ఇస్లామీయ క్యాలెండర్ లేదా హిజ్రీ క్యాలెండర్


ఇస్లామీయ లేదా హిజ్రీ క్యాలెండర్ చంద్రమాస క్యాలెండర్.ఇందులో పన్నెండు నెలలు ఉంటాయి.అవి చంద్రునిపై ఆధారపడి ఉంటాయి.ఇస్లామీయ క్యాలెండర్ సౌర / సూర్య క్యాలెండర్ కన్నా దాదాపు 10రోజులు తక్కువ ఉంటుంది.కావున ఇది గ్రేగోరియన్ క్యాలెండర్ తో మారుతూ ఉంటుంది.

 

విషయసూచిక

 

సంవత్సరాల పేర్లు

ఇస్లాం కంటే ముందు అరేబియాలో ఏదైనా ముఖ్య ఘటన జరిగిన దానిని బట్టి ఆ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకునేవారు.ఇస్లామీయ చరిత్ర ప్రకారం అబ్రహ అనే యమెన్ పాలకుడు కాబాను నాశనం చేయడానికి ఏనుగులతో దండెత్తి వచ్చాడు.ఆ దాడి అల్లాహ్ దయ వల్ల విజయవంతం కాలేదు.ఆ సంవత్సరం ఏనుగుల సంవత్సరంగా ప్రసిద్దిగాంచింది.అదే సంవత్సరం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జన్మించారు.ఎక్కువ శాతం ప్రజలు దీన్ని 570 CE అంటారు, కొందరు 571 CE అని అంటారు.

అబూ రేహాన్ అల్ బిరుని రహిముల్లాహ్ ప్రకారం హిజ్రీ క్యాలెండర్ లోని మొదటి పది సంవత్సరాలు లెక్కించబడలేదు, కాని అవి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాల ద్వారా ప్రసిద్ది చెందాయి.

  1. అనుమతి సంవత్సరం
     
  2. యుద్ధ నియమాల సంవత్సరం
     
  3. విచారణ సంవత్సరం
     
  4. పెళ్లిపై శుభాకాంక్షలు తెలిపే సంవత్సరం
     
  5. భూకంప సంవత్సరం
     
  6. విచారించే సంవత్సరం
     
  7. విజయం పొందిన సంవత్సరం
     
  8. సమానత్వపు సంవత్సరం
     
  9. మినహాయింపు సంవత్సరం
     
  10. వీడ్కోలు సంవత్సరం

 

638 CE (17 AH) లో అప్పటి ముస్లిం పాలకుడైన ఉమర్ రజిఅల్లాహుఅన్హు పర్యవేక్షణలో బస్రా అధికారి అయిన అబూ మూసా అషారి రజిఅల్లాహుఅన్హు ఫిర్యాదు చేశారు.అదేమనగా ఎన్నో సందేశాలలో/ఉత్తర్వులలో సంవత్సరమే వ్రాసిలేదు.దీని కారణంగా ఏది మొదటిదో,ఏది తరువాతదో తెలుసుకోవడం కష్టం అవుతుంది.ఈ ఫిర్యాదును సమంజసంగా భావించి ఉమర్ రజిఅల్లాహుఅన్హు,తన అనుయాయులతో ముస్లింల శకాన్ని, కాలాన్ని నిర్ణయించడం అవసరం అని అన్నారు. అందరితో సంప్రదించాక ఉమర్ రజిఅల్లాహుఅన్హు మొదటి సంవత్సరంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మదీనాకు వచ్చిన తేదీని చేర్చాలని నిర్ణయించారు. అప్పటి అరబ్బుల సంప్రదాయం ప్రకారం ముహర్రం నెలతో సంవత్సరం ఆరంభించడం మంచిదని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజిఅల్లాహుఅన్హు సూచించారు. వాస్తవానికి వలస (మక్కా నుండి మదీనా) జరిగింది సఫర్ మరియు రబీ ఉల్ అవ్వల్ లో అయినా, ఇస్లామీయ క్యాలెండర్ ముహార్రం నెలతో (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మదీనా చేరిన సంవత్సరంతో) ప్రారంభమవడానికి కారణం ఇదే. హిజ్రా కారణంగా దాని పేరు హిజ్రా క్యాలెండర్ పడింది. అరబిక్ పదం హిజ్రా అంటే వలస వెళ్ళడం.

 

ఇస్లామీయ క్యాలెండర్ నెలలు

ఖుర్ఆన్ లో తెలిపినట్లుగా ఇస్లామీయ క్యాలెండర్ లో 12 నెలలు ఉన్నాయి: “నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర – అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. అయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచీ (ఈ లెక్క ఇలాగె సాగుతున్నది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి).....” ఖుర్ఆన్ సూరా తౌబా 9:36

 

ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం12 నెలలు ఇవి:

  1. ముహర్రం
     
  2. సఫర్
     
  3. రబీ ఉల్ అవ్వల్
     
  4. రబీ ఉల్ ఆఖిర్
     
  5. జుమాదా అల్ ఊలా
     
  6. జుమాదా అల్ ఉఖ్రా
     
  7. రజబ్
     
  8. షాబాన్
     
  9. రమజాన్
     
  10. షవ్వాల్
     
  11. జిల్ ఖాదా
     
  12. జిల్ హిజ్జాహ్ 

 

పవిత్రమైన నెలలు

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ 12 నెలల గురించి చెబుతూ అందులో నాలుగు పవిత్రమైన నెలలు ఉన్నాయని అన్నాడు. వాటి పేర్లు హదీసులో ఇవ్వబడ్డాయి:

అబూ బకర్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి. అందులో నాలుగు పవిత్రమైనవి. అవి వరుసగా వచ్చే మూడు –జిల్ ఖాదా, జిల్ హజ్జాహ్, ముహర్రం మరియు జుమాదా, షాబాన్ ల మధ్య వచ్చే రజబ్.” సహీహ్ బుఖారీ vol 4:419, 2958 (NE) మరియు అబూ దావూద్1942

 

ఆధారాలు

[1] http://snahle.tripod.com/higri.htm(ఇంగ్లీష్)

[2] http://en.hamrohonim.net/ab-al-rayhn-muhammad-ibn-ahmad-(ఇంగ్లీష్)

[3] http://www.islamweb.net/emainpage/index.php?page=articles&id=155869(ఇంగ్లీష్)

[4] http://www.sunnah.com/search/four-are-sacred(ఇంగ్లీష్)

 

2550 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్