ఇస్లామీయ ప్రవక్తలు


అల్లాహ్ ద్వారా ఎన్నుకోబడిన మానవులు, ఎవరిపైనైతే దైవవాణి అవతరింపజేయబడిందో మరియు మానవాళికి రుజుమార్గం చూపటానికి వచ్చారో వారిని ఇస్లామీయ ప్రవక్తలు అంటారు. ప్రతి ప్రవక్త ఏకదైవారాధన ధ్యేయంతోనే వచ్చారు. వారి అనుచరులు కూడా దానిపై విశ్వసించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవచించారు: అల్లాహ్ ఒక లక్ష ఇరవై నాలుగు వేల ప్రవక్తలను పంపించాడు. అందులో 315 సందేశహరులు ఉన్నారు. (ఇబ్న్ హిబ్బాన్ 361, ముస్నద్ అహ్మద్ 21552, 21546)

 

విషయసూచిక

 

ప్రవక్తలను పంపిన ఉద్దేశం

ప్రవక్తలను ప్రభవింపజేసిన ముఖ్య ఉద్దేశాలు:

 1. మానవాళిని సృష్టితాల పూజ నుండి ఆపి, సృష్టికర్తను పూజించేలా చేయడం.
   
 2. మానవాళికి సృష్టి యొక్క లక్ష్యాన్ని తెలుపడం: అల్లాహ్ నే ఆరాధించాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి, ప్రతి ఒక్కరికి ఈ జీవితం ఓ పరిక్ష లాంటిది, దీని ఫలితమే మానవుడు పరలోకంలో గడిపే జీవితాన్ని నిర్ణయిస్తుంది. అది భోగభాగ్యాల జీవితం కావచ్చు లేదా వ్యధాభరితమైన జీవితం కావచ్చు. ఇదే మానవ జీవితపు ముఖ్య లక్ష్యం.
   
 3. మానవాళిని స్వర్గానికి తీసుకెళ్ళే రుజుమార్గం చూపడం మరియు నరకాగ్ని నుంచి కాపాడటం.
   
 4. ప్రళయదినంనాడు మానవులపై సాక్ష్యం స్థాపించడానికి – మా జీవిత ధ్యేయంగానీ, పరలోకపు జీవితం గురించిగానీ మాకు తెలియదని ప్రజలు ఆ రోజు వాదులాడకుండా ఉండటానికి.
   
 5. ఈ ప్రపంచంలో మనకు కానరాని విషయాల (పరలోకం వగైరా) గురించి తెలుపడం. దైవజ్ఞానం, దైవదూతలు, అంతిమదినం వగైరా.
   
 6. స్వాభావిక ఉదాహరణలతో మానవులు జీవితాన్ని నైతికంగా, నిజాయితిగా, ఓ లక్ష్యంతో ఎలా గడపాలో తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి సంకోచం, సందేహం ఉండదు. మానవులు ఇతర మానవులను ఆదర్శంగా తీసుకుంటారు. కాని, ప్రవక్తలను ఆదర్శంగా చేసుకుంటే ఇహ, పర లోకాలలో సాఫల్యం లభిస్తుంది.
   
 7. మానవుని ఆత్మను ప్రాపంచిక వ్యామోహాల, పాపాల నుండి కాపాడుతుంది.
   
 8. మానవాళికి అల్లాహ్ బోధనలను చేరవేయడం మరియు వారిని ఇహ పర లోకాలలో సాఫల్యాన్ని కలుగజేయడం.

 

ప్రవక్తల తీసుకువచ్చిన సందేశం

అల్లాహ్ సందేశహరులను, ప్రవక్తలను ఒక ఉమ్మడి సందేశంతో పంపాడు. అదేమిటంటే కేవలం అల్లాహ్ నే విశ్వసించాలి మరియు ఆరాధించాలి. ఆయన్ని తప్ప ఇతరులెవరినీ ఆరాధించకూడదు.


“నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా, "నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు,  కనుక  మీరు  నన్నే ఆరాధించండి" అనే సందేశాన్ని (వహీని) అతనికి పంపాము.” (ఖుర్ఆన్, సూరా అంబియా 21:25)


ప్రతి ప్రవక్త తన జాతివారికి, అల్లాహ్ ను ఏ విధంగా ఆరాధించాలో, జీవితం ఎలా గడపాలో స్పష్టంగా తెలిపారు అని ముస్లింల విశ్వాసం. అల్లాహ్ ఒక్కడు అయినట్లే, అతని సందేశం కూడా అన్ని సమయాల్లో ఒక్కటే. ప్రవక్తలు తెచ్చిన సందేశాల మూలార్ధం – ఇస్లాం. ఒకే ఒక్కడైన అల్లాహ్ ను విశ్వసించి, తన ఇష్టాఅయిష్టాలను అల్లాహ్ కు సమర్పించి శాంతి పొందడం.

 

ఖుర్ఆన్ లో ప్రస్తావించబడిన ప్రవక్తలు

“తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. ''మేము ఆయన (పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్నీ పాటించము'' (అని వారు చెబుతారు). ''మేము విన్నాము.  విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే'' అని అంటారు.” (ఖుర్ఆన్, సూరా బఖర 2:285)


25 ప్రవక్తల పేర్లు ఖుర్ఆన్ లోప్రస్తావించబడ్డాయి :

 1. ఆదం అలైహిస్సలాం
   
 2. నూహ్ అలైహిస్సలాం
   
 3. ఇద్రీస్ అలైహిస్సలాం
   
 4. హూద్ అలైహిస్సలాం
   
 5. సాలెహ్ అలైహిస్సలాం
   
 6. ఇబ్రాహీం అలైహిస్సలాం
   
 7. లూత్ అలైహిస్సలాం
   
 8. ఇస్మాయీల్ అలైహిస్సలాం
   
 9. ఇస్ హాఖ్ అలైహిస్సలాం
   
 10. యాఖూబ్ అలైహిస్సలాం
   
 11. యూసుఫ్ అలైహిస్సలాం
   
 12. షుఐబ్ అలైహిస్సలాం
   
 13. అయ్యూబ్ అలైహిస్సలాం
   
 14. మూసా అలైహిస్సలాం
   
 15. హారూన్ అలైహిస్సలాం
   
 16. జుల్ కిఫ్ల్ అలైహిస్సలాం
   
 17. దావూద్ అలైహిస్సలాం
   
 18. సులైమాన్ అలైహిస్సలాం
   
 19. ఇల్యాస్ అలైహిస్సలాం
   
 20. అల్ యసా అలైహిస్సలాం
   
 21. యూనుస్ అలైహిస్సలాం
   
 22. జకరియ్యా అలైహిస్సలాం
   
 23. యహ్యా అలైహిస్సలాం
   
 24. ఈసా అలైహిస్సలాం
   
 25. ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం

 

అల్లాహ్ ద్వారా శిక్షించబడిన ప్రవక్తల సమాజాలు

కొందరు తమ ప్రవక్తల మాటను విన్నారు. కొందరు వినలేదు. విననివారికి అల్లాహ్ శిక్షించాడు.


ప్రవక్తల మాటను వినక అల్లాహ్ ద్వారా శిక్షించబడిన సమాజాల జాబితా:

నూహ్ అలైహిస్సలాం తన ప్రజలను విగ్రహారాధన నుండి ఆపి, ఒక్కడైన అల్లాహ్ ను ఆరాధించమని అన్నారు. నూహ్ అలైహిస్సలాం ప్రజలను ఇస్లాం వైపు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు వరకు పిలిచారు. ఇన్ని సంవత్సరాలలో కొందరే ఇస్లాం స్వీకరించారు. నూహ్ అలైహిస్సలాం సొంత కొడుకు ఆయన్ని నిరాకరించాడు. అల్లాహ్ వారిని ఓ భయంకరమైన తుఫాను ద్వారా తుదముట్టించాడు.


హూద్ అలైహిస్సలాం  - ఆద్ జాతివైపు పంపించబడ్డారు. ప్రస్తుతం అది యెమన్ దేశం. హూద్ అలైహిస్సలాం కూడా ప్రజలను ఇస్లామీయ ఏకదైవారాధన వైపుకు పిలిచారు. ఆద్ జాతివారు హూద్ అలైహిస్సలాం ను చాలా అవమానపరిచారు మరియు విగ్రహారాధనలోనే నిమగ్నులై పోయారు. అల్లాహ్ వారిని భయంకరమైన కరువుకు గురిచేశాడు. ఆ తరువాత వారిపై మబ్బును పంపించాడు. వారు ఆ మబ్బు ద్వారా వర్షం వస్తుందని భావించారు. కాని అల్లాహ్ ఆ మబ్బు ద్వారా ఘోరమైన గాలిని పంపించి వారిని సర్వనాశనం చేశాడు. ఇది అల్లాహ్ వారికి విధించిన శిక్ష.


సాలెహ్ అలైహిస్సలాం సమూద్ జాతి వైపు పంపబడిన దైవప్రవక్త. వారు కూడా విగ్రహాలను పూజించేవారు. వారు పర్వతాలలో నిర్మించబడిన అందమైన భవనాలలో ఉండేవారు. వారు అల్లాహ్ ను ఆరాధించడానికి తిరస్కరించారు. అప్పుడు సాలెహ్ అలైహిస్సలాం వారి ముందు ఓ అద్భుతాన్ని తెచ్చారు. అల్లాహ్ ఆజ్ఞానుసారం ఓ పెద్ద బండరాయి రెండుగా చీలి, అందులోనుంచి ఒక ఆడ ఒంటె బయటికి వచ్చింది. అప్పటికి కూడా చాలా మంది సమూదు జాతి ప్రజలు విశ్వసించలేదు.

అప్పుడు అల్లాహ్ వారిని తీవ్ర భూకంపాలతో ఘోరంగా శిక్షించాడు.


సోడోమ్ మరియు గొమోర్రా ప్రజలు బహిరంగంగా స్వలింగ సంపర్కం చేసేవారు. అల్లాహ్ వారి వైపు లూత్ అలైహిస్సలాం ను పంపాడు. ఆయన వారిని అల్లాహ్ శిక్ష గురించి హెచ్చరించారు. లూత్ అలైహిస్సలాం వారిని ఏకేశ్వరోపాసన చేయండని మరియు తమ పాపాలకు పశ్చాత్తాపం చెందండని బోధించారు. దానికి వారు నిరాకరించారు. అప్పుడు అల్లాహ్ లూత్ అలైహిస్సలాం వద్దకు ఇద్దరు దైవదూతలను పంపించాడు. వారు లూత్ అలైహిస్సలాం కు రాబోయే దైవశిక్ష గురించి చెప్పారు.

 

లూత్ అలైహిస్సలాం తన కుటుంబంతో (భార్య తప్ప – ఆమె విశ్వాసుల్లో చేరలేదు) సహా పట్టణం వదలి వెళ్ళిపోయారు. అల్లాహ్ రాళ్ల వాన మరియు భూకంపం పంపించి ఆ ప్రదేశాన్ని సర్వనాశనం చేశాడు. ప్రస్తుతం ఆ ప్రదేశం పాలస్తినాలోని డెడ్ సీ క్రింద ఉంది. అక్కడ ఎవరూ జీవించలేరు, ఏదీ వృద్ది చెందదు.

 

దైవప్రవక్తల,  దైవసందేశహరుల మధ్య వ్యత్యాసం

ఇస్లాంలో దైవప్రవక్త మరియు దైవసందేశహరుల మధ్య వ్యత్యాసం ఉంది. దైవసందేశహరులందరూ దైవప్రవక్తలు, కాని దైవప్రవక్తలందరూ దైవసందేశహరులు కారు.దై వసందేశహరునికి అరబీ పదం ‘రసూల్’. దైవప్రవక్తకు అరబీలో ‘నబీ’ అంటారు.

 

దైవప్రవక్తలు మానవులకు రుజుమార్గం చూపించేవారు. వారు ప్రత్యేకమైన పాపాలు చేస్తున్న  ప్రజలవైపుకు పంపబడేవారు. దైవప్రవక్తలు ప్రజల్ని మంచి వైపుకు మరియు ఏకేశ్వరోపాసన వైపుకు పిలిచేవారు.


ప్రవక్తలు ప్రజల్ని మునుపటి చట్టాన్నే బోధించేవారు మరియు దానిపై నడవమని ఆదేశించేవారు. దైవసందేశహరులు ఓ కొత్త చట్టాన్ని, సందేశాన్ని అల్లాహ్ ఆజ్ఞానుసారం ప్రజలకు చేరవేసేవారు.


మూసా అలైహిస్సలాం తౌరాత్ (కొత్త చట్టాన్ని) తెచ్చారు. కాబట్టి ఆయన దైవసందేశహరులు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఖుర్ఆన్ తెచ్చారు, కావున ఆయన దైవప్రవక్తతోపాటు, దైవసందేశహరులు కూడా.


ఒక హదీసు ప్రకారం అల్లాహ్ 1,24,000 ప్రవక్తలను పంపారు. అందులో 315 దైవసందేశహరులు. (ముస్నద్ అహ్మద్ 21552, 21546) ముస్లింలు ప్రవక్తలూ, సందేశహరులూ అందరినీ విశ్వసిస్తారు.

 

ఆధారాలు

TafseerIbnKathir (ఇంగ్లీష్)
Stories of the Prophets by IbnKathir (ఇంగ్లీష్)
 

1108 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్