారని చెప్పారు: “నేను కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను. ఈ రోజు నేను ఎవరితోనూ మాట్లాడను.” (ఖుర్ఆన్, సూరా మర్యమ్ 19:26)


‘సౌమ్’ (ఉపవాసం) అనగా “సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, కేవలం అల్లాహ్ కొరకు, ఆహారపానియాలు మరియు లైంగిక చర్య నుండి ఆగిపోవడం.”

 

విషయసూచిక

 

కావాలని, ఇచ్చాపూర్వకంగా రమజాన్ నెలలో పైన పేర్కొన బడిన చర్యలు చేయడం వల్ల ఉపవాసం రద్దు అవుతుంది. ఇలా చేయడం చాలా పెద్ద పాపం. ఇలా చేసినవారు ఆ రోజంతా ఉపవాసంలాగానే కొనసాగించాలి, దేనికంటే రంజాన్ ఉపవాసమును గౌరవిస్తూ, అల్లాహ్ సూచించినట్టుగా పరిహారం చెల్లించి పశ్చతాపం చేయాలి. కాని ఈ ఉపవాసము లెక్కలోకి రాదు.

 

కావాలని తినడం, త్రాగడం

“తొలిజాములోని తెలుపు నడిరేయి నల్లని చారలో నుండి ప్రస్ఫుటం అయ్యే వరకూ తినండి, త్రాగండి. ఆ తరువాత (వీటన్నింటినీ పరిత్యజించి) రాత్రి చీకటి పడేవరకూ ఉపవాసం ఉండండి.” (ఖుర్ఆన్, సూరా అల్ బఖర 2:187)


కావాలని చేసిన వారికే శిక్ష వర్తిస్తుంది. ఎవరైనా మరచిపోయి లేదా బలవంతం చేయబడి ఇలా చేసినచో, అతని ఉపవాసం రద్దు కాదు మరియు అతనికి శిక్ష కూడా ఉండదు. అతను ఉపవాసాన్ని కొనసాగించాలి.


అబూ హురైరా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఎవరైనా ఉపవాసం ఉన్నట్టు మరచిపోయి- ఏదన్నా తిన్నా, త్రాగినా – అతను ఉపవాసం కొనసాగించాలి. అల్లాహ్ అతణ్ణి తినిపించాడు, త్రాగించాడు.” (బుఖారీ, ముస్లిం)


ఇబ్న్ అబ్బాస్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా సెలవిచ్చారు: “నా అనుచర సమాజానికి అల్లాహ్ తప్పుల నుండి, మతిమరుపు నుండి, బలవంతం చేయబడిన వాటి నుండి క్షమించాడు.” (తహావి, అల్ హాకిం, దరఖుంతి; సహీహ్)


పొగ త్రాగడం (నిషేధించబడిన) కూడా తినడం, త్రాగడంతో సమానం. ఎవరైనా సమయాన్ని తప్పుగా అంచనా వేసి, ఉపవాసం త్రెంచినా, ప్రారంభించినా అతని ఉపవాసం రద్దు కాదు.

 

లైంగిక చర్యకు పాల్పడటం  

తినడం, త్రాగడం లాగానే అల్లాహ్ రమజాన్ ఉపవాసాలలో లైంగిక చర్యను కూడా నిషేధించాడు.


ఉపవాస  కాలంలోని  రాత్రులలో  మీరు  మీ భార్యలను కలుసుకోవటం మీ కొరకు ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు దుస్తులు,    మీరు  వారికి  దుస్తులు.  మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే సంగతి అల్లాహ్‌కు తెలుసు. అయినప్పటికీ  ఆయన  క్షమాగుణంతో మీ వైపుకు  మరలి,  మీ తప్పును మన్నించాడు. ఇకనుంచి  మీరు   మీ    భార్యలతో (ఉపవాసపు రాత్రులందు) రమించడానికీ, అల్లాహ్‌ మీ కొరకు రాసిపెట్టిన దాన్ని  అన్వేషించటానికీ  మీకు అనుమతి ఉంది. తొలిజాములోని తెలుపు నడిరేయి నల్లని చారలో నుండి ప్రస్ఫుటం అయ్యే వరకూ తినండి,  త్రాగండి. ఆ తరువాత (వీటన్నింటినీ పరిత్యజించి) రాత్రి చీకటి పడేవరకూ ఉపవాసం ఉండండి. ఇంకా - మీరు మస్జిదులలో 'ఏతెకాఫ్‌' పాటించేకాలంలో మాత్రం మీ భార్యలతో సమాగమం జరపకండి. ఇవి అల్లాహ్‌ (నిర్ధారించిన) హద్దులు. మీరు వాటి దరిదాపులకు కూడా పోకండి. ప్రజలు  అప్రమత్తంగా ఉండగలందులకుగాను  అల్లాహ్‌ తన ఆయతులను ఇలా విడమరచి చెబుతున్నాడు. (ఖుర్ఆన్, సూరా బఖర 2:187)

 

కావాలని వాంతి చేయడం

అబూ హురైరా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా సెలవిచ్చారు: “ఎవరైనా అనుకోకుండా వాంతి చేసినచో, అతని ఉపవాసం రద్దు కాదు. కాని ఎవరైనా కావాలని వాంతి చేసినచో అతని ఉపవాసం రద్దు అవుతుంది.” (అహ్మద్, అబూ దావూద్, అత్ తిర్మిజి, ఇబ్న్ మాజా; సహీహ్)

 

దురాలోచనలు

మనసులో ఉద్దేశం లేనిచో– అంటే ఉపవాసం ఉండాలనే దృఢ నిర్ణయం. (నఫిల్ ఉపవాసాలకు ఈ ఆదేశం వర్తించదు.)


ఉపవాసాన్ని విరమించేద్దాం అని ఉపవాసం మధ్యలో అనుకోవడం కూడా దాన్ని రద్దు చేస్తుంది. ఆ తరువాత ఏమీ తినకున్నా ఉపవాసం రద్దవుతుంది. ఎందుకంటే ఇస్లాంలో ఉద్దేశానికి చాలా ప్రాముఖ్యత ఉంది.


ఇలా చేయడం వల్ల ఉపవాసం అయితే రద్దు అవుతుంది. అంతేకాక పూర్తి జీవితం ఉపవాసాలు పాటించినా దాని బదులు తీర్చలేము. కావున దాని “ఖజా”(బదులుగా మరోరోజు ఉపవాసం ఉండడం) పాటించి, అల్లాహ్ ముందు నిజాయితిగా పశ్చాత్తాపం చెందాలి మరియు ఇంకోసారి ఇలా చేయకూడదని సంకల్పించుకోవాలి. రమజాన్ ఉపవాసంలో లైంగిక చర్యకు పాల్పడిన పక్షంలో ఆ ఉపవాసానికి ‘ఖజా’ (బదులుగా మరో రోజు ఉపవాసం ఉండడం) నెరవేర్చి, పశ్చాత్తాపంగా అల్లాహ్ విధించిన శిక్ష నెరవేర్చాలి.


అబూ హురైరా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం ఒకతను దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వద్దకు వచ్చి, “ఓ దైవప్రవక్తా! నేను నాశనం అయిపోయాను.” అని అన్నాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం, “నిన్ను ఏం నాశనం చేసింది?” అని అడిగారు. “నేను రమజాన్ ఉపవాసంలో నా భార్యతో సంభోగం చేశాను” అని అతను అన్నాడు. “నీవు ఒక బానిసను విముక్తి కల్పించగలవా?” అని అడిగారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం. దానికి అతను, “లేదు” అని అన్నాడు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం, “పోనీ, రెండు నెలలు నిరంతరాయంగా ఉపవాసాలు పాటించగలవా? అని అడిగారు. దానికి కూడా అతను, “లేదు” అని అన్నాడు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం, “పోనీ, అరవై మంది బీదవారికి అన్నం తినిపించగలవా?” అని అడిగారు. దానికీ అతను, “లేదు” అని అన్నాడు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మౌనంగా ఉండిపోయారు. ఆ సమయంలో  దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వద్దకు ఒక బుట్ట నిండా ఖర్జూర పండ్లు తేబడ్డాయి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అతనితో, “వీటిని దానం చేయి” అని అన్నారు. అప్పుడు అతను, “నాకంటే బీదవాడు ఈ ప్రాంతంలో లేడు” అని అన్నాడు. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం (నవ్వేసారు దాని మూలంగా ఆయన దవడ కనిపించసాగింది) ఇలా అన్నారు: “ఇవి తీసుకెళ్ళి నీ కుటుంబానికి తినిపించు.” (బుఖారీ 1936, ముస్లిం 1111)


రమజాన్ ఉపవాసంలో లైంగిక సంపర్కం జరిగినచో, స్త్రీ పురుషులిద్దరూ ప్రాయశ్చితం (కఫ్ఫార) అదా చేయాలి అని ఎక్కువ శాతం విద్వాంసులు అంటారు.

 

బలాన్నిచ్చే ఇంజక్షన్ (సూది) తీసుకోవడం

ఇది కావాలని చేసే చర్య అయిననూ, ఒక రోగికి ఇచ్చినచో పాపంగా పరిగణించబడదు. అతడు దాని ‘ఖజా’ పాటిస్తే సరిపోతుంది. దీనివల్ల ఒక రోగికి అవసరమైన బలం లభిస్తుంది. అది రక్తంలో కలిసినచో ఉపవాసం భంగం అవుతుంది. ఎందుకంటే అది శరీరంలో అన్నంలా పనిచేస్తుంది.

 

గ్లూకోస్, సెలైన్ ఎక్కించినచో కూడా ఉపవాసం భంగం అవుతుంది. ఆస్తమా రోగులు పీల్చే ఇన్హేలర్ ల వల్ల కూడా ఉపవాసం భంగమైపోతుంది. అల్లాహ్ అందరికీ ఆరోగ్యం ప్రసాదించుగాక!

 

ఆధారాలు

Author: Abu Abdillah Abdel-Kader KamelTayebi al-Athari

Source: QSS Publications, al-Mu'minah Magazine (ఇంగ్లీష్)
 

699 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్